సిలికాన్ వ్యాలీ బ్యాంక్: రూ.17 లక్షల కోట్ల ఆస్తులున్న బ్యాంకు ఎలా మూతపడింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నటాలి షెర్మన్, జేమ్స్ క్లేటన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
అమెరికాలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) మూతబడింది.
ఎస్వీబీ ఖాతాదారుల డిపాజిట్లను నియంత్రణ సంస్థలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. అమెరికా బ్యాంకింగ్ రంగంలో 2008 తరువాత విఫలమైన అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఇదే.
‘‘తగినంతగా ఆదాయం లేకపోవడం, అప్పులు తీర్చే సామర్థ్యం తగ్గిపోవడం’’ కారణంతో సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను నియంత్రణలోకి తీసుకున్నట్లు కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్నోవేషన్ తెలిపింది.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఎక్కువగా టెక్నాలజీ సంస్థలకు రుణాలు ఇస్తూ ఉంటుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు బారులు తీరారు. అమెరికాలో 16వ పెద్ద బ్యాంకైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూతపడటంతో ఆ దేశం బ్యాంకింగ్ రంగం పరిస్థితి మీద సందేహాలు తలెత్తుతున్నాయి.
ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) సాధారణంగా 2,50,000 డాలర్ల వరకు డిపాజిట్‌లను కాపాడుతుంది. ఎస్వీబీ డిపాజిట్లలో సుమారు 175 బిలియన్ డాలర్ల బాధ్యతలు తీసుకున్నట్లు ఎఫ్‌డీఐసీ తెలిపింది.
బీమా ఉన్న ఖాతాదారుల కోసం సోమవారం నుంచి బ్యాంకులను తెరచి ఉంచుతారని, బ్యాంక్ ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చిన సొమ్మును బీమా లేని ఖాతాదారులకు ఇస్తారని ఎఫ్‌డీఐసీ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఖాతాదారుల ఆందోళన..
ఎస్వీబీలో ఖాతాలు ఉన్న అనేక కంపెనీలలో భయాందోళనలు నెలకొన్నాయి.
"మా డబ్బు గురించి ఆందోళనగా ఉంది. నిన్న డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడానికి ప్రయత్నించాం. కానీ, కుదరలేదు. చాలా కంగారుగా ఉంది" అని ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు బీబీసీతో చెప్పారు.
"మూడు రోజుల క్రితమే మా ఖాతా పది లక్షల డాలర్లకు చేరుకుంది. ఇంతలోనే ఇలా జరిగింది" అంటూ మరొక హెల్త్‌కేర్ స్టార్టప్ వ్యవస్థాపకుడు వాపోయారు.
రెగ్యులేటర్లు ఏం చెబుతున్నాయి?
2.25 బిలియన్ డాలర్ల నష్టాన్ని పూడ్చడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తెలిపింది. యూఎస్ ప్రభుత్వ బాండ్స్ విక్రయం వల్ల వచ్చిన నష్టాలను పూడ్చడానికి షేర్ల అమ్మకం మొదలెట్టామని అది వెల్లడించింది.
ఆ వార్తతో ఖాతాదారులు, పెట్టుబడిదారులు భయపడ్డారు. ఫలితంగా గురువారం బ్యాంకు షేర్లు 60 శాతానికి పైగా పడిపోయాయి. దాంతో ట్రేడింగ్ ఆపేశారు.
ఇతర బ్యాంకులు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కోవచ్చనే ఆందోళనలతో గురువారం, శుక్రవారం ఉదయం ప్రపంచవ్యాప్తంగా భారీగా బ్యాంక్ షేర్ల విక్రయం జరిగింది.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్, ఇతర బ్యాంకుల పరిస్థితిని "చాలా జాగ్రత్తగా" పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా ఆర్థిశాఖ మంత్రి జానెట్ యెలెన్ శుక్రవారం చెప్పారు.
"బ్యాంకింగ్ నియంత్రణ సంస్థలు సరైన చర్యలు తీసుకుంటాయని, బ్యాంకింగ్ వ్యవస్థ నిలకడగా ఉంటుందని, కంగారుపడక్కర్లేదని" ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఎంత పెద్దది?
ఎస్వీబీతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది కానీ, స్పందించలేదు.
ఎస్వీబీ ఎక్కువగా స్టార్టప్‌లకు రుణాలు ఇస్తుంది. అమెరికాలో గత ఏడాది స్టాక్ మార్కెట్‌లోని లిస్టెడ్ కంపెనీలలో దాదాపు సగం టెక్నాలజీ, హెల్త్‌కేర్ స్టార్టప్‌లకు ఎస్వీబీ రుణాలిచ్చింది.
1983లో 'కాలిఫోర్నియా బ్యాంక్' పేరుతో ఆరంభమైన ఈ సంస్థ గత దశాబ్దంలో వేగంగా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 8,500 మందికి పైగా ఉద్యోగులను ఉన్నారు. అయితే, చాలావరకు బ్యాంకు కార్యకలాపాలు అమెరికాలోనే జరుగుతాయి.
