ఆస్కార్: ‘నాటునాటు’ పాటను నాటుగా పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌ల సంగీత ప్రయాణం ఏంటి

కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్

ఫొటో సోర్స్, Facebook

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

ఆర్ఆర్‌ఆర్ సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్ అవార్డు బరిలో నిలిచింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీపడుతోంది.

సోమవారం(13న) ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ‘నాటు నాటు’ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.

ఎంఎం కీరవాణి స్వరపరచిన ఈ పాటను వీరితోనే పాడించాలని ఎందుకు అనుకున్నారు? ఈ ఇద్దరు నేపథ్య గాయకుల నేపథ్యం ఏమిటి? వీరిద్దరి ప్రయాణం ఎలా ఉంది?

ఓ ర‌కంగా రాహుల్‌ సిప్లిగంజ్, కాల‌భైర‌వ‌ల ప్ర‌యాణం ఒకేలా మొద‌లైంది. రాహుల్ సామాన్య‌ కుటుంబం నుంచి వ‌చ్చి పేరు తెచ్చుకుంటే కాల‌భైర‌వ‌ సెలబ్రెటీల కుటుంబంలో పుట్టినా, సాధారణంగానే సినీ సంగీత ప్రయాణం మొదలు పెట్టారు.

ఇప్పుడు ఇద్దరూ దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్‌తో రాహుల్ సిప్లిగంజ్

ఫొటో సోర్స్, Rahul Sipligunj/Facebook

మంగళ్ హాట్ బస్తీ నుంచి

హైద‌రాబాద్‌లోని మంగ‌ళ్ హాట్ అనే ఓ బ‌స్తీలో ఓ మామూలు దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇంట్లో పుట్టారు రాహుల్. స్థానిక‌ నారాయ‌ణ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. తండ్రికి ఓ సెలూన్ షాప్ ఉంది. అదే ఆ కుటుంబానికి ఆధారం.

రాహుల్‌కు చిన్న‌ప్ప‌టి నుంచీ ఆట పాట‌లంటే మ‌క్కువ‌. చిన్న‌ప్పుడు 'మాయ‌దారి మైస‌మ్మ‌..' పాట పాడితే ఆ గ‌ల్లీ అంతా చెవులు రిక్క‌రించి మ‌రీ వినేది.

మంగ‌ళ్ హాట్‌లో.. రాహుల్ ఓ బుల్లి సెల‌బ్రెటీ. రంగు డ‌బ్బాలూ, కంచాలే సంగీత ప‌రిక‌రాలుగా మార్చుకొని తోచిన పాట‌లు పాడేవారు.

పండిత్ విఠ‌ల్ రావు ద‌గ్గ‌ర సంగీతం నేర్చుకొని, అక్క‌డే గ‌జ‌ల్స్ పై ప‌ట్టు సాధించారు. రాప్ పాడ‌డానికి ఈ సాధన ఎంతో ఉప‌యోగ‌ప‌డింది కూడా.

గాయ‌కుడిగా బాగా సిద్ధ‌మైన త‌ర‌వాత‌, అవ‌కాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగారు. కానీ, లాభం లేకుండా పోయింది. తానే సొంతంగా మ్యూజిక్ ఆల్బ‌మ్స్ రూపొందించ‌డం మొద‌లెట్టాడు.

'మాకి కిరికిర', 'గ‌ల్లీ కా గ‌ణేష్‌', 'దావ‌త్'.. ఇలా హైద‌రాబాదీ సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు త‌న జోష్ మిక్స్ చేసి రాహుల్ పాట‌లు కంపోజ్ చేశారు. అవ‌న్నీ దుమారం రేపాయి.

ఈ సౌండ్ తెలుగు చిత్రపరిశ్రమను తాకింది. దాంతో 'జోష్' సినిమాలో ఆయనకు అవ‌కాశం వ‌చ్చింది. 'కాలేజీ బుల్లోడా' అనే పాట‌తో రాహుల్ టాలీవుడ్ ఎంట్రీ జ‌రిగిపోయింది.

ఎంఎం కీరవాణియే సంగీత దర్శకత్వం వహించిన 'ఈగ‌'లో టైటిల్ సాంగ్, దమ్ము చిత్రంలోని 'వాస్తు బాగుందే' పాట రాహుల్‌కు బాగా పేరు తెచ్చి పెట్టాయి. 'రంగ‌స్థ‌లం'లోని టైటిల్ సాంగ్‌తో, 'ఇస్మార్ట్ శంక‌ర్‌'లోని పాట‌ల‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో స్థిరపడిపోయారు.

