ఆంధ్రప్రదేశ్: దేశం మొత్తం 19వేల మంది ఉద్యోగులున్న ఎన్‌టీపీసీ, రాష్ట్రంలో 77వేల ఉద్యోగాలు ఇవ్వగలదా?

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, Facebook/NTPC, AP CM

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 సదస్సులో రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

అందులో ప్రధానంగా రెన్యూవబుల్ ఎనర్జీకి చెందిన ఒప్పందాల విలువే రూ. 8.5 లక్షల కోట్లని తెలిపింది. ఇందులో ఎన్టీపీసీ లిమిటెడ్ (నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్) 77 వేల ఉద్యోగాలకు అవకాశమున్న రూ. 2.35 లక్షల కోట్ల విలువైన 3 ఒప్పందాలు చేసుకుందని చెప్పింది.

దేశ, విదేశాల్లో ఎన్టీపీసీకి ఉన్న థర్మల్, సోలార్, హైడ్రో, విండ్ ప్రాజెక్టులతో పాటు ఇతర జాయింట్ వెంచర్ల ద్వారా మొత్తం 18,936 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు ఎన్టీపీసీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

కానీ, ఇప్పుడు ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న 3 ఒప్పందాల ద్వారా 77 వేల ఉద్యోగాలను కల్పించగలుగుతుందా? అనే ప్రశ్న మొదలైంది. అదే సమయంలో ఎన్టీపీసీ పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 2.35 లక్షల కోట్లు పెడితే, దానికి కావలసిన భూములను ఏపీ ప్రభుత్వం ఏ మేరకు సమకూర్చగలదు అనే చర్చ కూడా నడుస్తోంది.

ఏపీ ప్రభుత్వంతో ఎన్టీపీసీ చేసుకున్న మూడు ఒప్పందాలు పునరుత్పాదక శక్తి రంగంలో ఏ విభాగాల్లో చేసుకుంది? ఆ ఒప్పందాలను కార్యచరణలోకి తీసుకురావడానికి పెట్టుకున్న కాల వ్యవధి ఎంత? ఏ విభాగంలో ఎంత పెట్టుబడి, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు? వంటి అంశాలను ఇటు ప్రభుత్వం కానీ, అటు ఎన్టీపీసీ కానీ వెల్లడించలేదు.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న కారణంగా కోడ్ అడ్డంకిగా మారిందని, ఈ నెల 18 తర్వాత వాటిని ప్రకటించే అవకాశముందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్

ఫొటో సోర్స్, ap cmo

ఎన్టీపీసీ కథ ఇదీ...

ఎన్టీపీసీ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ అందిస్తున్న వివరాల ప్రకారం..

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్టీపీసీ, మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో నడుస్తుంది. దేశ అవసరాల కోసం విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం, దాన్ని దేశంలోని వివిధ ఎలక్ట్రిసిటీ బోర్డులకు సరఫరా చేయడం ఎన్టీపీసీ పని.

1975లో ప్రారంభమైన ఎన్టీపీసీ ప్రస్తుతం బొగ్గు, గ్యాస్, సోలార్, విండ్, హైడ్రో విద్యుత్‌లను దాదాపు 90 వరకు ఉన్న పవర్ స్టేషన్ల ద్వారా తయారు చేస్తుంది.

ఇందులో ప్రస్తుతానికి సింహాభాగం మాత్రం బొగ్గుదే. అలాగే కొన్ని చోట్ల ఇతర కంపెనీలతో జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేస్తుంది. ప్రారంభమైనపుడు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్‌గా ఉన్న ఎన్టీపీసీ పేరు ఆ తర్వాత 2005లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మారింది.

ఎన్టీపీసీ లిమిటెడ్‌లో 26 బొగ్గు ఆధారిత, 7 గ్యాస్, 4 హైడ్రో గ్యాస్ ఎలక్ట్రిక్ పవర్, 11 విండ్, 13 సోలార్ స్టేషన్లతో పాటు థర్మల్ విద్యుత్ ఉత్పాదక ప్లాంట్లలో మరో 11 జాయింట్ వెంచర్లు, గ్యాస్‌కు సంబంధించి 4, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్‌కు సంబంధించి 10, సోలార్ 1, స్మాట్ హైడ్రో 2 జాయింట్ వెంచర్ల విద్యుత్ ఉత్పదక కేంద్రాలున్నాయి.

