మెదడు నుంచి చెడు జ్ఞాపకాలను.. మందులతో చెరిపేయవచ్చా? పరిశోధనలు ఏం చెప్తున్నాయి?

మెదడు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జోస్ ఏ మోరల్స్ గార్సియా
    • హోదా, బీబీసీ ముండో

యులీసిస్ నుంచి చాలా ఏళ్లుగా ఎలాంటి సందేశమూ లేదు. బహుశా అతడు యుద్ధంలో చనిపోయి ఉండొచ్చు. అతడి కుమారుడు టెలిమాకస్. తండ్రి గురించి ఆరాతీస్తూ మనేలాస్ దగ్గరకు వచ్చాడు. వీరికి మనేలాస్ భార్య హెలెన్ విందు ఏర్పాటుచేసింది.

అయితే, ఆ విందులో యులీసిస్‌ను తలచుకొని అంతా విచారంలో మునిగిపోయారు. అప్పుడే నెపెంథీస్ పానీయాన్ని తీసుకురావాలని సేవకులకు హెలెన్ ఆదేశించారు.

‘‘ఎవరైతే ఈ పానీయం తాగుతారో వారి బాధలు తగ్గిపోతాయి. బాధకారమైన జ్ఞాపకాలు వారి మెదడులో నుంచి బయటకు వెళ్లిపోతాయి’’ అని హెలెన్ చెబుతారు.

ఈ సంభాషణ గ్రీకు గ్రంథం ఒడిస్సీలోని 4వ అధ్యాయంలో కనిపిస్తుంది.

అదే కోవలో.. ‘‘తాగితే మరచిపోగలను.. తాగనివ్వరు. మరచిపోతే తాగగలను.. మరువనివ్వరు’’ అంటూ ఒక తెలుగు సినీ కవి.. మద్యానికి, మెమొరీకి సంబంధం ఉందన్నవిధంగా రాసిన దేవదాసు పాట చాలా ప్రసిద్ధమైనది.

అయితే, నిజంగానే బాధాకరమైన జ్ఞాపకాలను ఇలా మరిపోవచ్చా? దీనిపై సైన్స్ ఏం చెబుతోంది?

మెదడు

ఫొటో సోర్స్, Getty Images

జ్ఞాపకాలు ఇలా..

మన రోజువారీ కార్యకలాపాల్లో చాలా అంశాలను మన మెదడు గుర్తుపెట్టుకుంటుంది. అయితే, వీటిలో చాలావరకు మనం మరచిపోతుంటాం.

కానీ, చెడు జ్ఞాపకాలు మాత్రం ఎక్కువ రోజులు గుర్తుంటాయి. మన నాడీ వ్యవస్థలో కొన్ని నాడీ సర్వ్యూట్‌లలో మార్పులు చోటుచేసుకోవడమే దీనికి కారణం. దీని కోసం కొన్ని ప్రోటీన్లు కలిసి పనిచేస్తాయి.

అయితే, ఈ చెడు జ్ఞాపకాలు ఇలానే మెదడులో నిలిచిపోవడంతో మనకు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్‌డీ) లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది?

ఎందుకంటే చెడు జ్ఞాపకాలకు భావోద్వేగాలతో గట్టి సంబంధం ఉంటుంది. మన మెదడు.. జ్ఞాపకాలను వాటి ఉపయోగాలకు అనుగుణంగా వర్గీకరిస్తుంది. చెడు భావోద్వేగాలతో సంబంధముండే జ్ఞాపకాలను మన మనుగడకు కీలకమయ్యేవిగా మెదడు గుర్తిస్తుంది.

ఉదాహరణకు మన నగరంలోని కొన్ని ప్రాంతాలను దాటి వెళ్లేటప్పుడు ప్రమాదకరంగా అనిపిస్తే, వీటిని మెదడు గుర్తించి అలానే స్టోర్ చేస్తుంది.

అయితే, మరింత బాధాకరమైన అనుభవాలు ఎదురైనప్పుడు పరిస్థితులు కాస్త సంక్లిష్టం అవుతాయి. ఆ అనుభవాలను ప్రాసెస్ చేయకుండానే మెదడు భద్రపరుస్తుంది.

మళ్లీ అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు సమస్య మరింత తీవ్రమైనట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికే ప్రాసెస్ చేయని జ్ఞాపకాలు మన మెదడులో ఉంటాయి.

మెదడు

ఫొటో సోర్స్, Getty Images

కాంతి, ధ్వని తరంగాలతో..

చెడు జ్ఞాపకాల సమస్యను పరిష్కరించే దిశగా న్యూరోసైన్స్‌లో చాలా పరిశోధనలు జరిగాయి. అయితే, మెదడులో అతిచిన్న మార్పులు కూడా సమాచారాన్ని డిలీట్ చేయడం లేదా నిల్వ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని వీటిలో తేలింది.

ఉదాహరణకు మెదడులోని కొన్ని భాగాలపై కాంతిని ప్రసంరిపచేయడం ద్వారా కొన్ని జ్ఞాపకాలను మరచిపోయేలా చేయొచ్చు. జ్ఞాపకాలను భద్రపరచడంలో క్రియాశీలంగా భావించే ప్రొటీన్లు కాంతికి ప్రభావితం కావడమే దీనికి కారణం.

జంతువులు, మనుషులు ఇలా దాదాపు అన్ని జీవుల మెదడు చర్యలను కాంతితో మనం నియంత్రించొచ్చు.

