అరికొంబన్: బియ్యమంటే పడి చచ్చే ఒక ఏనుగు కన్నీటి కథ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్
నెల రోజుల్లోనే ఒక అడవి ఏనుగును రెండుసార్లు బంధించారు, చాలాసార్లు మత్తు మందు ఇచ్చారు, ఆహారం కోసం ఇళ్లపైకి రాకుండా ఉండేందుకు తన సొంత ఆవాసం నుంచి 280 కి.మీ. దూరానికి తరలించారు. ఇది అరికొంబన్ కథ.
అరికొంబన్ అంటే మలయాళంలో ‘‘బియ్యం తినే ఏనుగు’’ అనే అర్థముంది. బియ్యం కోసం స్థానిక షాపులపై తరచుగా దాడి చేయడంతో దీనికి ఆ పేరు పెట్టారు.
దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు మధ్య తిరుగుతున్న ఈ ఏనుగుకు శాశ్వత నివాసం వెతికి పెట్టేందుకు అధికారులు అవస్థలు పడుతున్నారు. జంతువుల హక్కులపై చర్చలు, కోర్టుల్లో పోరాటాలకూ ఈ ఏనుగు కేంద్రంగా మారుతోంది.
కేరళలో అరికొంబన్‌ను ‘‘అన్యాయంపై పోరాటానికి చిహ్నం’’గా చూస్తున్నారని జంతువుల హక్కుల ఉద్యమకర్త శ్రీదేవి ఎస్ కర్తా చెప్పారు.
‘‘ఒక ఏనుగును సొంత నివాసం నుంచి వేరే చోటుకు తరలించడం ఎంత క్రూరంగా ఉంటుందో తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, SUPRIYA SAHU/TWITTER
కేరళ ఇడుక్కి జిల్లాలోని చిన్నకనాల్ అటవీ ప్రాంతంలో అరికొంబన్ తిరిగేది. తరచూ ఇళ్లు, దుకాణాలపైకి రావడంతో స్థానికులు నిరసన చేపట్టేవారు. అరికొంబన్‌ను ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని వారు డిమాండ్ చేసేవారు.
కొంత మందిని ఈ ఏనుగు చంపేసిందని కూడా అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఏనుగు హత్యలేమీ చేయలేదని స్థానిక గిరిజనులు అంటున్నారు.
అరికొంబన్‌ను పట్టుకొని, దాన్ని శిక్షణ పొందిన ఏనుగుగా మారుస్తామని అప్పట్లోనే కేరళ అటవీ విభాగం చెప్పింది.
ఆ ఏనుగును కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టును జంతు హక్కుల కార్యకర్తలు ఆశ్రయించారు.
మనుషులను ఆ ఏనుగు చంపేస్తోందనే ఆధారాలేమీ కోర్టులో ప్రభుత్వం సమర్పించలేదని పీపుల్స్ ఫర్ యానిమల్స్(పీవోఏ) సంస్థకు చెందిన శ్రీదేవి చెప్పారు. కోర్టులో అభ్యర్థన దాఖలు చేసిన వారిలో ఆమె కూడా ఒకరు.

ఫొటో సోర్స్, TAMIL NADU GOVERNMENT
అయితే, ఈ ఏనుగును ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తేనే మంచిదని కోర్టు నియమించిన నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.
ఆ తర్వాత రెండు రోజులు, అరికొంబన్‌ను పట్టుకొనేందుకు చిన్నకనాల్‌లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఏప్రిల్ 29న మొత్తానికి ఇక్కడకు 80 కి.మీ. దూరంలోని ‘‘పెరియార్ టైగర్ రిజర్వ్’’కు ఈ ఏనుగును తరలించారు.
అయితే, ఇది జరిగిన నెల రోజులకే తమిళనాడులోని అటవీ అధికారులు కూడా మళ్లీ అరికొంబన్‌ను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఆ ఏనుగును బంధించి వేరో చోటుకు తరలించడమే వీరి లక్ష్యం.
మే 27న తమిళనాడులోని కంబం పట్టణంలో అరికొంబన్ కనిపించింది. రద్దీగా కనిపించే పట్టణంలో ఏనుగు పరిగెడుతూ భవనాలు, వాహనాలను ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అయితే, ఈ క్రమంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరు 65 ఏళ్ల వృద్ధుడు. రెండు రోజుల తర్వాత ఆయన గాయాలతో మరణించారు. అరికొంబన్‌ను అధికారులు పట్టుకునే ప్రయత్నాల నడుమ ఇక్కడ కర్ఫ్యూ విధించారు.
నేడు కోర్టులో పోరాటాలకూ అరికొంబన్ కేంద్రంగా నిలుస్తోంది. ఆ ఏనుగును మళ్లీ కేరళకు తీసుకొచ్చేయాలని రాష్ట్ర హైకోర్టులో ఒక రాజకీయ నాయకుడు పిటిషన్ దాఖలు చేశారు.
తమిళనాడులో ఆ ఏనుగు చేసిన విధ్వంసానికి తనకు పరిహారం చెల్లించాలని ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
కేరళ అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ స్పందిస్తూ అరికొంబన్‌ను శిక్షణ పొందిన ఏనుగుగా మార్చాలనే తమ ప్రభుత్వ ప్రణాళికతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
ఆ ఏనుగును వేరే ప్రాంతానికి తరలించడానికి ఉద్యమకారులే కారణమని ఆయన ఆరోపించారు.

