అదానీ కంపెనీలలో భారీగా డబ్బులు గుమ్మరిస్తున్న జీక్యూజీ చైర్మన్ రాజీవ్ జైన్ ఎవరు... అమెరికాలో ఆయన కంపెనీ ఏం చేస్తోంది?

రాజీవ్ జైన్

ఫొటో సోర్స్, TWITTER/GQGPARTNERS

ఫొటో క్యాప్షన్, జీక్యూజీ చైర్మన్ రాజీవ్ జైన్
    • రచయిత, కమలేశ్ మఠేనీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అదానీ గ్రూప్‌లో తాజాగా పెట్టుబడులు పెట్టడంతో అమెరికన్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ 'జీక్యూజీ' పార్ట్‌నర్స్ పేరు వెలుగులోకి వచ్చింది.

జీక్యూజీ పార్ట్‌నర్స్, అదానీ గ్రూప్‌కు చెందిన నాలుగు కంపెనీలలో 1.87 బిలియన్ (రూ. 15,280 కోట్లు) డాలర్లు భారీ పెట్టుబడిని పెట్టింది.

అమెరికా ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ కంపెనీ 'హిండెన్‌బర్గ్ రీసెర్చ్' నివేదిక వెలువడిన తర్వాత నుంచి అదానీ గ్రూప్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ జనవరి 24న హిండెన్‌బర్గ్ నివేదికను వెలువరించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది.

ఈ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయాయి. కొన్ని రోజుల్లోనే అదానీ గ్రూప్, తన మార్కెట్ విలువలో 135 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11 లక్షల కోట్లు) నష్టాన్ని చవిచూసింది.

రేటింగ్ ఏజెన్సీ అయిన 'మూడీస్‌'కు చెందిన ఐసీఆర్‌ఏ విభాగం శనివారం గౌతమ్ అదానీ గ్రూపు పోర్టులు, ఎనర్జీ వ్యాపారాల రేటింగ్‌ను తగ్గించింది.

అదానీ గ్రూపు రేటింగ్‌ను 'స్థిరం'' నుంచి ''నెగెటివ్''గా మార్చింది.

అయితే, తాజా పెట్టుబడులను కేవలం ఆర్థిక ప్రయోజనాల రూపంలోనే కాకుండా తమ కంపెనీ ఇమేజ్‌గా అదానీ గ్రూపు చూస్తోంది. వీటి ద్వారా మళ్లీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనాలని కంపెనీ భావిస్తోంది.

గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గౌతమ్ అదానీ

అదానీ గ్రూపుకు చెందిన ఏ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయి?

అదానీ గ్రూపులోని 4 కంపెనీల్లో జీక్యూజీ పార్ట్‌నర్స్ సంస్థ పెట్టుబడులు పెట్టింది.

లైన్
  • అదానీ ఎంటర్‌ప్రైజెస్: సుమారు 54 బిలియన్ (రూ. 5,400 కోట్లు) రూపాయల కంపెనీ వాటాలో 3.4 శాతం వాటాను కొనుగోలు చేసింది.
  • అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్: రూ. 52 బిలియన్ల (రూ. 5,200 కోట్లు) ఈ సంస్థలో 4.1 శాతం వాటాను సొంతం చేసుకుంది.
  • అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్: ఈ సంస్థ విలువ రూ. 18 బిలియన్లు (రూ. 1,800 కోట్లు). ఇందులో 2.5 శాతం వాటాను జీక్యూజీ కొనుగోలు చేసింది.
  • అదానీ గ్రీన్ ఎనర్జీ: రూ. 27 బిలియన్ల (రూ. 2,700 కోట్లు) వాటాలో 3.5 శాతం వాటాలను సొంతం చేసుకుంది.

హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూపు, తమకు వచ్చిన ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించడం ఇదే తొలిసారి.

ఈ పెట్టుబడులు గురించి బయటకు తెలియగానే, శుక్రవారం అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 17.5 శాతం, అదానీ పోర్ట్స్ షేర్లు 10 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు 5 శాతం చొప్పున వృద్ధి నమోదు చేశాయి.

అదానీ గ్రూప్‌కు సంబంధించిన కంపెనీల పురోగతి, పనితీరు, నిర్వహణపై ప్రపంచ పెట్టుబడిదారులు ఇప్పటికీ నమ్మకంగా ఉన్నారని ఈ పెట్టుబడి తెలియజేస్తోందని అదానీ గ్రూప్ సీఎఫ్‌వో జుగేషీందర్ సింగ్ అన్నారు.

అదానీ

ఫొటో సోర్స్, Getty Images

రాజీవ్ జైన్ ఎవరు?

లైన్
  • జీక్యూజీ పార్ట్‌నర్స్ అనేది అమెరికాకు చెందిన ఒక అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ.
  • ఈ కంపెనీ, అదానీ గ్రూప్‌లో 1.87 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.
  • జీక్యూజీ పార్ట్‌నర్స్ కంపెనీ చైర్మన్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా రాజీవ్ జైన్ వ్యవహరిస్తున్నారు.
  • అలాగే, జీక్యూజీ పార్ట్‌నర్స్ స్ట్రాటజీస్‌ అన్ని పోర్ట్‌ఫోలియోలకు ఆయనే మేనేజర్ కూడా.
లైన్

జీక్యూజీ పార్ట్‌నర్స్ అనేది ఒక పెట్టుబడిదారుల సంస్థ. తమ క్లయింట్ల తరఫున మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుంది

జీక్యూజీ పార్ట్‌నర్స్ లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం, 2022 డిసెంబర్ 31 నాటికి ఈ కంపెనీ, క్లయింట్ల కోసం 88 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తులను నిర్వహిస్తోంది.

