జానీ డెప్‌కు డబ్బులిచ్చి పరువు నష్టం కేసును సెటిల్ చేసుకున్న మాజీ భార్య అంబర్ హెర్డ్.. ఎంత ఇచ్చారంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హోలీ హోండ్రిచ్
- హోదా, బీబీసీ న్యూస్
హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన మాజీ భార్య, నటి అంబర్ హెర్డ్‌పై వేసిన పరువు నష్టం కేసును ఆమె కోర్టు బయట పరిహారం చెల్లించి ‘సెటిల్’ చేసుకున్నారు.
మాజీ భార్యభర్తలైన వీరిద్దరూ ఒకరిపై ఒకరు పరువునష్టం ఆరోపణలు చేసుకుంటూ కోర్టుకు వెళ్లారు.
అంబర్ హెర్డ్ 2018లో ‘ది వాషింగ్టన్ పోస్ట్’ కోసం రాసిన ఒక ఒపీనియన్ వ్యాసంలో.. తాను ప్రముఖ వ్యక్తిని అయినా కూడా గృహ హింసకు గురయ్యానని రాశారు. ఆ కథనంలో ఆమె జానీ డెప్ పేరును ప్రస్తావించలేదు.
ఈ వ్యాసం ద్వారా తన పరువుకు నష్టం వాటిల్లిందని జానీ డెప్ కేసు వేశారు. జానీ డెప్ దావా వేసిన తర్వాత అంబర్ హెర్డ్ కూడా కౌంటర్ సూట్ దాఖలు చేశారు.
అమెరికాలోని వర్జీనియా కోర్టు జ్యూరీ జూన్ నెలలో, 59 ఏళ్ల జానీ డెప్ పక్షాన నిలిచింది. తనను తాను గృహ హింస బాధితురాలిని అని పేర్కొంటూ అంబర్ హెర్డ్ రాసిన కథనంతో జానీ డెప్ ప్రతిష్టకు భంగం కలిగిందని కోర్టు గుర్తించింది.

ఫొటో సోర్స్, Reuters
ఈ కేసులో జ్యూరీ ఇచ్చిన తీర్పును రిజర్వ్ చేయడం లేదా మొత్తంగా కేసును కొత్తగా మళ్లీ విచారించాలంటూ కోరుతూ ఈ నెల ప్రారంభంలో అంబర్ హెర్డ్ అప్పీల్ దాఖలు చేశారు.
అయితే.. అమెరికా న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయినందునే ఈ కేసును డబ్బు చెల్లించి పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సోమవారం అంబర్ హెర్డ్ చెప్పారు.
‘‘ఒకవేళ నేను చేసుకున్న అప్పీల్ విజయవంతమైనా దాని వల్ల మళ్లీ కొత్తగా విచారణ మొదలవుతుంది. అంతకంటే గొప్ప ఫలితం ఏమీ రాదు. మళ్లీ అదంతా నేను తట్టుకోలేను’’ అని ఆమె పేర్కొన్నారు.
అంబర్ హెర్డ్ పది లక్షల డాలర్లను (రూ. 8.27 కోట్లు) పరువు నష్ట పరిహారంగా జానీ డెప్‌కు చెల్లించనున్నారని జానీ డెప్ న్యాయవాదులు, బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
జానీ డెప్, ఆంబర్ హెర్డ్‌లు 2017లో విడాకులు తీసుకున్నారు. అంతకుముందు అయిదేళ్ల పాటు కలిసి జీవించారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు హింస, దుష్ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు చేసుకున్నారు.
జానీ డెప్ తనను మానసిక, శారీరక, లైంగిక వేధింపులకు గురి చేశాడని అంబర్ హెర్డ్ ఆరోపించారు. జానీ డెప్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
వీరి మధ్య కేసు విచారణ ఆరు వారాల పాటు సాగింది. టీవీల్లో ప్రసారమైన విచారణను ప్రజలు వీక్షించారు.
ఈ కేసులో వర్జీనియాలోని ఫెయిర్‌పాక్స్ జ్యూరీ ఎక్కువగా డెప్ వైపే నిలిచింది. ఆయనకు 1.50 కోట్ల డాలర్ల (రూ. 124 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని అంబర్ హెర్డ్‌ను ఆదేశించింది.
ఈ తీర్పుపై పలువురు న్యాయ నిపుణులు ఆశ్చర్యపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
సోమవారం జానీ డెప్ తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ, ‘‘జానీ డెప్‌కు సంబంధించిన ఈ బాధాకరమైన అధ్యాయాన్ని అధికారికంగా ముగించడం చాలా సంతోషంగా ఉంది. నష్టపరిహారంగా తనకు వచ్చే 10 లక్షల డాలర్లను జానీ డెప్ అనేక స్వచ్ఛంద సంస్థలకు పంచనున్నారు’’ అని వారు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మెస్సీ వరల్డ్ కప్ సాధిస్తే, భారత అభిమానులు సచిన్‌ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ
- ఎలాన్ మస్క్: ట్విటర్ బాస్‌గా దిగిపోవాల్సిందేనంటూ యూజర్ల ఓటు - ఇప్పుడు పరిస్థితేంటో?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














