అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్, కొచ్చి
కేరళలో స్థానిక రేషన్ దుకాణాలపై దాడి చేసి బియ్యాన్ని తింటూ ముప్పుతిప్పలు పెట్టిన అరికొంబన్ అనే ఏనుగును ఒక టైగర్ రిజర్వ్‌కు తరలించారు.
అరికొంబన్ అంటే మలయాళంలో బియ్యానికి అలవాటుపడిన ఏనుగు అని అర్థం. బియ్యం కోసం ఈ ఏనుగు స్థానిక దుకాణాలపై తరచుగా దాడి చేయడంతో దీనికి అధికారులు అరికొంబన్ అనే పేరు పెట్టారు.
బియ్యానికి అలవాటు పడిన ఈ ఏనుగు ఇప్పటివరకు ఏడుగురిని చంపేసింది.
ఏనుగును తమ ప్రాంతం నుంచి వేరే చోటుకు పంపించేయాలని కొన్ని నెలలుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
శనివారం రోజు దీనిని పట్టుకున్న అధికారులు మత్తుమందు ఇచ్చి 80 కి.మీ దూరంలో ఉన్న పెరియార్ టైగర్ రిజర్వ్‌కు తరలించారు.
ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు చెప్పారు. అరికొంబన్‌కు అమర్చిన ఒక రేడియో కాలర్ ద్వారా దాని కదలికలను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
మానవ-వన్యప్రాణి సంఘర్షణకు సంబంధించిన పెద్ద సమస్యను ఇది సూచిస్తుందని, కేవలం ఒక జంతువును వేరే చోటుకు తరలించడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాబోదని జంతు సంరక్షణ కార్యకర్తలు అంటున్నారు.

ఫొటో సోర్స్, ARUN CHANDRABOSE
2017లో చివరిసారిగా ఏనుగుల గణన (ఎలిఫెంట్ సెన్సస్) జరిగింది. దాని ప్రకారం, భారత్‌లో దాదాపు 30 వేల అడవి ఏనుగులు ఉన్నాయి. అంటే మొత్తం ఆసియా అడవి ఏనుగుల్లో ఇవి 60 శాతం ఉన్నట్లు.
ఆవాసాలను కోల్పోవడం, అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల మానవ ఆవాసాలపై, పంటలపై ఏనుగులు దాడికి దిగే పరిస్థితులు ఏర్పడతాయి. దీని వల్ల ఇబ్బందులు కలుగుతాయి.
అరికొంబన్ వయస్సు 30 ఏళ్లకు పైగా ఉంటుందని అంచనా. కేరళలోని ఇడుక్కి జిల్లా దేవికులమ్ అటవీ ప్రాంతంలో ఉండే ప్రజలు, చాలా ఏళ్లుగా అరికొంబన్‌ను చూస్తున్నారు.
వెదురు బొంగులు, గడ్డితో ఏర్పాటు చేసిన గుడిసెలు ఉన్న సమయంలో ఈ ఏనుగు వల్ల తమకు తక్కువ నష్టం కలిగేదని ‘‘ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’’ వార్తా పత్రికతో స్థానికులు చెప్పారు.
కానీ, ఇక్కడ జనాభా పెరిగే కొద్దీ కాంక్రీట్ ఇళ్లు సాధారణంగా మారాయని, అప్పటినుంచి ఈ ఏనుగు భవనాలను ధ్వంసం చేయడం, ప్రజల వెంట పడటం వంటి ఘటనలు మొదలయ్యాయని తెలిపారు. ఈ కారణంగానే స్థానికులు నిరసనలకు దిగడం మొదలైందని వెల్లడించారు.
అరికొంబన్‌ను పట్టుకొని దానికి తగు శిక్షణ ఇచ్చి బందీగా చేయాలని తొలుత రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు రచించారు. కానీ, దీనికి వ్యతిరేకంగా కేరళ హైకోర్టులో జంతు సంరక్షణ కార్యకర్తలు పిటిషన్ వేశారు.
ఈ ఏనుగు ఏడుగురిని చంపినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై కార్యకర్తలు ప్రశ్నలు లేవనెత్తారు.
‘‘ఆ ప్రాంతంలో మేం విచారణ చేసిన సమయంలో అరికొంబన్ ఎవరినీ చంపలేదని అక్కడి గిరిజనులు చెప్పారు’’ అని శ్రీదేవి అనే కార్యకర్త అన్నారు. ఆమె ‘‘పీపుల్ ఫర్ యానిమల్స్’’ అనే సంస్థ సభ్యురాలు. కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంస్థల్లో ‘‘పీపుల్ ఫర్ యానిమల్స్’’ కూడా ఒకటి.
కేరళ హైకోర్టు దీనిపై అయిదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏనుగును బంధించి, ప్రజలతో సంఘర్షణ ఏర్పడని వేరే ప్రాంతానికి తరలించాలని ఆ కమిటీ ప్రతిపాదనలు చేసింది.
పాలక్కాడ్ జిల్లాలోని పరంబికులమ్ టైగర్ రిజర్వ్‌కు అరికొంబన్‌ను తరలించాలని కమిటీ తొలుత సూచించింది. కానీ, అక్కడి ప్రజలు ఈ సూచనను వ్యతిరేకిస్తూ నిరసనలు చేశారు.
అరికొంబన్‌ను తరలించాలన్న హైకోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం, సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. అయితే, ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.
ఏనుగును తరలించడానికి కేరళ ప్రభుత్వం, ఇతర ప్రత్యామ్నాయ ప్రాంతాలను వెదకడం మొదలుపెట్టింది. దీన్ని పట్టుకోవడం కోసం భారీ ఆపరేషన్‌ను చేపట్టింది.
ఇందులో టాస్క్‌ఫోర్స్‌కు చెందిన 150 మంది అధికారులు పాల్గొన్నారు.
రెండు రోజుల ఆపరేషన్ అనంతరం మత్తుమందు ఇచ్చి అరికొంబన్‌ను పట్టుకోగలిగారు. పెరియార్ టైగర్ రిజర్వ్‌కు శనివారం దాన్ని తరలించారు.
అరికొంబన్ రాకను వ్యతిరేకిస్తూ స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కర్ఫ్యూ విధించడంతో పాటు పోలీసులను మోహరించినట్లు కథనాలు వచ్చాయి.
అయితే, అరికొంబన్‌ను అక్కడివారు స్వాగతించినట్లు సమాచారం.
అరికొంబన్‌ను దాని నివాస స్థలంలోనే ఉంచాలని, అదే ఉత్తమ మార్గమని తాము పిటిషన్‌లో కోరినట్లు బీబీసీతో శ్రీదేవి చెప్పారు.
‘‘కానీ, దాని విషయంలో అక్కడి ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా మారారు. అలాగే అరికొంబన్ ప్రాణాలకు ప్రమాదం ఉన్న నేపథ్యంలో దాన్ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడమే మంచిదని నిపుణుల కమిటీ నిర్ణయించింది’’ అని ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















