నగరాలలో మహిళలు గుమ్మం దాటి బయటకు రావడం బాగా తగ్గిందా... ఎందుకిలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పందొమ్మిదేళ్ల మనీషా దిల్లీ శివార్లలోని ఒక ఇంట్లో పనిమనిషిగా చేస్తున్నారు. సొంతూరు జార్ఖండ్‌లో చదువుకునే పరిస్థితులు లేక చదువు మానేశారు. బడికి వెళ్లేందుకు సరైన రవాణా సదుపాయాలు లేవు. బయటికెళితే లైంగిక వేధింపులూ ఎక్కువే. ఈ కారణంగా చదువు మానేసి దిల్లీ వచ్చి పనిమనిషిగా చేరారు.
దిల్లీలో కూడా మనీషా ఎక్కువగా బయటకు రారు. ప్రయాణంలో ఇబ్బందులు, బయట భద్రత లేకపోవడం కారణాలని ఆమె చెబుతున్నారు.
"నేను పనిచేస్తున్నాను. కానీ, బయటకు ఎప్పుడోగానీ వెళ్లను. నెలకు ఒకటి, రెండు సార్లు వెళతానంతే. వీధుల్లో నాకు భద్రతగా అనిపించదు" అన్నారామె.
ఇది మనీషా కథ మాత్రమే కాదంటున్నారు రాహుల్ గోయెల్. దిల్లీ ఐఐటీలో రిసెర్చ్ చేస్తున్న రాహుల్ 'టైం యూజ్ సర్వే' డేటా ఉపయోగించి సమాజంలో లైంగిక సమానతలు రోజువారీ ప్రయాణాలను, రాకపోకలను ఎలా ప్రభావితం చేస్తాయన్నది పరిశీలించారు.
దేశంలో మొదటిసారిగా 'టైం యూజ్ సర్వే డేటా'ను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ప్రజలు రకరకాల పనులలో ఎంతెంత సమయం వెచ్చిస్తారన్నది చెబుతుందీ డేటా. 2019లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ప్రజలు సర్వేకు ముందురోజు ఏ పనులపై ఎంతెంతె సమయం వెచ్చించారన్న డేటాను సేకరించారు.
పట్టణాలు, నగరాల్లో నివసించే 1,70,000 మంది నమూనాను రాహుల్ అధ్యయనం చేశారు.
ఈ ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. మహిళలలో సగం కంటే ఎక్కువమంది అంటే 53 శాతం సర్వే ముందురోజు ఇళ్ల నుంచి బయటకు అడుగుపెట్టలేదు. పురుషుల్లో కేవలం 14 శాతం మాత్రమే బయటకు వెళ్లలేదు.
యుక్తవయసులో ఉన్న అబ్బాయిల కంటే అమ్మాయిలు (10-19 ఏళ్లలోపు వారు) బయటికెళ్లే అవకాశాలు తక్కువ అని ఈ అధ్యయనంలో తేలింది.
అయితే, మహిళలు మధ్య వయసుకు వచ్చాక బయటకు వెళ్లడం కొంచం పెరిగింది.
సమాజంలో ఉన్న సంప్రదాయ నియమాలు చిన్నతనం నుంచే మహిళలను బయటికు వెళ్లకుండా నిరోధిస్తున్నాయని రాహుల్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సమాజంలో ఉన్న లైంగిక అసమానతలను కూడా ఈ అధ్యయనం బయటపెట్టింది. మహిళలు ప్రధానంగా ఇంటిపనులకే పరిమితమవుతున్నారు. ఎక్కువమంది పురుషులు బయటికెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు.
25-44 మధ్య వయసున్న మహిళలు సగటున రోజుకు ఎనిమిదిన్నర గంటలు ఇంటి పనిచేస్తున్నారు. అదే వయసులో ఉన్న పురుషులు రోజుకు గంట కన్నా తక్కువే ఇంటి పనిచేస్తున్నారు. ఈ వయసులో ఉన్న మహిళలలో కేవలం 38 శాతం ఇంటి నుంచి బయటికి వెళుతున్నారు. పురుషుల్లో 88 శాతం బయటకి వెళుతున్నారు.
పెళ్లి తరువాత మహిళలు ఎక్కువగా ఇంటిపట్టునే ఉంటున్నారు. కానీ, పెళ్లి తరువాత పురుషులు బయటకువెళ్లే రేటు పెరిగింది. పెళ్లి, పిల్లలు మహిళలను ఇంటికి కట్టేస్తున్నాయి. కానీ, పురుషులకు ఏ రకంగానూ ప్రభావితం చేయడం లేదని ఈ అధ్యయనంలో తేలింది.
పనిచేసే వయసులో ఉన్న పురుషులతో పోలిస్తే మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నది చాలా తక్కువ శాతం. 15 ఏళ్లు దాటిన తరువాత పురుషులు చదువు కోసం, ఉద్యోగం కోసం బయటకి వెళుతున్నారు. కానీ, మహిళలలో అలా జరగడం లేదు. చదువు లేదా ఉద్యోగానికి వెళ్లే మహిళలలో 81 శాతం రోజూ బయటకు వెళుతున్నారు. కానీ, ఇంటిపట్టున ఉన్నవాళ్లల్లో కేవలం 30 శాతం ఒక్కసారి మాత్రమే బయటకు వెళుతున్నారు.
"అంటే, మహిళలు ఉద్యోగం కోసం బయటకు వెళ్లకపోవడమే కాదు, ఉద్యోగం చెయ్యనివాళ్లు కూడా గుమ్మం దాటి బయటకు అడుగుపెట్టట్లేదు" అని రాహుల్ గోయెల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఈ అధ్యయనం ఫలితాలు నిపుణులకు కొంత విస్మయం కలిగించాయి.
