ప్లాస్టిక్ కాలుష్యం: మైక్రోప్లాస్టిక్స్ మీరు తినే పండ్లు, కూరగాయల్లోనూ ఉండవచ్చు... అవి ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా?

ఫొటో సోర్స్, Nailia Schwarz/Alamy
- రచయిత, ఇసాబెల్లె గెరెట్‌సెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్లాస్టిక్ కాలుష్యం అనేది మన ఆధునిక జీవన విధానంలో భాగమైపోయింది. రాను రాను మరింతగా విస్తరిస్తోంది. మనం తినే పండ్లు, కూరగాయలలో కూడా ఈ కాలుష్యం ఉంటోంది.
మైక్రోప్లాస్టిక్‌లు భూమి అంతటా చేరిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా తాగునీటిలో, అంటార్కిటిక్ సముద్రపు మంచులో, లోతైన సముద్రపు కందకాలలో నివసించే జంతువులలో కూడా ఇవి ఉన్నట్లు కనుగొన్నారు.
రిమోట్ ఏరియాల్లోని బీచ్‌లు, జనావాసాలు లేని దీవుల బీచ్‌లలో కూడా ప్లాస్టిక్ కాలుష్యాన్ని గుర్తించారు. ఇవి భూమి అంతటా ఉన్న సముద్రపు నీటి నమూనాలలో కూడా కనిపిస్తాయి.
మహాసముద్రాల ఎగువ ప్రాంతాలలో దాదాపు 24.4 లక్షల కోట్ల మైక్రోప్లాస్టిక్ శకలాలు ఉన్నాయని ఒక అధ్యయనం చెబుతోంది. అయితే, నీటిలో మాత్రమే కాదు భూమిపై నేలల్లో కూడా అవి విస్తృతంగా వ్యాపించాయి. మనం తినే ఆహారంలో కూడా కనిపిస్తాయి. మనకు తెలియకుండానే మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు ఉండవచ్చు.
ఒక ఎన్విరాన్‌మెంటల్ వర్కింగ్ గ్రూప్ 2022లో అమెరికాలోని దాదాపు 2 కోట్ల ఎకరాల (80,937 చదరపు కి.మీ.) పంట భూమి.. రసాయనాలు (ఫరెవర్ కెమికల్స్)గా పిలిచే పెర్ పాలీఫ్లోరోఅల్కైల్ పదార్ధాల (పీఎఫ్ఏఎస్)తో మురుగు బురదగా మారిపోయినట్లు గుర్తించింది.
ఇవి సాధారణంగా ప్లాస్టిక్ ఉత్పత్తులలో కనిపిస్తాయి. సాధారణ పర్యావరణ పరిస్థితులలో ఇవి నాశనం కావు.
మునిసిపాలిటి మురుగునీటిని శుభ్రపరిచిన తర్వాత మిగిలిపోయేదే ఈ మురుగు బురద. దీనిని నాశనం చేయడం ఖర్చుతో కూడుకున్నది. అయితే, పోషకాలు సమృద్ధిగా ఉండటంతో అమెరికా, ఐరోపాలో బురదను సేంద్రీయ ఎరువుగా ఉపయోగిస్తారు. తరువాతి కాలంలో ఇది యురోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహకంలో భాగంగా మారింది.

ఫొటో సోర్స్, RJ Sangosti/The Denver Post/Getty Images
మురుగునీటి బురద ఎక్కడ ఎక్కువగా ఉంది?
ఐరోపాలో ప్రతి సంవత్సరం 80-100 లక్షల టన్నుల మురుగునీటి బురద ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో దాదాపు 40% వ్యవసాయ భూములకు చేరుతుంది. కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని ఎక్కువగా మైక్రోప్లాస్టిక్స్ ఉన్న ప్రాంతంగా యూరోపియన్ వ్యవసాయ భూమి నిలవనుంది. ప్రతీ ఏడాది దాదాపు 31 వేల నుంచి 42 వేల టన్నుల మైక్రో ప్లాస్టిక్స్ లేదా 86 ట్రిలియన్ల నుంచి 710 ట్రిలియన్ల మైక్రో ప్లాస్టిక్ కణాలు యూరోపియన్ వ్యవసాయ భూములను కలుషితం కానున్నాయి.
