ఆస్కార్ 2023 : ఈ అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది?

ఫొటో సోర్స్, RRR
- రచయిత, ఆలమూరు సౌమ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రస్తుతం భారత్‌లో అందరి నోట నానుతున్న మాట ఆస్కార్. మార్చి 12 సాయంత్రం (భారత్‌లో 13న ఉదయం) అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ 2023 అవార్డులను ప్రకటిస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ సినిమా పాట ఇదే. అందుకే, ఈ 95వ ఆస్కార్ వేడుక కోసం భారతీయులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట పాడేందుకు సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ అమెరికా చేరుకున్నారు. రాజమౌళి, కీరవాణి సహా ఆర్ఆర్ఆర్ టీమ్ లాస్ ఏంజిల్స్‌లో ఉంది.
నాటు నాటు పాటకు ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ వచ్చాయి. ఈ రెండు అవార్డులు గెలుచుకున్న సినిమా కచ్చితంగా ఆస్కార్ కొడుతుందని చరిత్ర చెబుతోంది. మరికొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.
ఏటా ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఒక ఉత్సవంలా జరుగుతుంది. పోటీకి సినిమాలను పంపడం మొదలుకుని, అవార్డుల ప్రదానోత్సవం వరకు ఆస్కార్ అవార్డులకు సంబంధించిన వార్తలు పతాక శీర్షికల్లో నిలుస్తుంటాయి.
మరి, ఎందుకు ఆస్కార్ అవార్డులకు అంత విలువ? హాలీవుడ్ సినిమాలు, అంటే అమెరికన్ సినిమాలకే ప్రత్యేకమైన ఈ అవార్డుకు ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఎలా వచ్చింది?

ఫొటో సోర్స్, AFP
ఆస్కార్ అవార్డులు పుట్టుక
అకాడమీ అవార్డులనే ఆస్కార్ అవార్డులు అంటారు. అకాడమీ అవార్డులకు ఆస్కార్ అనే పేరు ఎలా వచ్చిందన్న దానిపై ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి.
అకాడమీ అవార్డుల పుట్టుపూర్వోత్తరాల గురించి వాళ్ల అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం, 1927లో హాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మెట్రో-గోల్డ్‌విన్-మేయర్ (ఎం-జీ-ఎం) చీఫ్ లూయిస్ బీ మేయర్ ఇంట్లో ఓ సాయంత్రం విందు భోజన సమయంలో అకాడమీ అవార్డుల ఆలోచనకు పునాది పడింది. చలనచిత్ర పరిశ్రమకు ప్రయోజనం చేకూరేలా ఒక వ్యవస్థీకృత సమూహాన్ని సృష్టించాలని లూయిస్ మేయర్, విందుకు వచ్చిన అతిథులతో చర్చించారు. ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ అంటే అమెరికా చలనచిత్ర పరిశ్రమ అని గుర్తుంచుకోవాలి.
ఇది జరిగిన ఒక వారం తరువాత, సినిమా పరిశ్రమలోని అన్ని సృజనాత్మక శాఖల నుంచి 36 మంది ఆహ్వానితులు లాస్ ఏంజెల్స్ అంబాసిడర్ హోటల్‌లో సమావేశమయ్యారు. వారంతా కలిసి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS)ను స్థాపించే ప్రతిపాదనపై చర్చించారు.
ఏ మాత్రం ఆలస్యం కాకుండా ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. ఈ ఆర్గనైజేషన్‌లో చేర్చాల్సిన అంశాల గురించి ఆర్టికల్స్ సమర్పించారు. అకాడమీ బోర్డు ఏర్పాటైంది. సభ్యులను ఎన్నుకున్నారు. డగ్లస్ ఫెయిర్‌బ్యాంక్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1928లో అకాడమీ బోర్డు ఏర్పాటు చేసిన తొలి కమిటీలలో 'అవార్డ్ ఆఫ్ మెరిట్' ఒకటి. ఏడుగురు సభ్యులున్న ఈ కమిటీ, 12 విభాగాల్లో అవార్డులు అందజేయాలని బోర్డుకు సూచించింది.
1929 మే 16న మొట్టమొదటి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రూజ్‌వెల్ట్ హోటల్‌లోని బ్లోసమ్ రూమ్‌లో జరిగిన ఈ వేడుకకు 270 మంది హాజరయ్యారు. అప్పటికి మూడు నెలల క్రితమే అవార్డుల విజేతలను ప్రకటించారు.
