గువాహటి: రైల్వే స్టేషన్‌లో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ టీ స్టాల్.. ‘‘గౌరవంగా బతకడం కోసమే ఈ పోరాటం’’ అంటున్న ట్రాన్స్‌జెండర్లు

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ కోసం, గువాహటి నుంచి
గువాహటి రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద మార్చి 10న ట్రాన్స్‌జెండర్లు గుమిగూడారు.
ఒక టీ స్టాల్ ప్రారంభోత్సవం సందర్భంగా వారంతా అక్కడికి వచ్చారు.
రైలును అందుకోవాలని హడావిడిగా రైల్వే స్టేషన్‌కు వస్తోన్న ప్రయాణికులు కూడా ఒక్క క్షణం ఆగి అక్కడున్న ‘‘ట్రాన్స్ టీ స్టాల్’’ అనే టీ దుకాణాన్ని చూస్తున్నారు.
రైళ్లలో చప్పట్లు కొడుతూ డబ్బులు డిమాండ్ చేసే ట్రాన్స్‌జెండర్లు, ఇప్పుడు అక్కడ ‘టీ’ అమ్మడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తాతోపాటు రైల్వే సీనియర్ అధికారులు ఈ దుకాణం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
గువాహటి రైల్వే స్టేషన్‌లో ట్రాన్స్‌జెండర్లు నడిపిస్తున్న ఈ టీ దుకాణం ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచింది.
భారతీయ రైల్వేలో ట్రాన్స్‌జెండర్లు టీ అమ్ముతున్న తొలి స్టేషన్‌గా అస్సాం రాష్ట్రంలోని గువాహటి రైల్వే స్టేషన్ అవతరించింది.
జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా, టీ స్టాల్‌ను ప్రారంభిస్తున్నప్పుడు అక్కడే నిల్చున్న ఇతర ట్రాన్స్‌జెండర్ల ముఖాల్లో చెప్పలేనంత ఆనందం కనిపించింది. తమకు కూడా హక్కులు లభించినట్లుగా వారంతా ఆనందించారు.

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC
‘‘బస్సులో మా పక్కన ఎవరూ కూర్చోరు’’
27 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ రాణి, గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా ఈ టీ స్టాల్‌లో పనిచేస్తున్నారు.
‘‘ప్రజలు మా పట్ల చాలా అగౌరవంగా మాట్లాడతారు. ఆట పట్టిస్తుంటారు. దురుసైన పదాలను వాడతారు. కానీ, టీ కొట్టుకు వచ్చే వారందరూ ‘బైడో’ (అస్సామీ భాషలో అక్క అని అర్థం) అంటూ మాతో చాలా మర్యాదగా మాట్లాడతారు. వాళ్లు మా దగ్గర చాయ్ కొనుక్కొని తాగుతారు. మేం సమాజం నుంచి ఇలాంటి గౌరవాన్నే కోరుకుంటున్నాం.
బస్సుల్లో పురుషుల సీట్లు, మహిళల సీట్లు అని రాసి ఉంటుంది. కానీ, మాకోసం ప్రత్యేకంగా ఎలాంటి సీట్లు ఉండవు. మేం ఎక్కువగా ఆడవాళ్ల సీట్లలోనే కూర్చొంటాం. అక్కడ ఖాళీ లేకపోతే పురుషుల సీట్లలో కూర్చుంటాం. అప్పుడు, మా పక్కన ఖాళీగా ఉండే సీటులో ఎవరూ కూర్చోరు.
మమ్మల్ని ఎవరూ పనిలో పెట్టుకోరు. ఉద్యోగాలు ఇవ్వరు. మంచి ఇళ్లలో ఉండాలని మాకు ఉంటుంది. కానీ, మాకు ఎవరూ ఇల్లు కిరాయికి ఇవ్వరు.
ఎక్కడికెళ్లినా మమ్మల్ని తరిమేస్తారు. అందుకే మాలో చాలా మంది మురికి వాడల్లో ఉంటారు. ఇలాంటి హక్కులను పొందడం కోసం మేం ఇంకా చాలా పోరాడాల్సి ఉంది’’ అని రాణి వివరించారు.
ఆల్ అస్సామ్ ట్రాన్స్‌జెండర్ సంఘం కృషి కారణంగా గువాహటి రైల్వే స్టేషన్‌లో ఈ టీ దుకాణం ఏర్పాటు సాధ్యమైంది. ఈ దుకాణాన్ని నడిపే బాధ్యతను రాణితో పాటు మరికొంత మంది ట్రాన్స్‌జెండర్లకు ఈ సంఘం అప్పగించింది.
ఈ సంఘం పరిధిలో 25 వేల మంది ట్రాన్స్‌జెండర్లు సభ్యులుగా ఉన్నారు. వారిలో చాలా మంది రైళ్లలో, బస్సులలో, దుకాణాల దగ్గర భిక్షాటన చేస్తుంటారు.

