కొడుకు కారుణ్య మరణం కోసం కోర్టుకు వెళ్లిన తల్లి, దారిలోనే బిడ్డ మృతి: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
కొడుకు కారుణ్య మరణం కోసం చిత్తూరు జిల్లాలో ఒక తల్లి కోర్టుకు వెళ్లిందని, కానీ కోర్టు ఆమె వినతిని వినేలోపే బిడ్డ చనిపోయాడని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
అరుదైన వ్యాధితో కన్నకొడుకు పడుతున్న బాధను ఆ తల్లి తట్టుకోలేకపోయింది. కడుపు తీపిని చంపుకొని... కుమారుడి కారుణ్య మరణానికి అనుమతివ్వాలని కోర్టును కోరాలనుకుంది.
కొడుకుని తీసుకుని కోర్టు వరకు వచ్చింది. కోర్టుకు సెలవు కావడంతో వెనుదిరుగుతుండగా దారిలోనే కొడుకు కన్నుమూయడంతో ఆ తల్లి వేదన మిన్నంటింది అని పత్రిక చెప్పింది.
మంగళవారం చిత్తూరు జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చౌడేపల్లె మండలం బీర్జేపల్లెకు చెందిన మణి, అరుణల మొదటి సంతానం హర్షవర్ధన్(9).
నాలుగేళ్ల కిందట హర్షవర్ధన్ పాఠశాల వద్ద ఆడుకుంటూ పడిపోవడంతో ముక్కుకు గాయమైంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
తాత్కాలికంగా గాయాన్ని నయంచేసిన వైద్యులు శస్త్రచికిత్స చేసుకుంటే భవిష్యత్తులో సమస్య ఉండదని సూచించారు.
అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హర్షవర్ధన్‌ని ఈ నాలుగేళ్లలో వివిధ ఆసుపత్రుల్లో చూపించారు.
మళ్లీ నెల రోజుల కిందట ముక్కు నుంచి రక్తం కారడంతో తిరుపతి రుయా, ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లారు.
రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినా వ్యాధి నయం కాలేదు. చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. కొత్తగా అప్పు చేద్దామంటే కరోనా కారణంగా ఎవరూ సహకరించలేదని పత్రిక చెప్పింది..
మరోవైపు 20 రోజుల కిందట తండ్రి మణి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఈ పరిస్థితుల్లో కుమారుడి బాధ చూడలేక, తల్లి అరుణ తన బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి కోసం అర్జీ రాసుకొని మంగళవారం పుంగనూరు కోర్టుకు వచ్చింది.
కోర్టుకు సెలవులు కావడంతో తిరిగి ఇంటికి వెళుతుండగా దారిలోనే హర్షవర్ధన్ ప్రాణాలు విడిచాడని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
పెళ్లి వేడుకతో 132 మందికి కరోనా
ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక పెళ్లి వేడుక వల్ల 132 మందికి కరోనా వ్యాపించినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
కరోనా లక్షణాలతో ఓ యువకుడు వివాహ విందుకు హాజరవడంతో 250 జనాభా ఉన్న ఊళ్లో సగంమందిపైగా వైరస్ బారినపడ్డారు.
వరుడి తండ్రి సహా ఆరుగురు మృతి చెందారు. ఇంకొందరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముత్యాలగూడెంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన కుల పెద్ద ఈసం భద్రయ్య కుమారుడి పెళ్లి మే 14న జరిగింది. అదే రోజు రాత్రి విందు ఏర్పాటు చేశారు. కట్టుబాటు ప్రకారం ఊరిలో ప్రతి ఇంటి నుంచి విందు భోజనానికి హాజరయ్యారు.
పొరుగునున్న కొమ్ముగూడెం, గిద్దెవారిగూడెం నుంచి కూడా బంధుమిత్రులు పాల్గొన్నారు. ఇదే సందర్భంలో లక్షణాలున్న గిద్దెవారిగూడెం యువకుడు అందరితో కలిసి తిరిగాడు.
తర్వాత క్రమంగా గ్రామంలో ఒక్కొక్కరు అనారోగ్యానికి గురయ్యారు.
కొందరు మామూలు జ్వరం, దగ్గు అనుకుని నిర్లక్ష్యం చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు ఆస్పత్రి వెళ్లగా పాజిటివ్ వచ్చింది.
అనుమానంతో అందరూ పరీక్షలు చేయించుకోగా గత నెల 20 నుంచి 132మందికి కరోనా నిర్ధారణ అయింది.
వీరిలో వరుడి తండ్రి సహా ఆరుగురు చనిపోయారు. 9 మంది ఖమ్మం ఆస్పత్రిలో ఉన్నారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో ఖమ్మం కలెక్టర్ కర్ణన్ గురుకుల పాఠశాలలో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేయించారని, అందులో 50 మంది చికిత్స పొందుతున్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, FB/KAKANI GOVARDHAN REDDY
ఈనెల 7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ
కృష్ణపట్నం ఆనందయ్య మందును ఆన్‌లైన్లో కూడా పంపిణీ చేయనున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే చెప్పారని సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందును సోమవారం (ఈనెల 7వ తేదీ) నుంచి పంపిణీ చేసే అవకాశం ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు.
