India-Pakistan: ఆ పాకిస్తాన్ చిన్నారి మెడ 90 డిగ్రీలు వంగిపోయింది, విజయవంతంగా సరిచేసిన భారతీయ వైద్యులు

ఫొటో సోర్స్, @Afsheen Gul
- రచయిత, రియాజ్ సుహైల్
- హోదా, బీబీసీ ప్రతినిధి, కరాచీ
పాకిస్తాన్‌కు చెందిన 13 ఏళ్ల అఫ్సీన్‌కు కొత్త జీవితాన్ని ఇచ్చారు భారతీయ వైద్యులు.
అఫ్సీన్‌కు చిన్నప్పుడే అట్లాంటో యాక్సియల్ రోటరీ డిజ్‌లొకేషన్(ఏఏఆర్‌డీ) అనే అరుదైన వ్యాధి సోకింది. ఆ అమ్మాయి తల 90 డిగ్రీల కోణంలో పక్కకు వంగింది. దాంతో గత 12 ఏళ్లుగా తినడం, నడవడం, మాట్లాడటం చాలా కష్టంగా ఉండేది.
'తను పుట్టినప్పుడు బాగానే ఉండేది. 8 లేదా 10 నెలలప్పుడు పాప తల వంగడం ప్రారంభమైంది. అంతకు ముందు ఒకసారి తన అక్క చేతిలో నుంచి అఫ్సీన్ జారి కిందపడింది. అందువల్ల ఇలా అయిందని మేం అనుకున్నాం. దగ్గర్లో ఉండే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాం. మెడకు ఒక బెల్టు, మందులు రాసిచ్చారు. మేం పేద వాళ్లం కాబట్టి పెద్ద ఆసుపత్రులకు వెళ్లలేక పోయాం.' అని అఫ్సీన్ తల్లి జమీలా బీబీ అన్నారు.
గత 12 ఏళ్లుగా అఫ్సీన్ కింద పడుకునే తినడం, తాగడం చేసేదని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Ahsan Khan
తండ్రికి క్యాన్సర్
అఫ్సీన్ తండ్రి ఒక పిండి మిల్లులో కూలీగా పని చేసే వారు. ఆయనకు క్యాన్సర్ సోకడంతో ఇప్పుడు పని చేయడం లేదు.
'చిన్నప్పుడు అఫ్సీన్‌ను ఒక కుమ్మరి వ్యక్తికి చూపించా. పాప మెడను అతను బలంగా తిప్పాడు. దాంతో మెడ పూర్తిగా పక్కకు ఒరిగి పోయింది. అంతకు ముందు ఎంతో కొంత మెడ తిప్పగలిగేది.' అని అఫ్సీన్ తండ్రి చెప్పారు.
అఫ్సీన్‌కు నలుగురు అక్కలు, ముగ్గురు అన్నలు.
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన అఫ్సీన్ ఆరోగ్యపరిస్థితి 2017లో మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌కు ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. అక్కడ అఫ్సీన్ అనారోగ్యాన్ని డాక్టర్ దిలీప్ కుమార్ పరిశీలించారు. నాటి నుంచి అఫ్సీన్ గురించి మీడియాలో వార్తలు రావడం ప్రారంభమైంది.
ఆ తరువాత ఫేస్‌బుక్‌లో అఫ్సీన్ ఫొటోను షేర్ చేసిన పాకిస్తాన్ నటుడు అహసాన్ ఖాన్, 'ఈ అమ్మాయిని మనమంతా ఆదుకోవాలి. పైగా వాళ్ల నాన్నకు క్యాన్సర్' అంటూ రాశారు.
పాకిస్తాన్ ప్రముఖ టీవీ యాంకర్ సనమ్ బలోచ్ కూడా అఫ్సీన్ కుటుంబాన్ని కలిశారు. ఇలా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో 'అఫ్సీన్ చికిత్సకు అయ్యే ఖర్చంతా సింధ్ ప్రభుత్వం భరిస్తుంది' అని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ మెంబర్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత నాజ్ బలోచ్ ప్రకటించారు.
ఆ తరువాత పాకిస్తాన్‌లోని ఆగా ఖాన్ ఆసుపత్రిలో అఫ్సీన్‌ను చేర్పించారు. కొంత కాలం తరువాత ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేస్తే బతికే అవకాశాలు 50శాతం మాత్రమే ఉన్నాయని డాక్టర్లు చెప్పడంతో తాము వెనక్కి తగ్గినట్లు అఫ్సీన్ అన్న యాకుబ్ బీబీసీకి చెప్పారు.
'ఇంతలో అఫ్సీన్ అక్క పెళ్లి కుదిరింది. ఆ పెళ్లి పనుల్లో పడి కొంతకాలం పాటు వైద్యం గురించి ఆలోచించలేదు. పెళ్లి అయిపోయిన తరువాత పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేతలతో పాటు, సింధ్ ప్రభుత్వాన్ని కలిశాం. కానీ వారి నుంచి నిరాశాజనకమైన సమాధానం వచ్చింది' అని యాకుబ్ చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, NAZ BALOCH
బ్రిటిష్ జర్నలిస్ట్ కథనంలో మళ్లీ చర్చ
ఒక బ్రిటిష్ న్యూస్ పేపర్‌కు చెందిన అలెగ్జాండర్ థామస్, 2019లో అఫ్సీన్ అనారోగ్యం, వాళ్ల పేదరికం గురించి కథనం రాశారు. దాంతో మళ్లీ చర్చ మొదలైంది.
'ఒకరోజు ఆస్ట్రేలియా నుంచి ఎవరో ఫోన్ చేశారు. ఆస్ట్రేలియా వస్తే మా చెల్లికి చికిత్స చేయిస్తానని చెప్పారు. అందుకు దారుల్ సుకూన్ అనే ఎన్జీఓను కలవమని చెప్పారు. మేం అక్కడికి వెళ్లాం. పాస్ పోర్ట్ చేయించడంతోపాటు వీసా తీసుకునే ప్రక్రియ మొదలు పెట్టాం. ఇంతలోనే కరోనా వచ్చింది. దాంతో ఆస్ట్రేలియా వెళ్లలేక పోయాం.' అని యాకుబ్ వివరించారు.
'పోయిన ఏడాది దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో పని చేసే డాక్టర్ గోపాలన్ కృష్ణన్‌ను అలెగ్జాండర్ థామస్ కలిశారు. ఆయనకు మా గురించి చెప్పారు. ఆ తరువాత స్కైప్ ద్వారా డాక్టర్ మాతో మాట్లాడారు. దిల్లీకి వస్తే ఉచితంగా చికిత్స చేస్తామని డాక్టర్ చెప్పారు.
మేం భారత్‌కు వెళ్లడానికి మెడికల్ వీసా దరఖాస్తు చేసుకున్నాం. వీసా దొరక్కానే దిల్లీకి బయలుదేరాం. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సాయం అందలేదు. విదేశీయులే మాకు సాయం చేస్తూ వచ్చారు. అలా పోయిన ఏడాది నవంబరులో దిల్లీ చేరుకున్నాం' అని యాకుబ్ తెలిపారు.

