అలీషా: ట్రాన్స్‌జెండర్ సెక్స్ వర్కర్ ఆరోగ్య కార్యకర్తగా ఎలా మారారు? - BBC She

- రచయిత, ప్రియాంక ధిమాన్, బీబీసీ పంజాబీ
- హోదా, షర్మిలా శర్మ, గుర్గావ్ కీ ఆవాజ్
అలీషా, రాత్రిపూట బాగా అలంకరించుకొని రోడ్డు పక్కన నిల్చొని కార్లలో వెళ్లే వారి వైపు చూస్తున్నారు.
తనను చూసి ఏదైనా కారు ఆగుతుందేమోనని ఆమె ఆశ.
అలీషా ఒక సెక్స్ వర్కర్. ఆమె తరచుగా ఇదే రోడ్డు పక్కన నిల్చొని కనిపిస్తారు.
ఒక రిపోర్టర్‌గా నేను, అదే రోడ్డుపై ఆమెకు కాస్త దూరంలో నిల్చున్నప్పుడు నాకు కాస్త భయం వేసింది. రాత్రిపూట అలాంటి ప్రదేశంలో ఒంటరిగా నిల్చుంటే ఏ ఆడపిల్లకైనా కలిగే భయమే నాకు కలిగింది.
కానీ, అలీషా మనందరి కంటే భిన్నమైనా వ్యక్తా? నిర్భయంగా చూస్తున్న అలీషా మనసులో ఎలాంటి భయం లేదా?
ఉదయం పూట ఇదే ప్రశ్నను నేను అలీషాను అడిగాను.
‘‘భయం అయితే అవుతుంది. రాత్రిపూట ఎవరో తెలియని వ్యక్తితో వెళ్లినప్పుడు, తిరిగి ప్రాణాలతో బయటకు వస్తామో లేదో అనేది కూడా నాకు తెలియదు’’ అని ఆమె బదులిచ్చారు.
‘‘బీబీసీ షీ’’ ప్రాజెక్టులో భాగంగా ‘గుర్గావ్ కీ ఆవాజ్’ మీడియా సంస్థతో కలిసి బీబీసీ ఈ కథనాన్ని మీ ముందుకు తెచ్చింది.

ఒడిదుడుకులతో కూడిన అలీషా జీవితంలో సెక్స్ వర్క్ ఒక భాగం. ఈ పని చేస్తున్నందుకు ఆమె సిగ్గుపడట్లేదు. కానీ, ఈ పని చేయడం ఆమెకు మొదటి ప్రాధాన్యం కాదు.
ట్రాన్స్‌జెండర్ అయిన అలీషా చాలా ఏళ్లుగా హరియాణాలోని గురుగ్రామ్‌లో నివసిస్తున్నారు.
తన గుర్తింపుతో స్వేచ్ఛగా జీవించాలనే కోరికతో ఆమె ‘ఆశు’ అనే అబ్బాయి గుర్తింపు నుంచి ‘అలీషా’ అనే అమ్మాయిగా మారారు. కానీ, దీనికోసం ఆమె సెక్స్ వర్క్‌లోకి దిగాల్సి వచ్చింది.
పట్నాకు చెందిన అలీషా చాలా చిన్న వయస్సులోనే ఇంటిని విడిచిపెట్టాల్సి వచ్చింది.
పూట గడవడం కోసం సెక్స్ వర్క్‌ను ఎంచుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.

