ది ఎక్సార్సిస్ట్ : ‘ఆ బాలుడి గదిలో కుర్చీలు పైకి లేచాయి, మంచం అటూఇటూ కదిలింది’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాఫెల్ అబుచైబే
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
“మౌంట్ రైనయిర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడికి పట్టిన 'దెయ్యాన్ని' ఒక క్యాథలిక్ మతాధికారి వదిలించారు. ఇది బహుశా మత చరిత్రలో అత్యంత అసాధారణమైన సంఘటనలలో ఒకటి” అని వాషింగ్టన్ పోస్ట్‌లో 1949 ఆగస్ట్ 20న ఒక వార్త ప్రచురితమైంది.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నుంచి 15 కిలోమీటర్ల. దూరంలో ఉన్న శివారు ప్రాంతం ఈ మౌంట్ రైనయిర్. క్యాథలిక్‌లలో కొంతమందిని ఉటంకిస్తూ ఆ అబ్బాయిని 'దెయ్యం' నుంచి వదిలించడానికి మతాధికారి 20 నుంచి 30 సార్లు భూతవైద్యం చేయాల్సి వచ్చిందని ఆ వార్తాపత్రిక పేర్కొంది.
మతాధికారి కార్యక్రమం ప్రధాన భాగానికి చేరుకున్న ప్రతిసారీ.. బాలుడు తనకు తెలియని లాటిన్ భాషలో అరుస్తూ, తిట్టాడని కూడా అందులో రాశారు.
ఈ ఘటన జరిగిన కొంతకాలం తర్వాత, ఆ ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న విలియం పీటర్ బ్లాటీ అనే యువకుడు దీని గురించి మొదటిసారి తెలుసుకున్నాడు.
ఆ సమయంలో బ్లాటీ జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు.
1971లో "ది పింక్ పాంథర్" వంటి విజయవంతమైన సిరీస్‌లకు బ్లాటీ రచయిత, స్క్రీన్ రైటర్‌గా పని చేస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన తన "ది ఎక్సార్సిస్ట్" నవలను మార్కెట్లోకి విడుదల చేశారు.
అంతేకాదు దాని ఆధారంగా అదే పేరుతో సినిమా తీశారు. ఇది భయానక శైలితో కూడిన ఆధునిక సినిమాల్లోని ప్రసిద్ధ కథలలో ఒకటిగా మారింది. ఈ నవల, సినిమా భారీ విజయాన్ని సాధించాయి.

ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగింది?
1949 నుంచి వచ్చిన వార్తాపత్రికల కథనాల ప్రకారం 14 ఏళ్ల రోలాండ్ డో (మారుపేరు) గది నుంచి వింత వింత శబ్దాలు వచ్చాయి. బాలుడి కుటుంబంలో ఒకరు చనిపోయిన తర్వాత ఈ శబ్దాలు మొదలయ్యాయి.
దీంతో క్యాథలిక్ మత పెద్దలు భూతవైద్యం చేశారు. మిస్సోరీలోని సెయింట్ లూయిస్ క్యాథలిక్ విశ్వవిద్యాలయం డాక్యుమెంట్స్ ప్రకారం.. చనిపోయిన ఆంటీ టిల్లీ తాను బతికి ఉన్న కాలంలో ఆ అబ్బాయితో సన్నిహితంగా ఉండేవారు. ఆమె అతనికి ఓయిజా బోర్డు కూడా పరిచయం చేశారు. ఈ బోర్డు ఉపయోగించి 'ఆత్మ'లతో మాట్లాడొచ్చని కొందరు నమ్ముతుంటారు.
అప్పటి వార్తాపత్రికల్లో రాసిన ప్రకారం.. ఓయిజా బోర్డు ద్వారా ఆ అబ్బాయి టిల్లీ ఆంటీతో కమ్యూనికేట్ చేయడానికి చేసిన ప్రయత్నాలలో చూసిన విషయాలను కుటుంబం నమ్మలేకపోయింది.
రోలాండ్ బెడ్‌రూమ్‌లో కుర్చీలు వాటంతట అవే కదలడం, మంచం దానికదే ఊగడం గమనించారు. ఎవరో బరువైన సామగ్రి నేల మీదుగా లాగినట్లు అక్కడ గుర్తులు కనిపించాయి.

