‘బాంబులు పడుతున్నా.. యుక్రెయిన్‌కు తిరిగి వెళ్లక తప్పట్లేదు’ - భారత వైద్య విద్యార్థుల దుస్థితి
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, న్యూ దిల్లీ
‘‘మొదట ‘క్షిపణులు దూసుకొస్తున్నాయి’ అని హెచ్చరికలు జారీ చేసే అలారంలు మోగుతాయి. మీదకి దూసుకువస్తున్న క్షిపణులను నేలమట్టం చేయడానికి ఇటు వైపు నుంచి క్షిపణుల దాడి మొదలవుతుంది.
దాంతో మాకు భయం వేస్తుంది. మమ్మల్ని మేం కాపాడుకోవడం కోసం భవనం నేల మాళిగలోకి పరిగెత్తి తలదాచుకుంటాం.
ఈ మధ్యకాలంలో దాడుల తీవ్రత పెరిగింది. కొన్నిసార్లు రోజుకి నాలుగు సార్లు హెచ్చరికల ఆలారమ్‌లు మోగుతాయి. ఈ రోజు నేను నిద్రలేచే సమయానికే అలారం మోగుతోంది. మేం నివసించే ల్వీయు నగరం మీద అప్పటికే క్షిపణి దాడి మొదలైంది.
కొన్నిసార్లు బయట నడుస్తున్నప్పుడు మా తల మీదుగా ఎన్నో విమానాలు, హెలికాప్టర్లు వెళ్తుంటాయి. అప్పుడు మాకు చాలా ఆందోళనగా ఉంటుంది. అది భరించలేం. కరెంట్ కోసం ఈ మధ్యనే మేం ఇల్లు మారిపోయాం. ఇంతకముందు నెలకి రూ. 8,100 ($100) అద్దె కట్టేవాళ్లం. ఇప్పుడు అది దాదాపుగా రూ. 28, 600 ($350) అయ్యింది. జీవితంలో ప్రశాంతత అనేది లేకుండా పోయింది’’
ఇవి యుక్రెయిన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల అనుభవాలు.

ఫొటో సోర్స్, PIB

యుక్రెయిన్ నుంచి తమ రోజువారీ అనుభవాలను వీరు నాతో పంచుకున్నారు. గతేడాది యుద్ధం మొదలయ్యాక వీళ్ళని అక్కడ నుంచి భారతదేశానికి తరలించారు.
అయితే, భారత్‌కు వచ్చిన వారిలో 1,100 మందికి పైగా విద్యార్థులు తిరిగి యుక్రెయిన్ వెళ్ళిపోయారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
యుక్రెయిన్‌లో యుద్ధం మొదలయ్యాక భారత ప్రభుత్వం, ‘ఆపరేషన్ గంగా’ పేరుతో 23,000 మంది భారతీయులని (అందులో 18,000 మంది వైద్య విద్యార్థులు) యుక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారత్‌కు తీసుకొచ్చింది.
యుక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతున్నందున అక్కడ ఉన్న భారతీయులందరూ తక్షణమే యుక్రెయిన్‌ను విడిచి వెళ్లాలని ప్రభుత్వం తాజాగా సూచించింది.
అయితే, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ తమ చదువును పూర్తి చేయడానికి చాలా మంది విద్యార్థులు, తిరిగి యుక్రెయిన్ వెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది వైద్య విద్యార్థులు, యుక్రెయిన్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు అక్కడికి వెళ్లిన విద్యార్థుల మాటల ద్వారా మాకు తెలిసింది.

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్‌కి భారతీయ విద్యార్థులు ఎందుకు వెళ్తున్నారు?
ఈ విషయం అర్థం చేసుకోవడానికి బీబీసీ, గత కొన్ని వారాలుగా విద్యార్థులతో నిరంతంర మాట్లాడుతోంది.
ఇంతకుముందు యుక్రెయిన్‌కు వెళ్లి చదువుకున్న చాలా మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు ఇతర దేశాల విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్ తీసుకున్నారు. కానీ, చాలా మందికి వివిధ కారణాల వల్ల ఇది సాధ్యపడలేదు. అలాంటి విద్యార్థులే ఇప్పుడు తిరిగి యుక్రెయిన్ వెళ్తున్నారు.
ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న వైశాలి సేథియా అందులో ఒకరు. దిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్ నివాసి అయిన వైశాలి, పశ్చిమ యుక్రెయిన్‌లోని తెర్నోపిల్ జాతీయ వైద్య విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. ఆమెను క్యాంపస్‌లో కలిసి మాట్లాడాం.
మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? అని వైశాలిని అడిగాం.
“నేను 2021 డిసెంబర్‌లో యుక్రెయిన్‌లో వైద్య విద్య ప్రారంభించాను. చదువు మధ్యలో విశ్వవిద్యాలయాన్ని మార్చకూడదని 2021 నవంబర్‌లో భారత జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ప్రకటించింది. అంటే మేం చదువుతున్న డిగ్రీకి భారత్‌లో గుర్తింపు రావాలంటే అదే యూనివర్సిటీలో చదువు మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది.
అలాంటి పరిస్థితుల్లో మేం ఇక్కడ నుంచి ఎలా బయటపడగలం? మళ్ళీ మొదటి నుంచి చదువు ప్రారంభిస్తే తప్ప అది కుదరదు. ఇప్పుడు అలా చేస్తే నేను మళ్ళీ మొదటి సంవత్సరం చదవటమే కాకుండా అదనపు రుసుము కూడా చెల్లించాలి. మాకు అంత స్తోమత లేదు.
‘ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నారు?’ అని జనాలు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. కానీ, మా కారణాలు మాకు ఉన్నాయి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఇది నన్ను బాగా ఆందోళనకి గురి చేస్తోంది’’ అని ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Reuters
తల్లిదండ్రుల అసంతృప్తి
అయితే, ఎన్‌ఎంసీ పెట్టిన షరతు వర్తించని విద్యార్థుల సంగతి ఏంటి?
హరియాణాకు చెందిన ఆర్యన్, ప్రస్తుతం ల్వీయు జాతీయ వైద్య విశ్వవిద్యాలయం (ఎల్ఎన్ఎంయు) ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు.
భారత్‌తో పాటు నైజీరియా నుంచి కూడా తనలాగే చాలా మంది విద్యార్థులు తిరిగి యుక్రెయిన్‌కు చదువుకోవడానికి వచ్చారని ఆయన తెలిపారు.
“యుక్రెయిన్ నుంచి నేను వేరే చోటుకి బదిలీ అవ్వలేను. ఎందుకంటే అలా చేస్తే నేను మళ్లీ మొదటి నుంచి చదువాలి. అదనంగా డబ్బు చెల్లించాలి. మా కుటుంబానికి అంత తాహతు లేదు” అని ఆయన వివరించారు.
యుక్రెయిన్‌కు వెళ్లి చదువుకుంటానని తల్లిదండ్రులను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.
“వాళ్ళు ఏ మాత్రం సంతోషంగా లేరు” ఆయన తెలిపారు.

కోర్సు పూర్తి చేయడం గురించి ఆందోళన
యుక్రెయిన్‌కి తిరిగి వెళ్ళటమే కష్టం అనుకుంటే, యుద్ధ భూమిలో చదువు కొనసాగించటం ఎలా ఉంటుంది?
సృష్టి మోజెస్‌కి రోజులో ఏ మాత్రం సమయం దొరికినా డెహ్రాడూన్‌లో నివస్తున్న తన తల్లితండ్రులకు తప్పకుండా వీడియో కాల్ చేస్తారు.
“ఇంతకుముందు రోజుకు ఒకసారి ఫోన్ చేసేదాన్ని. ఇప్పుడు రోజుకు ఎన్ని సార్లు కుదిరితే అన్నిసార్లు చేస్తున్నా. మా నాన్నకు గుండె జబ్బు ఉంది. వాళ్లని ఆందోళనకి గురి చేయడం నాకు ఇష్టం లేదు. యుక్రెయిన్ గురించి ఎటువంటి వార్తలు చూసినా వాళ్ళు బాగా ఆందోళనకి గురి అవుతున్నారు” అని ఆమె చెప్పారు.
