సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను అనుమతిస్తుందా, ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశ ఏంటి?

ఫొటో సోర్స్, ANKITA AND KAVITA
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై భారత సుప్రీం కోర్టు మంగళవారం తుది వాదనలను విననుంది.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు కోర్టు చెప్పింది.
సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని స్వలింగ సంపర్కులు, ఎల్జీబీటీక్యూ కమ్యునిటీకి చెందినవారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వంతో పాటు మత నాయకులు, స్వలింగ సంపర్కుల వివాహాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ పిటిషన్ల విచారణ ప్రక్రియను ఆసక్తిగా అనుసరిస్తున్న వారిలో డాక్టర్ కవితా అరోరా, అంకిత ఖన్నా ఉన్నారు. వారు స్వలింగ సంపర్కులు. పెళ్లి చేసుకోవడం కోసం వాళ్లిద్దరూ చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తొలి చూపులోనే అంకిత, కవిత ప్రేమలో పడిపోలేదు. మొదట వారిద్దరూ సహోద్యోగులు, ఆ తర్వాత స్నేహం మొదలైంది. అది కాస్తా ప్రేమగా మారింది.
బంధువులు, స్నేహితులు కూడా వారిద్దరి బంధాన్ని అంగీకరించారు.
వారిద్దరూ కలుసుకొని 17 ఏళ్లు అయింది. కలిసి జీవించడం మొదలుపెట్టి పదేళ్లు దాటింది.
చాలామంది దంపతులు కోరుకున్నట్లుగా వారిద్దరూ పెళ్లి చేసుకోలేరు అని మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
భారత్‌లో స్వలింగ సంపర్కుల వివాహాలను అనుమతించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన 15కు పైగా జంటల్లో కవిత-అంకిత జంట కూడా ఉంది.
కలిసి పిల్లలను పెంచుతున్న జంటలు కూడా 3కు పైగా పిటిషన్లను దాఖలు చేశాయి.
ఇది ప్రాధాన్యత అంశమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు.
చట్టపరమైన సవాళ్లను అన్నింటినీ పర్యవేక్షించి ఈ అంశంపై తీర్పునివ్వడానికి అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనాన్ని ఆయన ఏర్పాటు చేశారు.
భారత్‌లో ఎల్‌జీబీటీక్యూ ప్లస్ జనాభా కోట్లలో ఉన్నట్లు ఒక అంచనా. కాబట్టి ఈ అంశంపై భారత్‌లో చర్చ జరగడం చాలా కీలకం.

ఫొటో సోర్స్, ANKITA AND KAVITA
భారత్‌లో ఎల్‌జీబీటీక్యూ ప్లస్ జనాభా 25 లక్షలు ఉన్నట్లు 2012లో ప్రభుత్వం వెల్లడించింది.
కానీ, ప్రపంచ అంచనాల ఆధారంగా భారత్‌లో వీరి జనాభా దాదాపు 10 శాతం లేదా 13.5 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.
కొన్నేళ్లుగా భారత్‌లో స్వలింగ సంపర్కాని (హోమో సెక్సువాలిటీ)కి ఆమోదం కూడా పెరిగింది.
2020లో ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ చేసిన సర్వేలో స్వలింగ సంపర్కాన్ని ఆమోదించాలని 37 శాతం ప్రజలు చెప్పారు.
2014లో తొలిసారిగా ఈ అంశంపై సర్వే నిర్వహించినప్పుడు కేవలం 15 శాతం మంది మాత్రమే దీనికి ఆమోదం తెలిపారు. అంటే ఆరేళ్లలో 22 శాతం వృద్ధి నమోదైంది.
పరిస్థితిలో కాస్త మార్పు వచ్చినప్పటికీ సెక్స్, సెక్సువాలిటీ పట్ల భారత ప్రజల వైఖరి ఇంకా సంప్రదాయవాదంగానే ఉంది.
భయం కారణంగా చాలామంది ఎల్జీబీటీక్యూ ప్లస్ వ్యక్తులు బయటకు రావట్లేదని, కనీసం తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా తమ గుర్తింపును వెల్లడించడం లేదని కార్యకర్తలు అంటున్నారు.
స్వలింగ సంపర్కులైన దంపతులపై దాడులు తరచుగా ముఖ్యాంశాల్లో నిలుస్తుంటాయని వారు చెబుతున్నారు.
కాబట్టి, రాబోయే రోజుల్లో సుప్రీం కోర్టులో ఈ అంశంపై ఏం జరుగనుందో? అనే విషయంపై అందరి ఆసక్తి నెలకొంది.