ఫొటో సోర్స్, Getty Images
క్యాథలిక్ చర్చికి..
వైద్యులు, సైకాలజిస్టులు రోలాండ్ గదిలో ఏం జరుగుతుందో చెప్పలేకపోయారు. దీంతో బాలుడి తల్లి పాస్టర్ లూథర్ మైల్స్ షుల్జ్ వద్దకు సాయం కోసం వెళ్లారు.
ఇలాంటి కేసులలో క్యాథలిక్ చర్చికి అపార అనుభవముందని వాషింగ్టన్‌లోని క్యాథలిక్ కమ్యూనిటీని సందర్శించవలసిందిగా పాస్టర్ ఆమెకు సూచించారు.
చర్చిలో భూతవైద్యం చేసే ఆచారం అక్కడ చాలాకాలంగా ఉంది.
రోలాండ్ కుటుంబం చెబుతున్న విషయాల్లో సాక్షిగా ఉన్నానంటూ డ్యూక్ యూనివర్శిటీ సైకియాట్రి విభాగానికి షుల్జ్ లేఖ ఒకటి రాశారు.
"కుర్చీలు వాటంతట అవే కదిలాయి, ఎవరో నన్ను దూరంగా నెట్టేశారు. మంచం మీద ఉన్న ప్రతిసారీ మంచం దానంతట అదే కదిలింది" అని షుల్జ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిశీలించిన రేమండ్ బిషప్
బాలుడి కథపై ఆసక్తితో అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు పాస్టర్ రేమండ్ బిషప్. మరికొందరితో మిస్సోరీలోని సెయింట్ లూయిస్ చేరుకున్నారు.
అక్కడి యూనివర్సిటీలోని జెస్యూట్ సంఘంతో మాట్లాడారు. బిషప్ తన ప్రతి సందర్శన విషయాలను డైరీలో రాసేవారు, అది విశ్వవిద్యాలయంలోనే అందుబాటులో ఉంది.
బిషప్ నోట్స్ ప్రకారం, రోలాండ్ మంచం చూసినప్పుడు, అది ఊగుతూ కనిపించింది.
అయితే, రేమండ్ శిలువ గుర్తు పట్టుకొని, మంచంపై పవిత్ర జలం జల్లినప్పుడు, అది ఊగడం ఆగింది.
అనంతరం ఇలాంటి విషయాలలో అనుభవం ఉందని చెప్పే.. యూనివర్సిటీలోని చాప్లేన్ విలియం హెచ్ బౌడర్న్ సాయం తీసుకోవాలనుకున్నారు.

ఫొటో సోర్స్, ST LOUIS UNIVERSITY
52 ఏళ్ల బౌడర్న్ రెండో ప్రపంచ యుద్ధంలో పనిచేశారు. ఆయనకు విస్తృతమైన బోధన అనుభవం ఉంది. రేమండ్ చెప్పిన రెండు రోజుల తర్వాత రోలాండ్‌ని కలిశారు బౌడర్న్.
ఆ సమయంలో ‘పవిత్ర జలం’ వంటి పదార్థాలు గది చుట్టూ చిందరవందరగా పడి ఉన్నాయి.
దీంతో రోలాండ్ శరీరంపై రెండు శిలువ ఆకారాల ముద్రలు వేశారు. ఈ విషయాలు సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయం డాక్యుమెంట్లలో ఉన్నాయి.
అనంతరం భూతవైద్యం చేయడానికి అనుమతి కావాలంటూ రేమండ్, బౌడర్న్‌లు సెయింట్ లూయిస్ యూనివర్శిటీ ఆర్చ్ బిషప్‌ను అభ్యర్థించారు. వైద్యం చేయడానికి చర్చి మతాధికారులు అనుమతించారు.

