సరోగసీతో పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే, మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రతిభా లక్ష్మి
- హోదా, బీబీసీ కోసం
ఈ మధ్య కాలంలో అద్దె గర్భాలతో తల్లిదండ్రులుగా మారడం అనేది ఎక్కువగా కనిపిస్తోంది.
ముఖ్యంగా ధనవంతులైన జంటలు, గ్లామర్ ఫీల్డ్‌లో ఉండే మహిళలు ఈ విధానాన్ని ఆశ్రయిస్తున్నారు.
నేడు అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులుగా మారడానికి గల నియమ నిబంధనల గురించి తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, JONAS GRATZER
ఎప్పుడు అవసరం?
ఆరోగ్యపరమైన సమస్యల వల్ల పిల్లలకు జన్మ ఇవ్వలేని వారి కోసమే అందుబాటులోకి తీసుకొచ్చిన పద్ధతి ఇది. అయితే, సాధారణ పద్ధతిలో పిల్లలు పుట్టే అవకాశమున్నప్పటికీ, దీన్ని వాడడం వల్ల, గర్భం దాల్చిన మహిళకు, పుట్టే పిల్లలకే కాదు, అవకాశము ఉండి కూడా పిల్లలకు జన్మ ఇవ్వని ఆ మహిళ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.
తల్లి కావాలనుకునే మహిళ గర్భాశయం చిన్నగా ఉండడం, లేక గర్భసంచిలో క్షయ లేదా క్యాన్సర్ వంటివి ఏవైనా జబ్బులు రావడం వల్ల, బిడ్డను కనడానికి సాధ్యపడని పరిస్థితి నెలకొన్నప్పుడు సరోగసీని ఆశ్రయించవచ్చు.
భర్తలో లోపం ఉన్న సందర్భాలలో, దాతల స్పెర్మ్‌తో గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. మహిళ అండంలో సమస్య ఉంటే, డోనర్ ఎగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే మహిళ గర్భాశయంలో లోపం ఉంటే అద్దె గర్భానికి వెళ్లవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
భారతీయులు అయ్యుండాలి..
అద్దె గర్భంతో తల్లి కావాలి అనుకునే వారు భారతీయులై ఉండాలి. విదేశీయులు మన దేశంలోని మహిళల గర్భాలను అద్దెకు తీసుకోవడం చట్టరీత్యా నేరం.
కేవలం మూడు సార్లు మాత్రమే అద్దె గర్భం ద్వారా పిల్లలను కనేందుకు ప్రయత్నం చేయాలి. కుదరని పక్షంలో ఆ మహిళతో అద్దె గర్భాన్ని పొందే ప్రయత్నం మానుకోవాలి.
పిల్లలను కనాలనుకునే.. ఆ జంటకు ముందు పిల్లలు ఉండకూడదు. ఎవరినీ దత్తత కూడా తీసుకోకూడదు. ఒక పాప, లేక బాబు ఉన్న జంట అద్దె గర్భం ద్వారా మరొకరికి తల్లిదండ్రులుగా మారడం కుదరదు. కాబట్టి అసలు పిల్లలు లేని వారికి మాత్రమే ఈ అవకాశం.
తల్లి కావాలి అనుకునే ఆ మహిళ వయసు ఇరవై మూడు నుంచి యాభై సంవత్సరాల (23-50yrs) మధ్య ఉండాలి. ఆమె భర్త వయసు ఇరవై ఆరు నుంచి యాభై అయిదు సంవత్సరాల (26-55yrs) మధ్య ఉండాలి.
పుట్టిన బిడ్డ బాగోగులు చూసుకునేందుకు ఈ తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే, ముఖ్యంగా పుట్టిన తొలి కొన్ని సంవత్సరాల వరకు పిల్లల పెంపకం అనేది ఎంతో సహనంతో కూడుకున్న పని.