ఎన్టీపీసీ 2004లో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యింది. రూ. 62 వద్ద ప్రారంభమైన ఎన్టీపీసీ షేర్ ధర 2023 మార్చి 8 నాటికి రూ. 178లకు చేరింది. ప్రస్తుతం ఎన్టీపీసీ మార్కెట్ క్యాపిటల్ రూ. 1.73 లక్షల కోట్లు అని మనీ కంట్రోల్ వెబ్ సైట్ పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో ఏపీలోని అనకాపల్లి జిల్లా పరవాడలో ఎన్టీపీసీ సింహాద్రి పేరుతో 2000 మెగా వాట్ల సామర్థ్యంతో థర్మల్ విద్యుత్ కేంద్రం, తెలంగాణాలోని రామగుండంలో ఎన్టీపీసీ రామగుండం పేరుతో 2600 మెగావాట్ల సామర్థ్యంతో మరో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎన్టీపీసీ నిర్వహిస్తోంది.

దేశంలోని అత్యంత పెద్దదైన ప్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను రామగుండం ఎన్టీపీసీ నిర్వహిస్తోందని, అలాగే సింహాద్రి ఎన్టీపీసీలో కూడా 25 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉందని ఎన్టీపీసీ తెలిపింది.

ఎన్‌టీపీసీ వెబ్‌సైట్

ఫొటో సోర్స్, NTPC.CO.IN

ఫొటో క్యాప్షన్, జాయింట్ వెంచర్స్, అనుబంధ సంస్థలతో కలిపి 18,936 మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్లు ఎన్‌టీపీసీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్

ఫొటో సోర్స్, NTPC website

భవిష్యత్తు లక్ష్యం ఇది...

ఎన్టీపీసీని భవిష్యతులో 1,28,000 మెగావాట్ల సంస్థగా తీర్చిదిద్దుతున్నట్లు ఎన్టీపీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇదే విషయాన్ని ఎన్టీపీసీకి చెందిన అన్ని వెబ్‌సైట్లు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ప్రచారం చేస్తున్నారు కూడా. అయితే, 2032 నాటికి ఈ స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

శిలాజ ఇంధనం అంటే బొగ్గు, బొగ్గు సంబంధిత, క్రూడాయిల్, తారు, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని 2032 నాటికి 56 శాతం తగ్గించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎన్టీపీసీ పేర్కొంది. ఈ స్థాయిలో శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించుకోవడంతోనే రెన్యూవబుల్ ఎనర్జీ (విండ్, సోలార్, హైడ్రో)పై ఎన్టీపీసీ దృష్టి పెట్టింది. ఏపీతో ఎన్టీపీసీ చేసుకున్న మూడు ఒప్పందాలు కూడా పునరుత్పాదక ఇంధన రంగానికి చెందినవే.

2030 నాటికి విద్యుత్తు ఉత్పత్తిలో 50% పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటామని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా థర్మల్ ఎనర్జీ రంగంలో ఉన్న పరిశ్రమలు, క్రమంగా సంప్రదాయ ఇంధన వనరులను ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని, అందులో భాగంగానే విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌లో పెద్ద ఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలోనే పెట్టుబడులు వచ్చాయని ఏయూ ఎకనామిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం. ప్రసాదరావు బీబీసీతో చెప్పారు.