బ్రిటన్‌లోని సౌత్ వేల్స్‌లో ఒక మురుగునీటి శుద్ధి కర్మాగారంలో ప్రతిరోజు 1 ఎంఎం, 5 ఎంఎం (0.04-0.2 అంగుళాల) పరిమాణంలో ఉన్న 650 మిలియన్ల మైక్రోప్లాస్టిక్ కణాలు వస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ కణాలన్నీ మురుగునీటి బురదలో చేరుతాయి. అంతేకాకుండా స్వచ్ఛమైన నీటితో విడుదల కావు. ఇవి మొత్తం బరువులో దాదాపు 1% వరకు ఉంటాయి.
వ్యవసాయ భూముల్లో అంతమయ్యే మైక్రోప్లాస్టిక్‌ల సంఖ్య "బహుశా తక్కువే" అని కార్డిఫ్ యూనివర్శిటీకి చెందిన కేథరీన్ విల్సన్ అంటున్నారు. ఆ వర్సిటీలోని హైడ్రో-ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ సెంటర్‌లో అధ్యయన చేసే సహ రచయితలు, డిప్యూటీ డైరెక్టర్‌లలో కేథరీన్ ఒకరు. "మైక్రోప్లాస్టిక్‌లు ప్రతిచోటా ఉన్నాయి. మనం వాటిని చూడలేనంత చిన్నవిగా ఉంటాయి" అని కేథరీన్ స్పష్టంచేశారు.
మైక్రోప్లాస్టిక్స్ చాలా కాలం ఉంటాయి. ఫిలిప్స్-యూనివర్శిటీ మార్బర్గ్‌లోని మట్టి శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో 34 సంవత్సరాల క్రితం చివరిసారిగా మురుగునీటి బురదను వాడిన రెండు వ్యవసాయ క్షేత్రాల ఉపరితలం నుంచి 90 సెం.మీ. (35అంగుళాలు) వరకు మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నారు.
భూమి దున్నడం వల్ల కూడా బురద ఉండని ప్రాంతాల్లో ప్లాస్టిక్ విస్తరించింది. ఐరోపాలోని వ్యవసాయ భూములపై మైక్రోప్లాస్టిక్‌లు సముద్ర ఉపరితల జలాల్లో కనిపించే మొత్తానికి సమానంగా ఉంటుందని జేమ్స్ లోఫ్టీ చెబుతున్నారు. జేమ్స్ లోఫ్టీ కార్డిఫ్ అధ్యయనానికి ప్రధాన రచయిత, హైడ్రో-ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ సెంటర్‌లో పీహెచ్‌డీ పరిశోధన విద్యార్థి.
విల్సన్, లోఫ్టీ పరిశోధన ప్రకారం బ్రిటన్, ఐరోపాలు అత్యధికంగా మైక్రోప్లాస్టిక్‌లను కలిగి ఉన్నాయి. ప్రతి సంవత్సరం 500 నుంచి 1,000 మైక్రోప్లాస్టిక్ కణాలు వ్యవసాయ భూములలో చేరుతాయి.
భూమిపై మైక్రోప్లాస్టిక్‌ల పెద్ద రిజర్వాయర్‌ను సృష్టించడం, మురుగునీటి బురదను ఎరువుగా ఉపయోగించడం కూడా మన మహాసముద్రాలలో ప్లాస్టిక్ సంక్షోభం పెంచుతుందని లోఫ్టీ చెబుతున్నారు. చివరికి మైక్రోప్లాస్టిక్‌లు జలాల్లోకి వెళ్లిపోతాయి. ఎందుకంటే నేల పై పొరను వర్షం నీరు నదులు లేదా భూగర్భ జలాల్లోకి పంపిస్తుంది. "ప్రవాహాలు, నదులు, మహాసముద్రాలు (ప్లాస్టిక్) కాలుష్యానికి ప్రధాన కారణం" అని లోఫ్టీ అంటున్నారు.
