చైల్డ్ ఫ్రీ లైఫ్: ‘మాకు పిల్లలు వద్దు.. కుక్కలు, పిల్లులు ముద్దు’ అంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది.. ఎందుకు?

చిన్నారి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గౌతమి ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘మా అమ్మమ్మకు ఆరుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు.. వాళ్లది చాలా పెద్ద కుటుంబం..’ ఇలాంటి మాటలు చాలానే విని ఉంటారు కదా!

కొన్నేళ్ల తర్వాత.. ప్రభుత్వాలు జనాభా నియంత్రణ చర్యలు మొదలెట్టాయి. ‘చిన్న కుటుంబం - చింతలేని కుటుంబం’ అంటూ ఫ్మామిలీ ప్లానింగ్ ఆరంభమైంది.

దీంతో కుటుంబాలు ముగ్గురు పిల్లలు చాలు అంటూ సంతానానికి పరిమితిలు పెట్టుకోవటం మొదలైంది.

ఇంకొన్నేళ్లకు.. ‘మేమిద్దరం - మాకిద్దరు’ అనే నినాదంతో ‘2 ప్లస్ 2’ ఫార్ములా పాటించారు.

ఆపైన ‘ఇద్దరు వద్దు - ఒక్కరు ముద్దు’ అంటూ ఒక్క బిడ్డనే కనటం పెరిగింది.

ఇక ఇప్పుడు ‘నో కిడ్స్.. కిడ్స్ ఫ్రీ లైఫ్’ ట్రెండ్‌గా మారింది. చాలా మంది ‘హ్యాపిలీ సింగిల్ ఎట్ 40’ అంటున్నారు. అంటే అసలు పిల్లలను కనకుండా ఉండిపోవడం. సంతానం వద్దనుకోవడం.

ఇప్పుడు చాలా దేశాల్లో ఈ ‘నో కిడ్స్ మూవ్‌మెంట్’ ఊపందుకుంటోంది. చైల్డ్ ఫ్రీ లైఫ్ ఒక ట్రెండ్‌గా మారుతోంది.

పిల్లలు లేరంటే అదేదో మహా పాపంగా చూసే రోజులు పోయాయి. పిల్లల్ని కనటం లేదని, పిల్లలు కావాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు మహిళకు ఉంది అనే విషయాన్ని ఈ తరం మహిళలు నిర్భయంగా చెబుతున్నారు.

పిల్లల్ని వద్దనుకుంటున్న మహిళలు లేదా జంటల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏయే దేశాలు ఈ లిస్ట్‌లో ముందున్నాయో, దానికి కారణాలేంటో చూద్దాం.

వీడియో క్యాప్షన్, పలు దేశాల్లో ట్రెండ్ అవుతున్న నో చైల్డ్ మూవ్‌మెంట్

చైల్డ్ ఫ్రీ లైఫ్

మహిళలు ‘చైల్డ్ ఫ్రీ లైఫ్’ ఎంచుకుంటున్నారు. అది ‘చైల్డ్ లెస్ లైఫ్’ కాదు.

అంటే.. పిల్లలు లేకపోవడం కాదు, భార్యాభర్తలే పిల్లల్ని వద్దనుకోవడం, కనాలని అనుకోకపోవడం. ఈ తరం యువత.. ‘వి వాంట్ చైల్డ్ ఫ్రీ లైఫ్’ అంటోంది.

సింగపూర్, ఆస్ట్రియా, యూఎస్, యూకే, ఫిన్లాండ్, బహ్రెయిన్ , కెనడా లాంటి దేశాలలో ఇప్పటికే ఈ చైల్డ్ ఫ్రీ మూవ్‌మెంట్ మొదలైంది. కన్జర్వేటివ్ కంట్రీగా చెప్పుకునే దక్షిణ కొరియాలో కూడా పిల్లల్ని వద్దనుకునే జంటల సంఖ్య బాగానే పెరిగింది.

ఇక చైనా లాంటి దేశాల్లో జననాల రేటు తీవ్రంగా పడిపోవడంతో ఆ దేశ ప్రభుత్వం పిల్లల్ని కనాలంటూ ప్రోత్సహిస్తోంది. వన్ చైల్డ్ పాలసీని కూడా రద్దు చేసింది. జర్మనీ, రష్యా , తైవాన్ లాంటి దేశాలలో కూడా జననాల రేటు తగ్గిపోవడంతో ప్రభుత్వాలు, మహిళల మెటర్నటీ లీవ్ దగ్గర నుంచి పుట్టిన పిల్లల చదువు బాధ్యతల వరకు చాలా అంశాలపై దృష్టి పెట్టాయి.

దేశ జనాభాను పెంచేందుకు ఆర్థిక సాయాన్ని ఆయుధంగా ప్రయోగిస్తున్నాయి. పుట్టిన పిల్లలకు నజరానాలు కూడా ప్రకటిస్తున్నాయి.

చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

పెరుగుతోన్న సంఖ్య

సింగపూర్‌లో 40 ఏళ్ల తర్వాత ఇక పిల్లలు వద్దనుకుంటున్న వారి సంఖ్య 23 శాతం పెరిగింది. అమెరికాలో కూడా చైల్డ్ ఫ్రీ లైఫ్ కోరుకునే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. నిజానికి అమెరికన్లు పెళ్లి వద్దనుకోవడం లేదు కానీ పిల్లల్ని వారి బాధ్యతల్ని మాత్రం వద్దనుకుంటున్నారని ఫ్యూ రీసర్చ్ సెంటర్ చేసిన సర్వేలో తేలింది.

