సింగిల్ స్క్రీన్ థియేటర్స్: శిథిలాలుగా మారుతున్న ఒకనాటి భారతదేశ సినిమా వైభవ ప్రతీకలు

సింగిల్ స్క్రీన్ థియేటర్లు

ఫొటో సోర్స్, HEMANT CHATURVEDI

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు తగ్గిపోతున్నాయి.
    • రచయిత, చెరిలాన్ మొలన్
    • హోదా, బీబీసీ న్యూస్

ఇప్పుడంతా మల్టీప్లెక్స్‌ల హవా నడుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ భారతదేశంలోనూ ఇప్పటికే వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. లేదా మల్టీప్లెక్స్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు కూర్చొనేలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండేవి. కొన్ని థియేటర్ల నిర్మాణ శైలి భిన్నంగా ఉండేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి.

సినిమాటోగ్రాఫర్ హేమంత్ చతుర్వేది, సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఫొటోలను 2019 నుంచి తీస్తున్నారు.

సుమారు 15 రాష్ట్రాల్లోని 950 సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఫొటోలను ఆయన తీశారు.

''గత 25ఏళ్లలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య 24వేల నుంచి 9వేలకు పడిపోయింది. కొన్ని థియేటర్లను పడగొట్టి షాపింగ్ మాల్స్, రెసిడెన్సియల్ బిల్డింగులు కట్టారు. మరి కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి'’ అని హేమంత్ అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఉన్న వాళ్ల తాతయ్య ఇంటికి వెళ్లినప్పుడు, తను చిన్నతనంలో సినిమాలు చూసే లక్ష్మీ టాకీస్‌కు మరొకసారి వెళ్లారు హేమంత్. కానీ ఆ థియేటర్ మూతపడి ఉంది.

ఒకనాడు దైవంలా ప్రజలు ఆరాధించిన ఆ థియేటర్, నేడు దుమ్ముధూళితో నిండిపోయి ఉంది. పట్టణీకరణ వల్ల ఆ నగరం చరిత్ర ఎలా శిథిలమవుతూ వస్తోందో అప్పుడు హేమంత్ గమనించారు. అలా దేశంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లను చిత్రీకరించాలని ఆయన నిర్ణయించుకున్నారు.

నిరంజన్ టాకీస్

ఫొటో సోర్స్, HEMANT CHATURVEDI

నిరంజన్ టాకీస్

ఉత్తరప్రదేశ్‌లోని నిరంజన్ టాకీస్‌ను 1940లలో నిర్మించారు. 1989 ప్రాంతంలో ఆస్తి వివాదం వల్ల అది మూతపడింది. ఒకనాడు అది దేదీప్యమానంగా వెలుగులీనింది. ఎంతో విశాలంగా ఉండే ఆ థియేటర్ గోడల మీద ఆకట్టుకునే కళాకృతులు ఉండేవి. నేటికి ఆ థియేటర్ శిథిలాల్లో అవి కనపడతాయి.

'‘నాడు అలహాబాద్‌లో నిరంజన్ టాకీస్‌ను తొలి ఏసీ థియేటర్‌గా చెబుతారు. షో అయిపోయిన తరువాత థియేటర్ డోర్లు తెరచినప్పుడు, బయటకు వచ్చే చల్లని గాలి కోసం నాడు చాలా మంది గేట్ల వద్ద నిలబడే వారని స్థానికులు చెప్పారు'’ అని హేమంత్ అన్నారు.

గంగా టాకీస్

ఫొటో సోర్స్, HEMANT CHATURVEDI

ఫొటో క్యాప్షన్, గంగా టాకీస్

గంగా టాకీస్

రాజస్థాన్‌లోని గంగా టాకీస్‌ను నాటి రాజులు నిర్మించారని చెబుతారు.

20ఏళ్ల కిందట ఆ థియేటర్ మూతపడింది. బూజుపట్టిన, శిథిలమైన గోడల మీద ఎన్నో విలువైన జ్ఞాపకాలు కనిపిస్తాయి. 1961లో హిట్‌ అయిన షమ్మీ కపూర్ సినిమా జంగ్లీతోపాటు నర్గీస్ చివరి సినిమా రాత్ ఔర్ దిన్(1967) పోస్టర్లు మనల్ని నాటి రోజుల్లోకి తీసుకెళ్తాయి.

విజయానంద్ టాకీస్

ఫొటో సోర్స్, HEMANT CHATURVEDI

ఫొటో క్యాప్షన్, విజయానంద్ టాకీస్

విజయానంద్ టాకీస్

మహారాష్ట్రలోని విజయానంద్ టాకీస్‌ను 1914లో నిర్మించారు.

ఒకప్పుడు ఈ థియేటర్‌ ఉన్న ప్రదేశానికి దగ్గరల్లో దాదాసాహేబ్ ఫాల్కే సినిమాలు ప్రదర్శించేవారని చెబుతారు. రెండు చెట్లకు తెల్లని గుడ్డ కట్టి, దాని మీద ఆయన సినిమాలు ప్రదర్శించేవారంట.

‘''తెల్లని గుడ్డ మీద కదులుతున్న బ్లాక్ అండ్ వైట్ బొమ్మల్ని చూసి స్థానికులు భయపడ్డారట. అదేదో చేతబడి అనుకొని, దాదాసాహేబ్ ఫాల్కే మీద దాడి చేశారట. ప్రొజెక్టర్‌ను పగలకొట్టి, సినిమా ఫిలింను కాల్చివేశారట. దాంతో అది బాణామతి కాదని, దాన్ని సినిమా అంటారని పోలీసులు ప్రచారం చేయాల్సి వచ్చిందట'’ అని హేమంత్ చతుర్వేది తెలిపారు.