కీయెవ్‌లోని తరాస్ షెవ్‌చెంకో విశ్వవిద్యాలయంలో సృష్టి, ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఆమె తల్లి గృహిణి కాగా, తండ్రి పర్యాటక గైడ్. ఆమె కాలేజీ యాజమాన్యం పూర్తిస్థాయలో ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తోంది. తొందరలోనే ప్రత్యక్ష తరగతులు మొదలవుతాయని ఆమె చెప్పారు.
యుక్రెయిన్‌లోని పరిస్థితులు తన మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపినట్లు ఆమె తెలిపారు.
“చదువుతున్నప్పుడల్లా ఏవేవో ఆలోచనలు. ఇదంతా ఎందుకు చేస్తున్నామని కొన్నిసార్లు అనిపిస్తుంది. అసలు కోర్సును పూర్తి చెయ్యగలమా అనే అనుమానం కూడా తొలిచేస్తూ ఉంటుంది. ప్రభుత్వం ఆకస్మికంగా ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే మా కష్టం అంతా వృథాగా మారుతుందా అనే భయం కూడా ఉంది. ఇవన్నీ కాకుండా ఇక్కడ యుద్ధం జరుగుతోంది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
చలికాలంలో యుక్రెయిన్‌లో ఉష్ణోగ్రత మైనస్ పదిహేను డిగ్రీలకు పడిపోతుంది. యుక్రెయిన్‌లో విద్యుత్ వ్యవస్థల మీద రష్యా తరచుగా దాడులు చెయ్యటంతో హీటింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచెయ్యదు.
ప్రతి రోజు స్థానిక అధికారులు మరుసటి రోజు విద్యుత్ కోతల షెడ్యూల్ ఇస్తారని విద్యార్థులు మాకు చెప్పారు.
“రెండు మూడు గంటల విద్యుత్ సరఫరా, దాని తర్వాత రెండు మూడు గంటల కోతలు. ఇదే రోజువారీ షెడ్యూల్. ఇక్కడ ప్రతిదీ విద్యుత్తు మీద ఆధారపడి ఉంటుంది. వంట కూడా ఇండక్షన్ మీద చేసుకోవాల్సిందే. అందుకే మేం ఈ విద్యుత్తు సరఫరా షెడ్యూల్‌ని అనుసరించి మా పరికరాలని చార్జ్ చేసుకోవటం, స్టడీ మెటీరియల్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాం” అని సృష్టి తెలిపారు.

ప్రభుత్వ అనుమతులతోనే
తమతో పాటు యుక్రెయిన్‌కు తిరిగి వచ్చిన విద్యార్థులు మళ్ళీ భారత్‌కు వెళ్లిపోయారని ల్వీయులోనే చదువుతున్న శశాంక్ తెలిపారు.
రోజువారీ నిత్యావసరాల ధరలు కూడా యుద్ధం కారణంగా బాగా పెరిగాయి.
యూనివర్సిటీకి తాను రోజూ వెళ్లే బస్సు చార్జీ కూడా పెరిగిందని శశాంక్ తెలిపారు. నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయని చెప్పారు.
ప్రభుత్వ సూచనలను కాదని యుక్రెయిన్‌కు వెళ్తే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో తెలిసే మీరు యుక్రెయిన్‌కు వెళ్లారా? అని మేం కొంతమంది విద్యార్థులను అడిగాం.
“దీనికి మేం ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయ్యలేం. మా అంతట మేమే ఇక్కడికి వచ్చాం కాబట్టి అన్నింటికీ సిద్ధపడే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, ప్రభుత్వం మాకోసం ఏదైనా సహాయం చేయడం లేదా ప్రత్యామ్నాయాన్ని చూపించడానికి బదులుగా ఒక సలహాను మా మొహాన పడేసి చేతులు దులుపుకుంది కాబట్టి” అని సృష్టి అసహనం వ్యక్తం చేశారు.
“ఇక్కడ మా బాగోగులకి మేమే బాధ్యులమని మా తల్లితండ్రులకి స్పష్టంగా చెప్పాం. ఒకవేళ యుద్ధ తీవ్రత పెరిగితే సరిహద్దు దేశాల ద్వారా బయటపడే మార్గాలు చూస్తామని వారికి చెప్పి వచ్చాం’’ అని ఎల్ఎన్ఎంయులో అయిదో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న రిషి ద్వివేది తెలిపారు.
