అమెరికా ఆశలు చూపించి బాలి తీసుకెళ్లి బంధించారు.. భారతీయులను కిడ్నాప్ చేస్తున్న ఇండొనేసియా ముఠా

- రచయిత, సరబ్‌జిత్ సింగ్ ధలివాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా పంపిస్తామని ఆశ చూపించి యువతను మోసం చేస్తున్న ముఠా.. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యువతను టార్గెట్ చేస్తున్నారు.
మెరుగైన జీవితం కోసం అమెరికా వెళ్లాలని ఎంతోమంది కలలు కంటుంటారు. 35 ఏళ్ల సుఖ్‌జిందర్ కూడా అలాగే ఆశపడ్డారు. కానీ, ఇప్పుడు ఎవరైనా అమెరికా పేరు చెబితేనే ఆయన వణికిపోతున్నారు.
"అమెరికా పేరెత్తితేనే నాకు భయమేస్తుంది. అక్కడికి వెళ్లాలని ఎవరైనా అంటే లోపలి నుంచి వణుకుస్తుంది. అమెరికా వెళ్లాలన్న కల నా జీవితాన్నే నాశనం చేసింది" అంటున్నారు సుఖ్‌జిందర్.
అమెరికా వెళ్లేందుకు సుఖ్‌జిందర్ ఎంచుకున్న మార్గమే అందుకు కారణం.
తర్న్ తారన్ పట్టణానికి చెందిన సుఖ్‌జిందర్‌కు తన బంధువుల్లో ఒకరు బాలిలో ఉంటున్న సన్నీ కుమార్ అనే వ్యక్తిని పరిచయం చేశారు. సుఖ్‌జిందర్‌ను అక్రమ మార్గంలో మెక్సికో గుండా అమెరికా పంపిస్తానని సన్నీ కుమార్ మాటిచ్చారు.
ప్లాన్ ఏంటంటే, సుఖ్‌జిందర్ మొదట ఇండోనేషియాలోని బాలి వెళ్తారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లేందుకు మార్గం సిద్ధం చేసుకుంటారు. ఇద్దరి మధ్య రూ.45 లక్షలకు డీల్ కుదిరింది.

విదేశాలకు పంపిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేయడం పంజాబ్‌లో కొత్త కాదు. కానీ, సుఖ్‌జిందర్ దీన్ని నమ్మారు. ఎందుకంటే, డబ్బులు ఏమీ ఇవ్వకుండానే బాలి టికెట్ ఆయన చేతిలోకొచ్చింది. అదే ముప్పు తెచ్చింది. కలలో కూడా ఊహించని సుడిగుండంలో చిక్కుకున్నారు.
"నేను బాలి చేరుకున్నాక, సన్నీ కుమార్ నన్ను ఒక ఇంటికి తీసుకెళ్లి అక్కడ నిర్బంధించారు. సుమారు 23 రోజుల పాటు నన్ను అక్కడ బందీగా ఉంచారు. కొట్టి, చితకబాది మా ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి అబద్ధం చెప్పించారు. నేను అమెరికా చేరిపోయానని, రూ. 45 లక్షలు సన్నీ కుమార్‌కు ఇవ్వాలని నా చేత చెప్పించారు" అని సుఖ్‌జిందర్ వివరించారు.
అమెరికా వెళ్లాలన్న కల చెదిరిపోయింది. ఆ నిర్బంధం నుంచి తప్పించుకుని అతికష్టం మీద ఇల్లు చేరుకున్నారు.
తర్న్ తారన్‌కు చెందిన జస్విందర్ సింగ్‌ది కూడా ఇదే కథ. ఆయన కూడా అదే ముఠా చేతిలో చిక్కుకున్నారు. 2022 అక్టోబర్ 5న బాలి చేరుకున్నారు. జస్విందర్ సింగ్‌ను కూడా దాదాపు 18 రోజుల పాటు ఒక ఇంట్లో బంధించారు. రూ. 45 లక్షలు ఇస్తే తప్ప వదల్లేదు.
పంజాబ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన యువత కూడా బాలిలోని ఈ ముఠా చేతికి చిక్కుతున్నారని మొహాలి పోలీస్ డీఎస్పీ దిల్‌షేర్ సింగ్ చెప్పారు.

