పాకిస్తాన్: యూనివర్సిటీల్లో హోలీ చేసుకుంటున్న హిందూ విద్యార్థులపై దాడి చేసిందెవరు?

పంజాబ్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు
ఫొటో క్యాప్షన్, పంజాబ్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు
    • రచయిత, షుమేలా జాఫ్రీ
    • హోదా, బీబీసీ న్యూస్, ఇస్లామాబాద్

పాకిస్తాన్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో హోలీ సంబరాలు చేసుకుంటున్న సింధి స్టూడెంట్ కౌన్సిల్ సంఘానికి చెందిన హిందూ విద్యార్థుల మీద, వారి ముస్లిం స్నేహితులు కొందరి మీద.. మితవాద విద్యార్థి సంఘం ఇస్లామీ జమీయత్ తులేబా సభ్యులు దాడి చేసి కొట్టారని ఆరోపణలు వచ్చాయి.

అయితే, లాహోర్‌లోని యూనివర్సిటీ పాలనాయంత్రాంగం అలాంటి ఘటన ఏదీ జరగలేదని తిరస్కరించింది. ఇస్లామీ జమీయత్ తులేబా సైతం.. తాము మైనారిటీల హక్కులకు మద్దతు ఇస్తామని, ఈ దాడిలో తమ సంఘం వారి పాత్ర లేదని చెప్తూ ఆరోపణలను ఖండించింది.

పంజాబ్ యూనివర్సిటీ పాకిస్తాన్‌లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అతి పెద్దది. అక్కడ చదువుతున్న హిందూ విద్యార్థుల సంఖ్య దాదాపు 30 మంది వరకూ ఉంది. వీరిలో ఎక్కువ మంది పంజాబ్ సింధ్ ప్రాంతానికి చెందినవారు. వీళ్లు తమ ఇంటికి దూరంగా లాహోర్‌లో ఉండి చదువుకుంటున్నారు.

వీళ్లందరూ సోమవారం హోలీ వేడుకల కోసం పంజాబ్ యూనివర్సిటీ లా-కాలేజ్ ఎదురుగా గుమిగూడారు. ఆ సమయంలో తమపై ఇస్లామీ జమీయత్ తుల్బాకు చెందిన ఒక పెద్ద గ్రూపు దాడి చేసిందని వారు చెబుతున్నారు.

ఆ దాడిలో, హిందూ విద్యార్థులతోపాటూ వారితో కలిసి హోలీ వేడుకలు జరుపుకుంటున్న ముస్లిం విద్యార్థులు కూడా గాయప్డడారని తెలిపారు.

కరాచీలో విద్యార్థుల నిరసన
ఫొటో క్యాప్షన్, కరాచీలో విద్యార్థుల నిరసన

ఈ విద్యార్థులు యూనివర్సిటీలోని జిమ్నాజియం గ్రౌండ్‌లో హోలీ ఉత్సవం జరుపుకోవటానికి అనుమతి పొందేందుకు తాను సాయపడ్డట్లు.. పాకిస్తాన్‌లో హిందువుల హక్కుల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ సమాజ్ సేవా ఫౌండేషన్ చైర్మన్ చమన్ లాల్ బీబీసీతో చెప్పారు.

ఆ విద్యార్థులపై దాడి జరిగినపుడు తాను లాహోర్‌లో లేనని, అయితే సోమవారం నాడు విద్యార్థుల నుంచి తనకు ఫోన్ కాల్స్ రావటం మొదలైందని పేర్కొన్నారు. ఆ విద్యార్థులు జిమ్నాజియం గ్రౌండ్‌లోకి వెళ్లటానికి సిద్ధమవుతుండగా జమీయత్ విద్యార్థుల బృందం వారిపై దాడిచేసి కొట్టినట్లు ఆ ఫోన్ కాల్స్ ద్వారా తనకు చెప్పారని ఆయన వివరించారు.

ఈ దాడికి సంబంధించిన వీడియోలను తాను వీక్షిస్తుండగా పంజాబ్ యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి తనకు ఫోన్ వచ్చిందన్నారు. ఆ విద్యార్థులు అనుమతిని ఉల్లంఘించారని, తమకు కేటాయించిన ప్రదేశంలో కాకుండా లా కాలేజీలో హోలీ సంబరాలు జరుపుకుంటున్నారని, వారి మీద యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు చేపడుతుందని తనతో చెప్పారని చమన్ లాల్ చెప్పారు.

