స్టార్మీ డేనియల్స్ కేసు: డోనాల్డ్ ట్రంప్ విచారణ రోజు న్యూయార్క్‌లో కనిపించిన 'సర్కస్' ఇదీ

డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఆంథోనీ జర్చెర్
    • హోదా, బీబీసీ ఉత్తర అమెరికా ప్రతినిధి

కోర్టులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ క్షణాలు చాలా నాటకీయంగా గడిచాయి. ఇవి చరిత్రాత్మకంగానూ నిలిచిపోతాయి. వీటి నుంచి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఈ ఆరోపణల వల్ల ప్రజలపై పెద్దగా ఎలాంటి ప్రభావమూ పడదు.

రెండు వారాల క్రితమే న్యూయార్క్‌లో తనపై అభియోగాలు మోపబోతున్నారని ట్రంప్ అంచనా వేశారు. అయితే, ఇంతకూ ఆ ఇండిక్ట్‌మెంట్‌లో ఏమేం ఆరోపణలు ఉంటాయోనని ట్రంప్‌తోపాటు అందరూ ఎదురుచూశారు.

అడల్ట్ ఫిల్మ్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు చెల్లింపుల కేసులో ఆయనపై 34 అభియోగాలను మోపారు. నేరపూరిత కుట్ర అనే అభియోగం ఈ జాబితాలో లేదు. వీటిలో బయటకు వెల్లడించేవరకు ప్రజలకు తెలియని ఆరోపణలంటూ ఏమీలేవు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, DREW ANGERER

మంగళవారం మాన్‌హటన్‌లో ట్రంప్ నిద్రలేచే ముందే ఈ రోజు ఏం జరుగుతుందో అందరూ ఊహించారు. అయితే, ఈ కేసును ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేయడం కోసమూ ఉపయోగించుకోవడం అనేది కొత్త అంశం.

గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న ఈ తీరు కేసు ముందుకు వెళ్లేకొద్దీ మరింత బలపడుతుంది. తనపై అభియోగాలు మోపే అవకాశముందని ట్రంప్ చెప్పినప్పటి నుంచే ఈ కేసుపై రిపబ్లికన్లంతా ఒకేతాటిపైకి వచ్చారు.

ట్రంప్‌ అభిశంసన సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసిన యూటా సెనేటర్ మిట్ రోమ్నీ కూడా ప్రస్తుతం ట్రంప్‌కు మద్దతుగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘రాజకీయ అజెండాతోనే ట్రంప్‌పై ఈ అభియోగాలను మోపుతున్నారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టేందుకు ప్రాసిక్యూటర్లను ఉపయోగించుకోవడం ప్రజల్లోకి తప్పుడు సందేశాలను పంపినట్లు అవుతుందని రోమ్నీ ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల అమెరికా వ్యవస్థపై ప్రజల నమ్మకమూ తగ్గిపోతుందని చెప్పారు.

ట్రంప్, స్టార్మీ డేనియల్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ట్రంప్, స్టార్మీ డేనియల్స్

ప్రస్తుతం డెమొక్రాట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తరహాలోనే మౌనంగా ఉండే అవకాశముంది. రిపబ్లికన్లు అందరి మద్దతు కూడగట్టేందుకు ఈ కేసు ట్రంప్‌కు తోడ్పడుతోంది. ఇలాంటి సమయంలో ఈ వివాదంలో డెమొక్రాట్లు జోక్యం చేసుకోకపోవచ్చు.

కోర్టు ప్రాంగణంలో ట్రంప్ మొహంలో హావభావాలేమీ కనిపించలేదు. అయితే, తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని మాత్రం ఆయన చెప్పుకొచ్చారు.

ట్రంప్ తన సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో, అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నిధులు కూడగట్టే ఈమెయిల్స్‌లో ఈ కేసును తనకు అనుకూలంగా మలచుకొంటున్నట్టు కనిపించింది.

మాన్‌హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ బ్రాగ్, న్యూయార్క్ సిటీ ప్రాసిక్యూషన్ చర్యలపైనా ట్రంప్ విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే, ఇకపై ఇలాంటి విమర్శలు చేయొద్దని జడ్జి జువాన్ మెర్కన్ ఆయన్ను హెచ్చరించారు.

జడ్జి మెర్కన్ నిష్పాక్షికతపైనా ట్రంప్ ప్రశ్నలు సంధించారు. ఈ కేసును ఇక్కడి నుంచి స్టేటెన్ ఐలండ్‌కు మార్చాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అక్కడ జ్యూరీలో ట్రంప్ మద్దతుదారులు ఎక్కువగా ఉన్నారు. మరోవైపు కేసు విచారణకు వెళ్లే ముందే, ఆ అభియోగాలను కొట్టివేయాలని ప్రత్యేక పిటిషన్లను కూడా ట్రంప్ న్యాయవాదులు దాఖలు చేసే అవకాశముంది.

వీడియో క్యాప్షన్, ఆయనపై నేరాభియోగాలు నమోదు చేయాలంటూ సిఫార్సు (2021 డిసెంబరు వీడియో)

ఈ కేసు చాలా బలహీనమైనదని డోనాల్డ్ ట్రంప్ కొట్టిపారేస్తున్నారు. అయితే, ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఇక్కడితో ముగిసిపోవు. ఫెడరల్ స్పెషల్ కౌన్సిల్‌తోపాటు జార్జియా డిస్ట్రిక్ట్ అటార్నీ కూడా ట్రంప్‌పై విడిగా విచారణలు మొదలుపెట్టే అవకాశముంది.

హైప్రొఫైల్ లీగల్ డ్రామాలకు అమెరికా పెట్టింది పేరు. రాజకీయ ప్రచారాల్లోనూ వీటిని మెరుగ్గా ఉపయోగించుకున్నట్లు చరిత్ర చెబుతోంది. నేడు మరోసారి అమెరికా ప్రజలు ఈ రెండింటినీ కలిపి చూడబోతున్నారు. రానున్న నెలల్లో కోర్టుల్లో విచారణకు ట్రంప్ హాజరుకావడం, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం లాంటి నాటకీయ పరిణామాలు వరుసగా చోటుచేసుకోబోతున్నాయి.

వీడియో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు.. అధ్యక్ష పత్రాలకోసం వెతికారన్న ట్రంప్ కుమారుడు..

బహుశా రాజకీయ సంప్రదాయాలు, పద్ధతులను ఎనిమిదేళ్లుగా తనకు నచ్చినట్లుగా మారుస్తున్న తొలి అమెరికా రియాలిటీ-షో ప్రెసిడెంట్‌ నుంచి ఇలాంటి నాటకీయ పరిణామాలను చూసి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ట్రంప్‌ను కోర్టుకు తీసుకొట్చేటప్పుడు టీవీ కెమెరాలు లేకుండా చూడాలని జడ్జి మెర్కాన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఈ మొత్తం ఒక సర్కస్ గ్రౌండ్‌లా మారకూడదని ఆయన భావిస్తున్నారు. అయితే, కోర్టుబయట, మీడియా ముందు ట్రంప్ మద్దతుదారులు, వ్యతిరేకుల నినాదాలతో భారీ సర్కస్ షో నడిచింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)