జర్మనీ: జెహోవా విట్‌నెస్ హాల్‌ చర్చిలో కాల్పులు... సుమారు ఆరుగురు మృతి

పోలీసులు
    • రచయిత, ఎమిలీ మెక్‌గార్వే
    • హోదా, బీబీసీ న్యూస్

ఉత్తర జర్మనీ నగరం హ్యామ్‌బర్గ్‌లో జెహోవా విట్‌నెస్ మీటింగ్ హాల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో సుమారు ఆరుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

కాల్పులు జరిపిన వ్యక్తి కూడా చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.

చనిపోయిన ఆరు లేదా ఏడుగురిలో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి కూడా ఉన్నాడా లేడా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని జర్మన్ మీడియా తెలిపింది.

అయితే, కాల్పులకు వెనుకాల ఉన్న ఉద్దేశ్యం ఏమిటన్నది కూడా ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు.

నగరంలోని గ్రాస్ బోర్‌స్టల్ జిల్లాలో దీల్‌బోగ్ స్ట్రీట్‌లో ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మరికొంత మంది ప్రజలు కూడా గాయాలు పాలయ్యారు.

సంఘటన స్థలంలో గుర్తించిన ఒక మృతదేహాన్ని కాల్పులు జరిపిన వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతామని అన్నారు.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.15 ప్రాంతంలో తమకు కాల్పులు జరుగుతున్నట్లు రిపోర్టులు వచ్చాయని పోలీసు అధికార ప్రతినిధి హోల్గర్ వెహ్రెన్ చెప్పారు.

ఆఫీసర్లు అక్కడికి వెళ్లే సరికి కొందరు బుల్లెట్ల వల్ల తీవ్రంగా గాయపడ్డారని, కొందరు మరణించినట్లు గుర్తించారని చెప్పారు.

భవనం పై అంతస్తు నుంచి ఈ కాల్పులు జరుగుతున్నట్లు గుర్తించడంతో, భవంతి పైకి వెళ్లారని, అక్కడ కూడా ఒక వ్యక్తిని గుర్తించినట్లు చెప్పారు. నేరస్తులు సంఘటన స్థలం నుంచి పారిపోయిన సంకేతాలు ఏమీ లేవని అన్నారు.

బాధితులను పోలీసులు ఇంకా గుర్తించలేదని హోల్గర్ వెహ్రెన్ చెప్పారు. సంఘటన స్థలం వద్ద ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు పలువురు వ్యక్తులు చనిపోయినట్లు తెలిసిందని, చాలా మంది గాయాలు పాలయ్యారు. గాయాలు పాలైన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ కాల్పుల వెనుకాల ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు.

జర్మనీలోని హాంబర్గ్ నగరం

ఫొటో సోర్స్, Getty Images

పోలీసుల ప్రత్యేక దళాలు, పెద్ద ఎత్తున అధికారులను సంఘటన స్థలానికి పంపినట్లు హ్యామ్‌బర్గ్ హోం మంత్రి ఆండీ గ్రోట్ ట్విటర్‌లో చెప్పారు.

ఈ ఘటనపై ఎలాంటి పుకార్లను సృష్టించవద్దని ప్రజలకి పోలీసులు తెలిపారు.

క్రైస్తవ మత ఉద్యమానికి సంబంధించిన సభ్యులతో జెహోవా విట్‌నెసెస్ ఏర్పాటైంది.

చార్లెస్ తేజ్ రస్సెల్ నేతృత్వంలో 19వ శతాబ్దపు చివరిలో అమెరికాలో ఇది నెలకొల్పారు. ఈ ఉద్యమ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.

ఫెడరల్ వార్నింగ్ యాప్ ద్వారా ఈ ప్రాంతం ప్రమాదంలో ఉన్నట్లు ప్రజలని హెచ్చరించారు పోలీసులు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)