ఫొటో సోర్స్, ARUN CHANDRABOSE
కంబం ఘటనలను పరిశీలిస్తే, అరికొంబన్‌తో మనుషులకు ఎలాంటి ముప్పూలేదని స్పష్టంగా తెలుస్తోందని శ్రీదేవి అంటున్నారు. ‘‘ఆ ఏనుగు భయంతో ఉంది. అందుకే కొందరి వెంట పడింది. కానీ, అక్కడ ఎవరిపైనా దాడి చేయలేదు’’ అని ఆమె చెప్పారు.
జూన్ 5న తమిళనాడు అటవీ విభాగం అధికారులు మరోసారి మళ్లీ అరికొంబన్‌కు మత్తు ఇచ్చి పట్టుకున్నారు.
అయితే, మళ్లీ మళ్లీ ఏనుగుకు మత్తు ఇవ్వడం, ట్రక్కుల్లో తరలించడంతో గాయాలు కావడం లాంటి అంశాలపై జంతు హక్కుల ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఏనుగు తిరిగే మార్గంలో మనుషుల అవాసాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు అరికొంబన్ మూల్యం చెల్లించాల్సి వస్తోందని జంతు హక్కుల ఉద్యమకారుడు స్టీఫెన్ డేనియేల్ చెప్పారు.
‘‘ఆ మూగ జంతువు ఎంతో మానసిక, శారీరక హింసను భరిస్తోంది. దీనికి రెండు రాష్ట్రాల్లోని అటవీ విభాగాలు సమాధానం చెప్పాల్సిన అవసరముంది’’ అని ఆయన అన్నారు.
అరికొంబన్‌ను మళ్లీ వెనక్కు తీసుకొచ్చేయాలని కేరళలో చిన్నకనాల్‌లో గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం కోర్టుకు కూడా వెళ్లాలని వారు భావిస్తున్నారు.
‘‘అంతలా హింసించేందుకేనా ఆ ఏనుగును బంధించి టైగర్ రిజర్వుకు పంపించారు’’ అని ఒక నిరసనకారుడు మలయాళ మనోరమ వార్తా సంస్థతో అన్నారు.
ప్రస్తుతం కంబంకు 200 కి.మీ. దూరంలోని ‘‘కలక్కడ్ ముందాంథురై టైగర్ రిజర్వ్’’కు అరికొంబన్‌ను తరలించినట్లు తమిళనాడు అటవీ విభాగం చెబుతోంది.
అయితే, ఇప్పుడు అక్కడుండే స్థానికులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. అరికొంబన్ తమ అవాసాల్లో విధ్వంసం సృష్టిస్తుందేమోనని వారు భయపడుతున్నారు.
తమిళనాడు అటవీ అధికారి సుప్రియా సాహు మాట్లాడుతూ.. ‘‘విజయవంతంగా సురక్షిత ప్రాంతానికి అరికొంబన్‌ను తరలించాం. అది దట్టమైన అడవి, నీరు కూడా పుష్కలంగా ఉంటుంది. అక్కడ ఏనుగు హాయిగా ఆహారం తీసుకుంటోంది’’ అని ఆమె ట్వీట్ చేశారు.
రాష్ట్ర అటవీ సిబ్బంది అరికొంబన్ ఆరోగ్యంతోపాటు దాని కదలికలనూ ఒక కంట కనిపెడుతున్నారు.
‘‘అరికొంబన్ ఆరోగ్యంతో ఉంది. గాయాల నుంచి కోలుకుంటోంది’’ అని అటవీ అధికారి శ్రీనివాస్ రెడ్డి బీబీసీ తమిళ్‌తో చెప్పారు.
అయితే, దట్టమైన అడవిలో వదిలి పెట్టినప్పటికీ, మళ్లీ అరికొంబన్ జనావాసాల్లోకి వస్తుందని తాజా పరిణామాలు చెబుతున్నాయని మీడియాతో శశీంద్రన్ అన్నారు.
‘‘వేరే చోటుకు తరలించడం అనేది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. మళ్లీ ఆ ఏనుగు కేరళలోకి రాదని మేం చెప్పలేం’’ అని ఆయన అన్నారు.
మళ్లీ రాష్ట్రంలోకి వస్తుందనే అనుమానంతో కేరళ అటవీ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
‘‘సొంత ఆవాసాలకు ఏనుగులు తరచూ తిరిగిస్తుంటాయి. ఏప్రిల్‌లో వేరే చోటుకు తరలించినప్పటి నుంచి వెనక్కి వచ్చేందుకు అరికొంబన్ ప్రయత్నిస్తూనే ఉంది’’ అని శ్రీదేవి అన్నారు.
‘‘ఒకవేళ తను మళ్లీ ప్రజల ఆవాసాల్లోకి వస్తే, కేరళకు తీసుకు వచ్చేయండి. ఇది మాత్రమే శాశ్వత పరిష్కారం’’ అని ఆమె చెప్పారు.
(ఈ కథనం కోసం మీను మ్యాథ్యూ అదనపు సాయం అందించారు.)
ఇవి కూడా చదవండి:
- మనీ: యూపీఐ, ఓఎల్ఎక్స్, డెబిట్/క్రెడిట్ కార్డ్ మోసాల బారిన పడకూడదంటే ఇలా చేయాలి
- కర్ణాటక బస్సుల్లో పక్క రాష్ట్రాల మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చా?
- కొలంబియా అమెజాన్: దట్టమైన అడవిలో ఆ నలుగురు పిల్లలు 40 రోజులు ఏం తిన్నారు, ఎలా నిద్రపోయారు... అడవే వారిని కాపాడిందా?
- భారత్‌లో వందేళ్ళ కిందటే తొలి అండర్ వాటర్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని కలగన్న బ్రిటిష్ ఇంజనీర్
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