ఒకవేళ ఎల్‌జీబీటీక్యూ ప్రజలకు అనుకూలంగా కోర్టు తీర్పు వస్తే, ప్రపంచంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించిన 35వ దేశంగా భారత్ నిలుస్తుంది. సమాజంలో ముఖ్యమైన మార్పులను దారితీస్తుంది.
దీని ప్రకారం దత్తత, విడాకులు, వారసత్వం తదితర చట్టాల్లో సవరణలు చేయాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
అంకిత ఒక థెరపిస్ట్. కవిత ఒక సైకియాట్రిస్ట్. మానసిక సమస్యలు, అభ్యాస వైకల్యాలలతో బాధపడే చిన్న పిల్లలు, కౌమారుల కోసం వారిద్దరూ ఒక క్లినిక్‌ను నడుపుతున్నారు.
తామిద్దరం పెళ్లి చేసుకుంటామంటూ 2020 సెప్టెంబర్ 23న దరఖాస్తు చేసుకున్నారు.
‘‘మేం ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించే దశలో ఉన్నాం. ఏదైనా చేయాలకున్న ప్రతీసారి వ్యవస్థతో పోరాడి అలసిపోయాం. జాయింట్ అకౌంట్ తెరవాలన్నా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇల్లు కొనడం, విల్ రాయడం వంటి అంశాలన్నీ మాకు చాలా ఇబ్బంది కూడిన వ్యవహారాలు’’ అని వారు చెబుతున్నారు.
వారికి ఎదురైన ఒక అనుభవాన్ని కవిత పంచుకున్నారు.
అంకిత వాళ్ల అమ్మకు అత్యవసరంగా శస్త్రచికిత్స అవసరం అయింది. అప్పుడు అంకితతో పాటు నేను కూడా ఆసుపత్రికి వెళ్లాను. కానీ, కన్సెంట్ (సమ్మతి) పత్రంలో నేను సంతకం చేయలేకపోయాను. ఎందుకంటే నేను అంకిత వాళ్ల అమ్మకు కూతుర్ని కాదు, కోడలుగా కూడా పరిగణించరు’’ అని ఆమె వివరించారు.
ఈ ఘటన తర్వాత సెప్టెంబర్ 30న తమ వివాహానికి చట్టబద్ధత కల్పించాలంటూ స్థానిక మెజిస్ట్రేట్‌ను వారు ఆశ్రయించారు. కానీ, వారికి నిరాశే ఎదురైంది.
స్వలింగ సంపర్కుల పెళ్లికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ వీరిద్దరూ దిల్లీ హైకోర్టుకు వెళ్లారు. తమ వివాహానికి అధికారిక గుర్తింపు ఇవ్వాలని అధికారులకు సూచించాలని వారు కోర్టును కోరారు.
సుప్రీం కోర్టుతో పాటు దేశంలోని పలు హైకోర్టుల్లో స్వలింగ సంపర్కుల వివాహాలకు సంబంధించి అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
జనవరిలో ఈ పిటిషన్లు అన్నింటినీ ఒకచోటుకు చేర్చిన సుప్రీం కోర్టు, ఈ ముఖ్యమైన అంశంపై విచారిస్తామని ప్రకటించింది.
‘‘మమ్మల్ని ఒంటరిగా వదిలేయమని మేం కోరట్లేదు. మమ్మల్ని కూడా అందరితో సమానులుగా గుర్తించే హక్కును మేం అడుగుతున్నాం’’ అని పిటిషన్‌లో కవిత, అంకిత పేర్కొన్నారు.
వారిద్దరి తరఫున సీనియర్ న్యాయవాది మేనక గురుస్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఫొటో సోర్స్, ANKITA AND KAVITA
భారత రాజ్యాంగం, దేశంలోని పౌరులందరికీ తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కును కల్పిస్తుందని మేనక అన్నారు.
‘‘లైంగిక ధోరణి ఆధారంగా పౌరులపై వివక్షను రాజ్యాంగం నిషేధిస్తోంది. సామాజిక నైతికత కంటే రాజ్యాంగ నైతికత ఎక్కువ కాబట్టి వారి పిటిషన్‌ను అనుమతించాలి. నేను ఆశావాదిని. న్యాయవ్యవస్థపై నాకు చాలా నమ్మకం ఉంది’’ అని బీబీసీతో మేనక గురుస్వామి అన్నారు.
ఆరు స్వలింగ సంపర్కుల కేసులను మేనక టీమ్ కోర్టులో వాదిస్తోంది.
