‘‘గత ప్రభుత్వంలా ఒప్పందాలకే పరిమితం కాదు,అమలు చేసి చూపిస్తాం’’ - గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఏపీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, @AndhraPradeshCM
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం....
విశాఖలో జరిగిన రెండు రోజులపాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ముగిసింది. ఈ సదస్సులో ఒప్పందాలతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను, లభ్యమవుతున్న వనరులను దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు అధికారులు వివరించినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
రెండో రోజు సదస్సును ప్రారంభించిన సీఎం జగన్ సదస్సుకి వచ్చి ఒప్పందాలు చేసుకున్న పారిశ్రామికవేత్తలందరికి ధన్యవాదాలు తెలిపారు. కీలక సమయంలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించామన్నారు. గత మూడున్నరేళ్లలో ఆర్థికంగా రాష్ట్రం ముందడుగు వేసిందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు.
“గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు 15 కీలక రంగాల్లో చర్చలు జరిగాయి. రెండు రోజుల్లో 352 ఎంవోయూలు జరిగాయి. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి రానున్న పెట్టుబడులతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. చిత్తశుద్ధితో ప్రభుత్వం అడుగులు వేస్తోంది” అని సీఎం జగన్ పేర్కొన్నారు.
అయితే, పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ ప్రకటనలను ఆర్భాటమని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, @AndhraPradeshCM
‘రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం...’
రెండో రోజు సమ్మిట్ కు హెటిరో గ్రూప్ ఎండీ వంశీకృష్ణ, అవాదా గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్, భారత్ బయోటిక్ ఎండీ సుచిత్ర ఎల్ల, లారస్ ల్యాబ్స్, అపాచీ అండ్ హిట్ టాప్ గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తొలి రోజు సదస్సులో రూ. 11.8 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగితే, రెండోరోజు, రెండో రోజు సమ్మిట్‌లో రూ. 1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం పేర్కొంది.
రెండో రోజు సదస్సుకి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
“సముద్ర ఉత్పత్తులు, రొయ్యలు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం, ఇంజినీరింగ్ గూడ్స్ మొదలైన రంగాలలో ఏపీకి గొప్ప వనరులు,అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం ఇస్తోంది. 3 పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ’’ అని కిషన్ రెడ్డి అన్నారు.

ఫొటో సోర్స్, @AndhraPradeshCM
రెండో రోజు సదస్సులో....
తొలిరోజు జరిగిన పెట్టుబడి ఒప్పందాల్లో ప్రధానంగా ఎన్టీపీసీ, ఏబీసీ లిమిటెడ్, జేఎస్ డబ్ల్యూ గ్రూప్, అదానీ గ్రీన్ ఎనర్జీ అరబిందో గ్రూప్ ఆదిత్య బిర్లా జిందాల్ స్టీల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నాయి.
రెండో రోజు అవాదా గ్రూపు, హెటిరో గ్రూప్, భారత్ బయోటిక్, లారస్ ల్యాబ్స్, అపాచీ అండ్ హిట్ టాప్ గ్రూప్ పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నాయి. వచ్చే రెండేళ్లలో ఏపీలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హెటిరో గ్రూప్ సిద్ధంగా ఉందని ఆ కంపెనీ ఎండీ వంశీకృష్ణ ప్రకటించారు.
దీని ద్వారా 3 వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. మరోవైపు సోలార్ విండ్ హైడ్రో ప్రాజెక్టుతో పాటు లార్జ్ గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు అవాదా గ్రూపు సంస్థల చైర్మన్ వినీత్ మిట్టల్ అన్నారు.
ఏపీ ప్రగతిలో తాము భాగమవుతున్నామని అపాచీ అండ్ హిట్ టాప్ గ్రూప్ డైరెక్టర్స్ అన్నారు. తక్కువ కాలంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని, పలు కీలక రంగాల్లో ఏపీ పటిష్టంగా ఉందని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల అన్నారు.

