బేసిక్ ఇన్‌స్టింక్ట్‌ సినిమాలో నా పాత్ర.. నా కొడుకును నాకు దూరం చేసింది: షారన్ స్టోన్

బేసిక్ ఇన్‌స్టింక్ట్ సినిమాలో షారన్ స్టోన్

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, 1992లో విడుదలైన బేసిక్ ఇన్‌స్టింక్ట్ సినిమాలో షారన్ స్టోన్
    • రచయిత, బ్రాండన్ డ్రెనాన్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్

ప్రఖ్యాత హాలీవుడ్ నటి షారన్ స్టోన్.. బేసిక్ ఇన్‌స్టింక్ట్ సినిమాలో తన పాత్ర కారణంగా తన కుమారుడు తనకు దూరమయ్యాడని చెప్పారు.

ఆమె తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో ఈ విషయం వెల్లడించారు.

1992లో విడుదలైన బేసిక్ ఇన్‌స్టింక్ట్ సినిమాలో పాత్ర తన పట్ల అభిప్రాయాలను కుచించుకుపోయేలా చేసిందని షారన్ పేర్కొన్నారు.

ఆ పాత్ర కారణంగా 2004లో తన కుమారుడిని తన కస్టడీకి అప్పగించటానికి నిరాకరించారని చెప్పారు.

‘‘మీ అమ్మ సెక్స్ సినిమాల్లో నటిస్తారని నీకు తెలుసా?’’ అని జడ్జి అప్పుడు తన నాలుగేళ్ల కొడుకుని ప్రశ్నించారని షారన్ గుర్తు చేసుకున్నారు.

ఆ సినిమాలో తాను కొన్ని క్షణాల పాటు నగ్నంగా కనిపించిన ఒక సన్నివేశం పట్ల తీవ్ర విమర్శలు రావటంతో.. ఆ తర్వాత ఆ తరహా పాత్రలకు దూరంగా ఉన్నట్లు ఆమె వివరించారు.

బేసిక్ ఇన్‌స్టింక్ట్ సినిమాలో షారన్ స్టోన్, మైఖేల్ డగ్లస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బేసిక్ ఇన్‌స్టింక్ట్ సినిమాలో షారన్ స్టోన్‌, మైఖేల్ డగ్లస్ నటించారు

షారన్ స్టోన్, అప్పటి ఆమె భర్త రాన్ బ్రాన్‌స్టీన్‌లు 2000 సంవత్సరంలో తమ కుమారుడు రోవాన్‌ను దత్తత తీసుకున్నారు. షారన్, బ్రాన్‌స్టీన్‌లు 2004లో విడిపోయారు.

ఆ సమయంలో వారి దత్తపుత్రుడు రోవాన్ కస్టడీని బ్రాన్‌స్టీన్‌కు అప్పగిస్తూ కేసు విచారించిన జడ్జి తీర్పు చెప్పారు.

ఆ విధంగా తన కుమారుడికి దూరం కావటం తన గుండెను పిండేసిందని షారన్ స్టోన్ తెలిపారు.

టేబుల్ ఫర్ టు పాడ్‌కాస్ట్‌లో హోస్ట్ బ్రూస్ బాజీతో మాట్లాడుతూ ఆమె ఈ విషయాలు వెల్లడించారు.

‘‘నా గుండెలో ఎగువ, దిగువ భాగాల్లో గుండె కొట్టుకోవటం పెరిగిపోయింది. దీంతో నేను ఆస్పత్రి పాలయ్యాను. మేయో క్లినిక్‌లో చేరాల్సి వచ్చింది. ఆ ఉదంతంతో నా గుండె ముక్కలైంది’’ అని షారన్ వివరించారు.

మైఖేల్ డగ్లస్, షారన్ స్టోన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బేసిక్ ఇన్‌స్టింక్ట్‌ సినిమాలో మైఖేల్ డగ్లస్, షారన్ స్టోన్ లవర్స్‌గా నటించారు

ప్రస్తుతం టీవీల్లో ఎంతగా సెక్స్, న్యూడిటీ కనిపిస్తున్నాయనేది చూస్తే.. నాటి తన హిట్ సినిమాలో తను పోషించిన పాత్ర తర్వాత తన పట్ల వ్యవహరించిన తీరు చాలా కిరాతకంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

‘‘ఆ పాత్రలో ఒకవేళ నేను నగ్నంగా కనిపించాననుకున్నా.. అది ఒక సెకనులో 16వ వంతు మాత్రమే ఉండొచ్చు. దాని కారణంగా నా కొడుకు నాకు దూరమయ్యాడు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బేసిక్ ఇన్‌స్టింక్ట్ కథ శృంగార భరత థ్రిల్లర్‌గా సాగుతుంది. అందులో నవలా రచయిత క్యాథరీన్ ట్రామెల్ పాత్రను షారన్ స్టోన్ పోషించారు. పోలీస్ డిటెక్టివ్ పాత్రలో మైఖేల్ డగ్లస్ నటించారు. నవలా రచయిత ఆ పోలీస్ డిటెక్టివ్‌ను వశపరుచుకుంటారు.

ఆ పాత్ర పోషించినందుకు తనను హాలీవుడ్‌లో ఇతరులు తన పట్ల దురభిప్రాయాలు వ్యక్తంచేశారని షారన్ పేర్కొన్నారు.

షారన్ స్టోన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1990లలో హాలీవుడ్‌ అగ్రతారల్లో షారన్ స్టోన్ ఒకరు

‘‘ఆ సినిమాలో పాత్రకు గాను నేను గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయ్యాను. నేను గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు కార్యక్రమానికి వెళ్లాను. వేదిక మీద నుంచి వాళ్లు నా పేరు పిలిచినపుడు అక్కడున్న కొంత మంది నవ్వారు’’ అని ఆమె గుర్తుచేసుకున్నారు.

‘‘నాకు చాలా అవమానకరంగా అనిపించింది. ఆ పాత్ర పోషించటం ఎంత కష్టమో ఎవరికైనా ఏమాత్రమైనా తెలుసా? అది ఎంత భయంగొలిపేలా ఉంటుందో, కడుపులో ఎంతగా తిప్పేస్తుందో వీరికి ఏమైనా అర్థమవుతుందా?’ అని నాకు అనిపించింది’’ అని చెప్పారామె.

ఆ తర్వాతి నుంచి తాను మహిళలను లైంగిక కోణంలో కానీ, చెడు వ్యక్తిత్వంతో కానీ చూపించే పాత్రలు చేయటం లేదని షారన్ తెలిపారు.

అయితే అభిమానులు నటులను, వారు నటించే పాత్రలను ఒకటిగా చూడకూడదని.. వారిద్దరూ వేర్వేరనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని ఆమె పేర్కొన్నారు.

అమెరికన్ సీరియల్ కిల్లర్ కథతో రూపొందించిన సినిమాలో సీరియల్ కిల్లర్ ‘‘జెఫ్రీ డామర్ పాత్ర పోషించిన వ్యక్తి.. నిజంగా మనుషులను తినే మనిషి అని ఎవరూ అనుకోరు. అతడు చాలా చాలా కష్టమైన పనిని చేసిన సంక్లిష్టమైన వ్యక్తి అవుతాడు’’ అని షారన్ ఉటంకించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)