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC
‘‘ప్రభుత్వం అండగా ఉంటే, బతికేస్తాం’’
ప్రభుత్వం నుంచి తమకు మద్దతు లభిస్తే ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తామని రాణి అన్నారు.
‘‘భిక్షం ఎత్తుకోవాలని ఎవరికి ఉంటుంది? టీ స్టాల్ పెట్టుకోవడానికి రైల్వే శాఖ సహాయం చేసినట్లుగా, ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వం నుంచి సహాయం లభిస్తే ఏదైనా పని చేసుకుంటూ జీవనం సాగిస్తాం. సమాజానికి భయపడి మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టారు. ఎవరి అండ లేకపోవడంతో మేం చదువులు కూడా పూర్తి చేయలేకపోయాం. మాలో చాలా మంది చాలా చిన్న వయస్సులోనే ఇల్లు వదిలి వచ్చేశారు.
10 ఏళ్లు ఉన్నప్పుడు నేను ఇంటి నుంచి బయటకు వచ్చేశా. హిజ్రాలు చప్పట్లు కొట్టి సంపాదిస్తూ తిని బతుకుతుంటారు అని సమాజంలోని చాలా మంది అనుకుంటారు. ఈ దేశంలో పురుషులకు, మహిళలకు ఉన్న హక్కులు మాకు ఉండకూడదా? మా కమ్యూనిటీలో చాలా మంది వయస్సు పైబడిన వారున్నారు. వారు బిక్షాటనకు వెళ్లలేరు. మా అందరికీ ప్రభుత్వం, సమాజం మద్దతు చాలా అవసరం’’ అని రాణి చెప్పారు.
రైల్వే ప్లాట్‌ఫామ్ మీద టీ అమ్మడం రాణికి చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. తనకు గతంలో ఎప్పుడూ ఇలాంటి గౌరవం దక్కలేదని ఆమె అంటున్నారు.
టీ వ్యాపారం చాలా బాగా జరుగుతోందని, తమ ట్రాన్స్ టీ స్టాల్‌లో టీ లేదా ఇతర ఆహార పదార్థాలు కొనేందుకు ప్రజలు సంకోచించడం లేదని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC
‘‘మరిన్ని స్టేషన్లలో ఇలాంటి పథకాలను ప్రారంభిస్తాం’’
ట్రాన్స్‌జెండర్ల సాధికారత కోసమే రైల్వే స్టేషన్‌లో టీ కొట్టు నిర్వహించుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సబ్యసాచి డే తెలిపారు.
‘‘ఇలాంటి అట్టడుగు వర్గాల ప్రజలకు సహాయం చేసేందుకు మేం చాలాకాలంగా ఒక మంచి ఆలోచన కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతలో ఆల్ అస్సాం ట్రాన్స్‌జెండర్ సంఘం వారిని కలిశాం. వారు టీ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతించాలని కోరారు. మేం కూడా అది సరైనదనే భావించాం.
ఇదే కాకుండా ట్రాన్స్‌జెండర్ల కోసం ‘‘సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్’’ అనే సమగ్ర పథకాన్ని భారత ప్రభుత్వ ఆమోదించింది.
ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఇలాంటి స్టాల్స్‌ను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా’’ ఆయన చెప్పారు.
గువాహటి రైల్వే స్టేషన్‌లోని టీ స్టాల్ ద్వారా సంపాదించిన ఆదాయంలో ఎక్కువ భాగం ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నట్లు ట్రాన్స్‌జెండర్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షురాలు స్వాతి బిధాన్ బారూహ్ తెలిపారు.
మెరుగైన జీవితాన్ని ఆశిస్తున్న ట్రాన్స్‌జెండర్లు
టీ స్టాల్‌తో వచ్చే సంపాదనతో ఇంత పెద్ద ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సంక్షేమం కోసం పనిచేయడం సాధ్యమేనా?
ఈ ప్రశ్నకు స్వాతి బిధాన్ సమాధానం ఇచ్చారు. ‘‘ఒక్క టీ స్టాల్‌తో ట్రాన్స్ జెండర్లు అందరికీ సహాయం చేయడం సాధ్యం కాదు. కానీ, అన్నిచోట్లా ఇలాంటి ట్రాన్స్ టీ స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఇతర ప్రాంతాల్లోని ట్రాన్స్‌జెండర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.
దీనివల్ల ఇంకో మంచి పని కూడా జరుగుతుంది. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రజలు, పనిచేస్తోన్న ట్రాన్స్‌జెండర్లను చూడటం వల్ల సమాజంలో ట్రాన్స్‌జెండర్లను చూసే దృష్టికోణం మారుతుంది. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ చట్టం-2019 ప్రకారం మేం కూడా ప్రభుత్వం నుంచి మెరుగైన జీవితాన్ని ఆశిస్తున్నాం’’ అని స్వాతి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గోళ్లు ఎందుకు కొరుకుతారు?
- యువ అథ్లెట్లలో కొందరికి గుండెపోటు ఎందుకు వస్తోంది?
- ఈ స్కూలు పిల్లలు రోజూ రెండుసార్లు డబ్బాలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
- గుజరాత్: శివాలయం మీద హక్కులను హిందూ సంస్థలకు ఇచ్చేందుకు జైనులు ఎందుకు ఒప్పుకోవడం లేదు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















