అమెరికా: డోనాల్డ్ ట్రంప్‌కు పోర్న్‌ స్టార్ డేనియల్స్‌కు సంబంధం ఏంటి... ట్రంప్‌ను అరెస్ట్ చేస్తే ఏమవుతుంది?

డోనాల్డ్ ట్రంప్‌ను అరెస్ట్ చేసే అవకాశం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆంథోని జర్చర్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను అరెస్టు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఆయనను అరెస్టు చేస్తే అమెరికాలో అల్లర్లు చెలరేగకుండా చూసేందుకు ముందుగా ఆయా నగరాల్లో పోలీసులు భద్రతను పెంచుతున్నారు.

ప్రధానంగా న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, లాస్ ఏంజలీస్‌లలో భద్రతా బలగాలను అధిక సంఖ్యలో మోహరిస్తున్నారు.

ట్రంప్ కేసును విచారిస్తున్న మాన్‌హట్టన్ క్రిమినల్ కోర్టు వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ట్రంప్ టవర్ బయట కూడా అధిక సంఖ్యలో పోలీసులు కనిపిస్తున్నారు.

మఫ్టీలో ఉండే పోలీసులను కూడా మంగళవారం యూనిఫాంలో రావాల్సిందిగా న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆదేశించినట్లు సీబీఎస్ రిపోర్ట్ చేసింది. ఈ విషయంలో యూఎస్ సీక్రెట్ సర్వీస్, ఎఫ్‌బీఐకి చెందిన జాయింట్ టెర్రరిజం టాస్క్‌లతో నిరంతరం న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సంప్రదింపులు జరుపుతూ ఉంది.

అలాగే అమెరికా చట్టసభలు ఉండే క్యాపిటల్ హిల్ వద్ద అత్యవసర పరిస్థితిని విధించే ఆలోచనలో పోలీసులు ఉన్నారు.

తనను మంగళవారం అరెస్టు చేయొచ్చని ట్రంప్ ట్వీట్ చేసిన తరువాత అధికారులకు ఆన్‌లైన్‌లో బెదిరింపులు మొదలయ్యాయి. మాన్‌హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ అల్విన్ బ్రాగ్‌కు ఎక్కువగా బెదిరింపులు వస్తున్నాయి. ట్రంప్ మీద చార్జ్ షీట్‌ను అల్విన్ ఫైల్ చేయనున్నారు.

డోనాల్డ్ ట్రంప్‌ను అరెస్ట్ చేసే అవకాశం

ఫొటో సోర్స్, Getty Images

డోనాల్ట్ ట్రంప్‌పై ఉన్న ఆరోపణలేంటి?

2006లో తనతో డోనాల్డ్ ట్రంప్ సెక్స్‌లో పాల్గొన్నట్లు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ 2016లో ఆరోపించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చెబుతానంటూ ఆమె కొన్ని మీడియా సంస్థలను సంప్రదించారు.

2016లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.

అయితే డేనియల్స్ నోరు మూయించేందుకు డోనాల్డ్ ట్రంప్ న్యాయవాది మైఖేల్ కోహెన్ ఆమెకు 1,30,000 డాలర్లు చెల్లించారు.

కానీ ఇది అక్రమం కాదు.

ఆ తరువాత లీగల్ ఫీజులు అంటూ 1,30,000 డాలర్లను తన లాయర్ కోహెన్‌కు ట్రంప్ చెల్లించారు. దీన్ని ఆయన లీగల్ ఫీజులుగా చూపించారని, అందుకు తప్పుడు పత్రాలు సృష్టించారనేది ఆరోపణ.

న్యూయార్క్ చట్టాల ప్రకారం తప్పుడు పత్రాలు సృష్టించడం నేరం.

పోర్న్ స్టార్‌తో తనకున్న సంబంధాన్ని ఓటర్లకు తెలియకుండా ఉంచేందుకు డేనియల్స్‌కి చేసిన చెల్లింపులను ఆయన దాచి పెట్టేందుకు చూశారని, ఇది ఎన్నికల చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తుందని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

డోనాల్డ్ ట్రంప్‌ను అరెస్ట్ చేసే అవకాశం

ఫొటో సోర్స్, Getty Images

ఒకవేళ ట్రంప్‌ను అరెస్ట్ చేస్తే ?