గ్లోబల్ సమ్మిట్

ఫొటో సోర్స్, AP CMO/fb

‘అవకాశాలు వస్తాయి, కానీ సగానికి పడిపోతాయి’

పునరుత్పాదక రంగంలో చేసుకున్న పెట్టుబడుల ఒప్పందాలపై పారిశ్రామిక వేత్తలు విభేదించట్లేదు, కానీ, చేసుకున్న ఒప్పందాల సైజ్ అంటే పెట్టుబడి మొత్తం, ఉపాధి కల్పిస్తామనే సంఖ్యపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఎన్టీపీసీ ఇప్పటి వరకు దాదాపు 19 వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించగలిందని, మరి ఇప్పుడు ఏకంగా ఒకేసారి 77 వేల ఉద్యోగాలంటే ఆశ్చర్యంగా ఉందని విశాఖలోని సోలార్ విద్యుత్ రంగంలో పని చేస్తున్న కె. మధు బీబీసీతో అన్నారు.

‘‘పైగా పునరుత్పాదక రంగంలో శాశ్వత ఉద్యోగాల కల్పనకు అవకాశం తక్కువగా ఉంటుంది. ప్లాంట్స్ ఇన్ స్టాల్ చేసేటప్పుడు అక్కడ కనిపించే ఉద్యోగులతో పోలిస్తే, ఒకసారి పని పూర్తయ్యాక అందులో సగానికి పైగా ఉద్యోగులతో అవసరం ఉండదు.

సోలార్, విండ్, హైడ్రో పవర్ వంటి స్టేషన్ల వద్ద ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఆశించలేం” అని మధు అభిప్రాయపడ్డారు.

ఎన్టీపీసీ

ఫొటో సోర్స్, NTPC website

‘77 వేల ఉద్యోగాలు అనుమానమే’

ఒక మెగా వాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కనీసం 4 ఎకరాల స్థలం, రూ. 5 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని జీవీఎంసీ మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ వద్ద నిర్మించిన ప్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన ప్రదీప్ చెప్పారు. ప్రదీప్ గత పదేళ్లుగా సోలార్ ప్లాంట్స్ ఇన్‌స్టాలేషన్ ప్రాజెక్టులలో పని చేస్తున్నారు.

“ఒక మెగా వాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకునే స్టేషన్ వద్ద నిర్మాణ దశలో 10 మంది టెక్నీషియన్లు, 5 ఇంజనీర్లు, ఒక జూనియర్, మరో సీనియర్ ప్రాజెక్టు మేనేజర్, ఇన్‌స్టాలేషన్ సిబ్బంది మరో 5 నుంచి 8 మంది అవసరం అవుతారు. ఒకసారి ప్రాజెక్టు పూర్తైతే ఇందులో సగం మంది అవసరం ఉండదు.

ఎన్టీపీపీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులలో ఉద్యోగాల కల్పన ఎలా చేస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ప్రాజెక్టు పనులపై వచ్చే ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ సిబ్బందిని, చిన్ని చిన్న సబ్ కాంట్రాక్టర్లని కూడా ఎంప్లాయిస్‌గా గుర్తించినా కూడా ఎన్టీపీసీ చెప్పిన 77 వేల ఉద్యోగాల కల్పన కష్టమవుతుంది” అని ప్రదీప్ బీబీసీతో చెప్పారు.

ఎన్టీపీసీ తన భవిష్యత్తు కార్యచరణ ప్రణాళిక కూడా 2032 వరకు ఉంది. దాదాపు మరో పదేళ్ల సమయం ఉంది కాబట్టి ఈలోపు రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ఊహకందని మార్పులు వస్తే అప్పుడు చూడాలి అని ప్రదీప్ చెప్పారు.

సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు

ఫొటో సోర్స్, AP CMO/FB

‘‘ఉపాధి కల్పన తక్కువ, భూమి అవసరం ఎక్కువ’’

అనకాపల్లి జిల్లా పరవాడలో ఉన్న సింహాద్రి ఎన్టీపీసీ 2000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో పని చేస్తోంది. 2021లో 25 మెగావాట్ల సామర్థ్యంతో ప్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ని కూడా ఎన్టీపీసీ నిర్మించింది. సింహాద్రి ఎన్టీపీసీలో సుమారు 17 వందల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2 వేల వరకు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకుడు వెంకటరావు బీబీసీతో చెప్పారు.

