ఆస్కార్-ఆర్ఆర్ఆర్: వైఎస్ జగన్ ‘‘తెలుగు జెండా’’ అంటే ప్రాంతీయ వాదం అవుతుందా?

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy/Facebook
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై భారతదేశమంతా చర్చ జరుగుతోంది.
అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పాట పుట్టిన తెలుగు నేలపై ఆస్కార్ హడావుడి మరింత ఎక్కువగా, సందడిగా ఉంది.
పాట రాసిందీ, బాణీలు ఇచ్చిందీ, పాడిందీ, తీసిందీ, డాన్స్ చేసిందీ అంతా తెలుగువారే కావడం దానికి కారణం.
ఈ అభినందనల్లోనే వివాదాలు కూడా మొదలయ్యాయి. ఆర్ఆర్ఆర్ బృందానికి శుభాకాంక్షలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు.
తెలుగు కీర్తపతాకను రెపరెపలాడించారు అనే భావం వచ్చేలా ఇంగ్లిష్‌లో ట్వీట్ చేసిన జగన్, ఒక తెలుగు పాటకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చినందుకు గర్వపడుతున్నాను అంటూ అందులో రాశారు.
"తెలుగు ఫ్లాగ్ ఈజ్ ఫ్లయింగ్ హైయర్" అంటూ ఆ ట్వీట్‌లో ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సరిగ్గా ఈ పాయింటుపై మొదలైంది రచ్చ. ఆర్ఆర్ఆర్ పాటకు అవార్డు వస్తే భారతీయ పాటకు వచ్చింది అనకుండా తెలుగు పాటకు వచ్చింది అంటారా? మీది ప్రాంతీయ వాదం అంటూ జగన్ ట్వీటుపై పలువురు విరుచుకుపడ్డారు.
ఉత్తర భారతానికి చెందిన కొందరు ట్విట్టర్ యూజర్లు, బీజేపీ పార్టీ అభిమానులు, స్వతంత్రులు కూడా తెలుగు పతాక అన్న పదాన్ని తప్పు పడుతూ భారతదేశానికి ఒకటే జెండా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.
తెలుగు అంటూ భారతదేశాన్ని విడదీస్తారా అని పలువురు నెటిజన్లు ట్వీట్లు చేశారు.

ఫొటో సోర్స్, Twitter

ఫొటో సోర్స్, TWITTER
అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'నాటు నాటు' పాట విషయంలో ‘‘తెలుగు జెండా’’ అనే పదం వాడటం ఇదే మొదటిసారి కాదు. ఆ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పుడు కూడా ఆయన ‘‘తెలుగు జెండా’’ అనే పదం వాడుతూ ట్వీట్ చేశారు.
అప్పట్లో ఆ ట్వీట్ పై కూడా దుమారం రేగింది. అప్పుడు కూడా అనుకూల, వ్యతిరేక ట్వీట్ల పరంపర కొనసాగింది.
బాలీవుడ్ గాయకుడు అద్నాన్ సమీ వంటి వారు విమర్శిస్తున్నారు. ‘‘ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారు’’ అంటూ ఆరోపించారు. ‘‘ఇటువంటి మెంటాలిటీ వల్లే 1947లో దేశం విడిపోయింది. ఇది చాలా ప్రమాదకరం’’ అని ఆయన అన్నారు.
అదే సమయంలో పలువురు జగన్ ట్వీట్ చేసిన దాంట్లో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలుగు పాట కాబట్టి తెలుగు వారికి గర్వకారణం అంటూ వారు జగన్ కి మద్దతిస్తున్నారు.

