ఐదుగురు కన్నబిడ్డలను చంపేసిన తల్లి 16 ఏళ్ల తర్వాత ఎలా మరణించారంటే....

లెర్మిట్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, కోర్టులో విచారణకు హాజరైన లెర్మిట్
    • రచయిత, జెరెమీ గహగన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జెనీవీవ్ లెర్మీట్ (58) అనే మహిళ తన ఐదుగురు పిల్లలను హత్య చేసిన 16 ఏళ్ల తర్వాత స్వచ్ఛంద మరణం (యుథనేసియా) పొందారు.

బెల్జియంలోని నివెల్లెస్ పట్టణంలో 2007 ఫిబ్రవరి 28న జెనీవీవ్ లెర్మీట్ తన కొడుకు, నలుగురు కుమార్తెలను హత్య చేశారు. ఆ సమయంలో పిల్లల తండ్రి ఇంట్లో లేరు.

అంతేకాకుండా లెర్మీట్ తన ప్రాణాలను తీసుకోవడానికి ప్రయత్నించి, విఫలమయ్యారు. అనంతరం సాయం కోసం ఆమె అత్యవసర సేవలకు కాల్ చేశారు.

దోషిగా తేలిన లెర్మీట్ కు 2008లో కోర్టు జీవిత ఖైదు విధించింది. 2019లో లెర్మీట్‌ను మానసిక ఆసుపత్రికి తరలించారు.

నయం చేయలేని శారీరక సమస్యలు, భరించలేని మానసిక వ్యధతో బాధపడుతున్నట్లయితే స్వచ్ఛందంగా మరణించడానికి బెల్జియం చట్టాలు అనుమతిస్తాయి.

అయితే, వ్యక్తి ఈ నిర్ణయం పట్ల స్పృహ కలిగి ఉండాలి. వారి కోరికను సహేతుకమైన, స్థిరమైన పద్ధతిలో వ్యక్తపరచగలగాలి.

"లెర్మీట్‌ ఈ నిర్దిష్ట ప్రక్రియను అనుసరించారు, వైద్యపరమైన అభిప్రాయాల సేకరణ కూడా జరిగింది" అని ఆమె న్యాయవాది వెల్లడించారు.

సైకియాట్రిస్ట్‌పై కేసు ఎందుకు వేశారు?

మానసిక నిపుణులు ఎమిలీ మారోయిట్ ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ''లెర్మీట్‌ ఫిబ్రవరి 28న ఒక విధానంలో చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆమె కోసం, ఆమె ప్రారంభించిన పని పూర్తి చేయడం కోసం అయి కూడా ఉండవచ్చు. ఎందుకంటే లెర్మీట్‌ వారిని చంపినప్పుడు తాను కూడా చనిపోవాలనుకున్నారు" అని అభిప్రాయపడ్డారు.

2007లో జరిగిన ఈ ఐదు హత్యలు, ఆ తర్వాత జరిగిన విచారణ బెల్జియంను కుదిపేసింది.

ఆమె మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, ఆమెను జైలుకు పంపవద్దని విచారణ సమయంలో లెర్మీట్‌ న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు.

అయితే జ్యూరీ మాత్రం ఆమె పథకం ప్రకారమే హత్యలకు పాల్పడినట్లు నిర్ధారించింది. లెర్మిట్‌కు జీవిత ఖైదు విధించింది.

మరోవైపు 2010లో లెర్మీట్‌ ఒక మాజీ సైకియాట్రిస్ట్‌పై దాదాపు రూ.26 కోట్లు డిమాండ్ చేస్తూ సివిల్ దావా వేశారు.

ఆ సైకియాట్రిస్ట్ తాను హత్యలు చేయకుండా ఆపడానికి ఏమీ చేయలేకపోయారని ఆరోపించారు. అయితే 10 ఏళ్ల తర్వాత కేసుపై న్యాయ పోరాటాన్ని లెర్మిట్ నిలిపివేశారు.

2022లో బెల్జియంలో సుమారు 2,966 మంది స్వచ్ఛంద మరణం ద్వారా తనువు చాలించారు. 2021తో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ.

కేన్సర్ అనేది చాలా సాధారణ కారణం. అయితే అధికారులకొచ్చిన నాలుగు అభ్యర్థనలలో మూడింటిలో బాధితులు "శారీరక, మానసికంగా అనేక రకాల బాధలు" పడుతున్నట్లు తెలిపారు.

2014 నుంచి బెల్జియం‌లో పిల్లలు ప్రాణాంతకమైన అనారోగ్యంతో, తీవ్ర నొప్పితో బాధపడుతుంటే వారి తల్లిదండ్రుల సమ్మతితో యుథనేసియాకు అనుమతి ఇస్తున్నారు.