భారతదేశం తొలి ఫుల్‌లెంగ్త్ ఫీచర్ ఫిలిం రాజా హరిశ్చంద్ర తీసిన వ్యక్తి దాదాసాహేబ్ ఫాల్కే.

నేడు ఆయన పేరు మీదుగా సినిమా రంగంలో విశేషకృషి చేసిన వారికి ప్రతి ఏడాది అవార్డు ఇస్తున్నారు.

రాయల్ టాకీస్

ఫొటో సోర్స్, HEMANT CHATURVEDI

ఫొటో క్యాప్షన్, రాయల్ టాకీస్

రాయల్ టాకీస్

ముంబయిలోని 'ప్లే హౌస్' అనే ప్రాంతంలో 1800ల ప్రాంతం నుంచి రాయల్ టాకీస్ ఉంది. ఒకనాడు ఆ ఏరియాలో నాటకాలు, కచేరీలు జరిగే అనేక థియేటర్లు ఉండేవి. 1900ల ప్రాంతంలో భారతదేశానికి సినిమా పరిచయమైన తరువాత నాటకాలు వేసే ఆ థియేటర్లను క్రమంగా సినిమా థియేటర్లుగా మార్చారు.

‘'ఇప్పటికీ ఉన్న ఆ భవనాలను చూస్తే, తెర వెనుక డయాస్ కనిపిస్తుంది. మేకప్ వేసుకునే, బట్టలు మార్చుకునే గదులు కూడా ఉంటాయి. రాయల్ టాకీస్‌లో 1950, 1962 సంవత్సరాలకు చెందిన రెండు లెటర్ హెడ్స్ కనిపించాయి. ఒకనాడు ఆ ప్రాంతాన్ని ప్లే హౌస్ అని పిలిచేవారు అనడానికి అవి రుజువులుగా ఉన్నాయి'’ అని హేమంత్ చెప్పారు.

వాద్వాన్

ఫొటో సోర్స్, HEMANT CHATURVEDI

ఫొటో క్యాప్షన్, వాద్వాన్

వాద్వాన్

గుజరాత్‌లోని వాద్వాన్ సంస్థానంలో ఒక శిథిల కట్టడం ఉంది. ఆ కట్టడంలో ఒక టికెట్ విండో నేటికీ కనిపిస్తోంది.

ఫిలిం ప్రొజెక్టర్‌ను కనిపెట్టిన లూమియర్ సోదరులు 1896లో బాంబేకి వచ్చినప్పుడు, నాటి వాద్వాన్ రాజు వారికి రూ.10 వేలు చెల్లించి, ఒక ప్రొజెక్టర్‌ బుక్ చేశారనే కథలు ఇక్కడ ప్రచారంలో ఉన్నాయి.

సుమారు 10ఏళ్ల తరువాత ఆ ప్రొజెక్టర్ భారత్‌కు వచ్చింది. ఓపెన్ థియేటర్‌లో తెర కట్టి దాన్ని అమర్చారు. దేశంలో మూకీ సినిమాలను ప్రదర్శించిన తొలి థియేటర్లలో అది ఒకటని హేమంత్ అన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి ఒక టికెట్లు విక్రయించే కిటికీ మాత్రమే మిగిలింది.

భగవత్ చిత్ర మందిర్

ఫొటో సోర్స్, HEMANT CHATURVEDI

ఫొటో క్యాప్షన్, భగవత్ చిత్ర మందిర్

భగవత్ చిత్ర మందిర్

షోలాపుర్‌లని భగవత్ చిత్ర మందిర్‌ను 1935లో కట్టారు.

ప్రముఖ గాయని లతా మంగేష్కర్, 5ఏళ్ల వయసులో తొలిసారి ఇక్కడ ప్రదర్శన ఇచ్చినట్లు చెబుతారు. ఆ థియేటర్ ప్రాంగణంలోనే మరొక మూడు థియేటర్లను యాజమాన్యం కట్టింది. ఛాయా మందిర్, కాలా మందిర్, ఉమా మందిర్ అనేవి వాటి పేర్లు.

భారతదేశంలో పదుల సంఖ్యలో సింగిల్ స్క్రీన్ థియేటర్లను డిజైన్ చేసిన డబ్ల్యూఎం నామ్‌జోషీ వాటిని నిర్మించారు.

‘'భారతదేశంలో మల్టీప్లెక్స్ ట్రెండ్‌కు తామే తెరతీశామని ఆ థియేటర్ల యాజమాన్యం చెబుతూ ఉంటుంది'’ అని హేమంత్ అన్నారు.

నిశాంత్ సినిమా

ఫొటో సోర్స్, HEMANT CHATURVEDI

ఫొటో క్యాప్షన్, నిశాంత్ సినిమా

నిశాంత్ సినిమా

ముంబయిలోని నిశాంత్ సినిమా థియేటర్‌ను రిపేర్లు చేసి ఇటీవలే తిరిగి తెరచారు. షారూఖ్ ఖాన్‌ నటించిన పఠాన్ సినిమా విడుదలైంది.

ఆ థియేటర్‌కు ప్రజలు భారీగా రావడంతో దగ్గర్లోని థియేటర్‌ నుంచి 'హౌస్ ఫుల్' అనే బోర్డును అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని దశాబ్దాలుగా హౌస్ ఫుల్ బోర్డును వాడాల్సిన అవసరం వారికి రాలేదు. దాంతో దాన్ని ఎక్కడో పెట్టి మరచిపోయామని చెప్పారు.

గమనిక: అన్ని ఫొటోలకు కాపీరైట్లు వర్తిస్తాయి.

వీడియో క్యాప్షన్, వేసవిలో చల్లని నీటిని అందించే ‘రంజన్లను’ పేదవాడి ఫ్రిడ్జ్ గా ఆదిలాబాద్‌లో పిలుస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)