‘ఎమ్మెల్యే చెప్పినట్టుగా వింటే బంగారం, డబ్బు వస్తాయన్నారు’ - దళిత మహిళా సర్పంచ్ ఆరోపణ.. ఖండించిన ఎమ్మెల్యే

సర్చంచ్ నవ్య
ఫొటో క్యాప్షన్, దళిత మహిళా సర్పంచ్ నవ్య తన భర్తతో కలిసి మీడియాతో మాట్లాడారు
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

హన్మకొండ జిల్లా స్టేషన్ ఘణపూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు ఓ దళిత మహిళా సర్పంచ్.

ఎమ్మెల్యే రాజయ్య లైంగికంగా వేధిస్తున్నాడని, తన గ్రామ అభివృద్దిని అడ్డుకుంటున్నాడని ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య మీడియా సమావేశంలో ఆరోపించారు.

ఎమ్మెల్యే రాజయ్య పై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.

అయితే తనపై మహిళా సర్పంచ్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఖండించారు. పార్టీలోని కొందరు తనపై కుట్ర చేస్తున్నారని అన్నారు.

మహిళా సర్పంచ్ ఆరోపణలు ఇవీ...

గత కొంత కాలంగా ఎమ్మెల్యే రాజయ్య, ఆయన అనుచరుల నుండి లైంగిక, మానసిక వేధింపులు ఎక్కువయ్యాయని జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపించారు.

ఆమె గురువారం నాడు, శుక్రవారం నాడు తన భర్త కుర్సపల్లి ప్రవీణ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

తనును, తన భర్తను ఎలా వేధించారో, తమ గ్రామ అభివృద్దిని ఎలా అడ్డుకున్నారో మీడియా సమావేశంలో వివరించారు నవ్య.

సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలు వైరల్ అయి చర్చకు దారితీసాయి.

సర్పంచ్ నవ్య

‘ఒంటరిగా వచ్చి ఎమ్మెల్యేను కలవాలని నాకు చెప్పారు’

ఎమ్మెల్యే రాజయ్య తనతో ప్రత్యక్షంగా పరోక్షంగా లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని, ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారని సర్పంచ్ నవ్య ఆరోపించారు.

‘‘ఆయనను (ఎమ్మెల్యే రాజయ్యను) కలిసేప్పుడు నా భర్త నా పక్కన ఉండొద్దు. ఏదైనా కార్యక్రమంలో భాగంగా ఫోటోలు దిగేప్పుడు ఆయనకు (ఎమ్మెల్యే రాజయ్యకు) చాలా దగ్గరగా నిలబడాలి. నాకు అలా నిలబడడటం ఇష్టం ఉండదు’’ అని ఆమె చెప్పారు.

‘‘ఈ మధ్య ధర్మసాగర్ లో కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో భాగంగా ఫోటోలు దిగే కార్యక్రమంలో దూరంగా ఉంటే.. ‘నువ్వు ఏమైనా బొమ్మవా దూరంగా ఉంటున్నావ’ని ఎమ్మెల్యే అన్నాడు’’ అని సర్పంచ్ నవ్య మీడియా ముందు ఆరోపించారు.

‘‘ధర్మసాగర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలితో మద్యవర్తిత్వం నడిపి నన్ను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. ఎమ్మెల్యే చెప్పినట్టుగా వింటే బంగారం, డబ్బుతో పాటూ, పిల్లల స్కూలు ఫీజులకు దోఖా ఉండదని ప్రలోభపెట్టింది’’ అని నవ్య వివరించారు.

‘‘నా భర్తతో కాకుండా ఒంటరిగా వచ్చి ఎమ్మెల్యేను కలవాలని సదరు మహిళ నాకు చెప్పారు. ఎమ్మెల్యే కూడా నాతో ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడేవారు’’ అని ఆమె ఆరోపించారు.

వీడియో క్యాప్షన్, ఆ గిరిజన రైతులు ఒకప్పుడు రాజుల్లా బతికారు... ఇప్పుడు పస్తులుంటున్నారు

‘ఎమ్మెల్యే మాట వినలేదని బిల్లులు రాకుండా అడ్డుకున్నారు’

జానకీపురం గ్రామ పంచాయతీలో పలు అభివృద్ది పనుల కోసం బంగారం, పొలం అమ్మామమని, అయితే ఎమ్మెల్యే మాట వినకపోవడంతో బిల్లులు రాకుండా పలుమార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని, మానసికంగా కొంత మంది ఎమ్మెల్యే అనుయాయులు తమను ఇబ్బందులకు గురి చేశారని సర్పంచ్ నవ్య ఆమె భర్త ప్రవీణ్ తెలిపారు.