18 నుంచి 49 ఏళ్ల లోపు వారిపై జరిపిన సర్వేలో దాదాపు 44 శాతం మంది అమెరికన్లు చైల్డ్ ఫ్రీ లైఫ్‌కే తమ ఓటు అని చెప్పారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్‌లో జరిపిన సర్వేలో 50 శాతానికి పైగా జంటలు పిల్లలు లేని జీవితాన్నే కోరుకుంటున్నారని తేలింది.

ఇక దక్షిణ కొరియా లాంటి దేశాల్లో అసలు పెళ్లే వద్దంటున్న వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. 2014లో దక్షిణ కొరియాలో జరిగిన వివాహాల సంఖ్య 3,50,500. నాలుగేళ్ల తర్వాత అంటే 2018కి ఆ సంఖ్య 2,57,600కి పడిపోయింది.

చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో కూడా..

ఈ పరిస్థితి విదేశాలకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఊహించని విధంగా భారత్‌లో కూడా పిల్లల్ని వద్దనుకునే వారి సంఖ్య పెరుగుతోంది.

గత పదేళ్లతో పోలిస్తే భారత్‌లో కూడా జననాల రేటు బాగా తగ్గిందని చెబుతోంది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా.

ఈ లెక్కల ప్రకారం 2001 నుంచి 2011 నాటికి ఒంటరిగా ఉంటున్న వారు 30 శాతం పెరిగారు. ఇది 2023. ఈ సంఖ్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. 2020లో భారత్‌లో సింగిల్‌గా ఉండిపోయిన వారి సంఖ్య 1.74 కోట్ల మంది.

చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

కారణాలేంటి?

చైల్డ్ ఫ్రీ లైఫ్ కావాలని దంపతులు కోరుకోవడానికి చాలా కారణాలున్నాయి.

సెల్ఫ్ లవ్ .. తమని తాము ప్రేమించుకోవడం, తమ కోసం తమ సమయాన్ని, డబ్బును ఖర్చుచేయాలనుకోవడం, టెన్షన్ ఫ్రీగా ఉండాలనుకోవడం.

ఆరోగ్యం .. కరోనా లాంటి కఠినమైన పరిస్థితులను చూశాక ఆరోగ్యం పట్ల శ్రద్ధతో పాటు భయం కూడా పెరగడం. మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా లైఫ్ స్పాన్ తగ్గుతూ రావడం, అనేక ఆరోగ్య సమస్యలు చిన్న వయసులోనే మనపై దాడి చేయడం.

పొల్యూషన్, క్లైమేట్ చేంజ్ లాంటి సమస్యలకు అడ్డుకట్ట పడే మార్గాలు కనిపించకపోవడం.

అన్నింటికి మించి పిల్లలు అనేది సంతోషానికి మించిన బాధ్యత. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా పిల్లల బాధ్యత తల్లులదే . పిల్లలొచ్చిన తర్వాత మహిళల కెరియర్‌కు బ్రేక్ పడుతుండటం, వారి ఆరోగ్యాలపై కూడా ఎంతో కొంత ప్రభావం పడుతుండటం కొన్ని కారణాలుగా చెప్పొచ్చు. ఇవన్నీ వట్టి మాటలనుకుంటే పొరపాటే.

ప్యూ అనే అమెరికన్ రిసెర్చ్ సెంటర్ తల్లులపై చేసిన సర్వేలో పిల్లలొచ్చాక సంతోషంగా ఉందన్న తల్లుల సంఖ్య 70 శాతం ఉండగా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పిన తల్లుల సంఖ్య 30 శాతం వరకు ఉంది.

చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

వీటితో పాటు చాలా దేశాలలో పెరుగుతున్న జీవన వ్యయం, తగ్గుతున్న ఆదాయం కారణంగా పిల్లలు, అవసరాలు, చదువులు, ఖర్చులు అన్నీ కలిపి భరించలేని భారంగా మారిపోయాయనే వాళ్లు కొకొల్లలు.

వీటిన్నంటి ఫలితమే ఈ తరంలో చాలామంది ఎంచుకుంటున్న నో కిడ్స్ పాలసీ. పిల్లలకి బదులు, కుక్కలను పిల్లులని పెంచుకుంటూ ‘ఐ యామ్ ఎ ప్రౌడ్ డాగ్ మామ్’ ‘ఐ యామ్ క్యాట్ మామ్’ అని చెబుతున్న వారి గురించి పరిచయం చేయాల్సిన పనే లేదు.

మొత్తంగా చాలా మంది మహిళలు ‘మేం పిల్లల్ని కనే మిషన్లు కాదు , మాకు కూడా మా ఇష్టాలు, అయిష్టాలు, ఆలోచనలు, ఫ్యూచర్ గోల్స్ ఉంటాయి’ అంటున్నారు. పిల్లలు లేకపోతే విడాకులు ఇస్తారేమో అని భయపడే రోజుల నుంచి పిల్లల్ని కనడం, కనకపోవడం ‘మా ఛాయిస్’ అనే చెప్పే రోజుల్లోకి మేం వచ్చాం అని చెబుతున్నారు.

అయితే, ఈ ట్రెండ్ బాగా పెరిగితే ప్రస్తుతం జపాన్ ఎదుర్కొంటున్న అధిక వృద్ధ జనాభా వంటి సమస్య తలెత్తవచ్చని, ఇంకా ఇతర సవాళ్లు కూడా ఎదురు కావచ్చనే అభిప్రాయం కూడా ఉంది.

వీడియో క్యాప్షన్, బాలబాలికల మధ్య సమానత్వ భావనను పెంచడం కోసమే అంటున్న స్కూలు యాజమాన్యం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)