ఆ తర్వాత శబ్ద తరంగాలు ఇక్కడ కీలకమైనవిగా చెప్పుకోవాలి. మెమరీ ప్రాసెసింగ్‌లో నిద్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజంతా మనం సేకరించిన జ్ఞాపకాలు మనం రాత్రి ప్రాసెస్ అవుతాయి. అంటే దీర్ఘకాల మెమరీలుగా ఇవి మెదడులో ప్రాసెస్ అవుతాయి.

అయితే, ఈ ప్రాసెసింగ్‌ను శబ్ద తరంగాలతో మార్పులు చేసేందుకు ఇంగ్లండ్‌లో యార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేపట్టారు.

నిజానికి ఈ పరిశోధన ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. అయితే, బాధాకరమైన అనుభవాలను మెదడు లోనుంచి తొలగించే కొత్త చికిత్స విధానాలకు ఇది బాటలు పరుస్తోంది.

మెదడు

ఫొటో సోర్స్, iStock

ఔషధాలు కూడా..

భవిష్యత్తులో చెడు జ్ఞాపకాలను మరచిపోయేలా చేసే లైట్ లేదా సౌండ్ పిల్స్ వస్తాయని ఇప్పటికే మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. దీనికి సమాధానం ఇప్పుడే చెప్పలేం.

అయితే, ప్రస్తుతం అందుబాటులోనున్న కొన్ని ఔషధాలతో చెడు జ్ఞాపకాల నుంచి మనం కొంతవరకు తప్పించుకొనే అవకాశముందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఉదాహరణకు ప్రొపనోలాల్‌ను తీసుకోండి. రక్త పోటులో ఉపయోగించే ఈ ఔషధం చెడు జ్ఞాపకాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని జంతువులపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.

మెమరీలో మార్పుల విషయంలో న్యూరాన్లలో ప్రోటీన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనం ఆ ప్రోటీన్‌ను నిర్వీర్యం చేస్తే, ఆ జ్ఞాపకాలనూ చెరిపేయొచ్చు.

ప్రస్తుతానికి ఈ పరిశోధన ఇంకా జంతువులపై కొనసాగుతోంది. కొన్ని జంతువుల మెదళ్లు మనుషుల మెదడును పోలి ఉంటాయి. దీంతో మనుషుల మెదడుపై ఆ ఔషధం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఈ పరిశోధనల ద్వారా తెలుసుకునే అవకాశముంటుంది.

నిజానికి బాధకరమైన అనుభవాలను మరచిపోవడం చాలా కష్టం. ఇవి సదరు వ్యక్తులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి.

వీడియో క్యాప్షన్, కళ్ళు ఎందుకు అదురుతాయి? కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలివే..

అయితే, ఇలాంటి జ్ఞాపకాలను తొలగించడంలో కీళ్లవాతానికి ఉపయోగించే ఔషధం హైడ్రోకోర్టిసోన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కనుక్కోవడానికి లండన్ యూనివర్సిటీ కాలేజీ నిపుణులు ఒక పరిశోధన చేపట్టారు.

ఇది మహిళలు, పురుషుల్లో భిన్నంగా స్పందిస్తోందని, వారి శరీరంలోని సెక్స్ హార్మోన్ల స్థాయిలు కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తున్నాయని ఆ పరిశోధనలో తేలింది. ఇక్కడ ఈస్ట్రోజన్ స్థాయిలు ఎక్కువగా ఉండే పురుషుల్లో బాధకరమైన మెమరీలపై ఈ ఔషధం మెరుగ్గా పనిచేస్తోంది.

ఇక మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే వారి శరీరం హైడ్రోకోర్టిసోన్‌కు సరిగా స్పందించడం లేదు. అంటే ఇక్కడ ఒకే ఔషధం పురుషుల్లో ఒక విధంగా, మహిళల్లో మరో విధంగా ప్రభావం చూపిస్తోంది.

మరోవైపు ఆ బాధాకరమైన ఘటన వెంటనే హైడ్రోకోర్టిసోన్‌ ఇస్తేనే ప్రభావం కనిపిస్తోంది.

వీడియో క్యాప్షన్, పొగ తాగని వారికీ ఊపిరితిత్తుల క్యానర్స్ వస్తోంది ఎందుకు?

ప్రస్తుతం బాధాకరమైన అనుభవాలపై జరుగుతున్న పరిశోధనల్లో పాల్గొనేవారికి కృత్రిమంగా బాధాకరమైన జ్ఞాపకాలను కలిగిస్తున్నారు. నిజానికి వారి జీవితాల్లో అలాంటి వేదనపూరిత ఘటనలు జరగకపోవచ్చు కూడా.

కాబట్టి ఇలాంటి పరిశోధనలకు చాలా పరిమితులు ఉంటాయి. నిజజీవిత పరిస్థితులకు ఇవి సరిగా అద్దం పట్టకపోవచ్చు కూడా.

అయినప్పటికీ, పీటీఎస్‌డీ బాధితుల కోసం కొత్త చికిత్సలు తీసుకొచ్చేందుకు ఇవి ఉపయోగపడే అవకాశముంది.

(స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్ యూనివర్సిటీ న్యూరోసైన్స్ రీసెర్చ్ రెంటర్‌లో జోస్ ఏ మోరల్స్ గార్సియా పరిశోధకురాలు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)