ప్రత్యక్ష తరగతులు, ఆసుపత్రులలో ప్రాక్టికల్ అనుభవం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రిషి అన్నారు. “మొదట కోవిడ్, తర్వాత ఈ యుద్ధం, ఆ తర్వాత అనేక ఇతర కారణాలు. వీటిన్నింటి వల్ల ప్రత్యక్ష తరగతులు జరగటం లేదు. ఇప్పుడు అవి మళ్ళీ మొదలవ్వడంతో సంతోషంగా ఉన్నా” అని ఆయన తెలిపారు.
2023 ఫిబ్రవరి 23న పార్లమెంట్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖని విద్యార్థులు తమ చదువులు పూర్తి చెయ్యటానికి యుక్రెయిన్ తిరిగి వెళ్ళటానికి అనుమతి ఉందా అని అడిగారు.
“విద్యార్థులు యుక్రెయిన్ తిరిగి వెళ్ళొచ్చు. అయితే యుక్రెయిన్‌లో భద్రతా పరిస్థితుల దృష్ట్యా యుక్రెయిన్‌ను విడిచిపెట్టమని భారత దేశ పౌరులకి సలహా ఇవ్వటం జరిగింది” అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జవాబు ఇచ్చింది.

భారత్‌లో పరిస్థితి
అకస్మాత్తుగా యుద్ధం వచ్చిన దేశంలో తమ పిల్లలు చిక్కుకుంటే తల్లడిల్లిన తల్లిదండ్రులు, ఇప్పుడు యుద్ధం జరుగుతున్న అదే ప్రాంతానికి మళ్లీ తమ పిల్లల్ని పంపించాలంటే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
“నా కూతురు డాక్టర్ కాకపోయినా మాకు ఇబ్బంది లేదు. కానీ, ఆమెను తిరిగి యుక్రెయిన్‌కు పంపడానిక నేను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోను’’ అని ఇప్పుడు పోలాండ్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో వైద్య విద్య అభ్యసిస్తున్న ఒక విద్యార్థిని తల్లి తండ్రులు తెలిపారు. వీరు దిల్లీలో నివసిస్తారు. ఈ విద్యార్థిని గతేడాది సురక్షితంగా యుక్రెయిన్ నుంచి బయటపడ్డారు.
తన కుమారుడు శశాంక్‌ని యుక్రెయిన్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు మృత్యుంజయ్ కుమార్ (53) చాలా ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నంలో ఆయన విఫలమయ్యారు.
“ఇంకొంత కాలం ఎదురుచూద్దాం. విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం తప్పక చర్యలు తీసుకుంటుందని నేను నా కుమారుడికి చెప్పాను. నేను చెప్పినట్లు తను కొంత కాలం ఎదురు చూశాడు. ఇంకా వేచి చూడటంలో అర్థం లేదు. తిరిగి యుక్రెయిన్ వెళ్ళాలి అని ఒక రోజు తన నిర్ణయాన్ని మాకు చెప్పాడు. నేను, నా భార్య మొదట్లో దానికి ఒప్పుకోలేదు. అయితే, ఇతర విద్యార్థులు కూడా తిరిగి వెళ్తున్నారు అని చెప్పటంతో చివరకు మేం ఒప్పుకున్నాం” అని ఆయన వివరించారు.
ఎంతో నెమ్మదిగా, ప్రశాంతంగా మాట్లాడే మృత్యుంజయ్ కుమార్ బిహార్ రాష్ట్రం పాట్నాలోని ఒక న్యాయస్థానంలో గుమస్తా. మా ముప్పై నిమిషాల ఇంటర్వ్యూలో ఆయన స్వరం ఒక్క సారి మాత్రమే పెరిగింది.
