వూహాన్ ల్యాబ్ లీక్ థియరీ: ఆంథోనీ ఫౌచి రాసిన ఈ-మెయిళ్లలో ఏముంది?

ఫొటో సోర్స్, Getty Images
ఏడుగురు అమెరికా అధ్యక్షుల పదవీ కాలంతో సమానమైన అనుభవం ఉన్న జాతీయ సంస్థల వైద్య నిపుణుడు, 80 సంవత్సరాల డాక్టర్ ఫౌచి, కోవిడ్ సమయంలో అమెరికా వైద్య రంగానికి ప్రతినిధిగా మారారు. అప్పటి నుంచి ఆయన అపారమైన ప్రశంసలతోపాటు బీభత్సమైన విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.
సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి వాషింగ్టన్ పోస్ట్, బజ్ ఫీడ్, సీఎన్‌ఎన్ వార్తా సంస్థలు 2020 జనవరి నుంచి జూన్ వరకు ఫౌచీ రాసిన సుమారు 3000 పేజీల ఈ-మెయిళ్లను సంపాదించాయి.
కోవిడ్ తలెత్తిన మొదట్లో ఆయన ప్రభుత్వంతో, జాతీయ, అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులతో, మీడియాతో, సెలెబ్రిటీలతో, అమెరికన్లతో మాట్లాడిన విషయాలు ఈ ఈ-మెయిళ్లలో ఉన్నాయి.

ఆ ఈ-మెయిళ్లలో ఏముంది?
1.వూహాన్ ల్యాబ్ థియరీ
చైనాలోని వూహాన్‌లోని ఒక లేబరేటరీ నుంచి కోవిడ్-19 వైరస్ వ్యాపించి ఉంటుందన్న వాదనలను డాక్టర్ ఫౌచితో పాటు ఆయన సహచరులు గమనించారు.
ఇలా జరగడం సాధ్యం కాదంటూ ఈ వివాదాస్పద సిద్ధాంతాన్ని గత సంవత్సరంలో నిపుణులు కొట్టి పారేసారు. ఆ ఆరోపణలను నిరూపించేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.
కానీ, ఈ ఆరోపణల పై జరుగుతున్న అంతర్జాతీయ విచారణ పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, అధికారికంగా వైరస్ గుర్తించక ముందే ఆ ప్రాంతంలో కోవిడ్ కేసులు తలెత్తాయనే విషయం ఈ వాదనలను మళ్లీ తెర మీదకు తెస్తున్నాయి.
''ఈ వైరస్‌లోని అసాధారణ లక్షణాలు చూస్తుంటే ఇది ల్యాబ్‌లో తయారు చేసిన వైరస్‌లా అనిపిస్తోంది అని మీరు ప్రకటించండి'' అంటూ అమెరికాలో ఓ బయో మెడికల్ పరిశోధన సంస్థ నుంచి 2020 జనవరి లో ఫౌచికి ఈ-మెయిల్ వచ్చింది.
"ఈ కుట్ర ఊపందుకుంది" అంటూ ఏప్రిల్ 2020లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ కొల్లిన్స్ ఫౌచికి లేఖ రాశారు. అయితే, అప్పట్లో ఫౌచి దీనిపై వ్యక్తం చేసిన స్పందనను తర్వాత పూర్తిగా మార్చుకున్నారు.
ఈ వైరస్ సహజంగా పుట్టిందనడాన్ని అంగీకరించలేక పోతున్నానని, దీని పై విచారణ జరగాలని డాక్టర్ ఫౌచి మే నెలలో వ్యాఖ్యానించారు.
మాస్కులు
వైరస్ వచ్చిన తొలినాళ్లలో అమెరికా ప్రభుత్వం మాస్క్ నిబంధనల అమలు విషయంలో ఆలోచనలు చేస్తోంది. దాంతో అది అయోమయంతోపాటు విమర్శలకు కూడా దారి తీసింది.
"ఇన్ఫెక్షన్ సోకని వారి కంటే, దీన్ని వ్యాప్తి చేయకుండా కేవలం ఇన్ఫెక్షన్ సోకిన వారే మాస్కులు ధరించాలి" అని అమెరికా ఆరోగ్య కార్యదర్శికి ఫిబ్రవరి 2020లో డాక్టర్ ఫౌచి ఒక ఈ-మెయిల్‌లో రాశారు.
అలాగే వైరస్ నియంత్రించడానికి స్టోర్‌లో కొన్న మాస్కులు పని చేయవని, వాటి నుంచి వైరస్ వ్యాపిస్తుందని చెప్పారు.
పశ్చిమ దేశాలు మాస్కు వాడకాన్ని సూచించకుండా పెద్ద తప్పు చేస్తున్నాయని చైనా ప్రజారోగ్య శాఖలో పని చేస్తున్న ఒక స్నేహితుడు ఆయనకు ఆ తర్వాత నెలలో ఈ-మెయిల్ రాశారు.
"నేను అర్ధం చేసుకోగలను. అందరం కలిసి ఈ సమస్యను అధిగమిద్దాం" అని డాక్టర్ ఫౌచి సమాధానమిచ్చారు.
అన్ని వైపుల నుంచీ ప్రశ్నలు
అమెరికా వ్యాప్తంగా అనేకమంది ఫౌచీకి అనేక ప్రశ్నలు సంధించారు. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా సోషల్ మీడియా వేదికల పైకి వచ్చి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఫౌచీని ఆహ్వానించారు.
ఎయిడ్స్ మహమ్మారి సమయంలో 1980లో కలిసి పని చేసిన మోర్గన్ ఫెయిర్ చైల్డ్ అనే నటి ఫిబ్రవరిలో డాక్టర్ ఫౌచీని సంప్రదించి నేనేమైనా సాయం చేయాలా అని ఆయన్ను అడిగారు.
ఆయన సలహా మేరకు "అమెరికా ప్రజలారా భయపడకండి. కానీ, భౌతిక దూరం పాటిస్తూ, ఇంటి నుంచే పని చేస్తూ, స్కూళ్లను మూసివేసి, ఈ దేశంలో మహమ్మారి వ్యాపించకుండా చూడాలి" అని మోర్గాన్ ట్వీట్ చేశారు.
ఆయన పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిఘా పెట్టారనే వదంతులను ఆ ఈ-మెయిళ్లు తిప్పికొట్టాయి.
చులకన అయిన క్షణాలు
ఇంటర్‌నెట్‌లో తనను ప్రశంసిస్తూ వచ్చిన మెయిళ్లు చూసి తాను చాలా ఇబ్బందిగా ఫీలయ్యానని ఫౌచి చెప్పారు.
అమెరికాలో ఒక షాపులో డో నట్స్ అయిపోయాయి అని ఆయన సహోద్యోగి ఆయనకు ఈ-మెయిల్ రాసినప్పుడు, దానికి సమాధానంగా ఆయన, "ఇదంతా త్వరలోనే అంతమైపోతుందని ఆశిస్తున్నాను. " అని రాశారు.
స్పందనలేంటి?
మహమ్మారి సమయంలో ఫౌచి ప్రవర్తించిన తీరు పట్ల ఆయనను పదవి నుంచి తొలగించాలని కొంతమంది రాజకీయ నాయకులు, మీడియా పండిట్లు అభిప్రాయపడ్డారు.
"ఈ డాక్టర్ పెద్ద మోసగాడు" అని ఈ-మెయిళ్లు నిరూపిస్తున్నాయని అమెరికా సెనేటర్ రాండ్ పాల్ అన్నారు. అయితే, లిబరల్ నాయకులు మాత్రం ఫౌచి నిర్ణయాలు ఆ సమయంలో లభించిన ఆధారాల ఆధారంగా చెప్పినవని సమర్థిస్తున్నారు.
కొంత మంది ఫౌచి వ్యవహరించిన తీరును ప్రశంసించారు.