ఫొటో సోర్స్, @AfsheenGul
నిధుల సమీకరణ
'గో ఫండ్ ఫర్ మీ' అనే వెబ్‌సైట్ ద్వారా తన చెల్లి చికిత్స కోసం నిధులు సేకరించారు యాకుబ్.
అఫ్సీన్‌కు తొలుత రెండు ఆపరేషన్లు చేశారు. ఆ తరువాత చివరిగా ఇంకో ఆపరేషన్ చేశారు. 'ఆపరేషన్ చేయకుంటే ఆ పాప చనిపోయి ఉండేది. ఇది ప్రపంచంలోనే తొలి కేసు అయి ఉండొచ్చు.' అని ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ కృష్ణన్ అన్నారు.

ఫొటో సోర్స్, @Afsheengul
ఈ ఏడాది ఫిబ్రవరి 28న చేసిన ఆపరేషన్‌తో అఫ్సీన్ మెడను వెన్నెముకకు విజయవంతం అమర్చారు. ఇందుకు సుమారు ఆరు గంటలు పట్టింది. మెడను సర్వికల్ స్పైన్‌కు రాడ్ల సాయంతో జాయింట్ చేశారు.
అలా 12 ఏళ్ల పాటు పడిన కష్టం నుంచి అపోలో ఆసుపత్రి వైద్యులు అఫ్సీన్‌కు విముక్తి కలిగించారు. ఇప్పుడు తను సాధారణ జీవితం గడుపుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని భారత జట్టులో ఉంచాలా? తీసేయాలా? - గొంతు విప్పుతున్న మాజీ క్రికెటర్లు
- పండర్‌పుర్ వారీ: ‘పీరియడ్స్ అనేవి పాండురంగడు ఇచ్చినవే. అవన్నీ ఆయనకే చెందుతాయి’
- హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
- సీఐ నాగేశ్వర రావు అరెస్ట్, వివాహితను బెదిరించి, అత్యాచారం చేసిన ఆరోపణల కేసులో విచారిస్తున్న పోలీసులు
- వైసీపీ పేరు మార్పు..జీవితకాల అధ్యక్షుడిగా జగన్ అన్న పార్టీ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













