కోచి: ‘జెహోవా విట్‌నెస్‌’ అంటే ఎవరు... జంట పేలుళ్లకు తానే బాధ్యుడినన్న మార్టిన్ వీడియోలో ఏముంది?

కొచ్చి పేలుళ్లు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, జంట పేలుళ్లు జరిగిన జెహోవా విట్‌నెస్ కన్వెన్షన్ సెంటర్
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

కేరళలోని కోచిలో ‘జెహోవా విట్‌నెస్’ గ్రూపు సభ్యుల ప్రార్థనా మందిరంలో జరిగిన జంట బాంబు పేలుళ్లతో అసలు వీరు ఎవరనే చర్చ మొదలైంది.

‘యుగాంతంలో ఏసుక్రీస్తు తిరిగి వస్తాడని విశ్వసించే, తమను తాము క్రైస్తవులుగా భావించుకునే ఒక చిన్న సమూహమే జెహోవా విట్‌నెస్‌’

కొట్టాయంలోని ఒక పాఠశాలలో ఉదయం జరిగే అసెంబ్లీలో జాతీయ గీతం ఆలపించేందుకు ముగ్గురు విద్యార్థులు నిరాకరించిన ఘటనతో జెహోవా విట్‌నెస్‌ సముదాయం వార్తల్లోకి వచ్చింది.

తమ మత విశ్వాసాలను కారణంగా చూపుతూ జాతీయ గీతం ఆలపించేందుకు ఆ విద్యార్థులు నిరాకరించారు. దీంతో ఆ విద్యార్థులను స్కూల్ నుంచి తొలగించారు. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది.

మత స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛను స్కూల్ ఉల్లంఘించిందంటూ విద్యార్థులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

కొచ్చి పేలుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాంబు పేలుళ్లలో చాలా మందికి తీవ్రగాాయాలయ్యాయి

డొమినిక్ మార్టిన్ వీడియోలో ఏముంది?

జెహోవా విట్‌‌నెస్‌ సముదాయానికి చెందిన ప్రార్థనా మందిరంలో జరిగిన రెండు బాంబు పేలుళ్లకు తానే బాధ్యుడినని ప్రకటించిన డొమినిక్ మార్టిన్ కేరళ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయే ముందు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను పోస్టు చేశారు.

తాను 16 ఏళ్లుగా జెహోవా విట్‌నెస్ సముదాయంతో ఉన్నానని, కానీ ఎప్పుడూ దీని గురించి సీరియస్‌గా ఆలోచించలేదని ఆ వీడియోలో చెప్పారు. దేశ వ్యతిరేక బోధనలు చేస్తున్నారని ఆరేళ్ల కిందట గుర్తించానని, అలాంటి పద్ధతులు మానుకోవాలని హెచ్చరించినా వారు పట్టించుకోలేదని మార్టిన్ ఆ వీడియోలో అన్నారు.

''జాతీయ గీతం పాడకూడదని పిల్లలకు నేర్పిస్తున్నారు. పెద్దైన తర్వాత ఓటు వేయకూడదని, సైన్యంలో చేరొద్దని, ప్రభుత్వ ఉద్యోగాలు చేయొద్దని చెబుతున్నారు. ఈ ప్రాంతమంతా వరదలు వచ్చినప్పుడు వాళ్ల సముదాయానికి చెందిన వారి ఇళ్లను మాత్రమే వాళ్లు శుభ్రం చేశారు. జెహోవా విట్‌నెస్‌ సముదాయంలో సభ్యులు కానివారు నాశనమవుతారని వారు చేస్తున్న బోధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. అలాంటి సిద్ధాంతాలకు ఈ దేశంలో చోటు లేదని నమ్ముతున్నా'' అని మార్టిన్ అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది.

''మత విశ్వాసాలుగా చెబుతూ ఈ సముదాయం తప్పు చేస్తున్నట్టు అనిపించింది. అలాగే, వాళ్లు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం కూడా సరికాదు. దేశ వ్యతిరేక బోధనలు చేస్తున్నారు'' అని మార్టిన్ ఆరోపించారు.

''ఒకసారి తన క్లాస్‌మేట్ మిఠాయి ఇస్తే తీసుకోవద్దని నాలుగేళ్ల చిన్నారికి చెప్పారు. అంత చిన్న వయసులో క్లాస్‌మేట్స్‌పై ద్వేషం నింపడం, వారి పసిమనసులను విషపూరితం చేయడమే'' అని మార్టిన్ అన్నారు.

ఏడీజీపీ అజిత్ కుమార్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, విచారణకు ఏడీజీపీ అజిత్ కుమార్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు

పేలుళ్లపై దర్యాప్తుకు సిట్

ప్రార్థన మందిరంలో జరిగిన జంట పేలుళ్లలో ముగ్గురు చనిపోగా, 50 మంది గాయాలపాలయ్యారు.

త్రిస్సూర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో మార్టిన్ లొంగిపోయారని కేరళ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ అజిత్ కుమార్ మీడియాకు చెప్పారు. మార్టిన్ చెప్పిన విషయాలపై విచారణ జరుపుతున్నట్లు ఆయన చెప్పారు.

