చేతన్ శర్మ: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా... అందుకు కారణమైన వీడియోలో ఏముంది

ఫొటో సోర్స్, ANI
చివరకు అనుకున్నదే జరిగింది.
టీం ఇండియా సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. బీసీసీఐ సెక్రటరీ జే షా ఆయన రాజీనామాను ఆమోదించారు.
ఇటీవల ఒక న్యూస్ చానెల్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు బీసీసీఐ ఇమేజ్‌కు మచ్చ తెచ్చేలా ఉన్నాయి. అంతర్జాతీయంగా బీసీసీఐ, భారతీయ క్రికెటర్లకు చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉన్నాయి.
విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ మధ్య సంబంధాలు వంటి విషయాలను ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ కనిపించారు. కొందరు క్రికెటర్లు ఇంజెక్షన్లు తీసుకుంటారని అన్నట్లుగా కూడా కనిపిస్తోంది.
గతంలో వన్డేలు, టీ20 కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీ, గంగూలీ మధ్య వివాదం నడిచినట్లు వార్తలు వచ్చాయి. నాడు ఒక ప్రెస్ మీట్‌లో కూడా విరాట్ కోహ్లీ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ఆ తరువాత మూడు ఫార్మెట్లలోనూ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగాడు.

ఫొటో సోర్స్, Getty Images
చేతన్ శర్మ ఏమన్నారు?
ఒక న్యూస్ చానెల్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో ఆయన అనేక విషయాల మీద మాట్లాడారు.
ఆ వీడియోలో కనిపించిన దాని ప్రకారం, "నాటి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వల్లే తన కెప్టెన్సీ పోయిందని విరాట్ కోహ్లీ భావించాడు. సెలక్షన్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌లో తొమ్మిది మంది ఉన్నారు. కెప్టెన్సీ వదిలేయడం గురించి మరొక సారి ఆలోచించాలని విరాట్ కోహ్లీకి గంగూలీ చెప్పారు. కానీ దాన్ని విరాట్ కోహ్లీ విన్నట్లుగా లేదు. కానీ ఆ తరువాత దక్షిణాఫ్రికా సిరీస్ ముందు అనవసరంగా విరాట్ కోహ్లీ ఆ విషయాన్ని లేవనెత్తాడు. హార్దిక్ పాండ్య తరచూ మా ఇంటికి వస్తూ ఉండేవాడు. రోహిత్ శర్మ నాతో అరగంట మాట్లాడతాడు. భారత క్రికెటర్లు ఫిట్‌గా ఉండేందుకు ఇంజెక్షన్లు తీసుకుంటారు. విశ్రాంతి పేరుతో పెద్ద ప్లేయర్లను పక్కన పెడతారు. కొత్త ప్లేయర్లు రాగానే పెద్ద ప్లేయర్లకు విశ్రాంతి ఇస్తారు".

ఫొటో సోర్స్, Getty Images
చెలరేగిన వివాదం
ఆ వీడియో బయటకు రాగానే వివాదం చెలరేగింది. చివరకు చేతన్ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది.
57 ఏళ్ల చేతన్ శర్మ పంజాబ్‌లోని లుధియానాలో పుట్టారు. భారత జట్టులో మీడియం ఫాస్ట్ బౌలర్‌గా ఆడేవారు. భారత్ తరపున మొత్తం 23 టెస్టులు ఆడి 61 వికెట్లు తీశారు. 369 పరుగులు చేశారు. 65 వన్డేలు ఆడి 67 వికెట్లు తీయడంతోపాటు 456 పరుగులు తీశారు.
మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ ఆయనకు మేనమామ అవుతారు. 1983 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ టీంలో యశ్‌పాల్ శర్మ కూడా ఉన్నారు.
1986 ఇంగ్లండ్ టూర్‌లో రెండు టెస్టు మ్యాచుల్లో 16 వికెట్లు తీయడం ద్వారా సంచలనం సృష్టించారు చేతన్ శర్మ.
1987 వరల్డ్ కప్‌లో న్యూ జీలాండ్ మీద హ్యాట్రిక్ సాధించారు.
1989లో ఎంఆర్ఎఫ్ వరల్డ్ సిరీస్‌లో ఇంగ్లండ్ మీద చేతన్ శర్మ సెంచరీ చేశారు.
1996-97లో చేతన్ శర్మ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఆ తరువాత ఆయన కామెంటెర్‌గా పని చేశారు. 2009లో బీఎస్‌పీ తరపున ఫరీదాబాద్ నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు.

ఇవి కూడా చదవండి:
- బడ్జెట్ 2023: లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో వచ్చే మార్పులు ఏంటి, కొత్తగా పాలసీ తీసుకునే వాళ్లు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
- వారణాసి: మేకలకు సైతం బొట్టు పెట్టి పూజించే ఈ నగరాన్ని చూసిన ఒక విదేశీయుని అనుభవం ఏంటి
- నీల్ మోహన్: ఈ యూట్యూబ్ కొత్త సీఈఓ ఎవరు
- నిక్కీ యాదవ్ మర్డర్: గర్ల్‌ఫ్రెండ్‌ను చంపి ఫ్రిజ్‌లో పెట్టి, మరుసటి రోజే ఇంకో అమ్మాయితో పెళ్లి, ఈ కేసులో పోలీసులు ఏం చెప్పారు?
- ఎయిరిండియా: రికార్డు సంఖ్యలో విమానాల కొనుగోలుతో అంతర్జాతీయ సంస్థలకు సవాల్ విసరబోతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











