గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: ‘రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు, 6 లక్షల మందికి ఉపాధి’-సీఎం జగన్ వెల్లడి

ఫొటో సోర్స్, APCMO
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో రూ. 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.
పారిశ్రామికవేత్తలకు తమ రాష్ట్రం కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటుందని అన్నారు.
ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్రంలో పెట్టుబడులకు 340 సంస్థలు ముందుకు వచ్చాయని, దీని ద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు.
అనేక సహజ వనరులు, మానవ వనరులున్న ఏపీ దేశ ప్రగతిలో కీలకంగా మారిందన్నారు.
త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని కాబోతుందని, విశాఖ నుంచే తాను పాలన చేయబోతున్నట్లు సమ్మిట్ వేదిక నుంచే సీఎం ప్రకటించారు.

ఫొటో సోర్స్, APCMO
‘సమ్మిట్...డే 1’
శుక్రవారంనాడు విశాఖలోని ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభమైంది.
ఇది శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది సాగుతుంది.
‘అడ్వాంటేజ్ ఏపీ’ నినాదంతో పెట్టుబడులను ఆకర్షిస్తూ ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
పలువురు కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు సహా వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు హాజరయ్యారు.
వీరిలో రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, జీఎంఆర్ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు, సైయంట్ అధినేత మోహన్‌రెడ్డి, అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ, కుమార మంగళం బిర్లా, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబెరాయ్, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, మార్టిన్ ఎబర్ హార్డ్డ్, హరిమోహన్ బంగూర్, సజ్జన్ భజాంకా వంటి 30కి పైగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు.
సమ్మిట్ తొలిరోజు రూ. 11.8 లక్షల కోట్ల మొత్తంతో 92 ఎంవోయూలు చేసుకున్నట్టు సీఎం వెల్లడించారు.
దీని ద్వారా దాదాపు 4 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
మిగిలిన 248 ఎంవోయూలు శనివారం జరుగుతాయన్నారు.
రెండో రోజు సమ్మిట్‌లో రూ. 1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోబోతున్నామని, దీని ద్వారా మరో 2 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని సమ్మిట్ కు హాజరైన నితిన్ గడ్కరీ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు.
పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యమని, ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రవాణా ఛార్జీలను తగ్గించి ప్రజారవాణాను ప్రోత్సహించాలని గడ్కరీ అన్నారు.

ఫొటో సోర్స్, APCMO
ప్రధాన పెట్టుబడుల ఒప్పందాలు ఏం జరిగాయంటే..
తొలిరోజు జరిగిన పెట్టుబడి ఒప్పందాల్లో ప్రధానంగా ఎన్టీపీసీ రూ.2,35,000 కోట్ల పెట్టుబడితో 77,000 మందికి ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో 3 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.
ABC లిమిటెడ్ రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడితో ఏపీలో 7000 మందికి ఉపాధి కల్పించబోతున్నట్లు ఒప్పందం చేసుకుంది.
రూ. 50,632 కోట్ల పెట్టుబడితో 9,500 మందికి ఉపాధిని కల్పించే విధంగా JSW గ్రూప్ 6 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.21,820 కోట్ల పెట్టుబడితో 14,000 మందికి ఉపాధి కల్పించే 2 అవగాహన ఒప్పందాలపై, అరబిందో గ్రూప్ రూ. 10,365 కోట్ల పెట్టుబడితో 5,250 మందికి ఉపాధి కల్పించే విధంగా 5 అవగాహన ఒప్పందాలపై, ఆదిత్య బిర్లా గ్రూప్ 2,850 మందికి ఉపాధి కల్పించే రూ.9,300 కోట్ల పెట్టుబడితో 2 అవగాహన ఒప్పందాలపై, జిందాల్ స్టీల్ రూ. 7,500 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉపాధి కల్పించే పెట్టుబడుల ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఆంధ్రా యూనివర్శిటీలోని సువిశాలమైన గ్రౌండ్లో సుమారు 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 30 స్టాల్స్‌తో సహా ఏపీలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాలను ప్రదర్శించారు.
దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి మొత్తం 40 ఇతర దేశాల నుండి 8,000 మంది ప్రముఖులు, పెట్టుబడిదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, APCMO
హాజరైన పారిశ్రామికవేత్తలు ఏమన్నారంటే..
ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని ముఖేష్ అంబానీ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ ముందుందని, పలు రంగాల్లో ఏపీ అభివృద్ధికి సంతోషిస్తున్నామని, ఏపీలో తమ పెట్టుబడులు కొనసాగుతాయని ముఖేష్ అంబానీ చెప్పారు.
అలాగే ఏపీలో 10 గిగావాట్ల రెన్యూవబుల్ సౌర విద్యుత్ రంగంలో రిలయన్స్ పెట్టుబడులు పెడుతుందని తెలిపారు.
అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలకు రాష్ట్రంలో కొదవ లేదన్నారు. రాష్ట్రంలో 2 పోర్టులు కృష్ణపట్నం, గంగవరం తాము నిర్వహిస్తున్నామని చెప్పారు.
భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. ఏపీలో మానవ వనరులు అపారంగా ఉన్నాయని, నైపుణ్య శిక్షణతో మెరుగైన అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రపంచానికి ఉత్తమ వనరులను ఏపీ అందిస్తోందని ఆయన చెప్పారు.
జీఎంఆర్ గ్రూపు అధినేత గ్రంధి మల్లికార్జునరావు ఈ సదస్సులో ప్రసంగించారు.
ఏపీలో పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం ఉందని, ఏపీ ప్రగతిలో భాగస్వాములైనందుకు సంతోషంగా ఉందన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయడాన్ని గొప్పగా భావిస్తున్నామని, తొలి దశలో రూ. 5 వేల కోట్ల పెట్టుబుడులు పెట్టనున్నామని జీఎంఆర్ చెప్పారు.
ఇవాళ, రేపు..
శుక్రవారం (మార్చి 3) ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సదస్సు మధ్యాహ్నం 2 వరకు సీఎం జగన్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తల ప్రసంగాలు చేశారు.
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.50 వరకు వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై పారిశ్రామికవేత్తలు, అధికారులు, రాష్ట్ర మంత్రులు మధ్య చర్చలు జరుగుతాయి.
సాయంత్రం 6 గంటలకు బీచ్‌రోడ్డులోని ఎంజీఎం మైదానంలో అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం విందు ఇవ్వనుంది.
తిరిగి రేపు ఉదయం 9.30 సదస్సు ప్రారంభమవుతుంది.
ఆ తర్వాత పెట్టుబడుల ఒప్పందాలు జరుగుతాయి. శనివారం (మార్చి 4) మధ్యాహ్నం 2 గం.కు రెండు రోజులు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