ఆ తరువాతి సంవత్సరం, విజేతల పేర్లను ముందే ప్రకటించకుండా అవార్డుల ప్రదానోత్సవం వరకు గోప్యంగా ఉంచారు. అయితే, వేడుక రోజు రాత్రి 11.00 గంటలకల్లా వార్తాపత్రికల్లో ప్రచురించేందుకు వీలుగా మీడియా సంస్థలకు విజేతల పేర్లను ముందే పంపించారు.
1940 వరకు ఈ పద్ధతి కొనసాగింది. ఆ సంవత్సరం లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రిక సాయంత్రం ఎడిషన్‌లోనే విజేతల పేర్లను ప్రచురించింది. దాంతో, ఆ సాయంత్రం అవార్డుల వేడుకకు వచ్చే అతిథులకు విజేతలెవరో ముందే తెలిసిపోయింది.
అప్పటినుంచి విజేతల పేర్లను కవర్‌లో పెట్టి సీల్ వేసే పద్ధతి ప్రారంభమైంది. అవార్డుల ప్రదానోత్సవం రోజు వేదికపై ప్రకటించేవరకు విజేతల పేర్లు గోప్యంగానే ఉంటాయి. ఇప్పటికీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు.
విజేతల వివరాలను గోప్యంగా ఉంచడం అనే ప్రక్రియ ఉత్సుకత రేకెత్తించింది. ఈ పద్ధతి మొదలైన రెండో ఏడాది లాస్ ఏంజిల్స్ టైమ్స్ అకాడమీ అవార్డుల వేడుకను రేడియోలో ప్రత్యక్ష ప్రసారం చేసింది.
1953 నుంచి అకాడమీ అవార్డుల వేడుకను టీవీలో ప్రసారం చేయడం ప్రారంభించారు. 1966లో తొలిసారిగా కలర్ టీవీలో అకాడమీ అవార్డుల ప్రత్యక్ష ప్రసారం జరిగింది.
1969 నుంచి అకాడమీ అవార్డులను అంతర్జాతీయంగా ప్రసారం చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం 200లకు పైగా దేశాల్లో అకడమీ అవార్డుల ప్రసారం జరుగుతోంది.
ప్రస్తుతం, హాలీవుడ్ సినిమాలకు 24 విభాగాల కింద అకాడమీ అవార్డులు ఇస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫారిన్ కేటగిరీని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1947 వరకు అంటే అకడమీ అవార్డులు ఇవ్వడం మొదలెట్టిన దాదాపు 20 ఏళ్ల వరకు ఇందులో విదేశీ చిత్రాల విభాగం లేనేలేదు. కేవలం హాలీవుడ్ సినిమాలను మాత్రమే అవార్డులను అందిస్తూ వచ్చారు.
1947లో తొలిసారిగా 'షూ-షైన్' అనే ఇటాలియన్ సినిమాకి విదేశీ చిత్రాల విభాగంలో అవార్డును అందించారు. తరువాతి సంవత్సరాలలో మరో ఏడు విదేశీ చిత్రాలకు స్పెషల్ కేటగిరీ కింద అకాడమీ అవార్దులు అందించారు.
1956 నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది పరభాషా చిత్రం (ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్) విభాగం కింద విదేశీ చిత్రాలకు అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు.
2019 వరకు ఈ విభాగాన్ని 'బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్' అని పిలిచేవారు. 2020లో దీని పేరును 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్'గా మార్చారు.

ఫొటో సోర్స్, RAJMOULI/TWITTER
విదేశీ చిత్రాల ఎంట్రీకి నిబంధనలు ఏమిటి?
అంతర్జాతీయ చిత్రాలు ఆస్కార్ బరిలోకి దిగాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
- చిత్రాలు 40 నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉండాలి.
- అమెరికా బయట వాటిని నిర్మించాలి.
- ఇంగ్లిష్ కాకుండా వేరే భాషా చిత్రాలు అయుండాలి.
- ఏనిమేటెడ్ చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలను కూడా పోటీకి పంపించవచ్చు.
- ఇంగ్లిష్ భాషలో సబ్‌టైటిల్స్ ఇవ్వాలి.
- ఒక దేశం నుంచి అధికారికంగా ఒక సినిమాను మాత్రమే అకాడమీ అవార్డుల పోటీకి పంపించాలి. (ఇది కాకుండా, నిబంధనలకు లోబడి ఉన్న ఏ సినిమా అయినా ఆస్కార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.)