ఇలా చూసుకుంటే ఏపీ ప్రభుత్వంతో ఎన్టీపీసీ కుదుర్చుకున్న ఒప్పందాలు నిజంగా అమలవుతాయా అనే అనుమానం వస్తుందన్నారు. సింహాద్రి ఎన్టీపీసీ 3 వేల 3 వందల ఎకరాల్లో ఉంది.

“ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నాయి. కాబట్టి ఎన్టీపీసీ ఒప్పందం అనేది సాధ్యం కాదనే అనుకుందాం.

కాకపోతే మరోవైపు ఈ ప్రాజెక్టులు కార్యరూపంలోకి తీసుకురావాలన్నా ఎంత భూమి అవసరం, ఎంత నీరు అవసరం అవుతుంది? ఒక అంచనా ప్రకారం సమ్మిట్‌లో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో కుదిరిన ఒప్పందాలు అమలు కావాలంటే 5 లక్షల ఎకరాల నుంచి 7 లక్షల ఎకరాల వరకు భూమి అవసరం. అంత భూమిని ప్రభుత్వం సమకూర్చగలదా?” అని వెంకటరావు ప్రశ్నించారు.

గ్లోబల్ సమ్మిట్

ఫొటో సోర్స్, AP CMO/FB

‘సోలార్ పవర్ కేరాఫ్ రాయలసీమ’

సోలార్ పవర్ ప్లాంట్స్ నిర్మాణానికి భూమి అవసరం చాలా ఎక్కువ. ఆ స్థాయిలో భూమి అందుబాటులో ఉన్న రాయలసీమలోనే ప్రభుత్వం సోలార్ ప్లాంట్స్‌కి అనుకూలమైన భూములను గుర్తించింది.

రాయలసీమలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రొత్సహిస్తూ ప్రకాశంలో 9,630 ఎకరాలు, అనంతపురంలో 29, 983 ఎకరాలు, వైఎస్సార్ కడప జిల్లాలో 29, 549 ఎకరాలు, కర్నూలులో 31, 450 ఎకరాలు ఇలా మొత్తం 1,00612 ఎకరాలు భూమిని ప్రభుత్వం గుర్తించింది.

రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి సహకరిస్తూ భూములు ఇచ్చే విధంగా క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రైతులతో మాట్లాడి ఒప్పించాలని సీఎం జగన్ ఆదేశించారు.

“ప్రభుత్వం ఎన్టీపీసీ వంటి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేసేందుకు రాష్ట్రంలో భూమి అందుబాటులోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్ల కోసం ఇప్పటికే దాదాపు లక్ష ఎకరాలను గుర్తించింది.

ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తిదారులకు 25 ఏళ్ల పాటు భూమిని లీజుకు ఇవ్వనుంది. ప్రతి ఎకరాకు రూ.31 వేలు లీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు భూమి అయితే ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి.

మెగావాట్‌కు రూ.లక్ష చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఉత్పత్తిదారు ఎక్కడైనా అమ్ముకోవచ్చు” అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్స్‌పోర్ట్ పాలసీ ద్వారా మన రాష్ట్రంలో సంప్రదాయ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. దీంతో పెట్టుబడిదారులు కూడా మన రాష్ట్రంపై ఆసక్తి చూపుతారని మంత్రి అమర్నాథ్ చెప్పారు.

గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్-2023 ద్వారా కుదిరిన ఒప్పందాలను వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీ వేసిందని మంత్రి చెప్పారు.

దీని ద్వారా నెలకు కనీసం 3 కంపెనీల ఒప్పందాలను కార్యచరణలోకి తీసుకుని రావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ లెక్కన సమ్మిట్ లో కుదిరిన 352 ఒప్పందాలు కార్యచరణలోకి రావాలంటే ఎంత సమయం పడుతుంది? నిరుద్యోగులను ఊరిస్తున్న ఉద్యోగాలు ఎప్పటికీ వస్తాయో?

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: శుభకార్యానికి వచ్చిన ముఖ్యమంత్రి... చెట్లు కొట్టేసిన అధికారులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)