‘‘ఒకవేళ విద్యార్థులు అనుమతిని ఉల్లంఘించినట్లయితే.. వారిని ఆపే హక్కు జమీయత్ సభ్యులకు ఎక్కడిదని నేను ఆయనను అడిగాను. వారిని ఆపాల్సిన విధి యూనివర్సిటీ యాజమాన్యానిది కాదా?’’ అన్నారాయన.

పాకిస్తాన్‌లోని పంజాబ్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, WWW.PU.EDU.PK

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని పంజాబ్ యూనివర్సిటీ

సింధి స్టూడెంట్ కౌన్సిల్ విద్యార్థులు తమపై దాడికి నిరసన తెలపటానికి వైస్ చాన్సలర్ ఆఫీస్ దగ్గరకు వెళ్లినపుడు.. యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు వారి మీద లాఠీలతో దాడి చేశారని కూడా చమన్ లాల్ చెప్పారు.

హోలి ఉత్సవాలకు సంబంధించి తాము సోషల్ మీడియాలో ఆహ్వానాన్ని పోస్ట్ చేసినప్పటి నుంచీ జమీయత్ కార్యకర్తలు తమను బెదిరిస్తూ ఉన్నారని సింధి స్టూడెంట్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ కాషిఫ్ బ్రోహి బీబీసీతో చెప్పారు.

హోలీకి సద్ధమవటం కోసం లా కాలేజీ గ్రౌండ్‌లో తాము గుమిగూడుతున్న సమయంలో జమీయత్ కార్యకర్తలు లాఠీలు పట్టుకుని వచ్చి తమను కొట్టటం మొదలుపెట్టారని తెలిపారు. ఈ ఘటనలో కొందరు విద్యార్థులు గాయపడ్డట్లు కాషిఫ్ చెప్పారు.

ఈ ఆరోపణలను పంజాబ్ యూనివర్సిటీ ఒక పత్రికా ప్రకటనలో ఖండించింది. యూనివర్సిటీలో ‘‘హోలీ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఘర్షణా జరగలేదు’’ అని పేర్కొంది. క్యాంపస్‌లో ఏ హిందూ విద్యార్థి కూడా ఏ గొడవలోనూ గాయపడలేదని చెప్పింది.

అయితే.. మరో రాష్ట్రానికి చెందిన జాతిపరమైన విద్యార్థి సంఘం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వర్సిటీలోని హిందూ విద్యార్థులను పావుగా వాడుకుందంటూ పరోక్షంగా సింధ్ స్టూడెంట్ కౌన్సిల్‌ను నిందించింది.

గాయపడిన పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి

ఫొటో సోర్స్, KASHIF BROHI

ఫొటో క్యాప్షన్, పంజాబ్ యూనివర్సిటీలో జరిగిన ఘర్షణలో గాయపడిన విద్యార్థి.. వర్సిటీలో ఎలాంటి ఘర్షణా జరగలేదని యూనివర్సిటీ ఖండించింది

లాహోర్ పంజాబ్ యూనివర్సిటీ చారిత్రకంగా ఇస్లామి జమీయత్ తులేబాకు బలమైన కేంద్రంగా ఉంది. మితవాద సంస్థ అయిన జమాతే ఇస్లామీకి చెందిన విద్యార్థి విభాగం ఇది. అయితే.. ఈ వర్సిటీలో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశం కల్పించటం కోసం రెండు దశాబ్దాల కిందట కోటా ప్రవేశపెట్టారు. అప్పటి నుంచీ జాతిపరమైన విద్యార్థి రాజకీయాలతో వర్సిటీ వేడెక్కుతోంది.

సింధ్ స్టూడెంట్ కౌన్సిల్.. పాలనా యంత్రాంగానికి సమాచారం ఇవ్వకుండా బలవంతంగా వేదికను మార్చారని, లా కాలేజీ గ్రౌండ్‌లో ఉత్సవాల నిర్వహణ కోసం లౌడ్ స్పీకర్లు, ఇతర పరికరాలు తీసుకెళ్లారని, దీంతో గొడవ రాజుకుందని యూనివర్సిటీ ప్రకటనలో పేర్కొంది.