“నిజంగా ప్రభుత్వం తలుచుకుంటే ఈ విద్యార్థుల కోసం తగిన చర్యలు తీసుకోలేదా? ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. మాకు ఇంకో అవకాశం లేకుండా పోయింది” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తమ పిల్లాడి భద్రత గురించి తాము నిత్యం దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నామని మృత్యుంజయ్ కుమార్, ఆయన భార్య తెలిపారు. అలాగే ఎప్పటికప్పుడు ఫేస్ బుక్‌ను చూస్తుంటామని వారు చెప్పారు.
“నా కుమారుడు యుక్రెయిన్‌కు వెళ్లే ముందు నాకు ఫేస్‌బుక్‌లో ఒక అకౌంట్ క్రియేట్ చేసిపెట్టాడు. యుద్ధం మొదలయినప్పటి నుంచి నేను ఫేస్‌బుక్ చాలా ఎక్కువగా వాడుతున్నా. చాలా విషయాలు నాకు అర్థం కావు. నిజమే, కానీ, ఇప్పుడిప్పుడే కొన్ని అర్థం అవుతున్నాయి” అని ఆయన తెలిపారు.
ఆయన భార్య నీలం కుమారి గృహిణి. వార్తల కోసం టీవీ చూస్తుంటారు. “టివీ చూడొద్దు, అందులో అన్నీ అతి చేసి చూపిస్తున్నారు అని శశాంక్ నాకు చెప్పాడు. అయినా కూడా నేను చూస్తూనే ఉన్నా’’ అని ఆమె మాతో అన్నారు.
భాష కూడా అర్థం కానీ చిన్న చిన్న దేశాల్లో వైద్య విద్య చదువడం కోసం భారతీయ విద్యార్థులు వెళ్తున్నారని 2022 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన విషయాన్ని మృత్యుంజయ్ ప్రస్తావించారు.
“వైద్య విద్య, భారత దేశంలో చదవటమే ఉత్తమం. ఇక్కడి ప్రభుత్వ కళాశాలలో ఫీజులు మిగతా చోట్లతో పోల్చుకుంటే తక్కువే. అయితే, ప్రభుత్వ కళాశాలలో ప్రవేశం లభించకపోతే ప్రైవేటు కళాశాలలో చదవాలి. అప్పుడు ఆరు సంవత్సరాలకి రూ. 72 లక్షల ఖర్చు అవుతుంది. అదే, యుక్రెయిన్‌లో అయితే రూ. 25 లక్షలతో అయిపోతుంది. ఇది కట్టడం కూడా అంత తేలిక కాదు’’ అని మృత్యుంజయ్ అన్నారు.
టిఎన్ఎంయులో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న దీపక్ కుమార్ (24) కూడా గతేడాది సురక్షితంగా అక్కడ నుంచి బయట పడ్డారు. అయితే, ఆయన తిరిగి యుక్రెయిన్ వెళ్ళలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఆయన తిరిగి యుక్రెయిన్ వెళ్లేందుకు ఒప్పుకోలేదు.

వెక్కిరింపులు
దీపక్ కుమార్, బిహార్‌లోని దర్భంగ నివాసి. భారత్‌లోని ప్రైవేటు కళాశాలల్లో దీపక్‌కు ప్రవేశం లభించేదే కానీ ఖర్చు రీత్యా ఆయన యుక్రెయిన్‌కు వెళ్లేందుకు మొగ్గు చూపారు.
“మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. యుక్రెయిన్‌లో చదవటానికి అవసరమైన డబ్బులు కూడా లేవు. మా నాన్న, మాకున్న భూమిలో కొంత భాగం అమ్మి నా చదువు కోసం ఫీజు చెల్లించారు.’’
యుక్రెయిన్ నుంచి సురక్షితంగా భారత్‌కు వచ్చాక తన లాంటి వైద్య విద్యార్థులకు సహాయం చేయాలని కోరుతూ దిల్లీలో మంత్రులని, ప్రజా ప్రతినిధులని దీపక్ కుమార్ కలిశారు.
“ఎవరూ సహాయం చెయ్యకపోవడంతో సుప్రీం కోర్టుని ఆశ్రయించాం. అయితే, అక్కడ కూడా మాకు న్యాయం లభించడంలో ఆలస్యమే జరిగింది” అని దీపక్ కుమార్ తెలిపారు.