‘‘గ్రామంలో ఇంకా అభివృద్ది జరగాల్సి ఉంది. మా గ్రామానికి వచ్చే అవకాశాలను అడ్డుకోవద్దని కోరుతున్నా. భూములు, బంగారం అమ్మాము. ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడతారు, ఆయన చెప్పినట్టు వినాలి, వారి చేతిలో లేకుంటే సహకారం ఉండదు. అలా ఉండటం నాకు నచ్చదు’’ అని నవ్య చెప్పారు.

‘‘నన్ను ప్రలోభపెట్టిన మహిళల సంసారాలు విచ్ఛిన్నం అవుతాయని ఆ మహిళల పేర్లు చెప్పడంలేదు. నన్ను నాశనం చేయాలనుకున్న వారిని నాశనం చేయదల్చుకోలేదు. అది నా సంస్కారం’’ అని ఆమె పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, 17 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు పిల్లల తండ్రి అత్యాచారం.. మహిళా సర్పంచి ఏం చేశారంటే

‘ఎమ్మెల్యేతో మా కుటుంబానికి ప్రాణగండం ఉంది’

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తో తన కుటుంబానికి ప్రాణగండం ఉందని సర్పంచ్ నవ్య అన్నారు.

‘‘నా కుటుంబానికి ఏ హాని జరిగినా దానికి ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో రాజయ్యకు పార్టీ టికెట్ ఇవ్వొద్దు. లేదంటే నియోజకవర్గంలోని మహిళ నాయకులపై వేధింపులు, అరాచకాలు కొనసాగుతాయి. కింది స్థాయి నాయకులు పార్టీలోని మహిళలతో ఎలా నడుచుకుంటున్నారో కేసీఆర్, కేటీఆర్‌లు కొంత సమయం తీసుకుని చూడాలి. కొంత మందితో పార్టీకి చెడ్డపేరు వస్తోంది” అని ఆమె కోరారు.

“ఈ విషయం లో కేసీఆర్, కేటీఆర్ వరకు వెళ్తాను. పసి పిల్లలను చూసినా సొల్లు కార్చుకునే వెధవలు కొంత మంది పార్టీలో ఉన్నారు. గ్రామాభివృద్దిలో సర్పంచ్ లకు సహకరించాలి, రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నా కొంత మంది చిల్లర వేషాలు వేస్తున్నారు’’ అని నవ్య అన్నారు.

‘‘ఈసారి ఎంతో మంది యువత సర్పంచ్ లుగా రాజకీయాల్లోకి వచ్చారు. కొంత మంది అధికారులు గ్రామాభివృద్ధికి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారు. బిల్లులు ఆలస్యం అయ్యేలా చేస్తున్నారు. మా గ్రామం అంటే వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. మహిళా సర్పంచ్ అని చిన్నచూపు చూస్తున్నారు. పార్టీని, నాయకత్వాన్ని కాపాడుకోవాలని ఇన్ని రోజులు ఓపిక పట్టాము. పార్టీలో అందరికి సమాన విలువ ఇవ్వాలి’’ అని సర్పంచ్ నవ్య భర్త ప్రవీణ్ అన్నారు.

తాటికొండ రాజయ్య

ఫొటో సోర్స్, Dr Thatikonda Rajaiah/Facebook

ఇది గిట్టని వారి పని: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఖండించారు.

‘‘ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో గతంలో జరిగినట్టే నాపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి’’ అని ఆయన ప్రత్యారోపణ చేశారు.

‘‘ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఇంటి దొంగలే కొంతమంది శిఖండి పాత్రను పోషిస్తున్నారు. నాపై వచ్చిన ఆరోపణలపై త్వరలోనే పార్టీ అధిష్టానాన్ని కలిసి అసలు విషయం విన్నవిస్తాను’’ అని రాజయ్య పేర్కొన్నారు.

ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు చేసిన జానకీపురం సర్పంచ్ నవ్య, ఆమె భర్త ప్రవీణ్‌లను ఫోన్ లో సంప్రదించేందుకు బీబీసీ పలుమార్లు ప్రయత్నించింది. అయితే వారు అందుబాటులోకి రాలేదు.

వీడియో క్యాప్షన్, వేసవికి ముందు విరగకాసే పూలతో సహజ సిద్ధమైన రంగులు తయారు చేస్తారు అదిలాబాద్‌లోని గిరిజనులు

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)