అక్కడికి వర్సిటీ అధికారులు, సెక్యూరిటీ గార్డులు చేరుకున్నపుడు ఆ విద్యార్థులు వాగ్వాదానికి దిగారని చెప్పింది. అంతేకానీ అక్కడ భౌతిక ఘర్షణ జరగలేదని చెప్పింది. ఆ తర్వాత సింధ్ స్టూడెంట్ కౌన్సిల్ సభ్యులు వైస్ చాన్సలర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి రాళ్లు విసరటం మొదలుపెట్టారని, దీంతో వర్సిటీ గార్డులు వారిని చెదరగొట్టేందుకు లాఠీలతో తరిమారని వర్సిటీ అధికార ప్రతినిధి ఆ ప్రకటనలో వివరించారు. ఈ గొడవలో ఏ ఒక్క విద్యార్థీ గాయపడలేదని పేర్కొన్నారు.

సింధ్ స్టూడెంట్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ కాషిఫ్ బ్రోహి
ఫొటో క్యాప్షన్, సింధ్ స్టూడెంట్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ కాషిఫ్ బ్రోహి

మరోవైపు.. కరాచీ యూనివర్సిటీ క్యాంపస్‌లో హిందూ విద్యార్థులను వేధించారని, హోలీ జరుపుకోకుండా అడ్డుకున్నారని ఒక హిందూ యువతి చెప్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విద్యార్థులపై దాడి చేసింది, హోలీ జరుపుకోకుండా అడ్డుకున్నది జమీయత్ విద్యార్థి సంఘం అని ఆమె ఆరోపించారు.

అయితే విద్యార్థులు హోలీ జరుపుకోకుండా హింసించారన్న కథనాలను కరాచీ యూనివర్సిటీ తిరస్కరించింది. ‘‘యూనివర్సిటీ ఆవరణలో హోలీ జరుపుకోవటానికి అనుమతి ఏదీ కోరలేదు. అలాంటి ఉత్సవాలకు వ్యతిరేకంగా ఎలాంటి హింసాత్మక ఘటనలూ జరగలేదు’’ అని వర్సిటీ ఒక ప్రకటనలో చెప్పింది.

కానీ వర్సిటీ క్యాంపస్‌కు పోలీసులు వచ్చారని, రెండు విద్యార్థి బృందాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని వార్తలు వచ్చాయి.

ఈ అంశాలపై దర్యాప్తు జరిపి, సవివరమైన నివేదిక అందించాలని కరాచీ వర్సిటీ వైస్ చాన్సలర్‌ను సింధ్ యూనివర్సిటీల మంత్రి ఇస్మాయిల్ రాహో ఆదేశించారు.

‘‘హిందూ విద్యార్థులు హోలీ ఉత్సవాలు జరుపుకోవచ్చు. వారిని ఏ ఒక్కరూ అడ్డుకోజాలరు’’ అని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఘటనలకు వ్యతిరేకంగా కరాచీ ప్రెస్ క్లబ్ వెలుపల నిరసన చేపట్టాలని ప్రోగ్రెసివ్ యూత్ అలయన్స్ అనే సంఘం పిలుపునిచ్చింది.

ఇస్లామీ జమీయత్ తుల్బా విద్యార్థి సంఘానికి యూనివర్సిటీ క్యాంపస్‌లో సుదీర్ఘ కాలంగా మోరల్ పోలీసింగ్ నిర్వహించిన చరిత్ర ఉంది. అయితే తాజా ఘటనల్లో తమ పాత్ర లేదని ఆ సంఘం చెప్తోంది.

‘‘ఒక విద్యార్థి సంఘంగా మేం మా సొంత కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇతరులు చేస్తున్న దాంట్లో తలదూర్చం. ఇతర బృందాలు, సమాజాలు తమకు నచ్చిన విధంగా కార్యక్రమాలు నిర్వహించుకునే, సమావేశమయ్యే హక్కులను, నిర్ణయాలను మేం గౌరవిస్తాం. వాటిలో మేం జోక్యం చేసుకోం’’ అని జమీయత్ అధికార ప్రతినిధి ఉసామా మిర్ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు. మైనారిటీలు తమ ఉత్సవాలు జరుపుకునే హక్కును తాము గుర్తిస్తున్నామని కూడా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)