ఫొటో సోర్స్, BAMBAM KUMAR JHA/GETTY IMAGES
‘‘బంధువులకే ప్రాధాన్యం ఇవ్వాలి’’
అద్దె గర్భాన్ని ఇచ్చే స్త్రీ ఆ తల్లితండ్రులకు బంధువై ఉండాలి. ఎవరో తెలియని మహిళకు, డబ్బులు, లేదా ఇతర ఏవైనా వస్తువులు ఇస్తామని ఆశ చూపించి, ప్రలోభాలకు గురి చేసి, అద్దె గర్భం దాల్చడానికి ప్రేరేపించకూడదు. ముఖ్యంగా ఆ మహిళ డబ్బుల కోసం తన గర్భాన్ని అద్దెకు ఇవ్వకూడదు.
అద్దె గర్భం దాల్చడానికి అంగీకరించిన ఆ మహిళకు ముందే ఒక కాన్పు అయి ఉండాలి. మరోవైపు అద్దె గర్భం దాల్చడానికి తన భర్త అనుమతి కూడా ఉండాలి.
అప్పటివరకు పిల్లలు లేని ఒక మహిళ, అద్దె గర్భం ధరించడం వల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తే, దాని పర్యవసానాల వల్ల కలిగే లోటు మళ్ళీ భర్తీ చేయలేక పోవచ్చు. అందుకే ఈ నియమం తీసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
హక్కులు కూడా ఉంటాయి..
అద్దె గర్భం ధరిస్తున్న మహిళకు కొన్ని హక్కులు కూడా ఉంటాయి. ఆ తల్లితండ్రులు, అద్దె గర్భాన్ని ఇస్తున్న మహిళకు మూడు సంవత్సరాల ఆరోగ్య బీమా చేయించాలి.
ఆ మూడు సంవత్సరాల కాలంలో, కాన్పుతోపాటు ఆరోగ్యానికి అయ్యే ఇతర ఖర్చులు అన్నీ వారే భరించాలి. కాన్పు అయ్యాక బిడ్డ బాధ్యత పూర్తిగా ఆ తల్లితండ్రులదే. కాన్పు సమయంలో ఏవైనా అనుకోని సమస్యలు కలిగినా అన్నిటికీ ఖర్చులు వారే భరించాలి.
కొంత మంది, ఎలాంటి సమస్యా లేకపోయినప్పటికీ, కేవలం మహిళ అందం తగ్గిపోతుంది అని, లేక, గర్భం దాల్చడం వల్ల వృత్తిలో వెనకబడుతుంది అనుకొని, ఇలా అద్దె గర్భాలకు వెళ్తున్నారు.
అయితే, మహిళ గర్భం దాల్చి, పిల్లలను కనకపోవడం వల్ల, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవితాంతం గర్భ నిరోధానికి వాడే పద్ధతుల వల్ల కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
దత్తత మేలు
పిల్లలు కలిగే అవకాశం లేదని నిర్ధారణ జరిగిన జంట, అనాథలను దత్తత తీసుకొని, వారికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే ఆ బిడ్డకు మీరు కొత్త జీవితాన్ని ఇస్తున్నారు.
పేద, నిరక్షరాస్య, గ్రామీణ మహిళల గర్భాశయాలతో అసలు ఆటలు ఆడుకోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు సదరు మహిళల ప్రాణాలకు దీని వల్ల ముప్పు వస్తుంది.
మహిళలకు తమ హక్కుల మీద అవగాహన కలిగించాలి. సరోగసీ ద్వారా పిల్లలను కనే సమయంలో చట్టప్రకారం నియమ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
(రచయిత వైద్యురాలు, అభిప్రాయాలు వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- ఇండియా జీ20: విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం మీద యుక్రెయిన్ యుద్ధ ప్రభావం..
- కైలాస: ఇండియా నుంచి పారిపోయిన నిత్యానంద ‘దేశం’ మీద ఐక్యరాజ్య సమితి ఏమని చెప్పింది
- త్రిపురలో మరొకసారి గెలిచిన బీజేపీ... నాగాలాండ్‌లోనూ కూటమిదే అధికారం
- తవాంగ్: ‘‘భారత సైనికుల శవాలను వీధుల్లో పడేసి వెళ్లేవారు...’’ 1962 నాటి ఇండో చైనా యుద్ధం చూసిన వారు ఏమంటున్నారు?
- కరోనావైరస్ పుట్టింది చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే -ఎఫ్‌బీఐ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















