విక్టోరియా బేట్‌మన్: ఈ కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రొఫెసర్ నగ్నంగా ఎందుకు నిరసన తెలుపుతుంటారు?

విక్టోరియా బేట్‌మన్

ఫొటో సోర్స్, DR VICTORIA BATEMAN

    • రచయిత, స్వామినాథన్ నటరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేంబ్రిడ్జి యూనివర్సిటిలో డాక్టర్ విక్టోరియా బేట్‌మన్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. విద్యార్థులకు ఎకనమిక్స్(అర్థశాస్త్ర) పాఠాలు బోధించడం ఆమె పని. ఆమె కేవలం ఒక ప్రొఫెసర్ మాత్రమే కాదు, ఉద్యమకారిణి కూడా. ప్రభుత్వ విధానాలపై తరచూ నిరసన తెలియజేస్తుంటారు. అది కూడా నగ్నంగా.

''నగ్నంగా ఉన్న నన్ను చూసి ప్రజలు అనేక రకాలుగా అనుకుంటారు. ఆమె ఒక స్టుపిడ్, ఇడియట్ అని, ఈమెకు వెర్రి అనుకుంటారు. కానీ, నేను వాస్తవాల గురించి ఆలోచించే వ్యక్తిని. అందుకే అలా నిల్చుంటాను'' అని బేట్‌మన్ చెప్పారు. అయితే, ఆమె నగ్న నిరసనలు మాత్రం వివాదాస్పదంగా మారాయి.

తన తాజా పుస్తకాన్ని ఆన్‌లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ నిషేధించిందని ఆమె చెప్పారు. పుస్తకం కవర్ ఫొటో లైంగికపరమైన అంశాలను సూచించేలా ఉందని భావించి బ్యాన్ చేసినట్లు బేట్‌మన్ చెప్పారు. సోషల్ మీడియా ఉద్యమంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని ఆమె చెప్పారు.

సొంత శరీరంపై కూడా మహిళలకు స్వేచ్ఛ లేదని, వాళ్లు ఏదైనా చేయాలనుకుంటే అనుమతించే పరిస్థితులు లేవని ఆమె భావిస్తున్నారు. ఈ నియంత్రణ పోవాలంటే సెక్సువల్ రివల్యూషన్ రావాలని ఆమె భావిస్తున్నారు.

ఆ కవర్ ఫొటోలో ఆమె శరీరం పూర్తిగా కనిపించేలా లేదు. అందులో ఆమె పొట్ట భాగం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఛాతి భాగం రూపురేఖలు కనిపించేలా ఉంది.

''నా శరీరాన్ని ప్రదర్శించడం వల్ల నేను చెప్పాలనుకున్న విషయం విలువైనది కాకుండా పోతుందని భావించడం లేదు.'' అని బేట్‌మెన్ అన్నారు.

'' నిశ్శబ్దం బద్దలైతే అది అంతానికి దారితీస్తుందని చరిత్ర మనకు చెబుతోంది. మధ్యయుగం నాటి దుర్మార్గాలతో నిజమైన ప్యూరిటన్స్ (క్రైస్తవ మతంలో పరిశుద్ధమైన వారిగా భావించే తెగ) పుట్టుకొచ్చారు. జార్జియన్ల విశృంఖలత్వం పెరిగిపోయి విక్టోరియన్స్ ఆవిర్భవించారు.

అలాగే ఈ 21వ శతాబ్దపు సెక్సువల్ రివల్యూషన్ స్వచ్ఛమైన సంస్కృతికి, మహిళలపై ఆధిపత్య ధోరణిని కత్తిరించేందుకు దారితీస్తుంది'' అని ఆమె చెప్పారు.

విక్టోరియా బేట్‌మన్

ఫొటో సోర్స్, DR VICTORIA BATEMAN

"నగ్నంగా నిరసన తెలపడం అంత పెద్ద విషయమేం కాదు"

నగ్నంగా నిరసనలు చేయడం ఇంగ్లాండ్, వేల్స్‌లో నేరం కాదు. ఇతరులను ఇబ్బంది పెట్టాలని, లేదా భయపెట్టాలనే ఉద్దేశంతో దుస్తులు తీసేసినట్లు నిర్ధరణ అయితే నేరంగా పరిగణిస్తారు. అయితే, ఫిర్యాదు చేసిన వ్యక్తి దానిని నిరూపించాల్సి ఉంటుంది. తన నిరసనలు ఎవరినీ ఇబ్బంది పెట్టేవి కాదని బేట్‌మన్ బలంగా చెబుతున్నారు.