‘‘నువ్వు మగాడివి కాదు, అమ్మాయివి కూడా కాదు’’
ఇంటిని వదలాల్సి రావడం చాలా బాధాకరం. అప్పటి పరిస్థితులను అలీషా ఇప్పటికీ గుర్తుంచుకున్నారు.
లిప్‌స్టిక్ పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, చీర కట్టుకోవడం, గోర్లకు రంగు వేసుకోవడం, అమ్మాయిలతో ఆడుకోవడం వీటన్నింటిని తన తల్లి ఇష్టపడకపోవడం ఇలా అన్ని విషయాలను అలీషా గుర్తు చేసుకున్నారు.
తానొక మగపిల్లాడికి జన్మనిచ్చానని తన తల్లి అనుకునేవారు. తల్లిదండ్రులు ‘ఆశు’ అని పేరుపెట్టారు. తానెప్పుడు మగపిల్లాడిలా ప్రవర్తించాలని వారు కోరకునేవారు.
కానీ, తన మనస్సులో ఎప్పుడూ ఆడపిల్లల భావాలు ఉండేవని అలీషా చెప్పారు.
‘‘బహుశా మా అమ్మ కూడా దీన్ని గుర్తించి ఉండొచ్చు. కానీ, ఈ విషయం బయటివారెవరికీ తెలియకూడదని ఆమె అనుకొని ఉండొచ్చు. అందుకే ఆమె నాకెప్పుడూ ఆశూ నువ్వెప్పుడూ అబ్బాయి లాగే ప్రవర్తించాలని చెప్పేవారు’’ అని అలీషా తెలిపారు.
అప్పుడే జరిగిన ఒక సంఘటనతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని అలీషా అన్నారు.
13 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ట్యూషన్ టీచర్ తనను బలవంతం చేసినట్లు, అంతేకాకుండా తన అసంపూర్ణమైన గుర్తింపు గురించి లోకువగా మాట్లాడినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.
‘‘నువ్వెవరో నీకు తెలుసా? నువ్వు మగాళ్ల కేటగిరీలోకి రావు, అలాగని అమ్మాయివి కూడా కాదు. నీ లాంటి వ్యక్తులను సమాజంలో ఎవరూ అంగీకరించరు అని మా టీచర్ ఎద్దేవా చేశారు’’ అని అలీషా చెప్పారు.
అలీషా చెప్పినదాని ప్రకారం, ఆ టీచర్ అలీషాను చాలా చెడ్డ పదాలతో తిట్టడమే కాకుండా దీని గురించి ఎవరికైనా చెబితే తనను ఇంట్లో నుంచి తన కుటుంబీకులు బయటకు పంపిస్తారని బెదిరించారు.
ఒకవైపు టీచర్ నుంచి లైంగిక వేధింపులు, బెదిరింపులతో పాటు కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ, సానుభూతి కూడా దొరకలేదని ఆమె గుర్తు చేసుకున్నారు.
అప్పట్లో ఈ ఘటన తనను చాలా వేధించిందని ఆమె తెలిపారు. ఒకట్రెండు సార్లు అమ్మతో గానీ, లేదా చెల్లెలితో గానీ తన గురించి చెప్పడానికి ప్రయత్నించి ధైర్యం చాలక చెప్పలేకపోయారు. ఇల్లు వదిలి వెళ్లిపోవడం తప్ప అప్పుడు తనకు మరో మార్గం కనిపించలేదు.

ఆశు నుంచి అలీషాగా
మగాడి శరీరంతో పుట్టిన ఆశు కొత్త గుర్తింపును కోరుకున్నారు. అమ్మాయిగా మారిపోవాలనుకున్నారు. కానీ, దానికి చాలా డబ్బు అవసరం.
దాని కోసమే ఒక ఫ్రెండ్ సహాయంతో దిల్లీ వచ్చారు. దిల్లీలో తన గురువును కలుసుకున్నారు.
ఇల్లును విడిచిపెట్టి ఒంటరిగా మారిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఒక ‘గురువు’తో కలిసి ఉంటారు.
తన గురువునే తల్లిదండ్రులుగా భావిస్తానని అలీషా చెప్పారు.
‘‘నా గురువే నాకు తల్లీ, తండ్రి. నేను ఈ రోజు స్వతంత్రంగా బతుకుతున్నానంటే దానికి కారణం నా గురువు. నేను దిల్లీకి వచ్చినప్పుడు నా గురువే నాకు సెక్స్ వర్క్‌ను చూపించారు’’ అని ఆమె అన్నారు.
తొలిసారి సెక్స్ వర్క్‌కు వెళ్లినప్పుడు తనకు నాలుగు వేల రూపాయలు వచ్చాయని తెలిపారు.
‘‘నేను అంత డబ్బును చూడటం అదే మొదటిసారి. కేవలం 10 నిమిషాల పని కోసం నాకు అంత డబ్బు ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది’’ అని ఆమె అన్నారు.
కానీ, ఇది చాలా కష్టమైన జీవితం. ఆమె ఎప్పుడూ భయం నీడలో బతుకుతుంటారు.
14 లేదా 15 ఏళ్ల వయస్సు నుంచే అలీషా ఈ పని చేస్తున్నారు. ‘‘కొన్నిసార్లు కస్టమర్లు తప్పుగా ప్రవర్తిస్తారు. కొడతారు కూడా. కొన్నిసార్లు నా పర్సును కూడా దొంగిలించారు’’ అని ఆమె చెప్పారు.
లింగ మార్పిడి చికిత్స ద్వారా పూర్తిగా అమ్మాయిగా మారిపోవడం కోసం అలీషా క్రమంగా డబ్బును కూడబెట్టారు.
సుదీర్ఘ చికిత్స తర్వాత మూడేళ్ల క్రితం ఆశు పూర్తిగా అలీషాగా మారిపోయారు.
ఇప్పుడు తన జీవితానికి ట్రాన్స్ జెండర్ లేదా సెక్స్ వర్కర్ అనే గుర్తింపును దాటుకొని అర్థవంతమైన గుర్తింపును ఇవ్వడమే తన లక్ష్యం.

