వ్యోమగామి అవ్వాలని ప్రయాణం మొదలుపెట్టి, సముద్రంలో మునిగిపోయిన అమ్మాయి

- రచయిత, కవూన్ ఖామోష్, అలీ హుస్సేనీ, సోరన్ ఖుర్బానీ
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్, బీబీసీ పర్షియన్
మేదా హుస్సేనీ, వ్యోమగామి కావాలని అనుకున్నారు. తన కోరికను తెలుపుతూ నాసాకు ఉత్తరం కూడా రాశారు.
17 ఏళ్ల అఫ్గాన్ యువతికి అది సుదూర స్వప్నమే. కానీ, ఆమె దాని కోసం కృషి చేయాలని నిశ్చయించుకున్నారు.
2021 ఆగస్టులో తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక ఆమె కుటుంబం ఇరాన్‌కు పారిపోయారు. అయినప్పటికీ ఆస్ట్రోనాట్ కావాలనే తన కలను 17 ఏళ్ల మేదా వదులుకోలేదు.
యూరప్‌కు వెళ్లి తన చదువును కొనసాగించాలని అనుకున్నారు.
తుర్కియేకు రోడ్డు మార్గంలో వెళ్లి, తర్వాత సముద్రాన్ని దాటి యూరప్‌కు వెళ్లాలని మేదా నిర్ణయించుకున్నారు.
‘‘దేవుడు నిన్ను కాపాడతాడు. ముందుకు సాగిపో’’ అని తన కూతురుకు చెప్పానని ఆమె తల్లి మహతబ్ ఫారో తెలిపారు.
ఫిబ్రవరి 22న తుర్కియే నుంచి బయలుదేరిన చెక్క బోటులో ప్రయాణించిన 200 మంది ప్రయాణీకుల్లో మేదా కూడా ఉన్నారు.
అయితే, నాలుగు రోజుల తర్వాత ఇటలీలోని క్రోటోన్ తీర ప్రాంత సమీపంలో పడవ మునిగిపోయింది.

‘‘హలో అమ్మా. నువ్వు బాగున్నావని అనుకుంటున్నా. నేను కూడా బాగున్నా. సంతోషంగా ఉన్నా. ఇంకా పడవలోనే ఉన్నా. మరో 30 నిమిషాల్లో పడవ దిగుతాం’’ అని మేదా చివరిసారిగా తన తల్లి మహతబ్‌కు వాయిస్ మెసేజ్ పంపించారు.
తర్వాత ఆమె మరో టెక్ట్స్ మెసేజ్ కూడా పంపించారు.
‘‘మై డియర్ మామ్. మేం దాదాపు ఇటలీకి చేరుకున్నాం. కాసేపట్లో పడవ దిగిపోతాం. నా ఆరోగ్యం బాగుంది. నేను సంతోషంగా ఉన్నా. నా గురించి ఆందోళన చెందకు’’ అని ఆమె మెసేజ్ చేశారు.
మేదా చాలా అరుదుగా ఒంటరిగా ప్రయాణిస్తుందని మహతబ్ చెప్పారు. అయితే, ఆమె సంకల్పం చాలా దృఢమైననదని అన్నారు.
ఏడు నెలల క్రితం మేదా కాలిలో బుల్లెట్ దిగింది. ఇరాన్ నుంచి తుర్కియేకు వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. 10 రోజుల పాటు ఆమె కాలిలో బుల్లెట్ ఉన్పప్పటికీ ఆమె సంకల్పం పట్టు సడలలేదదని మహతబ్ తెలిపారు.
యూరప్‌కు వెళ్లడానికి మేదా చాలాసార్లు ప్రయత్నించి విఫలమైందని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.
‘‘ఆమె గురించి నేను చాలా ఆందోళన చెందాను. ఇరాన్‌కు తిరిగి వచ్చేయమని ఆమెను అడిగాను. విదేశాలకు వెళ్లేందుకు మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తున్న నీకు అలసట రావట్లేదా అని మేదాను అడిగాను’’ అని మహతబ్ గుర్తు చేసుకున్నారు.
పడవ మునక విషాదంలో 70 మందికి పైగా మరణించారు. మేదా మృతదేహం ఇంకా దొరకలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాణాంతక ప్రయాణం
యూరప్‌కు వెళ్లాలనుకునే అఫ్గాన్లకు తుర్కియే ప్రధాన రవాణా కేంద్రం.
ఇటలీ వంటి దేశాలకు వారు బాల్కన్ గుండా లేదా సముద్రాన్ని దాటి వెళతారు.
2022లో యూరోపియన్ యూనియన్, స్విట్జర్లాండ్, నార్వే దేశాలకు ఆశ్రయం కోరుతూ వచ్చిన అభ్యర్థనల్లో 13 శాతం అఫ్గాన్లవే అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఇరాన్‌కు చెందిన ఒక వ్యక్తి చివరి నిమిషంలో మనసు మార్చుకొని ఈ ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఆయన ఆ పరిస్థితి గురించి బీబీసీకి వివరించారు.
