‘ఆమెకు 10,500 పైగా హత్యల్లో పాత్ర ఉంది’ - నాజీ టైపిస్టును దోషిగా తేల్చిన జర్మనీ కోర్టు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, పాల్ కిర్బీ, రాబర్ట్ గ్రీనాల్
- హోదా, బీబీసీ న్యూస్
ఒక నాజి కాన్సంట్రేషన్ క్యాంపు కమాండర్ వద్ద సెక్రటరీగా పనిచేసిన ఒక మహిళకు.. 10,505 మందికి పైగా ప్రజలను హత్య చేయడంలో ప్రమేయం ఉందని జర్మనీ కోర్టు తేల్చింది.
ఇమ్‌గార్డ్ ఫర్చ్నర్ వయసు ఇప్పుడు 97 సంవత్సరాలు. ఆమె టీనేజర్‌గా ఉన్నపుడు స్టట్టొఫ్ కాన్సంట్రేషన్ క్యాంపులో టైపిస్టుగా చేరారు. అక్కడ 1943 నుంచి 1945 మధ్య కాలంలో పనిచేశారు.
దశాబ్దాలుగా నాజీ నేరాలకు సహాయం చేసిన అతి కొద్ది మహిళలలో ఇమ్‌గార్డ్ ఫర్చ్నర్ కూడా ఒకరు. ఆమె పౌర కార్మికురాలు. ఆ క్యాంపులో ఏం జరుగుతుందో ఆమెకు పూర్తి అవగాహన ఉంటుందని జడ్జి అంగీకరించారు.
స్టట్టొఫ్ కాన్సంట్రేషన్ క్యాంపులో 65 వేల మంది ఖైదీలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మరణించారు. వారిలో యూదులు, యూదులు కాని వారు, బందీలైన సోవియట్ సైనికులున్నారు.
స్టట్టొఫ్ క్యాంపు డాన్స్క్ నగరానికి దగ్గర్లో ఉంది. ఖైదీలను వివిధ రకాల పద్ధతులతో హత్య చేసే వారు. 1944 జూన్ నుంచి గ్యాస్ చాంబర్లలో వేలాది మందిని చంపేశారు.
ఉత్తర జర్మనీలోని ఇట్జెన్హొ కోర్టు.. ఈ క్యాంపు నుంచి బయటపడ్డ వారి వాదనలను పరిగణనలోకి తీసుకుంది. ఈ క్యాంపు నుంచి బయటపడిన వారిలో కొంతమంది ఈ అంశం విచారణ దశలో ఉండగానే మరణించారు.
సెప్టెంబర్ 2021లో విచారణ ప్రారంభమైనప్పుడు, ఇమ్‌గార్డ్ ఫర్చ్నర్ తాను పదవీ విరమణ తర్వాత నివసిస్తున్న ఇంటి నుంచి కూడా కనిపించకుండా పారిపోయారు. కానీ పోలీసులు ఆమెను హ్యామ్‌బర్గ్‌లోని ఓ వీధిలో గుర్తించారు.
స్టట్టొఫ్ కమాండెంట్ పాల్ వెర్నర్ హోప్పె ఓ హత్యలో ప్రమేయం ఉందన్న కారణంతో 1955లో జైలు పాలయ్యారు. ఆ తర్వాత ఐదేళ్లకు ఆయన విడుదల అయ్యారు.
మాజీ నాజీ డెత్ క్యాంప్ గార్డు జాన్ డెమ్జాంజుక్ దోషిగా తేలిన తర్వాత 2011 నుంచి జర్మనీలో దీనిపై పలు న్యాయ విచారణలు జరిగాయి.
ఈ హత్యలు జరిగినట్టు సరిపోయే ఆధారాలు దొరకడంతో మాజీ నాజీ డెత్ క్యాంపు గార్డును దోషిగా తేల్చారు.
సివిలియన్ కార్యకర్త ఫర్చ్నర్ కూడా విచారణకు రావాలని ఆ సమయంలోనే కోర్టు ఆదేశించింది. క్యాంపు కమాండర్‌తో ఆమె నేరుగా పనిచేసే వారని పేర్కొంది. స్టట్టొఫ్ ఖైదీలను ఆమె నేరుగా డీల్ చేసే వారు.
ఈ విచారణలో ఆమె నోరు విప్పేందుకు 40 రోజుల సమయం పట్టింది. ‘‘అప్పుడు జరిగిన ప్రతిదానికి నేను క్షమాపణ కోరుతున్నా’’ అని ఆమె కోర్టుకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
క్యాంపులో హత్యలు జరిగిన సమయంలో ఆమె వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. దీంతో స్పెషల్ జువెనైల్ కోర్టులో ఈ విచారణ సాగింది. ‘‘ఆ సమయంలో నేను స్టట్టొఫ్‌లో ఉన్నందుకు నేనెంతో చింతిస్తున్నాను – అదే నేను చెప్పదలుచుకున్నది’’ అని ఆమె చెప్పారు.
ఆమెకు తెలిసిన విషయాలపై అనుమానులు నెలకొనడంతో.. ఆమెను తప్పనిసరిగా శిక్షించాల్సి ఉందని ఆమె ప్రతివాది ఆరోపించారు. హోప్పె ఆఫీసులో పనిచేసిన ఎంతో మంది టైపిస్టులలో ఆమె కూడా ఒకరు.