మైక్రోప్లాస్టిక్‌లు 99 శాతం బురద జల వాతావరణంలోకి డంప్ చేసిన ప్రదేశం నుంచి ప్రవాహాల కారణంగా దూరంగా వెళ్లాయని కెనడాలోని అంటారియోలోని పరిశోధకులు గుర్తించారు.
కొట్టుకుపోయే ముందు మైక్రోప్లాస్టిక్‌లు విషపూరిత రసాయనాలను మట్టిలోకి పంపుతాయి. మైక్రోప్లాస్టిక్‌లు ఇతర విష పదార్థాలను కూడా గ్రహించగలవు. ఇది వ్యవసాయ భూములపైకి వాటిని వెళ్లడానికి వీలు కల్పిస్తుందని లోఫ్టీ తెలిపారు.
పర్యావరణ ప్రచార గ్రూప్ గ్రీన్‌పీస్ బ్రిటన్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ నివేదిక ఒకటి విడుదల చేసింది. బ్రిటన్ వ్యవసాయ భూముల్లో మురుగు వ్యర్థాలు మానవ ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయిలలో డయాక్సిన్‌లు, పాలీసైక్లిక్ సుగంధ హైడ్రోకార్బన్‌లు సహా కాలుష్య కారకాలతో కలుషితమై ఉన్నాయని గుర్తించారు.
కాన్సస్ యూనివర్శిటీ వ్యవసాయ శాస్త్రవేత్త మేరీ బెత్ కిర్కామ్ 2020లో చేసిన ప్రయోగంలో కాడ్మియం వంటి విష రసాయనాలను మొక్కలు తీసుకోవడానికి ప్లాస్టిక్ వెక్టార్‌గా పనిచేస్తుందని కనుగొన్నారు.
"మట్టిలో ప్లాస్టిక్ ఉండి కాడ్మియం ఉన్న మొక్కల గోధుమ ఆకులలో, మట్టిలో ప్లాస్టిక్ లేకుండా పెరిగిన మొక్కల కంటే ఎక్కువ కాడ్మియం ఉంటుంది" అని కిర్ఖమ్ ఆ సమయంలో వెల్లడించారు.

ఫొటో సోర్స్, Aris Messinis/AFP/Getty Images
నేలలకు మైక్రోప్లాస్టిక్ ఎలా ప్రమాదకరం?
మైక్రోప్లాస్టిక్‌లు వానపాముల పెరుగుదలను అడ్డుకోవచ్చని, వాటి బరువు తగ్గడానికి కారణమవుతాయని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఈ బరువు తగ్గడానికి గల కారణాలు పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఒక పరిశోధన ప్రకారం మైక్రోప్లాస్టిక్‌లు వానపాముల జీర్ణవ్యవస్థను అడ్డుకుంటాయి. పోషకాలను గ్రహించే సామర్థ్యం కూడా వీటి వల్ల పరిమితం అవుతుంది.
మట్టి ఆరోగ్యాన్ని కాపాడడంలో వానపాములు కీలక పాత్ర పోషిస్తున్నందున ఇది పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు అంటున్నారు. మట్టిని వాటి బురోయింగ్ చర్య (బొరియలు తీయడం) ద్వారా గాలిలోకి పంపుతుంది. నేల కోతను నివారిస్తుంది, నీటి పారుదలని మెరుగుపరుస్తుంది. పోషకాలను రీసైకిల్ చేస్తుంది. ప్లాస్టిక్ రేణువులు ఆహార పంటలను కూడా కలుషితం చేస్తాయి.ఇటలీలోని సిసిలీ కాటానియాలో పర్ మార్కెట్‌లు విక్రయించే పండ్లు, కూరగాయలలో మైక్రోప్లాస్టిక్‌లు, నానోప్లాస్టిక్‌లు ఉన్నాయని 2020లో నిర్వహించిన ఒక అధ్యయన గుర్తించింది.
యాపిల్స్ అత్యంత కలుషితమైన పండు, క్యారెట్ల తరహా కూరగాయలలో అత్యధిక స్థాయిలో మైక్రోప్లాస్టిక్‌లను కలిగి ఉన్నట్లు తెలిసింది. నెదర్లాండ్స్‌లోని లైడెన్ యూనివర్శిటీలో పర్యావరణ టాక్సికాలజీ, బయోడైవర్సిటీ ప్రొఫెసర్ విల్లీ పీజ్నెన్‌బర్గ్ చేసిన పరిశోధన ప్రకారం పంటలు నానోప్లాస్టిక్ కణాలను గ్రహిస్తాయి.
1-100 నానో మీటర్ పరిమాణంలో లేదా మానవ రక్త కణాల కంటే 1,000 నుంచి 100 రెట్ల కంటే చిన్న వాటిని నీరు, నేల చుట్టుపక్కల వాటి మూలాల్లోని పగుళ్ల ద్వారా గ్రహిస్తాయి.
చాలా ప్లాస్టిక్స్ మొక్కల మూలాల్లో పేరుకుపోయాయని, చాలా తక్కువ మొత్తంలో మాత్రమే రెమ్మల వరకు ప్రయాణిస్తున్నట్లు ఓ పరిశోధన వెల్లడించింది. "ఆకులలో సాంద్రతలు 1% కంటే తక్కువగా ఉన్నాయి" అని పీజ్నెన్‌బర్గ్ చెప్పారు. పాలకూరలు, క్యాబేజీ వంటి ఆకు కూరల్లో ప్లాస్టిక్ సాంద్రతలు సాపేక్షంగా తక్కువగా ఉండవచ్చు.
అయితే క్యారెట్, ముల్లంగి, టర్నిప్‌ల వంటి రూట్ వెజిటేబుల్స్‌కు మైక్రోప్లాస్టిక్‌లను వినియోగించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరిస్తున్నారు.
పీజ్నెన్‌బర్గ్, ఆయన సహచరులు చేసిన మరొక అధ్యయనంలో పాలకూర, గోధుమలు రెండింటిలోనూ మైక్రోప్లాస్టిక్‌ల సాంద్రత చుట్టుపక్కల నేల కంటే 10 రెట్లు తక్కువగా ఉందని గుర్తించారు.
"చిన్న కణాలు మాత్రమే మొక్కలు తీసుకుంటాయని మేం కనుగొన్నాం. అవి పెద్దవి కావు, ఇది భరోసానిస్తుంది" అని పీజ్నెన్‌బర్గ్ చెప్పారు. అయినప్పటికీ చాలా మైక్రోప్లాస్టిక్‌లు నెమ్మదిగా క్షీణించి, నానోపార్టికల్స్‌గా విచ్ఛిన్నమవుతాయి. ఇది "మొక్కలు తీసుకోవడానికి మంచి మూలం (సోర్స్)" అందిస్తుందని తెలిపారు.
పీజ్నెన్‌బర్గ్ పరిశోధన ప్రకారం ప్లాస్టిక్ రేణువులను తీసుకోవడం వల్ల పంటల ఎదుగుదల కుంటుపడలేదు.
కానీ, మన ఆహారంలో ప్లాస్టిక్ చేరడం కారణంగా ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో స్పష్టంగా తెలియదు. దీన్ని అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం అని పీజ్నెన్‌బర్గ్ చెప్పారు.
"ప్లాస్టిక్‌ను పర్యావరణం నుంచి పూర్తిగా తొలగించడానికి దశాబ్దాలు పడుతుంది" అని ఆయన చెప్పారు.
"ప్రస్తుతం ప్రమాదం ఎక్కువగా లేనప్పటికీ [వ్యవసాయ భూమిలో] నిరంతర రసాయనాలను కలిగి ఉండటం మంచిది కాదు. అవి పోగుపడతాయి. ప్రమాదాన్ని ఏర్పరుస్తాయి." అని తెలిపారు.