ఇటీవలి సంవత్సరాలలో స్కూళ్లు, కాలేజీల్లో చేరుతున్న ఆడపిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందని, వాళ్లు తరగతులకు హాజరు కావట్లేదని చెప్పేందుకు ఆధారలు లేవని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అశ్విని దేశ్‌పాండే అన్నారు.
అంటే, ఎక్కువమంది మహిళలు బయటకు వస్తున్నట్టు లెక్క.
"దేశంలో స్త్రీలను మంచాలకు కట్టేసి ఉంచట్లేదు. వాళ్లు బయటకు రాకూడదు అన్న నిబంధనలు లేవు" అని ఆమె అన్నారు.
ప్రయాణం, బయటకు రావడం మొదలైన పదాలను వేరు వేరు భాషల్లో భిన్నంగా అర్థం చేసుకుంటుండవచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు ప్రొఫెసర్ అశ్విని.
"ఉదాహరణకు, స్కూలికి లేదా కాలేజీకి వెళ్లడం ప్రయాణం కింద నేను పరిగగణించను" అని అశ్విని అన్నారు.
మహిళలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం అనే అంశాన్ని కేవలం సామాజిక నియమాలు లేదా ఉద్యోగాలు లేకపోవడం ద్వారా వివరించలేమని మరికొందరు భావిస్తున్నారు.
ఉదాహరణకు, పూణెలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య చాలా తక్కువ కానీ, రోడ్లపై, వీధుల్లో ఎక్కువమంది మహిళలు కనిపిస్తారు.
ఈ అంశంలో ప్రాంతీయ భేదాలు ఉన్నాయని రాహుల్ గోయెల్ అంగీకరించారు. ఉదాహరణకు, గోవాలో మహిళలు, పురుషులు సమానంగా బయటకి వస్తారని అన్నారు.
బిహార్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వం ఆడపిల్లలకు ఉచితంగా సైకిళ్లు ఇచ్చాక, చాలామంది అమ్మాయిలు బయటకు రావడం మొదలుపెట్టారు. అలాగే తమిళనాడులో బయటికొచ్చి పనిచేసే మహిళల సంఖ్య ఎక్కువ అని మరొక అధ్యయనంలో తేలింది.

ఫొటో సోర్స్, AFP
అయినప్పటికీ, మహిళలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టకపోవడం అనే అంశంలో భారతదేశం సహా దక్షిణాసియాలో కొన్ని దేశాలు వెనుకబడి ఉన్నాయనే చెప్పాలి.
2007లో ఐరోపా దేశాలలో జరిపిన టైం యూజ్ సర్వేలో 15 దేశాలలో మహిళలు, పురుషుల కన్నా ఎక్కువగా బయటికొస్తారని తేలింది. లండన్‌లో ఈ అంశంలో పురుషులు, స్త్రీల మధ్య వ్యత్యాసం లేదు. ఫ్రాన్స్‌లో మహిళలే ఎక్కువగా బయటకు వస్తున్నారు.
ఇలాంటివి మరికొన్ని అధ్యయనాలు కూడా ఉన్నాయి.
దీన్ని బట్టి, ఇల్లు దాటి బయటకు అడుగుపెట్టడం అనే విషయంలో భారతదేశంలో మహిళలు వెనుకబడి ఉన్నారన్నది స్పష్టమని రాహుల్ అంటున్నారు.
అయితే, భారత్‌లో లైంగిక అసమానతలు కొత్తేం కాదు. ప్రపంచ దేశాలతో పోలిస్తే శ్రామిక శక్తిలో భాగం పంచుకుంటున్న మహిళల సంఖ్య అతితక్కువగా 27 శాతం ఉంది. సామాజిక నియమాలు అడ్డుకట్ట వేస్తాయన్న సంగతీ తెలిసిందే.
కానీ, ఇటీవల కాలంలో మాతాశిశు మరణాల రేట్లు తగ్గాయి. సంతానోత్పత్తి స్థాయిలు తగ్గాయి. పుట్టినప్పుడు లింగ నిష్పత్తి క్రమంగా మెరుగుపడుతోంది. ఆడపిల్లలు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడం పెరిగింది.
కాగా, మహిళలు బయటకు అడుగుపెట్టకపోవడానికి ప్రధానంగా భద్రత లేకపోవడం కారణమని రాహుల్ అంటున్నారు. వీధుల్లో స్త్రీలు అభద్రతకు గురవుతున్నారని, పిల్లలు, వృద్ధులు కూడా ఇదే స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు.
"మన దేశంలో బహిరంగ ప్రదేశాలు ఎక్కువగా పురుషులకు అనుకూలమైనవి. వాటిని మహిళలకు కూడా అనుకూలంగా మార్చాలి" అన్నారు రాహుల్.
ఇవి కూడా చదవండి:
- ఇండియా జీ20: విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం మీద యుక్రెయిన్ యుద్ధ ప్రభావం..
- కైలాస: ఇండియా నుంచి పారిపోయిన నిత్యానంద ‘దేశం’ మీద ఐక్యరాజ్య సమితి ఏమని చెప్పింది
- త్రిపురలో మరొకసారి గెలిచిన బీజేపీ... నాగాలాండ్‌లోనూ కూటమిదే అధికారం
- తవాంగ్: ‘‘భారత సైనికుల శవాలను వీధుల్లో పడేసి వెళ్లేవారు...’’ 1962 నాటి ఇండో చైనా యుద్ధం చూసిన వారు ఏమంటున్నారు?
- కరోనావైరస్ పుట్టింది చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే -ఎఫ్‌బీఐ