ఫొటో సోర్స్, TWITTER
మహా సముద్రం గురించి తెలియకుండా బావిలో కప్పలాంటి ప్రాంతీయ మనస్తత్వం అంటూ జగన్‌పై పరుష పదజాలం వాడారు అద్నాన్ సమీ.
అక్కడితో ఆగకుండా, తన ట్వీట్‌ను సమర్థించుకుంటూ మరో ట్వీట్ పెట్టారు. ఇక్కడ భాష ముఖ్యం కాదనీ, దేశమే ప్రధానమంటూ సమీ మరో ట్వీట్ వదిలారు.
అద్నాన్ సమీ జగన్ పోస్ట్ చేసే ట్వీట్లపై స్పందించడం ఇదే మొదటిసారి కాదు. గోల్డెన్ గ్లోబ్ సమయంలో జగన్ నాటు నాటు పాటను తెలుగు పతాక అంటూ అభివర్ణించినప్పుడు కూడా సమీ ఇదే తరహాలో స్పందించారు.
అప్పట్లో ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి విడదల రజిని వంటివారు అద్నాన్ సమీకి కౌంటర్ ఇచ్చారు. జనవరిలో ఆ ట్వీటుపై పెద్ద చర్చే జరిగింది.

ఫొటో సోర్స్, TWITTER
మరోవైపు, జగన్ ట్వీటును సమర్థిస్తూ పలువురు మాట్లాడుతున్నారు.
నాటు నాటు' తెలుగు పాటే అయినప్పుడు అందులో తప్పేముందని వారు ప్రశ్నిస్తున్నారు.
'హిందీలో నాచో నాచో అని పెట్టారు.. తెలుగులో నాటు నాటు అని ఉంది. అవార్డు తెలుగు పాటకే కదా వచ్చింది?' అని వారు ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు దీన్ని వేరే లెవెల్‌కి తీసుకెళ్లారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఇలానే భాష, దేశం పేరుతో విభజించేస్తాయి. భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ పోస్టులు పెట్టారు.

ఫొటో సోర్స్, Twitter

ఫొటో సోర్స్, TWITTER
జగన్ ట్వీటుకు అనుకూలంగా వచ్చిన మద్దతులో ఎక్కువ కర్ణాటక, కన్నడ వారి ట్వీట్లు ఉన్నాయి. జగన్ అన్నదాంట్లో తప్పేమీ లేదని వారు సమర్థిస్తూ ట్వీట్లు చేశారు.
అయితే, ఈ చర్చలో మరో కొత్త కోణం కూడా ప్రవేశించింది. 2022లో సినిమా టికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కఠిన వైఖరిని ప్రశ్నిస్తూ పలువురు ట్వీట్లు పెట్టారు.
"అప్పట్లో టికెట్లు రేట్లు తగ్గించేసి ఈ సినిమాను ఇబ్బంది పెట్టింది మీరే కదా?" అంటూ పలువురు ప్రశ్నించారు.
టికెట్ల ధర బాగా తగ్గించేసి ఆర్ఆర్ఆర్ ని ఇబ్బంది పెట్టి, ఇప్పుడెలా అభినందనలు చెబుతున్నారంటూ వారు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- లావణి డ్యాన్స్: మహిళలను ప్రైవేటుగా బుక్ చేసుకునే ఈ నృత్యం ఏంటి? ఈ జీవితం మీద ఆ మహిళలు ఏమంటున్నారు?
- ‘బాంబులు పడుతున్నా.. యుక్రెయిన్‌కు తిరిగి వెళ్లక తప్పట్లేదు’ - భారత వైద్య విద్యార్థుల దుస్థితి
- స్టాక్ మార్కెట్ ద్వారా తక్కువ కాలంలో ధనవంతులు కావొచ్చా? ఇందులో నిజమెంత?
- మాతృత్వం: ‘మా అమ్మ వయసు 50 ఏళ్లయితే మాత్రం.. రెండవ బిడ్డను కనడానికి ఎందుకు సిగ్గుపడాలి?’
- ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఈ ఇంట్లో 18 ఓట్లు ఉన్నాయి... కానీ వారెవరో ఇంట్లో వాళ్లకు తెలియదు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