ఇవే కాక, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఎంట్రీకి అదనపు నిబంధనలు, ప్రత్యేక నిబంధనలు కూడా ఉంటాయి. అవి కాలానుగుణంగా మారుతుంటాయి. ఉదాహరణకు 2017 ఆస్కార్ అవార్డుల నిబంధనల్లో థియేటర్‌లో రిలీజ్ చేసిన సినిమాలను మాత్రమే ఆస్కార్ నామినేషన్‌కు పంపాలని ఉంది. కానీ, 2023 నిబంధనలలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైన సినిమాని కూడా పోటీకి పంపించవచ్చు.
అంతర్జాతీయ చిత్రాలకు 2023 నిబంధనలు ఇలా ఉన్నాయి..
- థియేటర్లలో లేదా పేరున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమా ఆడి ఉండాలి.
- సినిమా తీసిన దేశంలో విడుదల కాకపోయినా, ఇతర దేశాల్లో విడుదలైనా ఎంట్రీకి పంపొచ్చు. కాకపోతే కనీసం వారం రోజులు వరుసగా సినిమా ఆడి ఉండాలి.
- కనీసం వారం రోజులు వరుసగా థియేటర్లలో సినిమా ఆడి ఉండాలి. ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్‌లకు లాభాలు వచ్చి ఉండాలి.
- 35ఎమ్‌ఎమ్ లేదా 70ఎమ్ఎ ఫిలిం అయి ఉండాలి.
- 24 లేదా 48 ఫ్రేమ్స్ ప్రొగ్రెసివ్ స్కాన్ డిజిల్ సినిమా ఫార్మెట్‌లో ఉండాలి.
- కనీసం 2048x1080 రెజల్యూషన్ ఉండాలి.
- థియేటర్లలో విడుదల కాకముందే... టీవీ, డీవీడీ, ఆన్‌లైన్, ఇన్‌ఫ్లైట్ ఎయిర్‌లైన్ డిస్ట్రిబ్యూషన్, నాన్-థియేటర్ పబ్లిక్ ఎగ్జిబిషన్... వంటి రూపంలో సినిమాను ప్రదర్శించకూడదు.
- సినిమా తీసిన దేశం తప్పనిసరిగా క్రియేటివ్ హక్కులను ధ్రువీకరించాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్కార్ ఎందుకింత ఫేమస్?
ఇది కేవలం హాలీవుడ్ సినిమాలను ఇచ్చే అవార్డు అయినప్పటికీ ఆస్కార్‌కు ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఎలా వచ్చింది?
సుదీర్ఘకాలంగా, దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా స్థిరంగా ఈ అవార్డులను అందించడం, ఎప్పటికప్పుడు స్థాయిని మెరుగుపరుచుకుంటూ, ఒక క్రమపద్ధతిలో ఓ గొప్ప వేడుకలా నిర్వహించడం ఒక కారణం కావచ్చు.
ఆస్కార్ వేడుక ఇప్పటి యువతరానికి చేరువ అయ్యేలా అకాడమీ ప్రయత్నాలు చేస్తోందని బీబీసీ ఎంటర్టైన్మెంట్ రిపోర్టర్ స్టీవెన్ మెచ్ఇంటోష్ గతంలో అన్నారు.
అలాగే, గత శతాబ్ద కాలంలో అమెరికా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ ప్రపంచ పటంలో పెద్ద దేశంగా అవతరించింది. అమెరికాలో జరిగే ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరగడం అన్ని రంగాల్లో కనిపించింది. అదే కోవలో ఆస్కార్ అవార్డులు కూడా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందాయి అనుకోవచ్చు.
అయితే, ఆస్కార్ అవార్డుల మీద విమర్శలూ ఉన్నాయి. "ఆస్కార్స్ ఆర్ సో వైట్" అన్న విమర్శ తరచుగా వినిపిస్తూ ఉంటుంది. 2016లో #OscarsSoWhite అనే హ్యాష్‌ట్యాగ్ ఉద్యమం కూడా నడిచింది. అకాడమీ అవార్డులు తెల్లజాతీయులకే ప్రాధాన్యం ఇస్తాయని, జాతి వివక్ష ఆస్కార్‌కూ తప్పలేదనే వాదనలు ఉన్నాయి.
అలాగే, మన దేశంలో కమల హాసన్ ఆస్కార్ గురించి మాట్లాడుతూ, అది ప్రపంచస్థాయి అవార్డు కాదని, దాని కోసం మనం వెంపర్లాడక్కర్లేదని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇండియన్ మూవీస్ - ఆస్కార్ అవార్డ్స్
ఇప్పటివరకు భారతదేశం నుంచి ఒక్క సినిమాకు కూడా ఆస్కార్ అవార్డు రాలేదు. అయితే, ఇప్పటికి వరకు అయిదుగురు భారతీయులకు ఆస్కార్ అవార్డు లభించింది.
1982లో కాస్ట్యూం డిజైనర్ భాను ఆతియా 'గాంధీ' సినిమాకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్నారు.
1992లో బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రేకు 'ఆస్కార్ ఫర్ లైఫ్‌టైం అచీవ్మెంట్' అవార్డు అందించారు.
2009లో ఉత్తమ సంగీత దర్శకుడిగా (స్లమ్ డాగ్ మిలియనీర్) ఏఆర్ రెహ్మాన్, ఉత్తమ సౌండ్ మిక్సింగ్‌కు (స్లమ్ డాగ్ మిలియనీర్) రసూల్ పూకుట్టి, ఉత్తమ గేయ రచయితగా గుల్జార్ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు.
ఆస్కార్ అవార్డుల వేడుకకు భారతదేశం నుంచి సెలబ్రిటీలకు ఆహ్వానం అందుతుంటుంది. 1987లో ఆస్కార్‌కు ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి దక్షిణ భారత భాషా చలనచిత్ర నటుడు చిరంజీవి.
గత ఏడాది తమిళ నటుడు సూర్య, హిందీ నటి కాజోల్ ఆహ్వానం అందుకున్నారు.
తాజాగా, ఆస్కార్ 2023 వేడుకలో ప్రెజెంటర్‌గా దీప్తి పడుకొనేకు ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అలాగే తమిళ నటుడు సూర్య ఆస్కార్ 2023 అవార్డుల ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకున్నట్టు వెల్లడించారు. 95వ ఆస్కార్ ఫైనల్స్‌లో ఓటు వేసినట్టు తెలిపే స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నారు.

ఫొటో సోర్స్, TWITTER
'నాటు నాటు ఒక పాట కాదు.. కథ'
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైనప్పటి నుంచి నాటు నాటు పాట అంతర్జాతీయ స్థాయిలో అందరినీ ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచంలోని నలుమూలల నుంచి అభిమానులు ఆ పాటకు స్టెప్పులేశారు. ఇన్‌స్టాగ్రాంలో నాటు నాటు రీల్స్ హోరెత్తించాయి. ఈ పాట రాసింది గేయ రచయిత చంద్రబోస్ కాగా, సంగీతం సమకూర్చింది కీరవాణి.
"నాటు నాటు కేవలం ఒక పాట కాదని, ఆర్ఆర్ఆర్ సినిమా కథను 10 నిమిషాల్లో చెప్పే ఆటపాటల సన్నివేశమని" రాజమౌళి వానిటీ ఫైర్ ఛానెల్‌తో చెప్పారు.
ఇద్దరు స్వతంత్ర సమరయోధులు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడే కల్పిత కథ ఆర్ఆర్ఆర్. ఈ వీరులిద్దరూ ఆట, పాట ద్వారా ఒక బ్రిటిష్ అధికారిని మోకాళ్లపై కూలదోసే పోరాట సన్నివేశమే నాటు నాటు పాట అని రాజమౌళి వివరించారు. ఈ పాటే ఒక కథ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా ఆశలు చూపించి బాలి తీసుకెళ్లి బంధించారు.. భారతీయులను కిడ్నాప్ చేస్తున్న ఇండొనేసియా ముఠా
- H3N2 వైరస్ ఎంత ప్రమాదకరం? ఇది సోకితే కనిపించే లక్షణాలేమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?
- బిహార్‌లో ఘోరం: ఆరేళ్ల పాపపై గ్యాంగ్ రేప్, అడ్డుకున్న పదేళ్ల బాలిక బుగ్గను ‘కుక్క కొరికినట్లు కొరికారు’ - గ్రౌండ్ రిపోర్ట్
- తాలిబాన్లు జైల్లో బంధించిన అఫ్గాన్ సిస్టర్స్ పారిపోయి జర్మనీ ఎలా చేరుకున్నారు?
- మహారాష్ట్ర: రాట్నం ఉపయోగిస్తూ ప్లాస్టిక్ వ్యర్థాల ‘రీచర్ఖా’