భారత్‌లో గుర్తింపు
అలీషా మిగతా పనుల కోసం ప్రయత్నించలేదని కాదు. ఆమె సరైన జీవనోపాధి కోసం కూడా ప్రయత్నించారు.
భారత్‌లో ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపుతో పాటు అనేక హక్కులు లభించిన కాలం అది.
ట్రాన్స్‌జెండర్లకు థర్డ్ జెండర్ అనే గుర్తింపును కల్పిస్తూ 2014లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది.
వెనుకబడిన వర్గాలుగా పరిగణిస్తూ వారికి చదువు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16, 21 ప్రకారం, దేశంలోని పౌరులందరికీ విద్య, ఉద్యోగం, సామాజిక గుర్తింపులో సమాన హక్కులు ఉంటాయి.
ఈ మేరకు ట్రాన్స్ జెండర్లకు ఆయా హక్కులు కట్టబెడుతూ పార్లమెంట్ 2019లో ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ చట్టాన్ని ఏర్పాటు చేసింది.
కానీ, క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. అలీషాకు మంచి ఉద్యోగం దొరకడం అసాధ్యమే అయింది.
చిన్న వయస్సులోనే ఇంటినుంచి బయటకు వచ్చినప్పటికీ ఆమె చాలా కష్టపడి దిల్లీలో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు.
‘‘నేనెక్కడికి వెళ్లినా వాళ్లు ముందు ట్రాన్స్‌జెండర్ సర్టిఫికెట్ అడిగేవారు. తర్వాత సెక్యూరిటీ గార్డులు గేటు బయట నుంచే బయటకు పంపేవారు’’ అని అలీషా చెప్పారు.

కమ్యూనిటీలో లీడర్ పాత్ర
కానీ, చివరకు తనకో అవకాశం వచ్చింది. ఆ ప్రాంతంలో ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్యం, లైంగికత అంశాలపై పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థకు అలీషాను ఆమె గురువు పరిచయం చేశారు.
అలీషా మాట్లాడే తీరు, ఆమె ఆత్మవిశ్వాసం చూసి ఆ స్వచ్ఛంద సంస్థ ఆమెకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నారు
మీ కాళ్లపై మీరు నిలబడకుంటే ఈ సమాజం మిమ్మల్ని తొక్కేస్తుంది అని అలీషా అన్నారు.
ఇప్పుడు ఆమె ట్రాన్స్‌జెండర్లకు సెక్స్ వర్కర్లకు ఎయిడ్స్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించడమే కాకుండా వారికి మందులు ఇవ్వడం, సరైన చికిత్సను అందించడంలో సహాయపడుతున్నారు.
గురుగ్రామ్‌లోని ‘సొసైటీ ఫర్ సర్వీస్ టు వాలంటరీ ఏజెన్సీస్’ అనే స్వచ్ఛంద సంస్థను అలీషా తన కుటుంబంలా భావిస్తారు.
ఇక్కడ తరచుగా ట్రాన్స్‌జెండర్లు వస్తుంటారు. వారి సమస్యల గురించి చర్చిస్తారు. అలాగే వారి పండుగలను కలిపి జరుపుకుంటారు.

సమాజం దృష్టిలో అసంపూర్ణం, దేవుడి దృష్టిలో సంపూర్ణం
‘‘ఇన్నేళ్ల తర్వాత కూడా పల్లెటూరల్లో వినిపించే తిట్లు, వెటకారపు మాటలు నగరంలో కూడా వినాల్సి వస్తుంది. మేం రోడ్డుపై వెళ్తున్నప్పుడు మమ్మల్ని హిజ్రా, చక్కా, జుగాడ్ అంటూ పిలుస్తారు’’ అని అలీషా చెప్పుకొచ్చారు.
నేను అలీషాతో ఉన్నప్పుడు, ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న వారంతా ఆమెను భిన్నంగా చూడటం గమనించాను.
‘‘మేం మగవాళ్ల క్యూలో నిల్చోలేం. ఆడవాళ్ల కేటగిరీలో కూడా చేరనివ్వరు. దేవుడు మమ్మల్ని సృష్టించాడు. కానీ, సంపూర్ణంగా తయారు చేయలేదు. ప్రకృతి ప్రసాదించిన తోలుబొమ్మలం మేం’’ అని అలీషా ఆవేదన వ్యక్తం చేశారు.
జీవించే ధైర్యాన్ని పొందడం కోసం ఆమె భగవంతున్ని ఆశ్రయిస్తారు. తాను కృష్ణభగవానుడి ఇష్టసఖిని అని ఆమె చెబుతుంటారు.
సమాజం తనను అసంపూర్ణం అని భావించేలా చేస్తుందని, కానీ దేవుడు మాత్రం తనను సంపూర్ణ వ్యక్తిలా చూస్తారని ఆమె అన్నారు.
(బీబీసీ షీ సిరీస్ ప్రొడ్యూసర్ – దివ్య ఆర్య)
ఇవి కూడా చదవండి:
- గోళ్లు ఎందుకు కొరుకుతారు?
- యువ అథ్లెట్లలో కొందరికి గుండెపోటు ఎందుకు వస్తోంది?
- ఈ స్కూలు పిల్లలు రోజూ రెండుసార్లు డబ్బాలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
- గుజరాత్: శివాలయం మీద హక్కులను హిందూ సంస్థలకు ఇచ్చేందుకు జైనులు ఎందుకు ఒప్పుకోవడం లేదు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