ఈ ముఠా ఎలా పనిచేస్తుంది?
బాధితులు చెప్పిన వివరాలు, పోలీసు దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం, ఈ ముఠాకు పంజాబ్‌లో ఆఫీసు లాంటిది ఏమీ లేదు. అలాగే, ముఠా నుంచి ప్రకటనలు, ఏడ్స్ కూడా ఎక్కడా కనిపించలేదు.
మొబైల్ ఫోన్ ద్వారానే యువతను టార్గెట్ చేస్తారు. డబ్బులు ఇవ్వకుండానే బాలి టికెట్ చేతిలో పెట్టేసరికి చాలామంది వారిని నమ్ముతున్నారు. ముఖ్యంగా, మధ్య తరగతి యువత వీరి వలలో చిక్కుకుంటున్నారు. ముఠాకు సొమ్ము అందాక బాధితులను విడిచిపెడతారు. బాలి నుంచి వెనక్కి రావడానికి బాధితులే మార్గం వెతుక్కోవాలి.
ఈ ముఠా గత రెండేళ్లుగా చురుకుగా పనిచేస్తోందని, అంతగా చదువుకోని యువతను టార్గెట్ చేస్తోందని పోలీసులు చెబుతున్నారు.
యువతను ఇండోనేషియా లేదా సింగపూర్ మాత్రమే తీసుకెళతారు. ఈ రెండు దేశాల్లోనే భారతీయులకు 'వీసా ఆన్ ఎరైవల్' ఇస్తారు. అంటే ముందే వీసా తీసుకోనక్కర్లేదు. అక్కడ విమానాశ్రయంలో దిగాక వీసా ఇస్తారు. ఈ రెండు దేశాలకు విమాన టికెట్లు కూడా తక్కువ ధరకు దొరుకుతాయి.

ముఠా నాయకులు ఎవరు?
ఈ ముఠాకు చెందిన ఇద్దరు నాయకులు భారతదేశానికి చెందినవారేనని మొహాలి పోలీసులు చెప్పారు. ఇండోనేషియాలో నివసిస్తున్న సన్నీ కుమార్ పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో సలేరియా ఖుర్ద్‌కు చెందినవాడు. మరో సూత్రధారి జస్వీర్ సింగ్ అలియాస్ సంజయ్ సింగపూర్‌లో ఉంటారు. పంజాబ్‌లోని జలంధర్‌తో ఆయనకు సంబంధాలు ఉన్నాయి.
ఈ ముఠాలో కొందరు సభ్యులు పంజాబ్ నుంచే పనిచేస్తారని, మిగతావారు బాలిలో ఉచ్చు పన్నుతారని పోలీసులు తెలిపారు. పంజాబ్‌లో ఉన్న ముఠా సభ్యులు బాధితుల కుటుంబాల నుంచి డబ్బు వసూలు చేసే పనిలో ఉంటారు. బాలిలో ఉన్నవారు బాధితులను అక్కడికి రప్పించడం, వారిని నిర్బంధించి డబ్బు వచ్చేలా చేయడం మొదలైన పనులు చేస్తారు.
ముఠా నాయకుడు సన్నీ కుమార్ భార్య, తండ్రి పంజాబ్‌లోనే నివసిస్తున్నారని పసిగట్టిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1.5 కోట్ల సొమ్ము జప్తుచేశారు.
ఈ ముఠాతో కలిసి పనిచేస్తున్నారన్న అనుమానంతో మరొక మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. కానీ, ముఠా నాయకులు ఇంకా ఇండోనేషియాలోనే ఉన్నారు.

