ఉత్తర్‌ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?

ఉన్నావ్‌లో బాధితురాలి ఇల్లు

ఫొటో సోర్స్, GAURAV SHARMA

ఫొటో క్యాప్షన్, ఉన్నావ్‌లో బాధితురాలి ఇల్లు
    • రచయిత, అమన్ ద్వివేది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 2022 ఫిబ్రవరిలో ఒక మైనర్‌ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆమె ఇంటికి ఈ ఏడాది ఏప్రిల్ 17న ఎవరో నిప్పంటించారు. అందులో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

గ్యాంగ్ రేప్ నిందితులే ఇంటికి నిప్పంటించారని ఆమె తల్లి పోలీస్టేషన్‌లో కేసు పెట్టారు. పోలీసులు ఎఫ్‌ఐ‌ఆర్ కూడా నమోదు చేశారు.

పోలీసులు మాత్రం అసలు ఇల్లు కాల్చేసింది అత్యాచార నిందితులు కాదని, అసలు ముద్దాయి బాధితురాలి కుటుంబ సభ్యుడేనని చెబుతూ, ఆయన్ను అరెస్టు చేశారు.

బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం- ''2022 ఫిబ్రవరి 13న ఉన్నావ్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు.

కొన్ని నెలల క్రితం మైనర్ బాధితురాలు ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే ఇటీవల ఇద్దరు నిందితులు బెయిల్ పొంది, జైలు నుంచి బయటకు వచ్చారు.

బాధితురాలి తల్లిని కొట్టి, ఆపై ఇంటికి నిప్పంటించారు'' అని చెప్పారు.

మైనర్ బాలిక తల్లి రెండు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

ఉన్నావ్ పోలీస్టేషన్

ఫొటో సోర్స్, GAURAV SHARMA

ఎఫ్‌ఐఆర్‌లలో ఏముంది?

ఒక ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం- ఏప్రిల్ 13న కేసు వాదనకు హాజరైన తర్వాత ఉన్నావ్ జిల్లా కోర్టు నుంచి తాను, తన భర్త ఇంటికి తిరిగి వస్తున్నట్లు పోలీసులకు బాధితురాలి తల్లి సమాచారం అందించారు. రోషన్, సతీష్, శ్యామ్ బహదూర్, చందన్ వారిద్దరిని దారిలో అడ్డుకుని కొట్టారు.

ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఆరుగురిపై అభియోగాలు నమోదయ్యాయి.

“ఏప్రిల్ 17 సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో గ్రామానికి చెందిన రోషన్, సతీష్, రంజిత్, రాజ్‌బహదూర్, చందన్, సుఖ్‌దీన్ మమ్మల్ని, రేప్ బాధితురాలిని కొట్టి, ఇంటికి నిప్పు పెట్టారు. దీనివల్ల ఇంట్లోనే ఉన్న బాధితురాలి కొడుకు (6 నెలల వయస్సు)కు గాయాలయ్యాయి" అని బాధితురాలి తల్లి చెప్పినట్టు రెండో ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. ఈ ఘటనలో ఏడుగురిపై ఆరోపణలు వచ్చాయి.

బాధితురాలి తల్లి విలేఖరులతో మాట్లాడుతూ- ‘ఇంతమంది బాలికతో తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. నిందితులపై కేసు ఉపసంహరించుకోవాలని, లేకుంటే అందరినీ చంపేస్తామని బెదిరిస్తున్నారు. అందుకే మా పిల్లల్ని మంటల్లో పడేశారు'' అంటూ బోరున విలపించారు.

పోలీసు అధికారి

ఫొటో సోర్స్, GAURAV SHARMA

ఇల్లు తగులబెట్టింది ఎవరు?

పోలీసుల వాదన ప్రకారం.. ఘటనలపై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చర్యలు తీసుకుంటున్నామని ఉన్నావ్‌లోని పూర్వ ప్రాంత సర్కిల్ ఆఫీసర్ సంతోష్ సింగ్ చెప్పారు.

2022 ఫిబ్రవరి 13న గ్యాంగ్‌ రేప్ ఘటన జరిగిందని, ఆ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని ఉన్నావ్ ఏడీఎం నరేంద్ర సింగ్ అన్నారు.

ఇందులో అమన్, సతీష్, అరుణ్‌లను జైలుకు పంపినట్లు తెలిపారు.

వీరిలో ఇద్దరు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇపుడు ఇల్లు తగులబెట్టి పిల్లలను గాయాల పాల్జేసింది కూడా వీరేనని అత్యాచార బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. అయితే తమ విచారణలో కొత్త కోణం బయటపడిందని పోలీసులు చెప్పారు.

ఆ ఇంటిని కాల్చింది అత్యాచార నిందితులు కాదని, బాధితురాలి కుటుంబానికి చెందిన వ్యక్తేనని పోలీసులు తెలిపారు. ఘటనకు పాల్పడింది బాధితురాలి అంకులేనని చెప్పారు.

దీనికి ఆధారాలు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పడంతో కేసు మరో మలుపు తిరిగింది.

ఉన్నావ్ ఎస్పీ సిద్ధార్థ్ శంకర్ మీనా మాట్లాడుతూ- “ఏప్రిల్ 17న మౌరవాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లజ్‌ఖేడా గ్రామంలో ఒక ఇంటికి నిప్పంటించినందుకు 185/23 కింద కేసు నమోదు అయింది. దీనిపై బయట చర్చ జరిగి ఓ వీడియో కూడా బయటికి వచ్చింది. రాజ్‌కిషోర్ అనే వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టారని ఘటనా స్థలంలో ఉన్న పిల్లలు చెప్పారు. రాజ్‌కిషోర్ వాళ్ల అంకులే. ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపాం. కేసు విచారణ కొనసాగుతోంది’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)