ఇటీవల వడ్డీ రేట్లు బాగా పెరగడంతో, స్టార్టప్‌లకు ప్రైవేటు రంగం నుంచి నిధులు పోగుచేసుకోవడం కష్టమైంది. చాలామంది ఖాతాదారులు బ్యాంకు నుంచి డబ్బు వాపస్ తీసుకోవడం మొదలెట్టారు. దాంతో, బ్యాంకు చిక్కుల్లో పడింది.
ఎస్వీబీ ద్వారా ఉద్యోగులకు జీతాలిచ్చే కంపెనీలు కూడా ఆందోళనలో పడ్డాయి. ఈ నెల జీతాలు ఆలస్యం కావచ్చని తమ ఉద్యోగులకు చెప్పుకోవాల్సి వచ్చిందని, బ్యాంకు ఖాతాలను మరో బ్యాంకుకు మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని రిప్లింగ్ అనే సంస్థ తెలిపింది.
బ్రిటన్‌లో ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ బ్రాంచ్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, దానికి విడిగా బ్యాలన్స్ షీట్ ఉందని, అందువల్ల అమెరికాలో బ్యాంకు దివాలా తమ బ్రాంచ్‌ను ప్రభావితం చేయదని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టతపై సందేహాలు
ఎస్వీబీ దివాలా తీయడంతో బ్యాంకింగ్ రంగానికి ఉన్న ముప్పు గురించి సందేహాలు, ఆందోళనలు వినిపిస్తున్నాయి. మరోపక్క, వడ్డీ రేట్లు వేగంగా పెరుగుతుండడంతో బాండ్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి.
అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచంలో వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు వడ్డీ రేట్లను విపరీతంగా పెంచాయి.
రేట్లు పెరిగితే, చేతిలో ఉన్న బాండ్ పోర్ట్‌ఫోలియో విలువ తగ్గిపోతుంది. అంటే, చాలా బ్యాంకులు నష్టం అంచున ఉన్నట్టు లెక్క. వేరే రకమైన ఒత్తిళ్లు లేకపోతే బ్యాంకులు ఈ సమస్యను తట్టుకుని నిలబడగలవు. కానీ, ఇతరత్రా ఒత్తిడి ఉంటే, హోల్డింగ్స్ అమ్ముకోవల్సి వస్తే దివాలా తీసే పరిస్థితి వస్తుంది.
శుక్రవారం నాటికి అమెరికా స్టాక్ మార్కెట్‌లో పరిస్థితికి కొంత మెరుగైంది. కానీ, పరిస్థితి ఇంకా సున్నితంగానే ఉంది.
"ఒకే రకమైన కంపెనీలకు రుణాలిచ్చే బ్యాంకులు వేగంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఖాతాదారులు కోరినప్పుడు డబ్బు వెనక్కి ఇచ్చేందుకు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దగ్గర డబ్బు లేకపోయింది. తమ బ్యాంకు డిపాజిట్లతో పెట్టుబడి పెట్టింది. ఆ పెట్టుబడులు నష్టాన్ని కొనితెచ్చాయి. దాంతో, బ్యాంకు దివాలా తీసింది. బ్యాంకింగ్ వ్యవస్థ పట్ల భయాందోళనలు నెలకొన్నాయి. కానీ, అన్ని బ్యాంకులూ ఇదే పరిస్థితిలో ఉండవు. అయితే, ఎస్వీబీ వైఫల్యం వల్ల టెక్ కంపెనీలకు రుణాలు దొరకడం ఇప్పుడు మరింత కష్టమవుతుంది" అని ఈక్విటీ పరిశోధన విశ్లేషకుడు అలెగ్జాండర్ యోకుమ్ అన్నారు.
భారత్‌పై ప్రభావం
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వైఫల్యం, వడ్డీ రేట్లు పెరగడం భారత్‌లో పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించవచ్చు. కానీ, దాని ప్రభావం ఇక్కడ అంతగా ఉండదని నిపుణులు అంటున్నారు.
"ఇది అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థకు పరిమితమైన సమస్య. భారతదేశంలో బ్యాంకింగ్ రంగంపై ప్రభావం చూపదు. కానీ, పెట్టుబడిదారులను కొంత భయాందోళనలకు గురిచేయవచ్చు" అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ 'ది హిందూ' పత్రికతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- RRR సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రూ. 80 కోట్లు ఖర్చు అంటూ తమ్మారెడ్డి వ్యాఖ్యలు.. నాగబాబు కౌంటర్.. నెటిజన్లు ఏమంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్: దేశం మొత్తం 19వేల మంది ఉద్యోగులున్న ఎన్టీపీసీ, రాష్ట్రంలో 77వేల ఉద్యోగాలు ఇవ్వగలదా?
- భారత్ మ్యాట్రిమోనీ విడుదల చేసిన వీడియోపై వివాదమెందుకు? అందులో ఏముంది?
- మూత్రపిండాలు: కిడ్నీ సమస్యలను గుర్తించడం ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
- చైల్డ్ ఫ్రీ లైఫ్: ‘మాకు పిల్లలు వద్దు.. కుక్కలు, పిల్లులు ముద్దు’ అంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