పిల్లలు ఆ విధంగా చనిపోయేలా సాయం చేయడానికి పెద్దలకు ఆ దేశం అనుమతిస్తోంది.

కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో 'యుథనేసియా' చట్టం ఉందా?

భారతదేశంలో ' ప్రాయోపవేశం' (ఆహారం స్వీకరించడానికి నిరాకరించడం ద్వారా ప్రాణత్యాగం చేయడం), సంతర, సమాధి (ధ్యానం ద్వారా మరణం పొందడం) వంటి సంప్రదాయ, మతపరమైన ఆచరణలు ఉండేవి. వీటిని విశ్వసించేవారు కొన్నిసార్లు తమ జీవితాలను త్యజించడానికి ఈ పద్దతులు ఆచరించారు.

అయితే.. భారతదేశంలో ఎలాంటి యుథనేసియా అయినా చట్టవ్యతిరేకం. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ వంటి కొన్ని దేశాలు మాత్రమే..కేసులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత కొన్ని రకాల పాసివ్ యుథనేసియాకు అనుమతిస్తాయి.

2018 మార్చి 9వ తేదీన యుథనేసియాపై అప్పటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర ఆధ్వర్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు నిచ్చింది.

మానవులకు గౌరవంగా చనిపోయే హక్కు ఉందని తెలిపింది. నిర్ణీత నిబంధనలకు, మార్గదర్శకాలకు లోబడి పాక్షిక యుథనేసియాకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.

యుథనేసియా ఎన్ని రకాలు?

యాక్టివ్ యుథనేసియాకు, పాసివ్ యుథనేసియాకు మధ్య తేడాను న్యాయవాది అమిత్ కార్ఖానీస్ చెప్పారు.

''ఒక వ్యక్తికి ఔషధాలు కానీ, ప్రాణాంతక ఇంజక్షన్ కానీ ఇవ్వడం వంటి చర్యల ద్వారా అతడు చనిపోవడానికి అనుమతిస్తే దానిని యాక్టివ్ యుథనేసియా అంటారు.

అదే తీవ్రంగా జబ్బుపడి ఉన్న ఒక రోగి దయనీయ పరిస్థితికి అంతం పలకడానికి.. ఆ రోగికి అందిస్తున్న ఏదైనా వైద్య చికిత్సను నిలిపివేయడం, లేదా కృత్రిమ శ్వాస అందించడం వంటి యంత్రాల మద్దతును తొలగించడం ద్వారా మరణానికి అనుమతిస్తే దానిని పాసివ్ యుథనేసియా అంటారు'' అని ఆయన వివరించారు.

యుథనేసియా భావన మీద వైద్యుల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి.

యుథనేసియా మీద ఏదైనా చట్టం చేయడం, దానిని అమలు చేయడం రెండు వేర్వేరు విషయాలని డాక్టర్ సంజయ్ ఓక్ పేర్కొన్నారు.

''యుథనేసియాకు చట్టబద్ధత ఉన్న దేశాల్లో సైతం.. దీని మీద గందరగోళం నెలకొనివుంది. ఇంకా సరైన వ్యవస్థలే ఏర్పాటు కాని భారత్ వంటి దేశంలో ఇది అస్తవ్యస్త పరిస్థితికి దారితీయగలదు'' అని ముంబయి కేఈఎం హాస్పిటల్ మాజీ డీన్ డాక్టర్ ఓకా అభిప్రాయపడ్డారు.

కోలుకునే అవకాశం లేనపుడే..

అయితే.. పాసివ్ యుథనేసియాకైనా అనుమతి లభించడం సులభం కాదు.

''సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం.. తీవ్రంగా జబ్బుపడిన రోగి.. వ్యాధి తుది దశలో ఉన్నపుడు, కోలుకునే అవకాశమే లేనపుడు మాత్రమే.. చనిపోయేందుకు అనుమతి పొందగలరు. ఆ నిర్ణయాన్ని హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ తీసుకుంటుంది. ఈ అంశంపై వైద్యుడు, నిపుణుల అభిప్రాయాలను కూడా వారు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది'' అని కార్ఖానీస్ వివరించారు.

''తీవ్రంగా జబ్బుపడిన రోగికి ఎక్కువ సమయం మిగిలి ఉండదు. ఆ రోగి యుథనేసియా కోరినపుడు ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. అంటే సదరు రోగికి ఈ అనుమతి లభించడం దాదాపు అసాధ్యం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)