‘‘ఎవరినీ ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. ఆర్థిక శాస్త్రంలో మహిళల కొరత, బ్రెగ్జిట్ (యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలగడం) వల్ల మహిళలు ఎదుర్కోబోయే పరిణామాలు, మహిళల శారీరక స్వేచ్ఛపై దాడుల వంటి విషయాలపైకి అందరి దృష్టిని మళ్లించాలన్నదే నా ఉద్దేశం'' అని ఆమె చెప్పారు.

దుస్తులు ధరించడం అనేది కేవలం గౌరవానికి సంబంధించిన విషయం మాత్రమే కాదన్నారు బేట్‌మన్. ప్రజల్లో చర్చ జరగాలనే తన లక్ష్యాన్ని సాధించేందుకు నగ్న నిరసనలు ఉపయోగపడుతున్నాయని ఆమె చెబుతున్నారు.

''జంతురోమాల వినియోగానికి వ్యతిరేకంగా జంతువుల హక్కుల కోసం పోరాడే సంఘాలు నగ్నంగా నిరసనలు తెలియజేశాయి. వాతావరణంలో వస్తున్న భయంకర మార్పులను సరిదిద్దే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పర్యావరణ పరిరక్షణ సంఘాలు కూడా నగ్నంగా నిరసనలు తెలిపాయి. రాజకీయ అంశాలపైనా నగ్న నిరసన ప్రదర్శనలు చాలానే జరిగాయి.'' అని బేట్‌మన్ చెప్పారు.

విక్టోరియా బేట్‌మన్

ఫొటో సోర్స్, DR VICTORIA BATEMAN

కూలీ కుటుంబం నుంచి ఉన్నత స్థితికి..

తాను నార్త్ ఇంగ్లాండ్‌లో కూలీ పని చేసుకునే కుటుంబంలో పుట్టానని బేట్‌మెన్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదివిన బేట్‌మన్ అక్కడే పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

తన టీనేజ్‌లో సాధారణ దుస్తులతోనే పార్టీలకు వెళ్లేదాన్నని, కానీ చాలా మంది అమ్మాయిలు షార్ట్ స్కర్టులు, చిన్న టాప్స్, హై హీల్స్ వేసుకుని వచ్చేవారని బేట్‌మన్ చెప్పారు.

ఉన్నత విద్య అభ్యసించడం వల్లే తాను రోజువారీ పని చేసుకునే పరిస్థితి నుంచి మధ్య తరగతికి రాగలిగానని ఆమె బలంగా నమ్ముతారు. చదువుకునే రోజుల నుంచి మొదలైన చిన్నచూపు చూడడం లాంటి ఇబ్బందులను ఎదుర్కొని, ఉన్నత విద్యావంతురాలిగా గౌరవం పొందేందుకు బేట్‌మెన్ చాలా శ్రమించారు.

అయితే, టీనేజ్‌లో తనను చిన్నచూపు చూసినట్టే, చిన్న చిన్న బట్టలు వేసుకునే మహిళలను కూడా తక్కువగా చూస్తారని ఆమె చెప్పారు. ఆ వైఖరే బేట్‌మన్‌ను ఇబ్బంది పెట్టింది.

'' మగవాళ్లు నా గురించి ఏమనుకుంటారోనని నన్ను నేను ఎందుకు నిర్దేశించుకోవాలి? ఈ విషయాల కంటే ఎక్కువ బాధపడాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి '' అని ఆమె అన్నారు.

విక్టోరియా బేట్‌మన్

ఫొటో సోర్స్, DR VICTORIA BATEMAN

‘బెరుకుదనం మహిళల స్వేచ్ఛను చంపేస్తోంది’

దుస్తులు విప్పేయాలన్న ఆమె తీవ్రమైన నిర్ణయం వెనక బలమైన సైద్ధాంతిక కారణాలు కూడా ఉన్నాయి.

''మహిళలలో కనిపించే బెరుకుదనం నిజానికి వారికే చేటు చేస్తోంది. మహిళలపై మగవాళ్ల ఆధిపత్యానికి కారణమవుతోంది. మహిళ వినయం ఆధారంగా ఆమె విలువను బేరీజు వేసే క్షణమే.. ఆమె శక్తిని తక్కువగా అంచనా వేసేందుకు, ఆమెను అగౌరవపరిచే శక్తిని మగాళ్లకు ఇస్తోంది. మహిళలు వారికి మాంసం ముద్దలుగానే కనిపిస్తారు. ఎందుకంటే వారు మహిళలను గౌరవించరు. '' అని ఆమె బీబీసీతో చెప్పారు.

ఇలాంటి ఆలోచనలు మహిళలపై హింసకు ప్రేరేపిస్తాయని ఆమె అన్నారు.

'' అఫ్గానిస్తాన్‌లో మహిళలను చదువుకు దూరం చేయడం, ఇరాన్‌లో తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే కఠిన నిబంధనలు, కన్యత్వ పరీక్షలు, పరువు హత్యలు, ప్రతీకార సెక్స్ వీడియోలు, ఇలా ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న నిరంకుశ విధానాలు మహిళల స్వేచ్ఛను హరిస్తున్నాయి.'' అని బేట్‌మన్ అన్నారు.

విక్టోరియా బేట్‌మన్

ఫొటో సోర్స్, DR VICTORIA BATEMAN

న్యూడ్ మోడల్

తన అధికార హోదాను ఏదైనా పెద్ద మార్పు తెచ్చేందుకు ఉపయోగించాలని బేట్‌మన్ పదేళ్ల కిందట అనుకున్నారు. అప్పటి నుంచి ఆమె మహిళా కళాకారుల ముందు నగ్నంగా పోజులివ్వడం ప్రారంభించారు. కొంత ధైర్యం వచ్చాక మగ కళాకారులతో పనిచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత కొద్దికాలానికే ఆమె నగ్న చిత్రాలు, పెయింటింగ్స్ బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం మొదలైంది.

''గ్యాలరీలో నా నగ్న చిత్రం చూసి జనం పక్కకు వెళ్లిపోవడం గమనించాను. ఆ చిత్రంలో నగ్నంగా కనిపించిన మహిళ ప్రొఫెసర్ అని తెలిసి ఆశ్చర్యపోయారు'' అని ఆమె చెప్పారు.

ఆ తర్వాత రాజకీయపరమైన నిర్ణయాలపై సందేశాత్మక, బహిరంగ నిరసనలు తెలియజేసేందుకు ఆమెకు తన శరీరాన్ని వినియోగించే ధైర్యం వచ్చింది.

అర్థశాస్త్రంలో పురుషుల ఆధిపత్యం చూసి ఒక ఆర్థిక శాస్త్ర నిపుణురాలిగా బేట్‌మన్ ఆశ్యర్యపోయారు. ఇప్పటి వరకూ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మహిళలు కేవలం ఇద్దరే కావడం అందుకు ఉదాహరణగా చెబుతారామె.

మహిళా ఆర్థిక వేత్తల కొరతతో ఆర్థిక పరమైన వ్యవహారాలను కేవలం మగవాళ్ల కోణంలోనే చూడాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.

యూకేలో 2018లో జరిగిన ఆర్థికవేత్తల సమావేశంలో ఆ విషయాన్ని ఆమె హైలైట్ చేయాలనుకున్నారు. అందుకోసం ఆర్థిక వేత్తలున్న సమావేశ మందిరంలోకి ఆమె నగ్నంగా నడుచుకుంటూ వచ్చారు.

''శారీరకంగా నేను చాలా చిన్నదాన్ని. అంత బలంగా కూడా లేను. నా వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ మీరు ఒక గదిలో నగ్నంగా ఉంటే అక్కడున్నవారు ఇబ్బందిగా ఫీలవుతారు'' అని ఆమె చెప్పారు.

ఆ సమావేశం సమయంలో తన శరీరంపై రెస్పెక్ట్ (గౌరవం) అని మాత్రమే మార్కర్‌తో రాసుకున్నారు. తాను ఏం కోరుకుంటున్నానో, అది వారందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆమె అలా చేశారు. ఫలితంగా గాలా డిన్నర్‌లో అతిథులు అదే విషయంపై చర్చించుకున్నారు.

విక్టోరియా బేట్‌మన్

ఫొటో సోర్స్, Getty Images

ఇబ్బందికరమైన అనుభవాలు

యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలుగుతోందని(బ్రెగ్జిట్) విపరీతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో బేట్‌మెన్ బహిరంగ ప్రదేశంలో నగ్నంగా తన నిరసన తెలియజేశారు.

కొందరు ఆమె ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చాలా దారుణమైన కామెంట్లు వచ్చాయి. కొందరు మగవారు ఆమె వక్షోజాలు, ఇతర శరీర భాగాల గురించి అసభ్యకర కామెంట్స్ చేశారు. ఒకరైతే ఆమె ప్రొఫెసర్లతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వల్లే డిగ్రీలు వచ్చాయేమోనని కూడా కామెంట్ చేశారు. నగ్న ప్రదర్శనలు తను సాధించిన విజయాలను కూడా నాశనం చేస్తున్నాయని కొందరు హెచ్చరించారు.