తన లాంటి విద్యార్థుల కష్టాలని అందరికీ తెలియచెప్పటానికి ఆయన ఇప్పుడు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రత్యేక పేజీలను నడుపుతున్నారు.
భారత్‌లోనే ఉండిపోవటంతో యుద్ధం నుంచి దీపక్ బయటపడ్డారు. కానీ, ప్రతిరోజూ మానసిక యుద్ధం చేస్తున్నారు.
“మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎటు చూసినా అడ్డంకులే. మా చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని వెక్కిరిస్తున్నారు. డాక్టర్ అవ్వాలనే పెద్ద పెద్ద కలల్ని కన్నామంటూ అపహాస్యం చేస్తున్నారు. వారికి నేనేమీ బదులు ఇవ్వను. వాళ్లను పట్టించుకోను. అలాంటి వారితో పెద్దగా మాట్లాడను.
నా పరిస్థితిని ఎంతమందికి వివరించగలను? మా బంధువుల ఇళ్ళకి వెళ్ళటం కూడా మానేశాను. నా గదిలోనే ఉంటాను. చదువుకుంటాను. బాల్కనీలోకి వెళ్లి కాస్త సమయం గడుపుతాను. అంతే. ఆనందం, సంతోషం లాంటివి మర్చిపోయాను. నాకన్నా ఎక్కువగా నా కుటుంబ సభ్యులు అవమానాలను ఎదుర్కొంటున్నారు. వాళ్లు చాలా కష్టపడుతున్నారు” అని దీపక్ చెప్పారు.
యుద్ధం నేపథ్యంలో వైద్య విద్యార్థులు, గతేడాది యుక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చినప్పుడు వారి భవిష్యత్తుపై ప్రశ్నలు వచ్చాయి.
2022 మార్చ్ 14న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ “వారిని వైద్యులుగా చెయ్యటానికి భారత ప్రభుత్వం చెయ్యాల్సిందంతా చేస్తుంది” అని అన్నారు.
అలా వచ్చిన విద్యార్థులను దేశంలోని మెడికల్ కాలేజీలలో చేర్చుకోవాలని, తద్వారా వారు వైద్య విద్యను పూర్తి చెయ్యలగరని తెలుపుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ప్రభుత్వానికి సూచించింది.
విద్యార్థులు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, PIB
ప్రభుత్వం నుంచి స్పందన లేదు
‘‘యుద్ధం నుంచి మమ్మల్ని రక్షించడానికి ఇంత చేసిన ప్రభుత్వం, మా చదువుల విషయంలో మమ్మల్ని వదిలెయ్యదని మేం భావిస్తూ వచ్చాం. మాకు ఏదైనా సహాయం చేస్తుందని మేం అనుకున్నాం. అందుకే మేం వెనక్కి వచ్చినప్పటి నుంచి జూలై వరకు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూశాం. కొంతమంది విద్యార్థులు సుప్రీం కోర్టుని కూడా ఆశ్రయించారు. అయితే, మా ఆశలు సన్నగిల్లటం మొదలుపెట్టాయి. ఇంకా ఎక్కువ కాలం ఆలస్యం చేస్తే యుక్రెయిన్‌లో మా డిగ్రీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే తరగతులు తిరిగి ప్రారంభం అయ్యాయి. అందుకే ఆగస్ట్‌లో యుక్రెయిన్‌కు తిరిగి వెళ్ళటానికి నేను నిర్ణయించుకున్నాను” అని సృష్టి తెలిపారు.
సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండగానే 2023 ఫిబ్రవరి 10న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించింది. “మొత్తం 3,964 మంది భారత దేశ వైద్య విద్యార్థులు, యుక్రెయిన్‌లోనే వేరే వైద్య కళాశాలకి శాశ్వత ప్రాతిపదికన బదిలీ అవ్వటానికి అనుమతి కోరారు. అలాగే ఇంకొక 170 మంది వేరే దేశాలలో ఇతర కళాశాలలకి తాత్కాలిక ప్రాతిపదికన బదిలీ అయ్యారు” అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
యుక్రెయిన్ నుంచి వేరే దేశపు కళాశాలకి బదిలీ అవ్వటం కుదరని వైశాలి లాంటి విద్యార్థుల గురించి, వేరే కళాశాలలకి బదిలీ అవ్వటానికి ఆర్థిక వనరులు లేని సృష్టి లాంటి విద్యార్థుల పరిస్థితి గురించి కేంద్ర మంత్రిత్వ శాఖ, ఎన్ఎంసీలను బీబీసీ సంప్రదించింది.