కంపెనీ ప్రధాన కార్యాలయం అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంది. న్యూయార్క్, లండన్, సియాటెల్, సిడ్నీల్లో కూడా ఈ కంపెనీ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కంపెనీలో 51 నుంచి 200 మంద సిబ్బంది పనిచేస్తున్నారు.

జీక్యూజీ పార్ట్‌నర్స్ కంపెనీ, ఆస్ట్రేలియా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టెడ్ కంపెనీగా ఉంది. 2021లో ఆస్ట్రేలియాలో అతిపెద్ద ఐపీఓను నిర్వహించింది.

రాజీవ్ జైన్, జీక్యూజీ పార్ట్‌నర్స్ కంపెనీ చైర్మన్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్. జీక్యూజీ పార్ట్‌నర్స్ స్ట్రాటజీస్ అన్ని పోర్ట్‌ఫోలియోలకు మేనేజర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

భారత్‌లో జన్మించిన రాజీవ్ జైన్, అజ్మీర్ విశ్వవిద్యాలయంలో అకౌంటింగ్‌లో గ్రాడ్యుయేషన్ చదివినట్లు ఫోర్బ్స్ తెలిపింది.

అకౌంటింగ్‌లోనే మాస్టర్స్ డిగ్రీ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత మియామి యూనివర్సిటీలో ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ఎంబీఏ చేశారు.

దీని తర్వాత, స్విస్ బ్యాంక్ కార్పొరేషన్‌లో ఇంటర్నేషనల్ ఈక్విటీ అనలిస్ట్‌గా రాజీవ్ జైన్ పనిచేయడం మొదలుపెట్టారు.

వీడియో క్యాప్షన్, ఆరేళ్లలో ప్రపంచ సంపన్నుడిగా ఎదిగిన అదానీ

రాజీవ్ జైన్ లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం చూస్తే, ఆయన స్విస్ కంపెనీ 'వోంటోబెల్ అసెట్ మేనేజ్‌మెంట్‌'లో కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, ఈక్విటీస్ హెడ్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తుంది. 1994లో ఆయన వొంటోబెల్‌లో చేరారు.

పెట్టుబడుల రంగంలో 23 సంవత్సరాల అనుభవం సాధించిన తర్వాత 2016 జూన్‌లో ఆయన జీక్యూజీ పార్ట్‌నర్స్ సంస్థను ప్రారంభించారు.

జీక్యూజీ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా 1000 పైగా సంస్థాగత పెట్టుబడిదారుల ఆస్తులను నిర్వహిస్తుంది. అలాగే తన ఖాతాదారులకు ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేస్తుంది.

అదానీ గ్రూప్ గురించి రాజీవ్ జైన్ మాట్లాడుతూ, ఈ కంపెనీల్లో దీర్ఘకాలిక విస్తరణకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.

తన తరంలోని అత్యత్తమ పారిశ్రామికవేత్తలలో అదానీ ఒకరు అంటూ ఆయన గౌతమ్ అదానీని ప్రశంసించారు.

ఫిబ్రవరి 23న బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రాజీవ్ జైన్, అదానీ గ్రూపుపై విశ్వాసం వ్యక్తం చేశారు.

''పెట్టుబడుల విషయంలో చైనా కంటే భారత్‌ బలంగా ఉందని మీరు అంటారు కదా. అదానీ-హిండెన్‌బర్గ్ అంశం తర్వాత కూడా మీరు భారత్‌ను అదే స్థితిలో చూస్తున్నారా'' అని రాజీవ్ జైన్‌ను ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు రాజీవ్ జైన్ బదులిస్తూ, ''మా దృష్టిలో ఏమీ మారలేదు. అదానీ కేసు పరంగా చూస్తే, నా దృష్టిలో ఇంకా చాలా బలమైన అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది, బ్యాంకింగ్ వ్యవస్థ బాగుంది. రెండో అంశం ఏంటంటే, ఇవి నియంత్రిత ఆస్తులు. భారత వ్యవస్థ మీద మాకు ఎలాంటి ఆందోళన లేదు. అదానీది వేరే కేసు" అని ఆయన వివరించారు.

అదానీ గ్రూపు

ఫొటో సోర్స్, Getty Images

పెట్టుబడులపై ప్రశ్నలు

అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం గురించి జీక్యూజీని దాని క్లయింట్‌లలో ఒకరు ప్రశ్నించారు.

జీక్యూజీ క్లయింట్ 'ఆస్ట్రేలియన్ పెన్షన్ ఫండ్' అనే సంస్థ ఈ పెట్టుబడుల గురించి ప్రశ్నించింది.

ఆస్ట్రేలియాలోని కనీసం నాలుగు అతిపెద్ద పెన్షన్ ఫండ్‌ సంస్థల నుంచి జీక్యూజీ డబ్బును సేకరించింది.

అదానీ గ్రూపుపై లోతైన పరిశోధన చేశామని, హిండెన్‌బర్గ్ నివేదికతో తాము ఏకీభవించడం లేదని రాజీవ్ జైన్ బదులిచ్చినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై దర్యాప్తు కోసం మంగళవారం సుప్రీం కోర్టు ఒక స్వతంత్ర్య కమిటీని ఏర్పాటు చేసింది.

మాజీ న్యాయమూర్తి అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలోని ఈ కమిటీ రెండు నెలల్లో కోర్టుకు తన నివేదికను సమర్పించనుంది.

జస్టిస్ జేపీ దేవధర్, బ్యాంకర్ కేవీ కామత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, ఎస్‌బీఐ మాజీ చైర్మన్ ఓపీ భట్, సెక్యురిటీ లా నిపుణుడు సోమశేఖర్ సుందరేశన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)