అయితే, ఈ వివాహాలను వ్యతిరేకించే ప్రభుత్వం, మత నాయకుల నుంచి మేనక గురుస్వామి కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది.
స్వలింగ సంపర్కుల వివాహాలకు సంబంధించిన పిటిషన్లను తిరస్కరించాలని సుప్రీం కోర్టును భారత ప్రభుత్వం కోరింది.
భారత్‌లో వివాహాలు ఆడ, మగ మధ్య మాత్రమే జరుగుతాయని కోర్టుకు చెప్పింది.
‘‘స్వలింగ సంపర్కులు ఒకరితో ఒకరు భాగస్వాములుగా, లైంగిక సంబంధాలను ఏర్పరచుకుంటూ కలిసి జీవించడం అనేది భారత కుటుంబ వ్యవస్థ అయిన భార్య-భర్త-పిల్లలు అనే కాన్సెప్ట్‌తో పోల్చలేమని’’ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో భారత న్యాయ వ్యవస్థ వాదించింది.
మత, సామాజిక కట్టుబాట్లతో లోతుగా మమేకమైన దేశ శాసన విధానాన్ని కోర్టులు మార్చకూడదని, ఈ అంశాన్ని పార్లమెంట్‌కు వదిలేయాలని కోర్టుకు విన్నవించింది.
స్వలింగ సంపర్కులు ఏకం కావడాన్ని భారత్‌లోని అన్ని మతాలు అంటే హిందు, ముస్లిం, జైనులు, సిక్కులు, క్రిస్టియన్ల నాయకులు మూకుమ్మడిగా వ్యతిరేకించారు.
వివాహం అనేది సంతానం కోసమేతప్ప వినోదం కోసం కాదని వారు అన్నారు.
స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధత అనేది సమాజం, కుటుంబం, పిల్లలపై ప్రమాదకరమైన ప్రభావాలను చూపుతుందని ఒక బహిరంగ లేఖ ద్వారా 21 మంది రిటైర్డ్ హైకోర్ట్ న్యాయమూర్తులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
స్వలింగ వివాహాల వల్ల భారత్‌లో ఎయిడ్స్ కేసులు పెరగొచ్చని వారు హెచ్చరించారు. ఇలాంటి జంటల దగ్గర పెరిగే పిల్లల మానసిక, ఉద్వేగాల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్‌లోని ప్రముఖ మానసిక ఆరోగ్య సమూహం ‘‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ (ఐపీఎస్)’’ వారాంతంలో విడుదల చేసిన ఒక ప్రకటన, స్వలింగ సంపర్కుల్లో ఆశలను పెంచింది. ఐపీఎస్‌లో 7 వేలమందికి పైగా సైకియాట్రిస్టులు ఉంటారు.
‘‘స్వలింగ సంపర్కం అనేది ఒక వ్యాధి కాదు. ఎల్‌జీబీటీక్యూ ప్రజల పట్ల చూపే వివక్ష వారిలో మానసిక సమస్యలకు దారి తీస్తుంది’’ అని ఐపీఎస్ ప్రకటనలో తెలిపింది.
‘‘గే సెక్స్’’ను నేరంగా పరిగణించకూడదంటూ 2018లో ఐపీఎస్ చేసిన ఒక ప్రకటనను సుప్రీం కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది.
‘‘కోర్టులో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు?’’ అని నేను అంకిత, కవితలను అడిగాను.
‘‘సమానత్వం, వైవిధ్యం కోసమే భారత రాజ్యాంగాన్ని రూపొందించారని మాకు తెలుసు. న్యాయవ్యవస్థపై, రాజ్యాంగంపై మాకు అచంచలమైన విశ్వాసం ఉంది’’ అని అంకిత అన్నారు.
‘‘వ్యతిరేకత ఉంటుందని మాకు తెలుసు. అంత సులభంగా అయ్యే పని కాదని కూడా తెలుసు. కానీ, మేం ఈ దారిని ఎంచుకున్నాం. ఇది ఎక్కడి వరకు మమ్మల్ని తీసుకెళ్తుందో చూద్దాం’’ అని కవిత వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- Abortion Rights: సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుతో అబార్షన్లు, మారిటల్ రేప్‌కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?
- ఇరాన్: 'నోరు మూసుకుని ఉండకపోతే మమ్మల్ని రేప్ చేస్తామన్నారు'
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- అబార్షన్ చేయించుకోవాలని కోవిడ్ సోకిన గర్భిణీలకు ఎందుకు చెబుతున్నారు..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