హిస్టోరియన్ స్టీఫాన్ హార్డ్లర్ ఈ విచారణలో కీలక పాత్ర పోషించారు. ఈ క్యాంపు సైటును సందర్శించే సమయంలో ఆయనతో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులున్నారు.
కమాండెంట్ కార్యాలయం నుంచి క్యాంపులో జరుగుతున్న కొన్ని క్రూరమైన సంఘటనలను ఫర్చ్నర్ చూడగలరని స్పష్టంగా అర్థమైంది.
నాజీలు క్యాంపులు విస్తరించాలని, జిక్లాన్ బీ గ్యాస్ ఉపయోగంతో సామూహిక హత్యలు చేయాలని నిర్ణయించిన తర్వాత.. 1944 జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో స్టట్టొఫ్ క్యాంపు ప్రాంతానికి 48 వేల మందితో 27 ట్రాన్స్‌పోర్టు వెహికిల్స్ చేరుకున్నట్టు విచారణలో భాగంగా హిస్టోరియన్ చెప్పారు.
అక్కడ జరిగిన ప్రతి దానికి హోప్పె కార్యాలయం కేంద్ర బిందువు అని, ప్రతీది అక్కడ నుంచే జరిగిందని హార్డ్లర్ చెప్పారు.
నాజీ కాలంలో జరిగిన నేరాలలో జర్మనీలో జరుగుతున్న విచారణలో ఫర్చ్నర్‌ది చివరిది కావొచ్చు. కానీ ఇంకా కొన్ని కేసులు విచారణలోనే ఉన్నాయి.
స్టట్టొఫ్‌లో జరిగిన నాజీ నేరాలకు చెందిన రెండు కేసులు ఇటీవల కాలంలో కోర్టు ముందుకు వచ్చాయి.
గతేడాది కూడా ఈ క్యాంపుకు చెందిన మాజీ గార్డు ఈ నేరాలు చేసేందుకు ఎక్కువగా అవకాశమున్నప్పటికీ, విచారణకు ఆయన అన్‌ఫిట్ అని ధ్రువీకరించారు.
ఖైదీలను మర్డర్ చేయడంలో ప్రమేయం ఉన్నందుకు 2020లో మరో ఎస్‌ఎస్ క్యాంపు గార్డు బ్రునో డేకు రెండేళ్ల జైలు శిక్షను విధించారు.
2011 నుంచి నాజీ నేరాల కేసుల విచారణ..
జాన్ డెమ్జాంజుక్... సోబిబార్ డెత్ క్యాంపులో 28 వేల మందికి పైగా ఇజ్రాయిల్ వ్యక్తుల హత్యలో తన ప్రమేయం కూడా ఉందన్న కారణంతో 2011లో ఐదేళ్ల జైలు శిక్షకు గురయ్యారు. కానీ, ఆ అప్పీల్ పెండింగ్‌తో జాన్ విడుదలయ్యారు. ఆ తర్వాత ఏడాదినే 91 ఏళ్ల వయసులో మరణించారు.
ఆస్కార్ గ్రోనింగ్... 3 లక్షల మంది ఇజ్రాయిల్‌ల హత్యలో ప్రమేయం ఉందన్న కారణంతో 2015లో ఆస్కార్ గ్రోనింగ్‌కు శిక్ష పడింది. కానీ ఆయన జైలుకి వెళ్లలేదు. ఈయనపై ఫిర్యాదులు విచారణలో ఉన్న సమయంలోనే 2018లో 96 ఏళ్ల వయసులో మరణించారు.
రెయిన్‌హోల్డ్ హాన్నింగ్... సామూహిక హత్యలకు సహకరించాన్న కారణంతో ఈ మాజీ ఎస్‌ఎస్ గార్డుని 2016 జూన్‌లో దోషిగా తేల్చారు. ఆయనపై అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్న సమయంలోనే 95 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
ఫ్రైడ్రిచ్ కార్ల్ బెర్గర్... న్యూయెంగామె కాన్సంట్రేషన్ క్యాంపులో మాజీ కార్డుగా పనిచేసిన ఫ్రైడ్రిచ్ కార్ల్ బెర్గర్ ఫిబ్రవరి 2021లో 95 ఏళ్ల వయసున్నప్పుడు అమెరికా నుంచి జర్మనీకి తరలించారు. ఆయనకు వ్యతిరేకంగా జర్మన్ న్యాయవాదులు పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎవరికి తెలియదు.
జోసెఫ్ ఎస్... సచెన్‌హాసెన్ కాన్సంట్రేషన్ క్యాంపులో 3,500 మందికి పైగా ఖైదీలను హత్య చేయడానికి సహకరించినందుకు గాను 2022 జూన్‌లో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. జర్మనీలో నాజీ కాలంలో జరిగిన నేరాలకు దోషిగా తేలిన అత్యంత కురువృద్ధులు ఇతనే. ఈయన వయసు ప్రస్తుతం 101 ఏళ్లు. ఆయన వయసు, ఆరోగ్య సమస్యల కారణంతో జోసెఫ్ జైలులో ఉండే అవకాశం లేదు.
ఇవి కూడా చదవండి:
- మెస్సీ వరల్డ్ కప్ సాధిస్తే, భారత అభిమానులు సచిన్‌ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ
- ఎలాన్ మస్క్: ట్విటర్ బాస్‌గా దిగిపోవాల్సిందేనంటూ యూజర్ల ఓటు - ఇప్పుడు పరిస్థితేంటో?
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్‌బాల్ పిచ్‌ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















