H3N2 వైరస్ ఎంత ప్రమాదకరం? ఇది సోకితే కనిపించే లక్షణాలేమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రీనివాస రాజకులం
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల ఇన్ఫ్లుఎంజా 'ఏ' వైరస్ ఉప రకమైన హెచ్3ఎన్2 (H3N2) వల్ల కలిగే ఫ్లూ కేసులు దేశవ్యాప్తంగా వేగంగా పెరిగాయి.
అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్న ఈ వైరస్‌లో కోవిడ్-19 వంటి లక్షణాలు కనిపించాయి.
వాయు కాలుష్యం వల్ల ఈ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని వైరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
H3N2 లక్షణాలు ఏమిటి?
- జ్వరం
- వికారం
- దగ్గు
- వాంతులు
- గొంతు నొప్పి
- బాడీ పెయిన్స్
- అలసట
- పేగు మంటతో కూడిన బ్లడ్ డయేరియా
దీనితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా నిరంతర జ్వరం, ఛాతీలో నొప్పి, ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఫిట్స్ లాంటివి వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించండి.

ఫొటో సోర్స్, ANI
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటన ప్రకారం బలహీనమైన రోగనిరోధక శక్తి గలవారిలో ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, జబ్బుపడిన వ్యక్తులలో లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి.
- ప్లస్ ఆక్సిమీటర్ సాయంతో ఆక్సిజన్ స్థాయిని నిరంతరం పరిశీలిస్తూ ఉండండి.
- ఆక్సిజన్ సంతృప్త స్థాయి 95 శాతం కంటే తక్కువగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
- ఆక్సిజన్ సంతృప్త స్థాయి 90 శాతం కంటే తక్కువగా ఉంటే, అప్పుడు ఇంటెన్సివ్ కేర్ అవసరం కావచ్చు.
- స్వీయ మందులు ప్రమాదకరం.
- పిల్లలకు, వృద్ధులకు జ్వరం, దగ్గు వంటి సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల వస్తుంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది.
ఎందుకంటే యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుంది.
అంటువ్యాధి సోకకుండా ఐసీఎంఆర్ పలు సూచనలు చేసింది. వాటిలో కరోనా సమయంలో సూచించిన జాగ్రత్తలే ఎక్కువగా ఉన్నాయి.
హెచ్3ఎన్2 వైరస్ నివారణకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలపై కూడా ఐసీఎంఆర్ సలహా ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏం చేయాలి? ఏం చేయకూడదు?
ఐసీఎంఆర్ ప్రకటన ప్రకారం ఇది వర్షాకాలంలో లేదా చలికాలంలో వచ్చే సాధారణ ఇన్‌ఫ్లుఎంజా వైరస్.
- బహిరంగ ప్రదేశాల్లో మాస్కు వాడాలి, గుంపులుగా ఉన్నచోట ఎక్కువసేపు ఉండరాదు.
- వైరస్ లక్షణాలు ఉంటే సబ్బు, నీటితో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
- తుమ్మినపుడు, దగ్గినపుడు నోరు, ముక్కుకు ఏదైనా అడ్డు పెట్టుకోండి.
- చేతితో కళ్లు, ముక్కును తాకడం తగ్గించండి.
- ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోండి.
- జ్వరం లేదా ఒళ్లు నొప్పులు ఉంటే పారాసిటమల్ తీసుకోవచ్చు.
- కరచాలనం తగ్గించండి. పబ్లిక్‌లో ఉమ్మివేయవద్దు.
- వైద్యుడి సలహా లేకుండా యాంటీ బయాటిక్స్, ఇతర మందులు తీసుకోవద్దు.
- కలిసి తినడం, ఇతరులకు మరీ దగ్గరగా కూర్చోవడం చేయవద్దు.

ఫొటో సోర్స్, Science Photo Library
H3N2 గురించి వైద్యులు ఎలాంటి సూచనలిస్తున్నారు?
చెన్నైలోని బాలాజీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రావణ్ గోమ్‌గన్‌తో బీబీసీ ప్రతినిధులు మాట్లాడారు.
వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ప్రజలు కూరగాయలు, పోషకాలు ఎక్కువగా తినాలని ఆయన సూచించారు.
"తీవ్రమైన లక్షణాలు ఉన్న వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చాలి. తేలికపాటి లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండి వైద్యుడిని సంప్రదించాలి. పారాసిటమాల్ తీసుకోవచ్చు. గరిష్ట విశ్రాంతి, గోరువెచ్చని నీరు తీసుకోవాలి" రావణ్ అన్నారు.
హెచ్3ఎన్2 వైరస్‌లో మ్యుటేషన్ ఉంటుందని డాక్టర్ అంటున్నారు. అందుకే ఒకసారి వ్యాధి సోకిన వారికి మళ్లీ వ్యాధి సోకే అవకాశం ఉంది.
పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
సంవత్సరానికి ఒకసారి ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్‌ను వేసుకోవాలని వైద్యుడు సిఫార్సు చేశారు.
వర్షాకాలానికి ముందే ఇన్‌ఫ్లుఎంజా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల జలుబు, జ్వరం, దగ్గు వచ్చే అవకాశాలు 70 శాతం తగ్గుతాయని రావణ్ స్పష్టంచేశారు.
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కచ్చితంగా ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