తర్వాత రాహుల్ 2019లో తెలుగు బిగ్ బాస్‌ సీజన్‌-3లో పోటీపడటం, విజేతగా నిలవడం, ఇప్పుడు 'నాటు.. నాటు' పాట‌తో త‌న పేరు అంత‌ర్జాతీయంగా వినిపించ‌డం తెలిసిన విష‌యాలే.

'అల వైకుఠ‌పురం'లోని సూప‌ర్ హిట్ గీతం 'రాములో.. రాములా' కూడా రాహుల్‌తోనే పాడించాలని ఆ సినిమా యూనిట్ అనుకొంది. అయితే పాట రికార్డింగ్ స‌మ‌యానికి రాహుల్ బిగ్ బాస్ హౌస్‌లో‌ ఉన్నాడు. బిగ్ బాస్ యాజ‌మాన్యాన్ని ఎంత బ‌తిమాలినా, రాహుల్ ని పాట పాడ‌డం కోసం బ‌య‌ట‌కు పంప‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్ప‌డంతో ఆ పాట రాహుల్ చేతుల్లోంచి జారిపోయింది.

కాలభైరవ

ఫొటో సోర్స్, Kaala Bhairava/Twitter

కాలభైరవకు తొలి అవకాశం ఎలా వచ్చింది?

కాల‌భైర‌వ ప్ర‌యాణం మ‌రో త‌ర‌హాలో సాగింది. కీరవాణి ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు కాలభైరవ.

కీర‌వాణి పెంప‌కంలో హంగూ ఆర్భాటాల్లేవు. డ‌బ్బు విలువ త‌న బిడ్డ‌ల‌కూ తెలియాల‌న్న‌ది ఆయ‌న ఆలోచన. అందుకే డ‌బ్బుతో వ‌చ్చే సౌకర్యాల‌కు త‌న పిల్ల‌ల‌ను దూరంగా ఉంచారని టాలీవుడ్ వర్గాలు చెబుతాయి.

`రోజంతా క‌ష్ట‌ప‌డి ప‌ని చేయండి, డ‌బ్బు విలువ అర్థం అవుతుంది..` అని చెప్పి కీరవాణి త‌న ఇద్ద‌రు కొడుకులు కాలభైరవ, శ్రీసింహాలను ఓ రోజు కూలి ప‌నికి పంపారు.

ప్రముఖ సంగీత దర్శకుడి కుమారుడు అయినప్పటికీ కాలభైరవ అంత తేలిగ్గా గాయకుడు అయిపోలేదు.

కాల‌భైర‌వ‌నీ మిగిలిన ట్రాక్ సింగ‌ర్స్‌లానే కీరవాణి ట్రీట్ చేశారు. నిజానికి కాల‌భైర‌వ దృష్టి పాట‌లు పాడ‌డం మీద ఉండేది కాదు. త‌ను ఓ మంచి కంపోజ‌ర్ కావాల‌ని ఆశ ప‌డ్డాడు. డిగ్రీ పూర్తి చేసిన కాల‌భైర‌వ ప్ర‌త్యేకంగా సంగీతం నేర్చుకోలేదు కానీ, తండ్రిని గ‌మ‌నిస్తూ, ఆయ‌న్ని స్ఫూర్తిగా తీసుకొని అడుగులేశారు.

కీరవాణి తమ్ముడు క‌ల్యాణీ మాలిక్ ప‌ని చేసిన ఓ సీరియ‌ల్ ద్వారా కాల‌భైర‌వ‌కు తొలి అవ‌కాశం వ‌చ్చింది. `నాన్న‌` అనే ధారావాహిక కోసం తొలిసారి గొంతు విప్పారు.

`య‌మ‌దొంగ‌`లో ట్రాకులు పాడాడు. ఆ సినిమాలోని ఓ బిట్ సాంగ్‌లో కాల‌భైర‌వ గొంతు వినిపిస్తుంది. అంతే కాదు, ఆ సినిమాలో ఓ చిన్న పాత్ర కూడా పోషించాడు. అప్ప‌టికి వ‌య‌సు ప‌ద‌హారేళ్లే.

2010 నుంచి పూర్తిగా తండ్రితోనే ప్ర‌యాణం సాగిస్తున్నారు. `ఝుమ్మంది నాదం`సినిమా కోసం కోర‌స్ పాడాడు.

బాహుబ‌లిలోని `దండాల‌య్యా` కాల‌భైవ‌ర‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తీసుకొచ్చింది. ఈ పాట తొలిసారి వింటే, అచ్చంగా కీర‌వాణి గొంతే అనిపిస్తుంది. నిజానికి ఈ పాట వెనుక ఓ ఆసక్తికరమైన క‌థ ఉంది. ఈ పాట‌ను కీర‌వాణే స్వ‌యంగా పాడ‌దామ‌నుకొన్నారు. ర‌ఫ్‌గా ట్రాక్ కూడా పాడేశారు.

అయితే, `ఈ పాట నేను పాడితే ఎలా ఉంటుంది` అనే ఆలోచ‌న కాల‌భైర‌వ‌కు వ‌చ్చింది. ప్రోగ్రామర్‌తో క‌లిసి, ఈ ట్రాక్ తానే పాడి తండ్రి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లి వినిపించాడు. త‌న‌యుడి ప్ర‌య‌త్నం కీర‌వాణిని ఇంప్రెస్ చేసింది. అలా, తాను పాడాల్సిన పాట‌ను కొడుకుతో పాడించి ఫైన‌ల్ చేయించారు.

ఎస్.తమన్ సంగీత దర్శకత్వం వహించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలోని `పెనిమిటీ` గీతం కాల‌భైర‌వ‌కు బ్రేక్ ఇచ్చింది. ఆ పాటలో కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్‌‌కు ఆయన గొంతు బాగా సెట్ అయ్యింది.

`నాటు నాటు` పాట‌కు కాల‌భైర‌వ‌ని ఎంపిక చేయ‌డానికి ఇదో బ‌ల‌మైన కార‌ణం.

ఎంఎం కీరవాణి

ఫొటో సోర్స్, Kaala Bhairava/Twitter

నాటు నాటు పాట‌కు క‌స‌ర‌త్తు

కీర‌వాణి త‌న పాట‌కు గాయ‌కుల్ని ఎంపిక చేసుకొనే విధానం ప‌క్కాగా ఉంటుంది. ఆ పాట‌కు, సంద‌ర్భానికీ, స్వ‌రానికీ, క‌థానాయ‌కుడు లేదా నాయిక‌కు ఎవ‌రి గొంతు న‌ప్పుతుందో చూసుకొని, అన్ని ర‌కాలుగా విశ్లేషించుకొని, ఆ త‌ర‌వాతే ఆ పాట‌ని వాళ్ల చేతుల్లో పెడ‌తారు. అదో సుదీర్ఘ ప్ర‌యాణం. అందుకే కీర‌వాణి ద‌గ్గ‌ర పాట‌లు అంత త్వ‌ర‌గా పూర్త‌వ్వ‌వేమో. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం `నాటు నాటు` పాట‌కూ ఇలాంటి క‌స‌ర‌త్తే చేశారు.

ఏ పాట కంపోజ్ చేసినా, ముందు ట్రాక్ సింగ‌ర్స్ తో పాడించే అలవాటున్న సంగీత దర్శకుల్లో కీర‌వాణి ఒకరు. ట్రాక్స్ సింగర్స్‌తో పాడించిన తర్వాతే అసలు సింగర్స్ పాడతారు.

`నాటు... నాటు` పాట‌కు కీరవాణికి ఇద్ద‌రు ట్రాక్ సింగ‌ర్స్‌ కావాలి. ఒక‌రు ఇంట్లోనే దొరికేశారు.. కాల‌భైర‌వ రూపంలో. ఈ రోజుల్లో కీర‌వాణి కంపోజ్ చేసే ప్ర‌తీ పాట‌కూ దాదాపుగా ఆయ‌నే ట్రాక్ సింగ‌ర్‌.

ఆ త‌ర‌వాత‌, రాహుల్ సిప్లిగంజ్‌కు పిలుపు వెళ్లింది. పాట పాడిస్తున్న‌ప్పుడే `ఇది ట్రాక్ మాత్ర‌మే. ఇది సినిమాలో ఉండొచ్చు, ఉండ‌క‌పోవొచ్చు` అని ముందే ట్రాక్ సింగ‌ర్స్‌కి చెప్ప‌డం కీర‌వాణికి అల‌వాటు. ఈ సారీ అదే చేశారు. దానికి తోడు, ఈ పాట ఏ సినిమాలోదో కూడా చెప్ప‌కుండా పాట‌ను రికార్డ్ చేసేశారు.