‘‘పడవలో 60 నుంచి 70 మంది ప్రయాణీకులు ఉంటారని మాకు చెప్పారు. కానీ, రాత్రి మేం ఇస్తాంబుల్ నుంచి ఇజ్మీర్‌కు లారీలో ప్రయాణించడానికి ముందు అక్కడ 117 మంది ప్రయాణీకులు ఉన్నట్లు గ్రహించాను. అందులో చాలామంది అఫ్గాన్ కుటుంబాల వారే.
అదొక పీడకల లాంటిది. నేను ఇంకా దీన్నినమ్మలేకపోతున్నా. ఇకపై దేన్నీ కూడా నమ్మలేను. జీవితం అర్థం లేకుండా తయారైంది’’ అని సమన్ (పేరు మార్చాం) అన్నారు.

టర్కిష్ తీరం దాటిన కాసేపటికే పడవ మునిగిపోయినట్లు ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఇద్దరు వ్యక్తులు బీబీసీకి చెప్పారు.
ఆ తర్వాత స్మగ్లర్లు, మరో పడవను పంపించి ప్రజలను అందులోకి తరలించారని తెలిపారు.
ప్రయాణం చాలా కఠినంగా సాగిందని, కానీ సముద్రం నుంచి భూతలానికి సమీపిస్తుండటంతో అందరూ ఉల్లాసంగా కనిపించారని వారిలో ఒకరు చెప్పారు.
‘‘అప్పుడే మరో ఓడ మాకు దగ్గరగా వచ్చి మా పడవపై లైట్లు వేసింది. మా కెప్టెన్లు భయపడిపోయి పడవను తిప్పడానికి ప్రయత్నించారు. మా పడవ రెండుసార్లు గుండ్రంగా తిరిగింది. మూడోసారి తిరిగేటప్పుడు బలంగా దేనికో ఢీకొని ముక్కలైంది. మహిళలు, చిన్నారులు పడవ కింది డెక్‌లో ఉన్నారు. పురుషులు, ఒంటరి వలసదారులు పై డెక్‌లో ఉన్నారు. పడవలోకి నీళ్లు రావడం నాకు గుర్తుంది. నీరు నా మెడ వరకు చేరుకున్నాయి. అప్పుడే నేన చమురు వాసన చూసి స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు’’ అని మేరాజ్ అనే ప్రయాణీకుడు చెప్పారు.
ప్రాణాలతో బయటపడిన 80 మందిలో మేరాజ్, ఒడ్డుకు కొట్టుకువచ్చారు. ఓడలోని అతని బంధువుల ఆచూకీ ఇంకా తెలియలేదు.
ఇటలీ అధికారులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అందులో ఒకరు తుర్కియేకు చెందినవారు కాగా, ఇద్దరు పాకిస్తాన్ జాతీయులు. వారిని బోట్ కెప్టెన్లుగా భావిస్తున్నారు.
బోటులో ప్రయాణం కోసం అందులో ప్రయాణించిన ప్రతీ ఒక్కరూ 8,500 డాలర్లు చెల్లించినట్లు ఇటలీ పోలీసులు అంచనా వేస్తున్నారు.
మానిటరింగ్ గ్రూపులు వెల్లడించిన సమాచారం ప్రకారం, 2014 నుంచి మధ్యదరా సముద్రంలో మరణించిన లేదా అదృశ్యమైన వారి సంఖ్య 20 వేల మందికి పైగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘నా సోదరుడి బూట్లు మాత్రమే దొరికాయి’’
ఓడ మునకకు సంబంధించిన వార్త బయటకు రాగానే, ప్రయాణీకులు కుటుంబాలు ఇటలీకి రావడం మొదలుపెట్టాయి. తప్పిపోయిన తమ కుటుంబీకుల కోసం వారు అక్కడ వెదికారు.
47 ఏళ్ల లైలా టిమోరీ, జర్మనీ నుంచి అక్కడికి చేరుకున్నారు.
‘‘ఏడేళ్లు మా అన్నయ్య కోసం ఎదురు చూశాను. చివరకు ఆయనను చూడబోతున్నా అని అనుకున్నా. కానీ, ఇలా జరిగింది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
లైలా 2015లో ఆఫ్గానిస్తాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్ నుంచి జర్మనీకి వెళ్లిపోయారు. అప్పుడు అన్నయ్య తనను సాగనంపిన తీరును ఆమె గుర్తుచేసుకున్నారు.
బోటులో జాబిహ్ తిమోరీ (33), ఆయన భార్య మినా (23), వారి కుమారులు హసీబ్, ఆరిఫ్, అకిఫ్ ఉన్నారు.
జాబిహ్ ఒక న్యాయవాది అని, ఆయన ఆఫ్గాన్ గత ప్రభుత్వం కోసం పనిచేశాడని, తాలిబాన్ల రాకతో ఆయన భయపడ్డారని లైలా చెప్పారు.