ఫొటో సోర్స్, Yuji Sakai/Getty Images
ఆరోగ్యంపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది?
ప్లాస్టిక్స్ తీసుకోవడం వల్ల మానవ ఆరోగ్యంపై పడే ప్రభావం ఇంకా పూర్తిగా తెలియదు. ఇది హానికరం అని సూచించే కొన్ని పరిశోధనలు ఇప్పటికే ఉన్నాయి. ప్లాస్టిక్‌ల ఉత్పత్తి సమయంలో వాడే రసాయనాలు ఎండోక్రైన్ వ్యవస్థ, మన పెరుగుదల, అభివృద్ధిని నియంత్రించే హార్మోన్‌లకు అంతరాయం కలిగిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్లాస్టిక్‌లో లభించే రసాయనాలు కేన్సర్, గుండె జబ్బులు, పిండం అభివృద్ధి చెందడం వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్నాయి.
బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ హాల్ పరిశోధకుల విశ్లేషణ ప్రకారం అధిక స్థాయి మైక్రోప్లాస్టిక్స్ తీసుకోవడం వల్ల కణ నష్టం, వాపు, అలెర్జీలకు దారితీయవచ్చు.
మానవ కణాలపై మైక్రోప్లాస్టిక్స్ టాక్సికాలజికల్ ప్రభావాన్ని వెల్లడించే గతంలోని 17 అధ్యయనాలను పరిశోధకులు సమీక్షించారు. ప్రయోగశాల పరీక్షలలో కణాలకు నష్టం కలిగించే మైక్రోప్లాస్టిక్‌ల మొత్తాన్ని తాగునీరు, సముద్రపు ఆహారం, ఉప్పు ద్వారా ప్రజలు తీసుకున్న స్థాయిలతో పోల్చారు.
తీసుకున్న మొత్తాలు కణాల మరణాన్ని ప్రేరేపించగల స్థాయికి చేరుకుంటాయని సమీక్షలో గుర్తించారు. అయితే, ఇది అలెర్జీ ప్రతిచర్యలు, సెల్ గోడలకు నష్టం, ఆక్సీకరణ ఒత్తిడితో సహా రోగనిరోధక ప్రతిస్పందనలకు కూడా కారణం కావచ్చు.
కణాలపై హానికరమైన ప్రభావాలకు అనుగుణంగా మైక్రోప్లాస్టిక్‌లను మనం తీసుకుంటున్నామని తమ పరిశోధన చూపిస్తోందని ఇవాంజెలోస్ డానోపౌలోస్ చెప్పారు. ఇవాంజెలోస్ డానోపౌలోస్ హల్ యార్క్ మెడికల్ స్కూల్ పరిశోధకుడు. ఇది చాలా సందర్భాలలో ఆరోగ్యంపై ప్రభావాలకు ప్రారంభమని అధ్యయనం ప్రధాన రచయిత అయిన ఇవాంజెలోస్ అంటున్నారు.
"మైక్రోప్లాస్టిక్‌లు కణాల అడ్డంకులను దాటగలవని, వాటిని విచ్ఛిన్నం చేయగలవని మాకు తెలుసు. అవి కణాలపై ఆక్సీకరణ ఒత్తిడిని కూడా కలిగిస్తాయని మాకు తెలుసు, ఇది కణజాల నష్టం ప్రారంభ స్థాయి" అని తెలిపారు.
మైక్రోప్లాస్టిక్‌లు కణాల విచ్ఛిన్నానికి ఎలా దారితీస్తాయో రెండు సిద్ధాంతాలు ఉన్నాయని డానోపౌలోస్ వివరించారు.
