బిహార్‌లో ఘోరం: ఆరేళ్ల పాపపై గ్యాంగ్ రేప్, అడ్డుకున్న పదేళ్ల బాలిక బుగ్గను ‘కుక్క కొరికినట్లు కొరికారు’ - గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, SITU TIWARI/BBC
- రచయిత, సీటూ తివారి
- హోదా, బీబీసీ కోసం
ఆరేళ్ల నిషా (పేరు మార్చాం) శరీరంపై పళ్ల గాట్లు ఉన్నాయి. ముక్కు లోపల రక్తం గడ్డకట్టింది. కుడి కంటిలో గాయాల చారలు ఎర్రగా కనిపిస్తున్నాయి. నడుం చుట్టూ కట్టిన గుడ్డ రక్తంతో తడిసిపోయింది.
బిహార్‌లోని బెగుసరాయ్‌లోని సదర్ ఆస్పత్రిలో ఒక బెడ్‌పై చిన్నారి నిషా పడుకుని ఉంది. పక్క బెడ్‌లో ఆమె స్నేహితురాలు పదేళ్ల కవిత (పేరు మార్చాం) ఉంది.
కవిత ముఖానికి తెల్లటి బ్యాండేజీ చుట్టారు. ముఖంపై గాయాల గుర్తులున్నాయి. ఆమె చెంప కోసుకుపోయింది.
చెంప ఎంత లోతుగా కోసిపోయిందంటే, కవిత దంతాలు కనిపిస్తున్నాయని ఆమె తల్లి చెప్పారు.
"కుట్లు వేయడం కుదరదని డాక్టర్లు చెప్పారు. దానంతట అదే నయం అవుతుందని అంటున్నారు."
సదర్ ఆస్పత్రిలో డాక్టర్ ఆశాకుమారి బాలికలకు వైద్య పరీక్షలు చేశారు.
"ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. రెండో పిల్ల చెంప ఎంతలా కొరికారంటే, కుక్క మనిషిని కరిచినట్టు ఉంది" అని ఆమె బీబీసీతో చెప్పారు.
ఏం జరిగింది?

ఫొటో సోర్స్, SITU TIWARI/BBC
నిషా, కవిత బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లా సాహెబ్‌పూర్ కమాల్ బ్లాక్‌కు చెందిన పిల్లలు. ఇద్దరూ మైనారిటీ వర్గానికి చెందినవారే.
హోలీ రోజు వారిపై అత్యాచారం జరిగింది. ప్రస్తుతం సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోజు జరిగిన సంఘటనలను కవిత వివరించింది. ఆ విషయాలు చెబుతూ ఆ పాప వణికిపోయింది.
"మా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఊయల ఊగడానికి వెళ్లాం. మేం వెళ్లేసరికి పాఠశాల మైదానంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వారిలో సోహన్ కుమార్ (అలియాస్ ఛోటూ మహతో) మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పట్టుకున్నాడు. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాం. కానీ, వాళ్లు పట్టుకున్నారు. మా మొహాలను గోడకు అణచిపెట్టారు. నిషా ప్యాంట్ విప్పాడు. నా ప్యాంట్ కూడా విప్పాడు. ఈలోగా నేను తప్పించుకుని పరిగెత్తాను."
రోడ్డుకు కుడివైపున ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోని మరుగుదొడ్డిలో ఈ ఘటనకు సంబంధించిన గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. పూరీ ముక్కలు, రక్తపు మరకలు రెండూ ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఇద్దరు బాలికల చెప్పులు ఇంకా అలాగే ఉన్నాయి.
నిషాకు ముందు నుంచే మాట్లాడడంలో ఇబ్బంది ఉండేది. ఇప్పుడు పూర్తిగా మౌనం దాల్చింది. పాప బట్టలపై రక్తపు మరకలు ఎండట్లేదు. ఏమైనా తినడానికి ఇస్తే విసిరికొడుతోంది.
"నాకు ఏడుగురు పిల్లలు. ఈమె ఒక్కతే ఆడపిల్ల. రోజంతా గెంతుతూ, తిరుగుతూ ఉంటుంది. తిండి కూడా గెంతుతూనే తింటుంది. మేం బిచ్చమెత్తుకుని తినేవాళ్లం. ఆ రోజు కూడా పిల్లల చేతుల్లో బిచ్చెమత్తుకున్న పూరీలు ఉన్నాయి. మేం ఆ రోజు పూరీలు బిచ్చమెత్తుకుని వెనక్కి వస్తుంటే, అప్పుడు.. మీ పాపను కొట్టి పడేశారని ఎవరో చెప్పారు. వెంటనే వెళ్లి పాపను తీసుకొచ్చి డాక్టర్ ముస్తఫాకు చూపించాం" అని నిషా తల్లి చెప్పారు.
"నా దగ్గరకు తీసుకొచ్చేసరికి ఆ పిల్లలిద్దరి పరిస్థితి దారుణంగా ఉంది. ఒక పాప చెంప ఎంత లోతుగా కొరికారంటే, పాప దంతాలు బయటకు కనిపిస్తున్నాయి. రెండో పాపకు రక్తస్రావం అవుతోంది. వెంటనే నేను పోలీసులకు సమాచారం ఇచ్చాను. పది నిమిషాలలో పోలీసులు వచ్చి, పిల్లలిద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. లేదంటే నిషా బతికి ఉండేది కాదు" అని డాక్టర్ ముస్తఫా బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, SITU TIWARI/BBC
అత్యాచారం జరిగిందని తేలింది
"ఈ కేసులో సోహన్ కుమార్, బబ్లూ కుమార్, హర్దేవ్ కుమార్, గోవింద్ మహతో అనే నలుగురు యువకులపై బాలికల కుటుంబాలు ఫిర్యాదుచేశాయి. వీరిలో సోహన్, బబ్లులను అరెస్టు చేశాం" అని బెగుసరాయ్ పోలీసు సూపరింటెండెంట్ యోగేంద్ర కుమార్ చెప్పారు.