ఫొటో సోర్స్, @AndhraPradeshCM
ఏ రంగాలల్లో ఎంత పెట్టుబడుల ఒప్పందాలంటే...
విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఎనర్జీ విభాగంలో రూ. 9 లక్షల కోట్లు పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది.
మొత్తం జరిగిన రూ.13 లక్షల కోట్ల ఒప్పందాల్లో ఎనర్జీ రంగంలో ఇంత భారీ పెట్టుబడులు పెడతామని పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చినట్లు తెలిపింది.
ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో రూ. 3.23 లక్షల కోట్లు, ఐటీ అండ్ ఐటీఈఎస్ కేటగిరిలో రూ. 39 వేల కోట్లు, టూరిజంలో రూ. 22 వేల కోట్లు, వ్యవసాయ, పశుసంశర్థక రంగాలలో చెరో రూ. వెయ్యి కోట్లు పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

ఫొటో సోర్స్, @AndhraPradeshCM
80 శాతం మెటీరియలైజ్ చేస్తాం: మంత్రి అమర్నాధ్
రెండు రోజుల సదస్సులో జరిగిన పెట్టుబడుల ఒప్పందాల్లో గరిష్టంగా 80 శాతం ఒప్పందాల్ని వాస్తవ రూపంలోకి తీసుకుని వస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు.
గత ప్రభుత్వాల్లో జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో 10 శాతం ఒప్పందాల్ని కూడా మెటిరియలైజ్ చేయలేకపోయారని, తాము అలాంటి తప్పులకు అవకాశం లేకుండా ఒప్పందాలకు ముందే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న వారితో చర్చలు జరిపి, ఒప్పందం చేసుకోవడమంటే పెట్టుబడి పెట్టడమే అన్నట్లుగా పారిశ్రామిక వేత్తలను ప్రిపేర్ చేశామని చెప్పారు.
ఒప్పందాలు చేసుకున్న వారు ఆరు నెలల్లో పరిశ్రమలు పెడితే వారికి మరిన్ని అదనపు ప్రొత్సాహకాలు కూడా ఇస్తామని చెప్పారు.
“ఈ సమ్మిట్ ద్వారా రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా అనుకున్నాం. కానీ అనూహ్యంగా రూ. 13 లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి. ఒప్పందాల్ని వాస్తవరూపంలోకి తీసుకుని వచ్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ ప్రతివారం ఫాలో అప్ చేస్తుంది. 21 రోజుల్లో పరిశ్రమల స్ధాపనకు అవకాశాలు కల్పిస్తాం. రెన్యూవబుల్ ఎనర్జీపై దృష్టిపెటాం, పర్యావరణహిత రంగంలో అవకాశాలను అంది పుచ్చుకుంటాం” అని మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు.
‘పెట్టుబడుల ప్రచారం హాస్యాస్పదం’
విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ప్రచార అర్భాటమే తప్ప, రాష్ట్రానికి ప్రయోజనకరంగా కనిపించడం లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
దేశం మొత్తం మీద 15,786 మంది ఉద్యోగులున్న ఎన్టీపీసీలో ఒక్క ఏపీలోనే కొత్తగా 77,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామనడం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు.
‘‘రాష్ట్ర ప్రయోజనాల కంటే, ప్రజలను మభ్యపెట్టేందుకు ఎక్కువ ప్రయత్నం జరిగింది’’ అని బుచ్చయ్య విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
- కైలాస: ఇండియా నుంచి పారిపోయిన నిత్యానంద ‘దేశం’ మీద ఐక్యరాజ్య సమితి ఏమని చెప్పింది
- ఆంధ్రప్రదేశ్: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్... గత సదస్సులో కుదిరిన ఒప్పందాలతో రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా?
- వివేక్ రామస్వామి: అమెరికా అధ్యక్ష పదవికి బరిలో దిగనున్న ఈ భారతీయ-అమెరికన్ ఎవరు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు















