క్యాంపా కోలా: త్వరలో మార్కెట్‌లోకి 'రీ ఎంట్రీ' ఇవ్వబోతున్న ఈ భారతీయ శీతల పానీయం చరిత్ర ఏంటి?

ఫొటో సోర్స్, Alamy
భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఈ వేసవిలో '50 ఏళ్ల పాత పానీయాల బ్రాండ్' అయిన 'క్యాంపా కోలా'ను మళ్లీ మార్కెట్లోకి తీసుకురానుంది.
గత ఆగస్టులో దాని తయారీదారి అయిన ప్యూర్ డ్రింక్స్ నుంచి ఆ బ్రాండ్‌ను రిలయన్స్ రూ. 22 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక నుంచి సోడా కోలా, నిమ్మ, ఆరెంజ్ రుచులలో దీనిని అందించనున్నారు.
ఈ పానీయం భారతదేశంలో 1970, 80లలో చాలా ప్రసిద్ధి చెందింది. అయితే విదేశీ కోలా బ్రాండ్‌లు మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత దాని మార్కెట్ పతనమైంది.
రిలయన్స్ ప్రతినిధి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ ఐకానిక్ బ్రాండ్‌ను కొనడానికి అన్ని తరాల వినియోగదారులను ఉత్సాహపరచాలని కంపెనీ భావిస్తోందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
క్యాంపా కోలా చరిత్ర ఏంటి?
భారతదేశంలో క్యాంపా కోలా కథ కోకా-కోలా ముగిసిన చోట ప్రారంభమైంది.
1950లలో భారతదేశంలోకి ప్రవేశించిన కోకాకోలా 1970ల వరకు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన శీతల పానీయాల బ్రాండ్‌గా ఉండేది.
1977లో ప్రభుత్వ విధానాలలో మార్పులు కోకా-కోలాను దెబ్బతీశాయి. అవి కోకాకోలా భారతీయ సంస్థలలో ఈక్విటీ వాటాను తగ్గించడమే కాకుండా బ్రాండ్ "సీక్రెట్ ఫార్ములా"ను కూడా బహిర్గతం చేసే పరిస్థితి వచ్చింది.
ఇది ఇష్టం లేని కోకాకోలా ఇండియా నుంచి వైదొలిగింది. బ్రాండ్ లేకపోవడం వల్ల ఏర్పడిన ఖాళీని పూరించడానికి, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ 1977లో డబుల్ సెవెన్ పానీయం ప్రారంభించింది. అయితే ఆ పానీయం ఎక్కువ మందిని ఆకర్షించలేకపోయింది.
యువతకు, పిల్లలకు దగ్గరైన బ్రాండ్
భారతదేశంలో కోకాకోలా ప్రధాన 'బాటిలింగ్' ప్రత్యర్థి అయిన ప్యూర్ డ్రింక్స్ కంపెనీ సోడాను విడుదల చేసే అవకాశాన్ని ఉపయోగించుకుంది.
అలా తయారు చేసిన పానీయానికి క్యాంపా కోలా అని పేరు పెట్టారు. కోకా-కోలా పానీయానికి ఉపయోగించిన అక్షరాల రూపాన్ని (ఫాంట్‌ను) ఉపయోగించారు. ఈ స్వదేశీ శీతల పానీయాల బ్రాండ్ యువత దగ్గరికి త్వరగానే చేరింది.
ఆ బ్రాండ్ విడుదల చేసిన ప్రకటనలు యువతను ఆకర్షించడమే కాదు, దాని ట్యాగ్‌లైన్‌లు జాతీయ బంధాన్ని పెంపొందించేలా బాగా ప్రాచుర్యం పొందాయి.
ఆ బ్రాండ్ పంచ్‌లైన్ "ది గ్రేట్ ఇండియన్ టేస్ట్" ఇప్పటికీ గుర్తుండిపోతుంది.
ఈ పానీయం వాణిజ్య ప్రకటనలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా నటించారు. అందులో సల్మాన్‌తో పాటు యువకుల బృందం ఒక బోట్‌లో ప్రయాణిస్తూ ఆకట్టుకునే పాట పాడుకుంటూ క్యాంపా కోలా పానీయం తాగడం చూడవచ్చు.
క్యాంపా కోలా ప్రింట్ ప్రకటనలు సరదాగా, ఉల్లాసంగా ఉండేలా డిజైన్ చేసేవారు. తరచుగా కలిసిమెలిసి పార్టీలు జరుపుకోవడాన్ని అవి నొక్కి చెబుతాయి.
"టైమ్స్ ఆఫ్ ఫన్", "టైమ్స్ ఆఫ్ జాయ్" సమయంలో పానీయం తాగమంటూ ఓ ప్రకటన తెలుపుతుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ డ్రింక్ తొందరగానే పిల్లలు, యుక్తవయస్కులకు చేరింది. పుట్టిన రోజు పార్టీలు, కుటుంబ విహారయాత్రలలో దీన్ని ప్రధానంగా వినియోగించేవారు.
అయినప్పటికీ ఈ పానీయం పాత బ్రాండ్‌కు సరిపోలేదంటూ ఇప్పటికీ పలువురు భావిస్తారు.
2018లో ది ప్రింట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాడ్ ఫిల్మ్ మేకర్ అలిక్ పదమ్‌సీ దీనిని "అనుకరణ బ్రాండ్" అంటూ వ్యాఖ్యానించారు.
ప్రముఖ కాలమిస్ట్ సంతోష్ దేశాయ్ 2009లో ఆ బ్రాండ్ గురించి "క్యాంపా మంచి రుచిని కలిగి ఉంది. ఎందుకంటే మాకు వేరే ఆప్షన్లు కూడా లేవు" అని చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ వార్తాసంస్థ పేర్కొంది.
క్యాంపా కోలా ఎలా మూతబడింది?
అయితే 1990లలో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయడానికి సంస్కరణలు ప్రవేశపెట్టడంతో ఈ బ్రాండ్‌కు దెబ్బ పడింది.
ఈ మార్పులతో విదేశీ బ్రాండ్‌లు ఇండియాలో వ్యాపారం చేయడం సులభతరం అయ్యాయి. దీంతో కోకా-కోలా తిరిగి మార్కెట్లోకి ప్రవేశించింది.
పెప్సీ, కోకా-కోలా దూకుడు మార్కెటింగ్ ప్రచారం, విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్‌లతో క్యాంపా కోలాను అధిగమించాయి.
2000లలో క్యాంపా కోలా దిల్లీలోని దాని బాటిలింగ్ ప్లాంట్‌లను మూసివేసింది. కొద్దికాలంలోనే దుకాణాలు, స్టాళ్ల నుంచి ఆ పానీయం అదృశ్యమైంది.
ఇవి కూడా చదవండి
- దిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత మీద ఈడీ ఆరోపణలు ఏమిటి?
- అన్ని వయసుల వారికీ గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్.. ముందే గుర్తించడం ఎలా?
- IWD2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఊదా రంగును ఎందుకు ధరిస్తారు...
- అక్కడ విడాకులను వేడుకగా జరుపుకుంటారు
- మూత్రపిండాలు: కిడ్నీ సమస్యలను గుర్తించడం ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














