చైనాలో ఇక ముగ్గురు పిల్లలను కూడా కనొచ్చు

చైనాలో పిల్లలు, తల్లిదండ్రులు

ఫొటో సోర్స్, Getty Images

చైనాలో సంతానంపై పరిమితులను సడలించారు. జననాల రేటు భారీగా తగ్గిపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రజలు ముగ్గురు పిల్లల వరకు కనొచ్చని అనుమతించారు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పార్టీ పొలిట్‌బ్యురో మీటింగులో ఈ మేరకు ఆమోదం పలికారని జిన్‌హువా వార్తాఏజెన్సీ వెల్లడించింది.

అక్కడి జననాల రేటు ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో నెమ్మదించిందని పదేళ్లకు ఒకసారి జరిపే జనాభా లెక్కలలో తేలిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల ప్రారంభంలో వెల్లడైన జనాభా లెక్కల ప్రకారం చైనాలో గత దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 0.53 శాతంగా నమోదైంది. 2000-2010 మధ్య ఈ వృద్ధి రేటు 0.57 శాతం ఉండేది.

కొద్దికాలం కిందట వరకు చైనాలో కేవలం ఒక్కరిని మాత్రమే కనడానికి అనుమతి ఉండేది. దాన్ని సడలిస్తూ కొద్దికాలం కిందట ఇద్దరు పిల్లలన కనేందుకు అనుమతించారు.

దాన్నిప్పుడు ముగ్గురు పిల్లల వరకు కనొచ్చంటూ నిబంధనలు సడలించారు.

జననాలు

ఫొటో సోర్స్, Getty Images

చైనాలో ప్రతి పదేళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు విడుదల చేస్తారు. ఈ ఏడాది గణాంకాలు ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని రోజులు ఆలస్యమైంది.

2020లో జనాభా లెక్కలను సేకరించారు. సుమారు 70 లక్షలమంది జనగణన అధికారులు ఇంటింటికీ వెళ్లి జనాభా లెక్కలు సేకరించారు.

చైనాలో జనాభా లెక్కల సేకరణను అత్యంత సమగ్రంగా నిర్వహిస్తారు. భవిష్యత్తు ప్రణాళికను రచించేందుకు కచ్చితమైన జనాభా లెక్కలు ముఖ్యమని భావిస్తారు.

గత ఏడాది చైనాలో 1.2 కోట్ల శిశువులు జన్మిచారని, 2016లోని నవజాత శిశువుల సంఖ్య(1.8 కోట్లు)తో పోలిస్తే ఈ సంఖ్య బాగా తగ్గిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ హెడ్ నింగ్ జిజే తెలిపారు.

ఒక దేశం అభివృద్ధి చెందుతూ ఉంటే, సంతానోత్పత్తి రేటు సహజంగా తగ్గుతుంది.

అభివృద్ధి కారణంగా అక్షరాస్యత పెరగడం, ఎక్కువమంది కెరీర్ మీద దృష్టి పెట్టడం, ఇతర సామాజిక అంశాల కారణంగా సంతానోత్పత్తి తగ్గుతుంది.

జపాన్, దక్షిణ కొరియాలాంటి దేశాల్లో కూడా ఇటీవల కాలంలో సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయిలో తగ్గుతూ కనిపిస్తోంది.

జనాభా తరుగుదల సమస్యాత్మకం కావడానికి కారణం ఏమిటంటే, జనాభా తగ్గుతున్నకొద్దీ వృద్ధుల సంఖ్య పెరిగి యువత సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది.

ఇది దేశ ఉత్పత్తిని, ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుంది. ప్రజారోగ్య, సాంఘిక వ్యవయాలు పెరుగుతాయి.

2010 జనాభా లెక్కలతో పోలిస్తే చైనాలో 16 నుంచి 59 సంవత్సరాల వయసు జనాభా 4 కోట్లు తగ్గిందని ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయి.

అయినప్పటికీ, శ్రామిక జనాభా (వర్కింగ్ పాపులేషన్) 88 కోట్లు ఉందని చీఫ్ మెథడాలజిస్ట్ జెంగ్ యూపింగ్ తెలిపారు.

వన్ చైల్డ్ పాలసీ

ఫొటో సోర్స్, Reuters

1979 నుంచి 2016 వరకువన్ చైల్డ్ పాలసీ

2016లో వివాదాస్పద 'వన్ చైల్డ్ పాలసీ'ని చైనా రద్దు చేసింది. ఈ మార్పు వల్ల వెనువెంటనే ఫలితాలు కనిపించినా, దీర్ఘకాలంలో జనాభా తరుగుదలను నివారించలేకపోయింది.

ప్రస్తుతం, జనాభా లెక్కలను విడుదల చేయడంతో పాటూ కుటుంబ నియంత్రణ విధానాన్ని చైనా పూర్తిగా రద్దు చేస్తుందని పలువురు భావించారు. అయితే, అలాంటిదేమీ జరగలేదు.

చైనాలో జనాభా నియంత్రణ కొరకు 1979లో వన్ చైల్డ్ పాలసీని ప్రవేశపెట్టి కట్టుదిట్టంగా అమలు చేశారు.

దీన్ని అతిక్రమించినవారిపై కఠినమైన చర్యలు తీసుకున్నారు. జరిమానాలు విధించడం, ఉద్యోగం నుంచి తొలగించడం, బలవంతపు గర్భస్రావాలు మొదలైన శిక్షలు విధించారు.

గత మూడు నాలుగు దశాబ్దాలుగా చైనాలో జనాభా పెరుగుదల రేఖను వన్ చైల్డ్ పాలసీ నియంత్రించిందనే చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)