పోప్ ఫ్రాన్సిస్‌ నాయకత్వాన్ని ప్రశ్నించిన టెక్సాస్ బిషప్ తొలగింపు.. అసలేం జరిగింది?

పోప్ ఫ్రాన్సిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పోప్ ఫ్రాన్సిస్
    • రచయిత, మలు కర్సినో
    • హోదా, బీబీసీ న్యూస్

టెక్సాన్ బిషప్ జోసెఫ్ స్ట్రిక్‌ల్యాండ్‌ (65)ను పదవి నుంచి తొలగించారు క్యాథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్. పోప్ నాయకత్వాన్ని ప్రశ్నించిన అనంతరం ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు.

టైలర్ డియోసెస్‌లో విచారణ అనంతరం అక్కడి బిషప్‌ను బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు వాటికన్ ప్రకటించింది.

పోప్ సంస్కరణలను వ్యతిరేకిస్తున్న అమెరికా క్యాథలిక్కుల గ్రూపులో బిషప్ స్ట్రిక్‌ల్యాండ్ ముఖ్యులు.

కొంతమంది అమెరికా క్యాథలిక్ చర్చి నాయకుల "వెనుకబాటు" గురించి పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.

టైలర్ డియోసెస్ తాత్కాలికంగా ఆస్టిన్ బిషప్ జో వాస్క్వెజ్ ఆధ్వర్యంలో పనిచేస్తుందని వాటికన్ తెలిపింది.

ట్రాన్స్ జెండర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అబార్షన్, లింగమార్పిడి హక్కులు, స్వలింగ వివాహం సహా పలు సామాజిక అంశాల్లో చర్చి వైఖరిలో ఆధునిక పోకడల కోసం పోప్ చేసిన ప్రయత్నాలపై బిషప్ స్ట్రిక్‌ల్యాండ్ విమర్శలు గుప్పించారు.

ఏం జరిగింది?

అబార్షన్, లింగమార్పిడి హక్కులు, స్వలింగ వివాహం సహా పలు సామాజిక అంశాల్లో చర్చి వైఖరిలో ఆధునిక పోకడల కోసం పోప్ చేసిన ప్రయత్నాలపై బిషప్ స్ట్రిక్‌ల్యాండ్ విమర్శలు గుప్పించారు.

దీంతో క్యాథలిక్ బోధనలోని అనేక ప్రాథమిక సత్యాలు సవాలుకు గురవుతాయని ఆయన జులైలో హెచ్చరించారు.

ప్రత్యేకించి వివాహమనేది ఒక పురుషుడు, స్త్రీ మధ్య దేవుడు సృష్టించినట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే, పోప్ ప్రయత్నాలు దేవుడు ఇచ్చిన గుర్తింపును అణగదొక్కేవిగా ఆరోపించారు బిషప్.

'మార్చకూడని విషయాలు' మార్చడం చర్చిలో పరిష్కరించుకోలేని విభేదాలకు దారితీస్తుందంటూ బిషప్ లేఖ రాశారు. ఇలా మార్పు కోరుకునేవారు విబేధించేవారేనని ఆయన ఆరోపించారు.

ఫ్రాన్సిస్

ఫొటో సోర్స్, REUTERS

పోప్ ఆదేశాలతో విచారణ

వాటికన్ విచారణ చేస్తున్న సమయంలో రాజీనామా చేయబోనని స్ట్రిక్‌ల్యాండ్‌ చెప్పారు. అంతేకాదు, సెప్టెంబర్‌లో రాసిన ఒక బహిరంగ లేఖలో తనను తొలగించాలని పోప్‌కు సవాల్ విసిరారు.

బిషప్ పదవికి రాజీనామా చేయలేనని, అలా చేస్తే నమ్ముకున్న వారిని వదిలేయడమేనని స్ట్రిక్‌ల్యాండ్ అన్నారు.

అయితే, విచారణ సమయంలో స్ట్రిక్‌ల్యాండ్‌కు మద్దతు ఇవ్వడానికి ‘కొయలిషన్ ఫర్ క్యాన్సిల్డ్ ప్రీస్ట్స్’ ఈ ఏడాది ప్రారంభంలో ఒక సమావేశాన్ని నిర్వహించింది.

"గత జూన్‌లో పోప్ ఆదేశాలనుసారం టైలర్ డియోసెస్‌లో జరిగిన అపోస్టోలిక్ విజిటేషన్ (విచారణ) తర్వాత ఆయనను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నాం" అని వాటికన్ తెలిపింది.

టైలర్ డియోసెస్‌లో ఆర్థిక వ్యవహారాల నిర్వహణపై కూడా విచారణ జరిగిందని క్యాథలిక్ మీడియా చెప్పింది.

2012లో పోప్‌గా బెనెడిక్ట్ XVI ఉన్న సమయంలో స్ట్రిక్‌ల్యాండ్‌ బిషప్‌గా నియమితులయ్యారు.

వాటిని మనం నిర్ణయించలేం: పోప్

పోప్ ఫ్రాన్సిస్ తన హయాంలో చర్చిని మరింత ప్రగతిశీలంగా మార్చడానికి చేసిన ప్రయత్నాలే ఈ పరిణామాలకు మూలంగా చెప్పొచ్చు.

క్యాథలిక్ చర్చిలో ట్రాన్స్ ‌జెండర్స్ బాప్టిజం పొందవచ్చని గురువారం వాటికన్ ప్రకటించింది.

స్వలింగ జంటలను ఆశీర్వదించడానికి అక్టోబర్‌లో చర్చి అందుబాటులో ఉంటుందని తెలిపారు.

మనం ఎవరిని రానివ్వాలి, ఎవరని వద్దనాలనేది నిర్ణయించే వాళ్లం కాదని కార్డినల్స్ సమావేశంలో చెప్పారు పోప్ ఫ్రాన్సిస్.

కొంత మంది వెనుకబాటుతనం పనికిరానిదని లిస్బన్‌లో జరిగిన ప్రపంచ యువజన దినోత్సవాల సమావేశంలో పోప్ అన్నారు.

సానుకూల మార్పులను స్వీకరించకుండా పాత పద్ధతులకు కట్టుబడి ఉండటం నిజమైన సంప్రదాయాన్ని కోల్పోయేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

పోప్ 2015లో పర్యావరణంపై ముఖ్యమైన పత్రాన్ని విడుదల చేయడం నుంచి వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం ప్రమాదంలో ఉందని హెచ్చరించడం వరకు చురుకుగా వ్యవహరించారు.

వాతావరణ మార్పులు అనే వాస్తవాన్ని తిరస్కరించే వారిని పోప్ తీవ్రంగా విమర్శించారు. ఈ నెలాఖరులో ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (COP28)లో ఆయన పాల్గొనబోతున్నారు.

ఈ సదస్సు ప్రారంభమైన (1995) తర్వాత ఒక పోప్ దీనికి హాజరవడం ఇదే మొదటిసారి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)