ఫొటో సోర్స్, Getty Images
శరీరం అసహజంగా వంగింది
1949 మార్చి, ఏప్రిల్ నెలల్లో మతాధికారులు వైద్యం చేసినట్లు బిషప్ డైరీలో రాసి ఉంది.
"భూతవైద్యుల ప్రార్ధనలు కొనసాగాయి. రోలాండ్ తన దిండు, బెడ్ షీట్లను పట్టుకొని అరిచాడు. దీంతో అతని చేతులు, కాళ్ళు, తల ముగ్గురు వ్యక్తులు పట్టుకోవలసి వచ్చింది. సహజ శక్తికి మించి బాలుడి శరీరం వంగడం మొదలైంది. అక్కడ ప్రార్థన చేస్తున్న వారిపై, మతపరమైన చిహ్నాలపై ఉమ్మివేయడం మొదలుపెట్టాడు బాలుడు. వెంటనే మతాధికారులు ‘పవిత్ర జలాన్ని’ అతనిపై జల్లడంతో వణికిపోయాడు. అనంతరం పెద్దగా వింత శబ్ధాలతో అరిచాడు'' అని డైరీలో ఉంది.
బాలుడికి విముక్తి కల్పించడానికి యూనివర్సిటీ వేరు వేరు ప్రాంతాలలో వైద్యం నిర్వహించింది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో జరిగిన వింత ఘటనలను బిషప్ వివరించారు.
ఒక సెక్యూరిటీ కార్యాలయం, దాని ప్రవేశ ద్వారం వద్ద పవిత్ర జలాన్ని జల్లుతూ రోలాండ్ సమీపంలోని లోయలో దూకడానికి ప్రయత్నించాడు.
ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఈస్టర్ ఆదివారం రోజు బౌడర్న్ భూతవైద్యం చేస్తుండగా రోలాండ్ అకస్మాత్తుగా ఆందోళనతో లేచాడని గుర్తుచేసుకున్నారు బిషప్.
భూత వైద్యం సమయంలో దెయ్యం ఎవరో బహిర్గతం చేయాలని, బాలుడి శరీరాన్ని విడిచిపెట్టాలని బౌడర్న్ డిమాండ్ చేశారు. దానికి రోలాండ్ మూగ స్వరంతో సమాధానమిచ్చాడు.
నేనెప్పుడూ ఈ శరీరంలోనే ఉంటానని బదులిచ్చాడు. ఆ రోజు అర్ధరాత్రికి కొన్ని నిమిషాల ముందు రోలాండ్ నుంచి భిన్న స్వరాలు వచ్చాయని బిషప్ చెప్పారు.
"సాతాను! సాతానా! నేను సెయింట్ మైఖేల్. నిన్ను, సాతాను, ఇతర దుష్టశక్తులను శరీరం విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నా. వెంటనే. ఇప్పుడే! ఇప్పుడే! ఇప్పుడే!" అని అరిచాడు.
రోలాండ్ మేల్కొని 'దేవదూత' సెయింట్ మైఖేల్ తనను రక్షించడానికి గొప్ప యుద్ధం చేసి, గెలిచారని మతాధికారులకు చెప్పారు.

ఫొటో సోర్స్, ST. LOUIS UNIVERSITY
'ది ఎక్సార్సిస్ట్'లోని అబ్బాయి ఎవరు?
సెయింట్ లూయిస్ చర్చి మత పెద్దలు రోలాండ్ ఐడెంటిటీ రహస్యంగా ఉంచారు.
1949 ఆగస్టులో ఆ కుటుంబానికి చెందిన లూథరన్ పాస్టర్ ది వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడారు. ఈ వార్త విలియం పీటర్ బ్లాటీ చెవిన పడింది.
సంఘటన గురించి వార్తలు చాలా ఉన్నప్పటికీ ఆ పుస్తకం, చలనచిత్రం రెండూ భారీ విజయాన్ని సాధించాయి.
కొన్నేళ్లపాటు ఆ ఘటనలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నించారు.
కొందరు రచయితలు రోలాండ్ 1935లో మేరీల్యాండ్‌లో జన్మించినట్లు, నాసాలో ఏరోస్పేస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు.
అయితే, 2021లో అమెరికాలోని అనేక మీడియా సంస్థలు రోలాండ్ (2020లో 86 ఏళ్లు వయసులో) మరణించినట్లు కథనాలు వెల్లడించాయి.
1949లో ఆ రెండు నెలల్లో జరిగిన సంఘటనల గురించి చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ రచయిత, చరిత్రకారుడు హెన్రీ ఎ. కెల్లీ కీలక విషయాలు వెల్లడించారు.
ఆయన ఫాదర్ బౌడర్న్‌ను కలిసి మాట్లాడినట్లు 1974లో విడుదలైన "ది డెవిల్, డెమోనాలజీ, అండ్ విచ్‌క్రాఫ్ట్" అనే పుస్తకంలో తెలిపారు.
అయితే, 'భూత వైద్యం' చేసే ముందు వ్యక్తిలో 'దెయ్యం' పట్టినట్లు ఎలాంటి సంకేతాలు చూడలేదని బౌడర్న్ చెప్పినట్లు కెల్లీ రాశారు.
ఇక 'భూత వైద్యం' సందర్భంలో వైద్య పర్యవేక్షణ లేకపోవడంతో బిషప్ డైరీలోని కథనం విశ్వసనీయతపై సందేహాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
- ‘నన్ను, నా చెల్లిని కాపాడబోయి మా నాన్న వరదలో కొట్టుకుపోయారు. కానీ...’
- దావూద్ ఇబ్రహీం: పోలీస్ కానిస్టేబుల్ కొడుకు అండర్ వరల్డ్ డాన్ ఎలా అయ్యాడు?
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?
- కోవిడ్: కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1, పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?
- రేప్ కేస్-సజ్జన్ జిందాల్: ఈ బిజినెస్ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