ఎన్నిసార్లు అడిగినా వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
యుక్రెయిన్‌లో ప్రస్తుత భారత విద్యార్థుల సంఖ్య గురించి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి, కీయెవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి పంపిన ప్రశ్నలకి కూడా సమాధానం లభించలేదు.
మొరాకో, నైజీరియా, పాకిస్తాన్ లాంటి దేశాలలో యుక్రెయిన్‌లో ఉండిపోయిన తమ విద్యార్థుల విషయంలో తీసుకున్న చర్యలు మిశ్రమమైనవి. అనిశ్చితి యుద్ధ పరిస్థితులు ఈ విషయాన్ని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి.
భారత ప్రభుత్వం నుంచి మీరింకా ఆశిస్తున్నారా అని నేను విద్యార్థులను అడిగాను.
“ఆ యుద్ధానికి మేం కారణం కాదు. ఒకవేళ మా కోసం పూర్తి స్థాయి చర్యలు చేపట్టకపోయినా, కనీసం మేం యుక్రెయిన్ కళాశాలలకి సంబంధించి ఆన్లైన్ తరగతులకి హాజరు అవుతూ, ఇక్కడే ఇంటర్న్‌షిప్ లేదా ప్రాక్టికల్ తరగతులు చేసుకునే సౌకర్యం కల్పించాలి. అయితే, ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు” అని శశాంక్ తెలిపారు.
భారత ప్రభుత్వ చర్యలు ఎన్నికలతో ముడిపడి ఉంటాయని దీపక్ తెలిపారు.
“అక్కడ యుద్ధం మొదలైనప్పుడు ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. వెనక్కి తిరిగి వచ్చాక , ఎన్నికలు ఉండటంతో మాకు సహాయం లభించిందని విద్యార్థులు చెప్పారు. వాళ్ళు అలా అన్నప్పుడు నేను నమ్మలేదు. అయితే, ఇప్పుడు మా పరిస్థితి చూడండి. 2024 లోక్‌సభ ఎన్నికలు 2022 లేదా 2023లో జరిగి ఉంటే కనుక ప్రభుత్వం మా డిగ్రీలు మాకు లభించేలా చర్యలు తీసుకునేది. మమ్మల్ని వెనక్కి తీసుకువచ్చే కార్యక్రమం పేరు ‘ఆపరేషన్ గంగా’ అని పెట్టారు. ఇప్పుడు మా పరిస్థితి చూస్తే గంగా నది వ్యతిరేక దిశలో పారింది అని చెప్పాలి.”
గత సంవత్సరం యుద్ధం మొదలయ్యాక 22 సంవత్సరాల నవీన్ జ్ఞానగౌడర్ అనే భారతీయ విద్యార్థి యుక్రెయిన్‌లో బాంబుల దాడిలో చనిపోయారు. ఆయన సరుకులు కొనటానికి బయటకు వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది.
యుక్రెయిన్‌కి తిరిగి వెళ్ళిన 1,100 మంది విద్యార్థుల కష్టాలు తీరుతాయా? లేక వారు కూడా ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుందా?
ఇవి కూడా చదవండి:
- అమెరికా ఆశలు చూపించి బాలి తీసుకెళ్లి బంధించారు.. భారతీయులను కిడ్నాప్ చేస్తున్న ఇండొనేసియా ముఠా
- ఆస్కార్ 2023 : ఈ అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది?
- ‘ప్రార్థనల కోసం డబ్బులు చెల్లించి అప్పుల పాలయ్యాను, అద్భుతం జరిగేదెప్పుడు?’
- BBC She: మహిళలు ఎలాంటి వార్తలను ఇష్టపడతారు?
- దిల్లీ మద్యం కేసు: కవితను 9 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ.. 16న మళ్లీ విచారణకు పిలుపు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















