అమెరికా: ‘‘టీచర్‌ని గన్‌తో కాల్చిన ఆరేళ్ల బాలుడికి శిక్ష వేసే అవకాశం లేదు’’

ఫొటో సోర్స్, ABBY ZWERNER/FACEBOOK
- రచయిత, నదీన్ యూసిఫ్
- హోదా, బీబీసీ న్యూస్
క్లాస్ టీచర్‌ను తుపాకీతో కాల్చిన 6ఏళ్ల పిల్లవానికి ఎటువంటి శిక్ష విధించకపోవచ్చని అమెరికా అధికారులు తెలిపారు.
జనవరి నెలలో అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌ను ఆ బాలుడు తుపాకీతో కాల్చాడు.
ఈ కేసులో ఎవరైనా పెద్దల మీద నేరారోపణలు నమోదు చేయడం గురించి పోలీసులు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
జనవరి 6న రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌కి ఆ బాలుడు తుపాకీని బ్యాగులో పెట్టుకుని వచ్చాడని పోలీసులు తెలిపారు.
తన 25 ఏళ్ల టీచర్ అబిగైల్ జ్వెర్నర్ చేతిపై, ఛాతిపై ఆ బాలుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.
కాల్పులు జరిపిన బాలున్ని శిక్షించాలంటూ తాము కోరమని స్థానిక ఎన్‌బీసీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో న్యూస్‌పోర్ట్ న్యూస్ కామన్‌వెల్త్ అటార్నీ హోవార్డ్ గ్విన్ తెలిపారు.
‘‘ఆరేళ్ల బాలుని మీద విచారణలో అనేక సమస్యలుంటాయి. న్యాయ వ్యవస్థను అర్థం చేసుకునేంత వయసు ఆ పిల్లాడికి లేదు’ అని గ్విన్ చెప్పారు.
ఎంత వీలైతే అంత త్వరగా ఏదో ఒకటి చేయాలన్నది తమ లక్ష్యం కాదని అన్నారు.
తాము అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపిన తర్వాత, ఈ నేరం వెనుకాల ఎవరైనా ఉన్నట్లు తాము నమ్మితే ఆ వ్యక్తికి లేదా వ్యక్తులకు శిక్ష విధిస్తామన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఆరేళ్ల బాలుడు కావాలనే దాడికి పాల్పడినట్లు అమెరికా న్యాయ నిపుణులు అంగీకరించడం లేదని ఏబీసీ న్యూస్ అవుట్‌లెట్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గ్విన్ తెలిపారు.
తన చేతిపై, ఛాతిపై కాల్పులు జరిపిన తర్వాత ఈ విషయంపై జ్వెర్నర్ స్కూల్ డిస్ట్రిక్‌పై ఫిర్యాదు చేశారు.
అయితే, ఈ గన్ ఆ బాలుడి తల్లి కొనుగోలు చేసిందని పోలీసులు తెలిపారు.
ఈ బాలుడి ప్రవర్తన సరిగ్గా లేదని, స్కూల్ టీచర్లు, ఇతర విద్యార్థులతో ఏదో ఒక విషయంలో గొడవ పడుతుంటాడని జ్వెర్నర్ న్యాయవాది తెలిపినట్లు ఎన్‌బీసీ కథనం పేర్కొంది.
జ్వెర్నర్ సెల్‌ఫోన్ పగలగొట్టినందుకు అతన్ని ఒక రోజు స్కూల్ నుంచి సస్పెండ్ చేశారని, ఆ తర్వాత రోజు 9ఎంఎం గన్‌తో స్కూల్‌కి వచ్చినట్లు తెలిపారు. ఆ గన్‌తోనే తరగతి గదిలో టీచర్‌ను కాల్చినట్లు పేర్కొన్నారు.
కాల్పుల వల్ల చేతికి, ఛాతికి తీవ్ర గాయాలైనప్పటికీ, తరగతి గదిలో ఉన్న 20 మంది విద్యార్థులను జ్వెర్నర్ సురక్షితంగా బయటికి పంపినట్లు పోలీసులు తెలిపారు. రెండు వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన జ్వెర్నర్, ఆ తర్వాత కోలుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత మీద ఈడీ ఆరోపణలు ఏమిటి?
- అన్ని వయసుల వారికీ గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్.. ముందే గుర్తించడం ఎలా?
- IWD2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఊదా రంగును ఎందుకు ధరిస్తారు...
- అక్కడ విడాకులను వేడుకగా జరుపుకుంటారు
- Sexual Health: ‘‘వయాగ్రా తీసుకొని మద్యం తాగడంతో మరణించిన వ్యక్తి’’... అరుదైన కేసుగా వెల్లడి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