‘‘నేను ఘటనా ప్రదేశానికి చేరుకోగానే మొదట 18 నెలల నా మేనల్లుడు హసీబ్ మృతదేహాన్ని చూడాల్సి వచ్చింది’’ అని బీబీసీతో లైలా అన్నారు.
‘‘ఇటలీ అధికారులు నన్ను ఒక గదికి తీసుకెళ్లి గుర్తుపట్టమని చెబుతూ కొన్ని ఫొటోలు ఇచ్చారు. అందులో చనిపోయిన వారి ఫొటోలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి ఫొటోలు, ప్రాణాలతో బయటపడి క్యాంపులో ఉన్న వారి ఫొటోలు ఉన్నాయి. కానీ, అందులో నా కుటుంబీకుల ఫొటోలు లేవు. వెంటనే నేను వారిని వెదుకుతూ బీచ్‌కు వెళ్లాను.
అక్కడ కూర్చోలేకపోయాను. పడవ శిథిలాలు కనిపించాయి. కొట్టుకొచ్చిన దుస్తుల్ని చూశాను. నా కోసం ఎదురుచూసి, మా అన్నయ్య ఈ ఇసుకలో పాతిపెట్టారేమో అని నేను అనుకుంటున్నా.
ఆయన బూట్లు మాత్రమే నేను సంపాదించగలిగాను. ఆయన భార్య బ్యాగ్ కూడా దొరికింది’’ అని ఆమె చెప్పారు.
నాటి నుంచి వెదుకుతోన్న లైలాకు, ఆమె కూతురుకి వారి కుటుంబసభ్యుల జాడలేవీ ఇంకా దొరకలేదు. తీరానికి వారి మృతదేహాలు కొట్టుకొస్తాయని వారు ఎదురుచూస్తున్నారు.
‘‘ఇది చాలా బాధాకరం. పడవలోని సగం మంది మునిగిపోయి, సముద్రపు అడుగులోకి వెళ్లిపోయారని మేం విన్నాం.
ఇంతకాలం నీటిలో ఉన్న మృతదేహాలను గుర్తించడం కూడా కష్టమే. మా వారి మృతదేహాలు దొరికితే వారికి అంత్యక్రియలు చేయాలనేదే మా కోరిక’’ అని లైలా చెప్పారు.
మరోవైపు ఇరాన్‌లో మేదా తల్లిదండ్రులు, తమ కూతురు బతికి ఉందనే మంచి వార్త వినాలని ప్రార్థనలు చేస్తున్నారు.
ఇరాన్‌లో శరణార్థులుగా ఉన్న మేదా తల్లిదండ్రులు, ఇటలీకి వెళ్లడానికి వీసాను పొందడం సులభం కాదు. కాబట్టి వారికి స్వయంగా మేదాను వెదికే అవకాశం లేదు.
‘‘నేను ఆమె కోసం ఎదురుచూస్తున్నా. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు నేను ఎవర్నీ అనుమతించలేదు. నేను ఎవరి సానుభూతి కూడా కోరుకోవట్లేదు’’ అని మహతబ్ చెప్పారు.
18 ఏళ్లు నిండకముందే యూరప్‌కు వెళ్లి, ఫ్యామిలీ రీయూనిఫికేషన్ స్కీమ్ ద్వారా తన తల్లిదండ్రులు, ముగ్గురు తోడబుట్టినవారిని కూడా తన దగ్గరికి పిలిపించుకోవాలని మేదా ఆశపడ్డారు.
‘‘మమ్మీ నువ్వు చేసుకున్నట్లుగా దయచేసి నాకు చిన్నతనంలోనే పెళ్లి చేయవద్దు. నాకు చాలా పెద్ద కలలు ఉన్నాయి. నాన్న ఒక సాధారణ కార్మికుడని నాకు తెలుసు. నేను అనుకున్నది సాధించడానికి విదేశాలకు వెళ్లాలి’’ అని మేదా ఎప్పుడూ చెబుతుండేదని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- బైరి నరేశ్ మీద పోలీస్ జీపులో ఉండగానే దాడి... దీనిపై పోలీసులు బీబీసీతో ఏమన్నారు?
- ఆంధ్రప్రదేశ్-అమ్మఒడి: ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు సీట్లు కేటాయించడంపై వివాదం ఏమిటి?
- బంగ్లాదేశ్ నుంచి ఈ 500 మంది భారత్‌కు ఎందుకు వచ్చారు? వాళ్లు ఏం కోరుతున్నారు?
- ప్రీతి: ‘కరోనాను ఎదిరించి గెలిచింది కానీ... వేధింపులను తట్టుకుని నిలబడలేక పోయింది’
- ఎండలు బాబోయి ఎండలు... ఫిబ్రవరిలో ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















