ప్రశాంత్: పాక్ జైలులో నాలుగేళ్లు గడిపిన హైదరాబాద్‌వాసి విడుదల

ప్రశాంత్
ఫొటో క్యాప్షన్, ప్రశాంత్

పాకిస్తాన్‌లో నాలుగేళ్ల కిందట అడుగుపెట్టి బందీగా మారిన హైదరాబాద్‌‌వాసి ప్రశాంత్ సోమవారం అక్కడి జైలు నుంచి విడుదలయ్యారు.

నాలుగేళ్లపాటు జైలులో గడిపిన ఆయన్ను.. అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు అప్పగించారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ 2017లో పాకిస్తాన్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

తన ప్రియురాలిని కలుసుకునేందుకు పాకిస్తాన్ మీదుగా స్విట్జర్లాండ్ వెళ్లాలని ప్రశాంత్ భావించినట్లు బీబీసీ అసోసియేట్ జర్నలిస్టు రవీందర్ సింగ్ రాబిన్ చెప్పారు.

ప్రశాంత్‌ను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే, ఆయన్ను కలిసేందుకు అనుమతించాలని భారత్ కోరింది.

పాక్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌పుర్‌లో ప్రశాంత్‌ను అప్పట్లో అరెస్టు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో అతణ్ని అదుపులోకి తీసుకున్నట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు.

ప్రశాంత్

ఫొటో సోర్స్, FACEBOOK/XCHANGEVICTORY

ప్రశాంత్ చదువుకున్నది విశాఖలో..

ప్రశాంత్ తండ్రి బాబూరావు విశాఖపట్నంలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. కుమారులు ఉద్యోగ రీత్యా హైదారాబాద్‌లో స్థిరపడడంతో వీరు విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చేశారు.

ప్రశాంత్ చదువు విశాఖలోనే సాగింది. ఎనిమిదో తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకూ విశాఖపట్నంలోనే చదువుకున్నారు. 2010 తరువాత బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశారు. 2016లో హైదరాబాద్ వచ్చారు.

సజ్జనార్, బాబూరావు
ఫొటో క్యాప్షన్, 2019లో ప్రశాంత్ తండ్రి బాబూరావు పోలీసు అధికారి సజ్జనార్‌ను కలిసి తన కుమారుడి విడుదల కోసం ప్రయత్నించాలని కోరారు.

అసలు ఏం జరిగింది?

ఫేస్‌బుక్‌లో ప్రశాంత్ చివరి పోస్ట్ 2017 నవంబర్ 8న ఉంది. 'యూత్ ఫర్ సేవ' అనే స్వచ్ఛంద సంస్థకి వాలంటీర్‌గా ఉన్నట్టు ఆయన తన ప్రొఫైల్‌లో రాసుకున్నారు.

"2017 నాటికి మాదాపూర్‌లోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ప్రశాంత్ పనిచేసేవాడు. ఆ ఏడాది ఏప్రిల్ 11న ఉదయం ఆఫీసుకు వెళ్లిన వాడు తిరిగి రాలేదు. రెండు మూడు రోజులు వెతికి చూసి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాం. వారు ప్రయత్నించారు. దొరికితే చెబుతాం అన్నారు. అప్పటి నుంచీ జాడలేదు"అని ప్రశాంత్ తండ్రి బాబూరావు 2019లో బీబీసీతో చెప్పారు.

''ఏప్రిల్ 29, 2017న మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రశాంత్ మిస్సింగ్ కేసు నమోదయింది. పోలీసులు వెతికేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. కానీ సమాచారం దొరకలేదు. అయితే అతడు పాక్‌లో బందీగా మారినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను అలర్ట్ చేశాం''అని 2019లో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌ తెలిపారు.

ఉద్యోగం ఇష్టం లేదు...

జాబ్ చేయడం ప్రశాంత్‌కి ఇష్టం లేదని.. ప్రశాంత్‌కి ఒక ప్రేమ వ్యవహారం ఉందని తండ్రి బాబూరావు గతంలో బీబీసీతో చెప్పారు.

''లవ్ అఫైర్ ఉండడం కూడా తను కనిపించకపోవడానికి ఒక కారణమని మేం అనుకున్నాం. అతను కనిపించకుండా పోయిన చాలా కాలం తరువాత మాకా అనుమానం వచ్చింది. బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు తన సహోద్యోగి, మధ్యప్రదేశ్‌కి చెందిన అమ్మాయి ఒకరు ప్రశాంత్‌కు ప్రపోజ్ చేశారు. ఆ విషయం ఇంట్లో చెప్పాడు. మాకేం అభ్యంతరం లేదు అని చెప్పాం. ఆ అమ్మాయి కొంత కాలం స్విట్జర్లాండులో ఉందని తెలుసు" అన్నారు ఆయన తండ్రి బాబూరావు.

గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ..

భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతుండగా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చినట్టు ప్రశాంత్ చెప్పాడని పాక్ పోలీసు అధికారి షేక్ అస్జద్ బీబీసీతో 2018లో చెప్పారు.

అయితే ప్రశాంత్ సరిహద్దు నుంచి చాలా దూరం వచ్చేశారనీ, చొలిస్తాన్ ఎడారిలో తిరుగుతుండగా అరెస్టు చేశామని అస్జద్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)