'నాటు నాటు' పాటలో దాదాపు ఏడాది పాటు మార్పులు చేర్పులు జరిగాయి. మ‌ధ్య మ‌ధ్య‌లో ర‌చ‌యిత చంద్ర‌బోస్ పాట‌లోని కొన్ని ప‌దాలు మార్చినప్పుడ‌ల్లా కాల‌భైర‌వ‌, రాహుల్‌లకు ప‌ని ప‌డేది. ఈ పాట చివ‌రి వ‌ర‌కూ ఉంటుందా, లేదా అనే సందేహం ఇద్దరికీ ఉండేది.

`సార్‌.. ఈ పాట ఫైన‌ల్ అయ్యిందా? సినిమాలో నా గొంతే వినిపిస్తుందా` అని కీరవాణిని రాహుల్ అడిగేవారు. ఈ విషయాన్ని రాహులే స్వయంగా ఒక సందర్భంలో మీడియాతో చెప్పారు.

చిరున‌వ్వే కీరవాణి నుంచి స‌మాధానంగా వ‌చ్చేది. కీరవాణి ఇంట్లో ఉండే కాల‌భైర‌వ‌కు కూడా ఇదే సందేహం.

‘నాటు నాటు’ పాటను వివిధ భాషల్లో పాడే అవకాశం తనకు ఎలా వచ్చిందో రాహుల్ ఓ సందర్భంలో ఇలా గుర్తు చేసుకున్నారు.

"ఓ రోజు నాకు (కీరవాణి భార్య) శ్రీవ‌ల్లి నుంచి ఫోన్ వ‌చ్చింది. `నీకు త‌మిళం వ‌చ్చా?` అని అడిగారు. నాకు త‌మిళంతో ట‌చ్ ఉంది. కొన్ని పాట‌లూ పాడాను. ఆ విష‌య‌మే చెప్పా. `నాటు నాటు` త‌మిళ వర్ష‌న్ పాడుదువు కానీ రా.. ' అని ఆమె ఫోన్ పెట్టేశారు. వెళ్లి, త‌మిళ పాట పాడి వ‌చ్చా. ఆ త‌ర‌వాత‌, క‌న్న‌డ‌, హిందీ వెర్ష‌న్ ల‌కూ నేనే పాడాను.

నా హిందీ హైద‌రాబాదీ స్లాంగ్ లో ఉంటుంది. హిందీ పాట‌కు నా డిక్ష‌న్ స‌రిపోతుందా, లేదా అనే డౌటు కీర‌వాణికి వ‌చ్చింది. కానీ, ప్రోగ్రామ‌ర్ జీవ‌న్ మాత్రం `ట్రైలే క‌దా.. ఓసారి ప్ర‌య‌త్నిద్దాం. లేదంటే మ‌న ద‌గ్గ‌ర ఎలాగూ ఆప్ష‌న్లు ఉన్నాయి క‌దా` అన్నారు. దాంతో కీర‌వాణి హిందీ వర్ష‌న్ పాడే అవ‌కాశం ఇచ్చారు. అదృష్ట‌వశాత్తూ... అది కూడా ఓకే అయిపోయింది" అని రాహుల్ గుర్తు చేసుకొన్నారు.

కాల‌భైర‌వ మాత్రం తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఈ పాట‌ను ఆల‌పించాడు. త‌మిళ‌, హిందీ భాష‌ల్లో `నాటు నాటు` పాట కోసం కాల‌భైర‌వ‌ని మ‌రొక గాయ‌కుడితో రిప్లేస్ చేశారు.

నాటు నాటు

ఫొటో సోర్స్, TWITTER @RRR MOVIE

మరో స్థాయికి తీసుకెళ్లారు: ఎంఎం శ్రీలేఖ

రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు పాట స్థాయిని పెంచారని సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ బీబీసీ తెలుగుతో అన్నారు.

"నాటు నాటు పాట విన‌గానే ఓ పూన‌కం వ‌స్తుంది. శ‌రీరం ల‌య‌బ‌ద్దంగా క‌దులుతుంది. దానికి భాష‌తో సంబంధం లేదు. బాణీలో ఉన్న మ్యాజిక్ అది. అదే.. ప్ర‌పంచ వ్యాప్తంగా సంగీత ప్రియుల‌కు న‌చ్చింది.

