డబ్ల్యూపీఎల్: ముంబయి ఇండియన్స్ ఘన విజయం, 143 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి

డబ్ల్యూపీఎల్ ట్రోఫీతో హర్మన్ ప్రీత్ కౌర్ (కుడి), బేత్ మూనీ (ఎడమ)

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, డబ్ల్యూపీఎల్ ట్రోఫీతో హర్మన్ ప్రీత్ కౌర్ (కుడి), బేత్ మూనీ (ఎడమ)

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో తొలి విజయాన్ని ముంబయి ఇండియన్స్ జట్టు నమోదు చేసింది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65; 14 ఫోర్లు) విధ్వంసక బ్యాటింగ్‌కు సైకా ఇషాక్ (4/11) సూపర్ బౌలింగ్ తోడవ్వడంతో శనివారం జరిగిన లీగ్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 143 పరుగుల భారీ తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘన విజయాన్ని అందుకుంది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది.

అనంతరం గుజరాత్ జెయింట్స్ జట్టు 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయింది.

గుజరాత్ తరఫున హేమలత చేసిన 29 పరుగులే టాప్ స్కోరు. ఆమె తర్వాత మోనిక పటేల్ 10 పరుగులతో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచింది.

గుజరాత్‌లోని మిగతా బ్యాటర్లు ఎవరూ డబుల్ డిజిట్‌ స్కోరు చేయలేకపోయారు. ఏకంగా నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు.

ముంబయి బౌలర్ సైకా మొత్తం 3.1 ఓవర్లు బౌలింగ్ చేసి 11 పరుగులిచ్చి 4 వికెట్లను పడగొట్టింది. నాట్ సీవర్, అమెలియా కెర్ చెరో 2 వికెట్లు తీశారు.

గుజరాత్ కెప్టెన్ బేత్ మూనీ, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

హర్మన్‌ప్రీత్ కౌర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హర్మన్‌ప్రీత్ కౌర్

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూకుడుగా ఆడుతూ 22 బంతుల్లోనే 11 ఫోర్ల సహాయంతో అర్ధసెంచరీ అందుకుంది.

మొత్తం 30 బంతుల్ని ఎదుర్కొన్న హర్మన్ 65 పరుగులు చేసింది. ఆ తర్వాత స్నేహ్ రాణా బౌలింగ్‌లో హేమలతకు క్యాచ్ ఇచ్చి అవుటైంది.

మరోవైపు, ఓపెనర్ హేలీ మాథ్యూస్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అమెలియా కెర్ (24 బంతుల్లో 45 నాటౌట్: 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడారు.

గుజరాత్ బౌలర్లలో స్పిన్నర్ స్నేహ్ రాణా 2 వికెట్లు దక్కించుకుంది. ఆష్లే గార్డ్‌నర్, తనుజ కన్వర్, జార్జియా వరెహమ్ తలా ఓ వికెట్ తీశారు.

డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ జరగడానికి ముందు స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

బాలీవుడ్ హీరోయిన్లు కియారా అద్వానీ, కృతి సనన్‌లతో పాటు సింగర్ ఏపీ ధిల్లాన్ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.

హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన

మార్చి 26న ఫైనల్

పురుషుల క్రికెట్ టోర్నీ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలోనే మహిళల కోసం వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌)ను నిర్వహిస్తున్నారు.

మార్చి 4న మొదలైన డబ్ల్యూపీఎల్ మార్చి 26న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది.

డబ్ల్యూపీఎల్‌లోని అయిదు ఫ్రాంచైజీలు రూ. 4,669 కోట్లకు బిడ్లను దాఖలు చేశాయి.

ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ ఫ్రాంచైజీలు డబ్ల్యూపీఎల్‌లో తలపడుతున్నాయి.

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌, ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నారు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు స్మృతి మంధాన, యూపీ వారియర్స్ జట్టుకు అలీసా హీలీ, దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెగ్ లానింగ్, గుజరాత్ జెయింట్స్ జట్టుకు బేత్ మూనీ సారథులుగా ఉన్నారు.

హీలీ, మూనీ, లానింగ్ ముగ్గురూ కూడా ఆస్ట్రేలియా క్రికెటర్లు.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), డబ్ల్యూపీఎల్‌ను నిర్వహిస్తోంది. లీగ్ యాజమాన్య హక్కులు కూడా బీసీసీఐ వద్దే ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం: క్రికెట్‌కు దూరమైన పదేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి దిగుతున్న స్నేహ దీప్తి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)