అమెరికా మాజీ అధ్యక్షుడిని అరెస్టు చేయడానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది.

ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో వద్దనున్న తన ఇంటి నుంచి డోనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ సిటీ కోర్టుకి రావాల్సి ఉంటుంది. ఫోటోలు, వేలిముద్రలు తీసుకుంటారు.

కేసు బుక్ అయితే, జడ్జిని ఎంపిక చేస్తారు. నిందితుడి ట్రయల్ సమయం, ప్రయాణ ఆంక్షల వర్తింపు, బెయిల్ వంటి మిగిలిన వివరాలు ఆ తర్వాత తెలుస్తాయి.

సాధారణంగా నిందితులు కోర్టుకు వచ్చే దృశ్యాలు మీడియాలో కనిపిస్తాయి. ఒకవేళ ట్రంప్ గోప్యతను కాపాడాలనుకుంటే ప్రైవేటు మార్గంలో కోర్టు అనుమతించొచ్చు.

ట్రంప్‌కు భద్రత కల్పిస్తున్న అమెరికా సీక్రెట్ సర్వీస్, ఇతర విచారణ సంస్థలు కూడా అరెస్టుకు తగినట్లుగా అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంటుంది.

నేరం చిన్నది అని తేలితే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నేర తీవ్రత ఎక్కువగా ఉంటే ట్రంప్‌కు గరిష్టంగా నాలుగేళ్లు జైలు శిక్ష పడుతుంది.

నిరసనలు జరుగుతాయా?

సోషల్ మీడియా పోస్టులో తనను మంగళవారం అరెస్ట్ చేస్తారని తెలిపిన డొనాల్డ్ ట్రంప్, తన మద్దతుదారులు నిరసనలకు దిగాలని పదే పదే పిలుపునిస్తున్నారు. ‘‘దీన్ని ఎప్పటికీ మేము సహించం. మేము వెనుకాల కూర్చుని, చూస్తుంటే వారు మా దేశాన్ని చంపేస్తున్నారు’’ అని అన్నారు.

ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు, 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్‌ భవనంపై ఆయన మద్దతుదారులు చేసిన దాడిని గుర్తుకు చేస్తున్నాయి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఆదివారం ప్రెస్‌కి లీకైనా సమాచారంలో న్యూయార్క్ పోలీసు, కోర్టు సెక్యూరిటీతో బ్రాగ్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

తమ కార్యాలయాన్ని భయపెట్టాలని చూసినా లేదా న్యూయార్క్‌లో న్యాయ విధానానికి భంగం కలిగించేలా చూసినా తాము ఊరుకోమని తన డిపార్ట్‌మెంట్‌కి రాసిన లేఖలో బ్రాగ్ పేర్కొన్నారు.

డోనాల్డ్ ట్రంప్‌ను అరెస్ట్ చేసే అవకాశం

ఫొటో సోర్స్, Getty Images

అధ్యక్షుడిగా పోటీలో నిలబడతారా?

నేరం రుజువైన వ్యక్తి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా, అధ్యక్షుడిగా దేశాన్ని పాలించకుండా ఉండేలా అమెరికాలో చట్టాలంటూ ఏమీ లేవు.

జైలు నుంచి వారు దేశాన్ని పాలించవచ్చు.

ట్రంప్ అరెస్ట్ ఆయన అధ్యక్ష ఎన్నికల ప్రచారాలను కాస్త క్లిష్టంగా మార్చనుంది. ఎన్నో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వ్యక్తి తరఫున రిపబ్లికన్ ఓటర్లు ర్యాలీలు నిర్వహించాల్సి ఉంటుంది.

ఎన్నికల ప్రచారం, ఓట్లను అభ్యర్థించడం, డిబేట్లలో పాల్గొనే సమయంలో అభ్యర్థి దూరమవ్వాల్సి వస్తుంది.

ఇప్పటికే అమెరికా రాజకీయ విధానంలో నెలకొన్న అంతరాలను ఇది మరింత పెంచుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)