''అయితే, మహిళలే అత్యంత దుర్మార్గంగా నాపై మాటల దాడి చేశారు. నా వల్ల స్త్రీవాదం ఒక శతాబ్దం వెనక్కి వెళ్లిపోతోందని ఓ బ్రిటిష్ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు'' అని బేట్‌మన్ చెప్పారు.

అలా తనను ఈసడించుకుంటున్న వారిలో కొందరిని సంప్రదించి, తన అసలు ఉద్దేశాన్ని వివరించేందుకు ఆమె ప్రయత్నించారు.

'నేక్డ్ ఫెమినిజం - బ్రేకింగ్ ది కల్ట్ ఆఫ్ ఫిమేల్' (మహిళల వినయం ఆధారంగా మర్యాద ఇవ్వడాన్ని ఛేదించాలి) అనే తన కొత్త పుస్తకంలో తనకు ఎదురైన ఇబ్బందికర అనుభవాలను ఆమె ప్రస్తావించారు.

మహిళలందరికీ అర్హత, గౌరవం దక్కాలని, అది భౌతికంగా కనిపించే వినయంతో సంబంధం లేకుండా ఉండాలని నేను వాదిస్తున్నానని బేట్‌మన్ చెప్పారు.

విక్టోరియా బేట్‌మన్

ఫొటో సోర్స్, DR VICTORIA BATEMAN

స్వేచ్ఛ కావాలి

వస్ర్తధారణ (శరీరం కనిపించేలా బట్టలు వేసుకోవడం లేదా కప్పుకోవడం) ఆధారంగా మహిళలు ఎలాంటి వారో ఊహించుకోవడం మానేస్తే చాలా మంది మహిళల జీవితాల్లో భారీ మార్పులు వస్తాయని బేట్‌మన్ విశ్వసిస్తున్నారు. అందుకు ఆమె సెక్స్‌వర్కర్లను ఉదాహరణగా చెబుతున్నారు.

''మనం వారిని తక్కువగా చూస్తాం. వారిపై ముద్ర వేస్తాం. దారుణమైన పేర్లు పెట్టి పిలుస్తాం. వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియదనే అభిప్రాయానికి వచ్చేస్తాం. వాళ్లకు ఏది సరైనదో కూడా మనమే తీర్పులిచ్చేస్తాం'' అని ఆమె అన్నారు.

దానిని ఆమె అహంకారపూరిత ధోరణిగా భావిస్తారు. '' అలాంటి ఆలోచనలు మారాలంటే మనం ఇంకా చాలా ముందుకెళ్లాలి'' అని ఆమె చెప్పారు.

వంట వండటం, ఇల్లు శుభ్రం చేయడం, ఆహారం, నీళ్లు సిద్ధం చేయడం, పిల్లలను, పెద్దవారిని చూసుకోవడం లాంటి పనులకు మహిళలకు జీతం ఉండదు. ఒకవేళ ఆ పనులన్నింటికీ కనీస వేతనం చెల్లించాల్సి వస్తే సుమారు 10 ట్రిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని బ్రిటిష్ సంస్థ ఆక్స్‌ఫామ్ నివేదికలో తేలింది. కానీ వాటి గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటారు.

శక్తిమంతమైన వ్యక్తులు, వారి విధానాలకు వ్యతిరేకంగా నగ్న నిరసన తెలియజేసే ప్రతి అవకాశాన్ని తాను గొప్పగా భావిస్తానని ఆమె చెప్పారు. సాహిత్య కార్యక్రమాల్లోనూ ఆమె నగ్నంగానే పాల్గొంటారు. బట్టలు లేకుండానే ఆమె ప్రసంగిస్తారు.

అయితే, తన నిరసనలు తన తరగతులను ప్రభావితం చేయవని ఆమె చెబుతారు. నిజానికి, స్త్రీవాదం, మహిళలు, ఆర్థికపరమైన విషయాలను గతంలో కంటే ఇప్పుడే విద్యార్థులు ఎక్కువగా అడుగుతున్నారని ఆమె చెప్పారు.

''తమ మనసుకు నచ్చినట్టు, తమ శరీరానికి నచ్చినట్టు ఏదైనా చేసుకునే స్వేఛ్చ మహిళలందరికీ ఉండాలి. అలాంటి ప్రపంచమే నా లక్ష్యం. తప్పనిసరిగా హిజాబ్ ధరించాలన్న నిబంధనలను నేను వ్యతిరేకిస్తాను. అలాగే స్కార్ఫ్‌పై నిషేధానికీ నేను వ్యతిరేకం. మహిళలు ఏం చేయాలో, చేయకూడదో సమాజం, ప్రభుత్వాలు ఆదేశించకూడదు'' అని బేట్‌మన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)