మందు తయారీ, పంపిణీ గురించి మంగళవారం నెల్లూరులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చక్రధర్‌బాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్, జేసీలు హరేందిరప్రసాద్, గణేష్‌కుమార్, మందు తయారీదారు ఆనందయ్య తదితరులతో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమావేశమయ్యారు.
అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వనమూలికలు సమకూర్చుకున్న తర్వాత నాలుగైదు రోజుల్లో మందు తయారు చేసి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలిపారన్నారు.
కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకేచోట కాకుండా డీ సెంట్రలైజ్డ్ పద్ధతిలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
ఈ మందును ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, పోస్టల్, కొరియర్ ద్వారా కూడా పంపిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారికి కూడా ఇదే విధానంలో పంపిణీ చేస్తామన్నారు. కోవిడ్ సోకిన వారికి నయం చేసేందుకు మాత్రమే తొలిదశలో మందు పంపిణీ చేస్తామని తెలిపారు.
తర్వాత దశలో కరోనా రాకుండా ఉండేందుకు మందు ఇస్తామన్నారు. ఎవరూ మందు కోసం కృష్ణపట్నం, నెల్లూరు రావద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రజల మనోభావాలను అనుసరించి మందును పంపిణీ చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.
కంట్లో చుక్కల మందు పంపిణీకి సంబంధించి కోర్టు తుది తీర్పునకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారని సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, RDIF HANDOUT VIA REUTERS
హైదరాబాద్‌కు రష్యా స్పుత్నిక్- వి టీకా డోసులు
రష్యాకు చెందిన స్పుత్నిక్-వి టీకా డోసులు హైదరాబాద్ చేరుకున్నట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
కరోనా వ్యాక్సిన్ దిగుమతికి జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్‌ఏసీ) అతిపెద్ద కేంద్రంగా నిలిచింది.
రష్యాలో తయారైన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లు 27.9 లక్షల డోసులతో కూడిన 56.6 టన్నులు మంగళవారం తెల్లవారుజామున 3.43 గంటలకు చార్టర్డ్ ఫ్రైటర్ ఆర్‌యూ-9450 ద్వారా జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌కార్గోకు చేరాయి.
ఇప్పటివరకు భారత్‌కు వచ్చిన కొవిడ్ వ్యాక్సిన్ దిగుమతుల్లో ఇదే అతిపెద్దది. గతంలో 2.1 లక్షల డోసులు కలిపి మొత్తం 30 లక్షల డోసుల స్పుత్నిక్- వీ వ్యాక్సిన్ భారత్‌కు వచ్చింది.
మరో 20 లక్షల వ్యాక్సిన్లు త్వరలో వచ్చే అవకాశం ఉన్నది. ఈ వ్యాక్సిన్‌ను మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.
ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు జీహెచ్‌ఏసీ వద్ద ఉన్నాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్, చుట్టుపకల ఉన్న ప్రధాన ఫార్మా కంపెనీలు 3.5 బిలియన్ల డోసుల కొవిడ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం లేదా దిగుమతి చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు.
వీటిని సజావుగా నిర్వహించేందుకు జీహెచ్‌ఏసీ అన్ని వసతులను ఏర్పాటు చేసింది. టెంపరేచర్ కంట్రోల్డ్ మౌలిక సదుపాయాలతోపాటు భారత్‌లో మొట్టమొదటి డెడికేటెడ్ ఫార్మా కార్గో ఎగుమతి టెర్మినల్ అయిన 'ఫార్మా జోన్' సామర్థ్యాన్ని విస్తరించింది.
టెర్మినల్ నుంచి విమానం వద్దకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా సరుకులను రవాణా చేసేందుకు టెంపరేచర్ కంట్రోల్డ్ 'కూల్ డాలీ'ని ప్రవేశపెట్టారని నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- నేపాల్ యువరాజు దీపేంద్ర రెండు చేతుల్లో తుపాకులు నిప్పులు కక్కినప్పుడు ఏం జరిగింది
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- కోవిడ్: కరోనా నుంచి కోలుకున్న తరువాత డయాబెటిస్ వస్తుందా
- వూహాన్ ల్యాబ్ లీక్ థియరీ: ‘కోవిడ్-19 సహజంగా పుట్టిందంటే నమ్మను..చైనాలో ఏం జరిగిందో దర్యాప్తు చేయాలి’
- కోవిడ్ సోకితే గర్భిణులు ఏం చేయాలి.. తల్లి నుంచి బిడ్డకు వస్తుందా..
- భారతదేశంలో సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరిందా...కేసులు తగ్గుముఖం పట్టడం దేనికి సూచిక
- బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ మరింత ప్రమాదకరమా.. ఈ వ్యాధి ఎవరికి వస్తుంది..
- కరోనావైరస్: వ్యాక్సీన్లు తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు వస్తే ఏం చేయాలి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