ఆదివారం సాయంత్రం పోలీసులు విచారణ కోసం మార్టిన్‌ను పేలుళ్లు జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు.

ఈ ఘటనపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 307 (హత్యాయత్నం), ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్‌లోని సెక్షన్ 3ఏ, యూఏపీఏ (అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) సెక్షన్ 16(1) కింద కేసులు నమోదు చేశారు.

ఈ కేసు విచారణకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ అజిత్ కుమార్ నేతృత్వంలో 21 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ -సిట్‌)ను ఏర్పాటు చేశారు.

కొచ్చి పేలుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పేలుళ్లలో గాయపడినవారిలో కొందరిని కొల్లాం ఆస్పత్రికి తరలించారు

మేం ఎవరికీ వ్యతిరేకం కాదు: జెహోవా విట్‌నెస్

జెహోవా విట్‌నెస్ సముదాయ సభ్యుల మూడు రోజుల ప్రార్థనల్లో చివరి రోజు ఈ పేలుళ్లు జరిగాయి.

''ఉదయం 9 గంటల 40 నిమిషాలప్పుడు తనతో కలిసి అందరూ ప్రార్థన చేయాలని సంఘ చైర్మన్ అన్నారు. ఆ తర్వాత సరిగ్గా మూడు నిమిషాలకు పేలుడు జరిగింది'' అని ఆ సంఘ అధికార ప్రతినిధి టీఏ శ్రీకుమార్ చెప్పారు.

ఈ భారీ ప్రార్థనా మందిరం మధ్యలో రెండు పేలుళ్లు జరిగాయని శ్రీకుమార్ అన్నారు. అక్కడ మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని, గాయపడిన వారిలో కొందరిని కలమస్సేరి ఆస్పత్రికి, మరికొందరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు ఆయన చెప్పారు.

బాంబు పేలుళ్లకు తనదే బాధ్యతని ప్రకటించిన మార్టిన్ గురించి అడగ్గా, ఆరా తీస్తున్నామని శ్రీకుమార్ చెప్పారు. అయితే, జెహోవా విట్‌నెస్ సముదాయం ఇతర విషయాల జోలికి వెళ్లదని ఆయన స్పష్టం చేశారు.

''మేం నిష్పక్షపాతంగా ఉంటాం. ఎలాంటి మతపరమైన, రాజకీయపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కానీ, మద్దతు ఇవ్వడం కానీ జరగదు. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. తమ విశ్వాసాలను పాటించేందుకు ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుందని మేం విశ్వసిస్తాం'' అన్నారు.

ఇజ్రాయెల్ - గాజా వివాదంపై శనివారం ప్రార్థనలు నిర్వహించినందుకే ఈ పేలుళ్లు జరిగాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కొచ్చి పేలుళ్లు

ఫొటో సోర్స్, ANI

బాధితులకు తీవ్ర గాయాలు

కేరళలోని ఇడుక్కికి చెందిన తమిళ సినీ డైరెక్టర్ లక్ష్మణ్ ప్రభు, పేలుళ్ల విషయం తెలుసుకుని కలమస్సేరి ఆస్పత్రికి వచ్చారు. తన 57 ఏళ్ల అత్తయ్య, 15 ఏళ్ల మరదలి కోసం ఆయన ఆస్పత్రికి చేరుకున్నారు.

''మా అత్తయ్య వెనుక భాగం పూర్తిగా కాలిపోయింది. ఆమె కాళ్లకు కూడా గాయాలయ్యాయి. దాదాపు 50 నుంచి 55 శాతం శరీరం కాలిపోయింది.

మా మరదలు పదో తరగతి చదువుతోంది. మా అత్తయ్య, మరదలు ఇద్దరూ జెహోవా విట్‌నెస్‌ సభ్యులు. నా భార్య క్రిస్టియన్, నేను హిందూ'' అని లక్ష్మణ్ ప్రభు చెప్పారు.

ప్రభు, ఆయన భార్య ఇంట్లోనే ఉండడంతో పేలుళ్ల నుంచి తప్పించుకున్నారు.

తమ పిన్ని మొల్లి సిరియన్‌కి 80 శాతం గాయాలయ్యాయని ఐసీయూ బయట కూర్చుని ఉన్న కరోలిన్ సారా చెప్పారు.

''నా చెల్లెలు వీనస్ షాజు పొన్నాలి 70 శాతం కాలిపోయింది. ఆమె చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె నడవలేని స్థితిలో ఉంది'' అని సారా అన్నారు.

పేలుళ్లు జరిగినప్పుడు సారా ఇంట్లోనే ఉన్నారు. దీంతో ఆమె పేలుళ్ల బారినపడలేదు.

సారా, ఆమె తల్లిదండ్రులు రోమన్ క్యాథలిక్కులు. అయితే, వాళ్ల పిన్ని, ఆమె కూతురు జెహోవా విట్‌నెస్ సభ్యులుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)