వాటి పదునైన అంచులు సెల్ గోడను చీల్చవచ్చు లేదా మైక్రోప్లాస్టిక్‌లలోని రసాయనాలు కణాన్ని దెబ్బతీయవచ్చు ఆయన అభిప్రాయపడ్డారు. సక్రమ ఆకారంలో ఉండే మైక్రోప్లాస్టిక్‌లు కణాల మరణానికి కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనం కనుగొందని తెలిపారు. "మన శరీరంలో ఎన్ని మైక్రోప్లాస్టిక్‌లు మిగిలి ఉన్నాయి. ఎలాంటి పరిమాణం, ఆకృతి సెల్ అవరోధాన్ని దాటగలదో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి" అని డానోపౌలోస్ చెప్పారు. ప్లాస్టిక్‌లు కాలక్రమేణా హానికరంగా మారే స్థాయికి పేరుకుపోతే, ఇది మానవ ఆరోగ్యానికి మరింత పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది.
అయితే ఇలాంటి సమాధానాలు లేకపోయినా మైక్రోప్లాస్టిక్‌లు ఆహార గొలుసులోకి ప్రవేశించకుండా చూసుకోవడానికి మరింత జాగ్రత్త అవసరమా? అని డానోపౌలోస్ అడుగుతున్నారు. "మైక్రోప్లాస్టిక్‌లతో బురద కలుషితమైందని, మొక్కలకు వాటిని నేల నుంచి తీయగల సామర్థ్యం ఉందని మనకు తెలిస్తే మనం దానిని ఎరువులుగా ఉపయోగించాలా?" అని ప్రశ్నిస్తున్నారు.
మురుగునీటి బురద ఏఏ దేశాలు నిషేధం విధించాయి?
'1995 నుంచి నెదర్లాండ్స్‌లో వ్యవసాయ భూములపై బురదను ఏర్పాటుచేయడం నిషేధించారు. దేశం మొదట్లో దానిని నాశనం చేసింది, అనంతరం బ్రిటన్ కు ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఆమ్‌స్టర్‌డామ్ భస్మీకరణ కర్మాగారంలో ఇబ్బందులు తలెత్తడంతో దీనిని వ్యవసాయ భూముల్లో ఎరువుగా ఉపయోగించారు.
స్విజర్‌ల్యాండ్ 2003లో మురుగునీటి బురదను ఎరువుగా ఉపయోగించడాన్ని నిషేధించింది. ఎందుకంటే ఇది "పరిశ్రమ, ప్రైవేట్ గృహాల ద్వారా ఉత్పత్తి చేయబడిన హానికరమైన పదార్థాలు, వ్యాధికారక జీవులను కలిగి ఉంటుంది." వ్యవసాయ భూములు, పంటలు, నీటిపై పర్యావరణ అధికారులు అధిక స్థాయిలో పీఎఫ్‌ఏఎస్‌ని గుర్తించిన తర్వాత అమెరికాలోని మైనే రాష్ట్రం కూడా 2022 ఏప్రిల్‌లో దీన్ని నిషేధించింది.
రైతుల రక్తంలో అధిక పీఎఫ్‌ఏఎస్ స్థాయిలు కూడా కనుగొన్నారు. విస్తృతమైన కాలుష్యం కారణంగా అనేక పొలాలు పక్కనపెట్టాల్సి వచ్చింది. కొత్త మెయిన్ చట్టం మురుగునీటి బురదతో కూడిన కంపోస్ట్ దరఖాస్తు, అమ్మకం, పంపిణీని నిషేధిస్తుంది. కానీ దానిని ఎగుమతి చేయకుండా నిషేధించదు.
అయితే మురుగునీటి బురదను ఎరువుగా ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధించడం ఉత్తమ పరిష్కారం కాదని కార్డిఫ్ విశ్వవిద్యాలయానికి చెందిన విల్సన్ సూచిస్తున్నారు. బదులుగా సహజవాయువుతో తయారైన సింథటిక్ నత్రజని ఎరువులు వాడేందుకు రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. "[మురుగునీటి బురదతో] మేం అంతులేని శిలాజ ఇంధన ఎరువులను ఉత్పత్తి చేయకుండా, వ్యర్థ ఉత్పత్తిని సమర్థవంతమైన మార్గంలో ఉపయోగిస్తున్నాం బురదలో ఉన్న సేంద్రీయ వ్యర్థాలు మట్టికి కార్బన్‌ను తిరిగి ఇవ్వడంలో సాయపడతాయి. భాస్వరం, నత్రజని వంటి పోషకాలతో దానిని సుసంపన్నం చేస్తాయి, ఇది నేల క్షీణతను నివారిస్తుంది " అని విల్సన్ చెప్పారు.
