‘‘పాకిస్తాన్ కవ్విస్తే నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్ ఊరుకోదు’’... అమెరికా ఇంటెలిజెన్స్ వ్యాఖ్య

ఫొటో సోర్స్, FOREIGN MINISTRY OF UZBEKISTAN
పాకిస్తాన్ విషయంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత సర్కారు ఉదారంగా వ్యవహరించదని అమెరికా ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.
అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ఈ నివేదికలో, 2023లో అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారే అంశాల గురించి కూడా ప్రస్తావించారు.
అంతేకాకుండా భారత్, పాక్ దేశాల మధ్య పెరుగుతున్న వివాదంతో పాటు చైనా, యుక్రెయిన్, రష్యా దేశాల ప్రస్తావన, వాతావరణ మార్పుల వంటి అంశాలను కూడా ఈ నివేదికలో చేర్చారు.
అమెరికా పార్లమెంట్‌లో ఈ నివేదికను సమర్పించారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య క్షీణించిన సంబంధాలు తీవ్ర ఆందోళకరమైనవని అందులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు
భారత్, పాకిస్తాన్‌ల మధ్య 70 ఏళ్లకు పైగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.
ఇరు దేశాల మధ్య 3000 కిలో మీటర్లకు పైగా పొడవైన సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు వెంట చాలా చోట్ల రెండు దేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉంది.
సరిహద్దు వివాదాల కారణంగా ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు మూడు యుద్ధాలు జరిగాయి.
ఈ వివాదాలతో పాటు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ ఈ రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో కూడా రెండు దేశాల మధ్య వాగ్వాదం జరిగింది.
అయితే, 2014లో అధికారంలోకి వచ్చాక భారత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, Reuters
2015లో అఫ్గానిస్తాన్ నుంచి తిరుగు ప్రయాణంలో నరేంద్రమోదీ హఠాత్తుగా పాకిస్తాన్‌కు వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
అప్పటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, మోదీకి స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వెళ్లారు.
తర్వాత ఇద్దరు నేతలు కలిసి హెలికాప్టర్‌లో పాక్‌లోని రైవిండ్‌కు వెళ్లారు.
నవాజ్ షరీఫ్ మనవరాలి వివాహానికి కూడా మోదీ హజరయ్యారు. దిల్లీకి తిరుగు పయనం కావడానికి ముందు మోదీ, నవాజ్ షరీఫ్ సమావేశం అయ్యారు.
ఎలాంటి ప్రకటన లేకుండా అకస్మాత్తుగా మోదీ, పాకిస్తాన్‌లో పర్యటించడం భారత్-పాక్ సంబంధాలను పరిశీలించే నిపుణులను ఆశ్చర్యపరిచింది.
అయితే, దీని తర్వాత భారత్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ బేస్, యురీ మిలిటరీ బేస్, పుల్వామాలో సైనికుల కాన్వాయ్‌పై జరిగిన దాడులతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి.
యురీ, పుల్వామా దాడుల తర్వాత ప్రతీకార చర్య గురించి భారత సైన్యం మాట్లాడింది.

ఫొటో సోర్స్, HARISH TYAGI/EPA-EFE/REX/SHUTTERSTOCK
అణుయుద్ధం ప్రస్తావన
2019 ఫిబ్రవరి నెలలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య అణుయుద్ధానికి దారి తీసే పరిస్థితులు తలెత్తాయని మైక్ పాంపియో తన పుస్తకంలో పేర్కొన్నారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వ హయాంలో అమెరికా విదేశాంగ మంత్రిగా మైక్ పాంపియో పనిచేశారు. ఆయన రాసిన పుస్తకం ఇటీవలే విడుదలైంది. ఈ పుస్తకంలోనే అణుయుద్ధం ప్రస్తావన చేశారు.
‘‘భారత్, పాక్ దేశాలు 2019 ఫిబ్రవరి నెలలో అణుయుద్ధానికి ఎంత దగ్గరగా వచ్చాయనే సంగతి బహుశా ప్రపంచానికి సరిగ్గా తెలిసి ఉండకపోవచ్చు. నిజం ఏంటంటే నాకు అంతగా తెలియదు. కానీ, అవి రెండు అణుయుద్ధానికి చాలా దగ్గరగా వచ్చాయనే సంగతి మాత్రం నాకు తెలుసు.
ఆ రాత్రిని నేనెప్పుడూ మర్చిపోలేను. అప్పుడు నేను హనోయ్‌లో ఉత్తర కొరియాతో అణు ఆయుధాల గురించి చర్చల్లో ఉన్నా. అప్పుడే భారత్, పాకిస్తాన్ దేశాలు కశ్మీర్‌లోని ఉత్తర సరిహద్దుకు సంబంధించి దశాబ్దాల నాటి వివాదంలో ఒకరినొకరు బెదిరించుకోవడం ప్రారంభించాయి’’ అని ఆయన పుస్తకంలో రాశారు.
భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురించి, ప్రస్తుత విదేశాంగ మంత్రి జై శంకర్ గురించి కూడా ఆయన తన పుస్తకంలో ప్రస్తావించారు.
అయితే, అణుయుద్ధం వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అమెరికా నివేదికలో ఏం ఉంది?
అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం విడుదల చేసిన నివేదికలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు ఆందోళనకరమని వివరించారు.
‘‘భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న సంక్షోభం, చాలా ఆందోళనకరమైన అంశం. ఎందుకంటే, రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది.
అయితే, ఈ రెండు దేశాలు 2021 ప్రారంభంలో కాల్పుల విరమణ కొనసాగించడంపై పరస్పర ఒప్పందం చేసుకున్నాయి. అప్పటి నుంచి శాంతిని కొనసాగించడానికి ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి’’ అని నివేదికలో రాశారు.
ఈ నివేదికలో పాకిస్తాన్ పట్ల విమర్శనాత్మక వైఖరిని అవలంభించారు.
‘‘పాకిస్తాన్ చాలా కాలంగా భారత్ వ్యతిరేక తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తోంది. ఒకవేళ పాకిస్తాన్, భారత్‌ను రెచ్చగొట్టే పనులు చేసినా లేదా అలా చేసినట్లు కనిపించినా, సైనిక ప్రతీకార చర్యను భారత్ చేపట్టవచ్చు.
నరేంద్రమోదీ నాయకత్వంలోని భారత్, పాకిస్తాన్ నుంచి వచ్చే కవ్వింపు చర్యలకు సైనిక శక్తితో ప్రతిస్పందించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది’’ అని నివేదికలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- మూత్రపిండాలు: కిడ్నీ సమస్యలను గుర్తించడం ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
- సుషీ టెర్రర్: జపాన్‌లో రెస్టారెంట్ల వ్యాపారాన్ని ప్రమాదంలో పడేసిన ఆ వైరల్ వీడియోల్లో ఏముంది?
- భారత్ మ్యాట్రిమోనీ విడుదల చేసిన వీడియోపై వివాదమెందుకు? అందులో ఏముంది?
- పూర్వీకుల ఇళ్లకు ప్రాణం పోస్తున్న యువతరం
- మెక్సికో కిడ్నాప్స్: ఏటా 10 లక్షల మంది అమెరికన్లు ప్రమాదమని తెలిసినా వైద్యం కోసం మెక్సికో ఎందుకు వెళుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