అందుకే మ‌న భాష అర్థం కాక‌పోయినా, భావాన్ని అర్థం చేసుకున్నారు.. ప్రేమించారు. ఈ పాట ఇంత పెద్ద స్థాయిలో ఆద‌ర‌ణ పొంద‌డానికీ, ఇప్పుడు ఆస్కార్ రేసులో నిల‌వ‌డానికి కారణం ఇదే" అని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె కీర‌వాణికి వ‌రుస‌కు చెల్లి అవుతారు.

ఈ పాట‌కు కీర‌వాణి రాహుల్ సిప్లిగంజ్‌ని, కాల‌భైర‌వ‌ని ఎందుకు ఎంపిక చేసుకొని ఉండొచ్చనే ప్రశ్నకు శ్రీలేఖ సమాధానమిస్తూ, "ఈరోజుల్లో హుషారైన పాట పాడాలంటే.. ముందుగా వినిపించే పేరు రాహుల్ సిప్లిగంజ్‌. త‌న గొంతులో పాట మ‌రింత ప‌రిగెడుతుంది. ఈ పాట‌కు కావాల్సిందే అది. అందుకే రాహుల్‌ను ఎంచుకొన్నారు. కాల‌భైర‌వ గొంతులో ఓ ఫ్రెష్‌నెస్ ఉంటుంది. ఎన్టీఆర్‌కి కాల‌భైర‌వ గొంతు స‌రిగ్గా స‌రిపోతుంది. అందుకే కాల‌భైర‌వ‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇద్ద‌రూ ఈ పాట‌ని మ‌రో స్థాయికి తీసుకెళ్లారు" అని వివ‌రించారు శ్రీ‌లేఖ‌.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఆస్కార్ వేడుకలో పాడటంపై రాహుల్, కాలభైరవ ఏమన్నారు?

లాస్‌ఏంజెలిస్‌లో అక్కడి కాలమానం ప్రకారం మార్చి 12, ఆదివారం జరిగే ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో రాహుల్, కాల‌భైర‌వ‌ ఈ పాటను లైవ్‌లో పాడ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

"నాటు నాటు పాట‌కు ఆస్కార్ నామినేష‌న్ వ‌చ్చింద‌ని తెలిసిన రోజు.. మా ఇంట్లో ఎవ‌రూ నిద్ర‌పోలేదు. ఇలాంటి అరుదైన ఆనందాన్ని కుటుంబం అంతా క‌లిసి షేర్ చేసుకోవ‌డం అల‌వాటు. ఆ రోజూ అదే చేశాం. ఇక ఆస్కార్ వేడుక ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఆ వేదిక‌పై మా పాట వినిపించ‌డం గొప్ప గౌర‌వం.. ఇంత‌కంటే గాయ‌కుడిగా కోరుకొనేది ఏం లేదు" అని త‌న ఆనందాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో పంచుకొన్నారు కాల‌భైర‌వ‌.

"ఇలాంటి గొప్ప విష‌యం నా జీవితంలో మ‌ళ్లీ జ‌రుగుతుందో, లేదో తెలీదు. నేను కూడా ఇంత‌కు మించి ఏం కోరుకోవ‌డం లేదు. గ‌ల్లీలో పాట‌లు పాడుకొనే నేను ఆస్కార్ వేదిక‌పై పాడ‌డ‌మే.. ఓ కల‌గా ఉంది. ఇది నాకు ఓ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌" అని ఓ ఇంట‌ర్వ్యూలో ఉద్వేగ‌భ‌రితంగా చెప్పారు రాహుల్‌.

కీర‌వాణితో సిప్లిగంజ్‌కి ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. కెరీర్ తొలి రోజుల్లో మంచి పాట‌లిచ్చి ప్రోత్స‌హించారు. కీర‌వాణి ఆధ్వ‌ర్యంలో విదేశాల్లో సాగిన కొన్ని సంగీత కార్య‌క్ర‌మాల్లోనూ రాహుల్ పాల్గొన్నారు.

మంచి గాయ‌కుడిగా మ‌రింత గుర్తింపు పొందాల‌ని, దేశంలోని అన్ని భాష‌ల్లోనూ పాట‌లు పాడాల‌ని, త‌న‌లానే కింది స్థాయి నుంచి వ‌చ్చిన ప్ర‌తిభావంతులైన గాయ‌నీ గాయ‌కుల‌కు ఓ వేదిక క‌ల్పించాల‌న్న‌ది రాహుల్ కోరిక.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)