"మేం మురుగునీటి బురదలో మైక్రోప్లాస్టిక్‌లను లెక్కించాలి. దాంతో హాట్ స్పాట్‌లు ఎక్కడ ఉన్నాయో నిర్ణయించవచ్చు. దానిని నిర్వహించడం ప్రారంభించొచ్చు" అని విల్సన్ అంటున్నారు.
అధిక స్థాయిలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్న ప్రదేశాలలో మురుగునీటి బురదను ఎరువులుగా ఉపయోగించకుండా శక్తిని ఉత్పత్తి చేయడానికి కాల్చవచ్చు అని విల్సన్ సూచించారు. వ్యర్థజలాల శుద్ధి కర్మాగారాల వద్ద కొవ్వులు, నూనె, గ్రీజు తిరిగి పొందడం, బురదతో కలపడానికి బదులుగా జీవ ఇంధనంగా ఉపయోగించడం, వ్యవసాయ భూములను కలుషితం చేయకుండా నిరోధించడానికి ఒక మార్గం అని విల్సన్ బృందం చెబుతోంది.
ఇటలీ, గ్రీస్ వంటి కొన్ని యూరోపియన్ దేశాలు ల్యాండ్‌ఫిల్ సైట్‌లలో మురుగునీటి బురదను పారవేస్తాయని పరిశోధకులు గమనించారు.
అయితే, మైక్రోప్లాస్టిక్‌లు అక్కడి నుంచి పర్యావరణంలోకి ప్రవేశించి చుట్టుపక్కల భూమి, నీటి వనరులను కలుషితం చేసే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
విల్సన్, డానోపౌలోస్ ఇద్దరూ వ్యవసాయ భూములపై మైక్రోప్లాస్టిక్‌ల పరిమాణాన్ని, పర్యావరణ, ఆరోగ్య ప్రభావాలను లెక్కించడానికి మరింత పరిశోధన అవసరమని చెప్పారు. "మైక్రోప్లాస్టిక్‌లు ఇప్పుడు కలుషితం నుంచి కాలుష్య కారకంగా మారే దశలో ఉన్నాయి" అని డానోపౌలోస్ చెప్పారు.
"మైక్రోప్లాస్టిక్‌లు మన నీటిలో, మట్టిలో ఉండకూడదు. [అవి] ప్రతికూల ప్రభావాలను కలిగి ఉన్నాయని మనం నిరూపిస్తే, కాలుష్యకారకం అవుతుంది. దాంతో మనం చట్టాలు, నిబంధనలను తీసుకురావలసి ఉంటుందని" డానోపౌలోస్ సూచించారు.
ఇవి కూడా చదవండి
- మెగలొడాన్: తిమింగలాలనే మింగేసే అతి పెద్ద షార్క్ కోరను వెదికి పట్టుకున్న 9 ఏళ్ల బాలిక
- Naatu Naatu Song: తెలుగు సినీ సంగీత ప్రపంచానికి 'పెద్దన్న' ఎంఎం కీరవాణి
- ‘‘నన్ను కెమెరా ముందు కూర్చోబెట్టి నీ సెక్స్ సంబంధాల గురించి చెప్పు అని అడిగారు’’
- పాకిస్తాన్ ఆర్ధికంగా దివాలా తీస్తుందా, చేతిలో డాలర్లున్నా ఖర్చు చేయలేని స్థితిలో ఎందుకు పడింది?
- ఆరుగురు భార్యలు, 54 మంది పిల్లలు.. ట్రక్ నడుపుతూ అందరినీ పోషించిన 75 ఏళ్ల అబ్దుల్ మజీద్ మృతి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














