ఈజిప్ట్: గిజా పిరమిడ్‌లో రహస్య సొరంగం, ఎలా బయటపడిందంటే...

ఫొటో సోర్స్, EPA
- రచయిత, డేవిడ్ గ్రిటెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గిజా పిరమిడ్‌లో ఒక రహస్య సొరంగాన్ని కనుగొన్నట్లు ఈజిప్టు పురాతత్వ శాఖకు చెందిన అధికారులు వెల్లడించారు.
ఎండోస్కోప్ స్కానింగ్ వీడియోలో ఈ పిరమిడ్ లోపలి భాగంలో 9 మీటర్ల పొడవు, 2.1 మీటర్ల వెడల్పు ఉన్న ఒక కారిడార్ ఉన్నట్లు కనిపించింది.
ప్రవేశ ద్వారం చుట్టూ పిరమిడ్ బరువును సమంగా పంచేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సొరంగమైనా అయ్యుండచ్చు లేదా వివరాలు తెలియని చాంబర్ అయినా అయ్యుండొచ్చని ఈజిప్టు అధికారులు తెలిపారు.
స్కాన్ పిరమిడ్స్ ప్రాజెక్ట్‌కు చెందిన కొందరు శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేస్తున్న సమయంలో పిరమిడ్‌లో సాంద్రత మార్పులను పసిగట్టింది.
గ్రేట్ పిరమిడ్ ఉత్తర వైపు, ప్రధాన ప్రవేశద్వారానికి 7 మీటర్ల పైభాగాన రాతి చెక్కడాలు ఉన్న చోట లోపల భాగంలో ఈ ఖాళీ ప్రదేశాన్ని గుర్తించారు.
అనంతరం రాడార్, అల్ట్రా సౌండ్ టెక్నిక్స్‌తో మరికొన్ని పరీక్షలు చేశారు. ఆ తరువాత 6 మిల్లీమీటర్ల ఎండోస్కోప్‌ను ఆ రాళ్ల మధ్య ఉన్న ఖాళీలలోంచి లోనికి పంపించారు.

ఫొటో సోర్స్, EPA
ఎండోస్కోపీ తరువాత దానికి సంబంధిన వీడియో ఫుటేజ్‌ను శాస్త్రవేత్తల బృందం గురువారం విడుదల చేసింది. రాతిగోడల మధ్య ఖాళీగా ఉన్న కారిడార్ అందులో కనిపించింది.
‘‘పిరమిడ్‌ను ఇంకా స్కాన్ చేస్తాం. దానివల్ల లోపల ఇంకా ఏమేం ఉన్నాయి.. ఈ కారిడార్ చివరన ఏముందనేది తెలుసుకోవడానికి ఏం చేయాలో అర్థమవుతుంది’’ అని ఈజిప్ట్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ హెడ్ మొస్తాఫా వాజిరీ చెప్పారు.
క్రీస్తు పూర్వం 2609 నుంచి 2584 వరకు పాలించారని భావించే ఫారో ఖుఫూ సామ్రాజ్య కాలంలో గిజా పీఠభూమిపై 146 మీటర్ల ఎత్తయిన ఈ గ్రేట్ పిరమిడ్ నిర్మించారు.
భూమిపైన ఉన్న భారీ పురాతన నిర్మాణాలలో గిజా పిరమిడ్ కూడా ఒకటి. దీన్ని ఎలా నిర్మించారనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, EPA
ఈజిప్ట్ ఆర్కియాలజిస్ట్ జాహీ హవాస్ దీనిపై మాట్లాడుతూ ఖుఫూ రాజు సమాధి ప్రదేశం ఈ పిరమిడ్ లోపల ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ పరిశోధన తోడ్పడవచ్చన్నారు.
శాస్త్రవేత్తలు పిరమిడ్ లోపల గుర్తించిన కారిడార్ కింద ఉన్న ప్రదేశంలో ఏదో ముఖ్యమైనది ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.
‘‘నేను చెబుతున్నది నిజమో కాదో మరికొన్ని నెలల్లో తెలిసిపోతుంది’’ అన్నారు జాహీ హవాస్.
ఈ పిరమిడ్ లోపల రెండో అతిపెద్ద ఖాళీ ప్రదేశాన్ని మ్యూరోగ్రఫీ సాయంతో 2017లో గుర్తించారు. సుమారు 30 మీటర్ల పొడవు, 7 మీటర్ల ఎత్తున ఈ ఖాళీ ప్రదేశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