"ఇప్పటివరకు జరిపిన పరీక్షల ప్రకారం, బాలికపై అత్యాచారం జరిగింది. ప్రాథమికంగా ఇది గ్యాంగ్ రేప్ అని తెలుస్తోంది. వీలైనంత వేగంగా దర్యాప్తు, విచారణ జరిపేందుకు ప్రయత్నిస్తున్నాం" అని ఆయన అన్నారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఫోరెన్సిక్ సైన్స్ బృందం కూడా విచారణ చేపట్టింది. త్వరగా దర్యాప్తు జరపడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు.

ఫొటో సోర్స్, SITU TIWARI/BBC
మాదకద్రవ్యాలు సప్లయి చేస్తున్నారన్న ఆరోపణలు
ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే సోహన్ కుమార్ అలియాస్ ఛోటూ మహతోను పట్టుకున్నారు. ఆ సమయంలో అతడు బాగా తాగి ఉన్నాడని ఎస్పీ యోగేంద్ర కుమార్ చెప్పారు.
పాఠశాల సమీపంలోనే వీరు మద్యం, ఇతర మత్తు పదార్థాలను అమ్ముతారని గ్రామస్థులు చెబుతున్నారు.
ఈ కేసులో బబ్లూ కుమార్‌ను కూడా అరెస్ట్ చేశారు. బబ్లూ వృత్తిరీత్యా జర్నలిస్ట్. బబ్లూ, సోహన్ అన్నదమ్ములు.
"మా అబ్బాయి ఎలాంటి అత్యాచారం చేయలేదు. తను జర్నలిస్ట్. భజరంగ్ దళ్ సభ్యుడు కూడా" అని బబ్లూ తండ్రి జయ జయ రామ్ బీబీసీతో చెప్పారు.
అయితే, బబ్లూ కేవలం జర్నలిస్ట్‌గా తమకు పరిచయమని, భజరంగ్ దళ్‌తో అతడికి సంబంధం లేదని సాహెబ్‌పూర్ కమాల్ బ్లాక్ భజరంగ్ దళ్ కోఆర్డినేటర్ సజన్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, SITU TIWARI/BBC
గ్రామంలో ఆగ్రహం, అశాంతి..
"బాలికలిద్దరూ ప్రమాదం నుంచి బయటపడ్డార"ని సదర్ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ అఖిలేష్ కుమార్ తెలిపారు.
కానీ సాహెబ్‌పూర్ కమాల్ గ్రామంలో అశాంతి నెలకొంది. ముఖ్యంగా నిందితులు నివసిస్తున్న ప్రాంతంలో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
పిల్లలను బయటకు పంపాలంటే భయమేస్తోందని గ్రామస్థులు అంటున్నారు.
అక్కడి ప్రభుత్వ పాఠశాలలోనే మహ్మద్ ఎజాజ్ పిల్లలు చదువుతున్నారు.
"ప్రభుత్వం మొదట పాఠశాలలో పిల్లలకు రక్షణ కల్పించాలి. ఆ తరువాతే మా పిల్లలను బడికి పంపుతాం. ఈ వ్యక్తులు పాఠశాలను సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు స్థావరంగా మార్చారు" అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ ఘటన జరిగినప్పటి నుంచి గ్రామంలో బిహార్ పోలీసులు మోహరించారు. గ్రామంలో శాంతిభద్రతల కోసం గ్రామపెద్దలంతా ఒక కమిటీని ఏర్పాటుచేశారు.
"గ్రామంలో పెద్ద గొడవలు జరగకుండా చూడాలన్నదే మా ప్రయత్నం. పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. దోషులను వీలైనంత త్వరగా శిక్షించాలని కోరుతున్నాం" అని ఈ కమిటీ సభ్యులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సిలికాన్ వ్యాలీ బ్యాంక్: రూ.17 లక్షల కోట్ల ఆస్తులున్న బ్యాంకు ఎలా మూతపడింది?
- ఆస్కార్: ‘నాటునాటు’ పాటను నాటుగా పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌ల సంగీత ప్రయాణం ఏంటి
- క్యాంపా కోలా: త్వరలో మార్కెట్లోకి 'రీ ఎంట్రీ' ఇవ్వబోతున్న ఈ భారతీయ శీతల పానీయం చరిత్ర ఏంటి?
- చైల్డ్ ఫ్రీ లైఫ్: ‘మాకు పిల్లలు వద్దు.. కుక్కలు, పిల్లులు ముద్దు’ అంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది.. ఎందుకు?
- ‘ఎమ్మెల్యే చెప్పినట్టుగా వింటే బంగారం, డబ్బు వస్తాయన్నారు’ - దళిత మహిళా సర్పంచ్ ఆరోపణ.. ఖండించిన ఎమ్మెల్యే