విశ్లేషణ
తారామాక్ కెల్వీ
బీబీసీ వైట్ హౌస్ ప్రతినిధి
ఫౌచి ఈ-మెయిళ్లలో పడిన సిరా మరక కంటే కూడా ఆయన వ్యక్తిత్వం గురించి ఎక్కువగా తెలియచేస్తున్నాయి.
ట్రంప్ మద్దతుదారులకు ఫౌచి ఒక విలన్. వైరస్ గురించి ఆయన విరుద్ధమైన సందేశాలు ఇస్తూ ఉంటారని, సైన్సును పరి పరివిధాలుగా మారుస్తూ ఉంటారని రిపబ్లికన్లు అంటారు. ఆయన ట్రంప్ ప్రతిష్టను తగ్గించారని కూడా రిపబ్లికన్లు ఆరోపిస్తుంటారు.
అమెరికాలో మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించడానికి సంప్రదాయ వాదులు నిరాకరించారు.
ఆయన ఈ-మెయిళ్లు వాళ్ళ అభిప్రాయాలను బల పరుస్తున్నాయి. వైరస్ గురించి అదనపు సమాచారం వస్తున్న కొద్దీ , వైద్య సూచనలు ఇచ్చే విషయంలో ఫౌచి కూడా తన అభిప్రాయాలను మార్చుకున్నారు.
మరోవైపు లిబరల్ మద్దతుదారులకు ఫౌచి ఒక హీరో. ఆయన ఈ-మెయిళ్లు వారి అభిప్రాయాలను కూడా బలపరుస్తున్నాయి. వైరస్‌తో పోరాడేందుకు ట్రంప్‌కు అనుగుణమైన విషయాలను కాకుండా, ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చిన వైద్య పరిజ్ఞానాన్ని అనుసరించి సూచనలు ఇచ్చేవారని వారంటారు.

ఇవి కూడా చదవండి:
- కొత్త ఐటీ నిబంధనలను ట్విటర్ అనుసరించాల్సిందే - దిల్లీ హైకోర్టు
- ప్రశాంత్: పాక్ జైలులో నాలుగేళ్లు గడిపిన హైదరాబాద్‌వాసి విడుదల
- చైనాలో ఇక ముగ్గురు పిల్లలను కూడా కనొచ్చు
- కోవిడ్ సోకితే గర్భిణులు ఏం చేయాలి.. తల్లి నుంచి బిడ్డకు వస్తుందా..
- వూహాన్ ల్యాబ్ లీక్ థియరీ: ‘కోవిడ్-19 సహజంగా పుట్టిందంటే నమ్మను..చైనాలో ఏం జరిగిందో దర్యాప్తు చేయాలి’
- ఇజ్రాయెల్: లక్షలాది యూదులను చంపిన నాజీ అధికారి ఐష్‌మన్‌ను ఎలా పట్టుకుంది?
- పాలస్తీనియన్లకు మద్దతుగా కశ్మీర్లో ప్రదర్శనలు, 21 మంది అరెస్ట్
- వెస్ట్ బ్యాంక్ చరిత్రేమిటి.. ఇజ్రాయెల్ దాన్ని ఎందుకు ఆక్రమించాలనుకుంటోంది
- బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ మరింత ప్రమాదకరమా.. ఈ వ్యాధి ఎవరికి వస్తుంది..
- కరోనావైరస్: వ్యాక్సీన్లు తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు వస్తే ఏం చేయాలి?
- యాంఫోటెరిసిన్-బీ: బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే మందుకు తీవ్ర కొరత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








