పాల కోసం వెళుతుండగా డైనోసార్ల కాలంనాటి తుమ్మెద కనిపించింది....

జురాసిక్ కాలం కీటకం

ఫొటో సోర్స్, MICHAEL SKVARLA / PENN STATE

    • రచయిత, క్లో కిమ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2012లో మైఖేల్ స్క్వార్లా తనకు తెలియకుండానే ఓ అద్భుతాన్ని గుర్తించారు.

అర్కాన్సాస్‌లోని వాల్‌మార్ట్‌కు పాల కోసం వెళుతుండగా ఆ భవనం దగ్గర్లో ఆయన ఒక భారీ కీటకాన్ని గుర్తించారు.

దాని రెక్కలు దాదాపు రెండు అంగుళాలు పొడవు ఉన్నాయి. స్క్వార్లా కీటకాలపై అధ్యయనాలు చేస్తుంటారు. కాబట్టి ఆయన దానిని ఇంటికి తీసుకెళ్లారు. అయితే తర్వాత దాని గురించి మరచిపోయారు.

కానీ 2020లో స్క్వార్లా దానిని తాను పని చేస్తున్న కాలేజీలో విద్యార్థులకు చూపించారు.

దాన్ని చూశాక, ఇది ఊహించిన దానికంటే చాలా అరుదైనదని వారికి అర్ధమైంది.

అదే జెయింట్ లేస్‌వింగ్ జాతికి చెందిన తుమ్మెద.

50 సంవత్సరాలుగా తూర్పు ఉత్తర అమెరికాలో కనిపించకుండా పోయిన ఈ తుమ్మెదను స్క్వార్లా కనుగొన్నారు.

పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో స్క్వార్లా దగ్గర చదువుకునే కీటక శాస్త్ర విద్యార్థులలో ఒకరైన కోడి మాథిస్ మాట్లాడుతూ " ఈ తుమ్మెద మామూలు తుమ్మెద కాదని మాకు అర్ధమైంది'' అని అన్నారు.

స్క్వార్లా ప్రస్తుతం పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఇన్‌సెక్ట్ ఐడెంటిఫికేషన్ ల్యాబ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

తాను కనుగొన్న ఈ తుమ్మెద గురించి ఇటీవల వెలువడిన ఓ రిపోర్ట్‌కు ఆయన సహ రచయితగా వ్యవహరించారు.

ఆ కీటకం విశాలమైన రెక్కలు స్క్వార్లా, ఆయన విద్యార్ధుల్లో ఆసక్తిని పెంచాయి.

"మా ఉత్సాహం నీరుగారి పోలేదు. ఒక అద్భుతం ఆవిష్కృతమైంది" అని మాథిస్ అన్నారు.

మాలిక్యులర్ అనాలిసిస్ ద్వారా ఈ తుమ్మెదను నిర్ధరించుకున్నామని స్క్వార్లా అన్నారు.

ఆ కీటకం చరిత్ర ఏంటి?

జెయింట్ లేస్‌వింగ్ లేదా పాలిస్టోకోట్స్ పంక్టాటా అనేది డైనోసార్ల కాలానికి చెందిన ఒక పెద్ద కీటకం. ఇది ఒకప్పుడు విస్తృతంగా కనిపించేది.

కానీ 1950 నుంచి తూర్పు ఉత్తర అమెరికాలో దీని ఉనికి మాయమైంది.

కాలుష్యం, కృత్రిమ కాంతి, బయటి నుంచి వచ్చిన మాంసాహార జీవుల వల్ల, లేదంటే మరికొన్ని ఇతర కారణాల వల్ల ఈ కీటకం అదృశ్యమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు ఊహించారు.

ఆర్కాన్సాస్‌లో ఈ జాతి తుమ్మెదను కనుగొనడం ఇదే మొదటిసారి.

‘‘జురాసిక్ యుగం నాటి కీటకాలు ఇంకా ఎక్కడో మిగిలే ఉండి ఉండొచ్చు. వాటిని కనుగొనాల్సి ఉంది’’ అని ఆయన అన్నారు.

ఆర్కాన్సాస్ వాల్‌మార్ట్‌ గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

ఆర్కాన్సాస్ వాల్‌మార్ట్ బిల్డింగ్ ఓజార్క్ పర్వతాలలో ఉంది.

ఈ ప్రాంతంపై ఎక్కువ అధ్యయనం జరగలేదని, కానీ ఇది జీవ వైవిధ్యా హాట్‌స్పాట్ కావచ్చని స్క్వార్లాతోపాటు ఆయన సహ రచయిత, మిస్సిస్సిప్పి స్టేట్ యూనివర్శిటీకి చెందిన జె. రే ఫిషర్‌ కూడా అభిప్రాయపడ్డారు

ఈ ఆకర్షణీయమైన, భారీ తుమ్మెదలు ఎవరికీ కంటబడకుండా ఉండటానికి ఈ ప్రదేశం అనువుగా ఉందని వారు అన్నారు.

ఈ ఆవిష్కరణ మరిన్ని విశేషాలను బయటపెట్టవచ్చని స్క్వార్లా అన్నారు. కీటకాల గురించి ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)