గ్రామీణ యువతనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
పాటియాలాలోని పహల్ కలాన్ గ్రామానికి చెందిన మన్‌ప్రీత్ సింగ్ కూడా ఈ ముఠా పన్నాగానికి బలయ్యారు.
ఆయన ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసేవారు. చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని నడపడం కష్టమయ్యేది. అందుకే అమెరికా వెళ్లి బాగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. కానీ, రాజ్‌పురాలోని ఒక ఏజెంట్ చేతిలో చిక్కుకున్నారు.
సుఖ్‌జిందర్ కూడా ఇదే చెప్పారు. తనకున్న వ్యవసాయ భూమి కుటుంబ పోషణకు సరిపోవట్లేదన్న కారణంతో అమెరికా వెళ్లాలనుకున్నారు.
పహల్ గ్రామానికి చెందిన జస్వీర్ సింగ్ కూడా అమెరికా వెళ్లడానికి వ్యవసాయ భూమిని తనఖా పెట్టి అప్పు తీసుకున్నారు.
"అప్పులవాళ్లు నెత్తి మీద కూర్చున్నారు. ఏం చేయాలో పాలుపోవట్లేదు" అని ఆయన వాపోయారు.
పంజాబ్ నుంచి అమెరికా వలస వెళ్లే ట్రెండ్ కొత్తదేం కాదు. అక్కడికి వెళ్లి బాగా స్థిరపడినవారి సంఖ్యా ఎక్కువే. అందుకే, యువత అమెరికా పట్ల ఆకర్షితులవుతున్నారు.
చదువు, డబ్బు ఉన్నావారికి చట్టబద్ధంగా అమెరికా వెళ్లి స్థిరపడడం సులువే. కానీ, అంతగా చదువులేని గ్రామీణ ప్రాంతాలకు చెందినవారికి ఇది అంత తేలికగా నెరవేరే కల కాదు. అందుకే, ఫేక్ ఏజెంట్లు, ముఠాల చేతికి చిక్కుతున్నారు.
పాటియాలాకు చెందిన విశాల్ కుమార్ కూడా ఇలాంటి ఒక బాధుతుడే,
"చదువుకున్నవారు IELTS పాస్ అయి విదేశాలకు వెళ్లిపోతారు. నాలాగ ఎక్కువ చదువుకోనివారు అక్రమ మార్గంలోనైనా అమెరికా వెళ్లాలని చూస్తారు" అన్నారు విశాల్.
పదవ తరగతి పాస్ అయిన విశాల్‌కు సరైన ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ముఠా చేతికి చిక్కారు. లక్షల్లో డబ్బు ముట్టజెప్పి ప్రాణాలతో బయటపడ్డారు.
పంజాబ్‌లో నిరుద్యోగం, మాదకద్రవ్యాల వ్యసనం, గ్యాంగ్‌స్టర్ల కార్యకలాపాల కారణంగా యువత రాష్ట్రంలో తమకు భవిష్యత్తు లేదని భావించి విదేశాలకు వలస వెళుతున్నారని పంజబ్‌లో ప్రముఖ ఆర్థికవేత్త రంజిత్ సింగ్ గుమాన్ అన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడుల కొరత వలన తగినన్ని ఉద్యోగావకాశాలు రావట్లేదని ఆయన అన్నారు.
2021-22 ఎకనామిక్ సర్వే ప్రకారం, పంజాబ్‌లో నిరుద్యోగం రేటు 7.2 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 7.1 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో 7.5 శాతం ఉంది.
పంజాబ్‌లో ఉపాధి అవకాశాలు పెరిగితే యువత విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉంటారని రంజిత్ సింగ్ గుమాన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
చట్టం కళ్లుగప్పి ముఠా పనిచేస్తుంది
మానవ అక్రమ రవాణాను నిరోధించేందుకు 'పంజాబ్ ట్రావెల్ ప్రొఫెషనల్స్ యాక్ట్ 2014' రాష్ట్రంలో అమలులో ఉంది.
జలంధర్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో, నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై 239 ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్లు, 129 IELTS కేంద్రాల లైసెన్స్‌లను రద్దు చేసింది.
జలంధర్ జిల్లాలోని 1320 ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్స్, అంతర్జాతీయ టిక్కెట్ బుకింగ్ ఏజెంట్లు, IELTS సెంటర్ల యజమానులకు నోటీసులు జారీచేశారని జలంధర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ చెప్పారు. ఇప్పటికే 495 మంది లైసెన్స్‌లను రద్దు చేశారు.
చట్ట ప్రక్రియ సుదీర్ఘంగా, సంక్లిష్టంగా ఉండడం వలన కఠినమైన చట్టాలు ఉన్నా, వాటి కళ్లుగప్పి ముఠాలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని రంజిత్ సింగ్ అభిప్రాయపడ్డారు.
కొన్నిసార్లు అక్రమ మార్గంలో ప్రయాణం వలన ప్రాణాలు కూడా కోల్పోతారు, అయినాసరే యువత విదేశాల వైపే మొగ్గుతున్నారని ఆయన అన్నారు.

అమెరికాకు అక్రమ మార్గాల ద్వారా ప్రయాణం
చాలామంది భారతీయులు మెక్సికో లేదా కెనడా ద్వారా అక్రమ మార్గాల్లో అమెరికా చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువమంది మెక్సికో రూట్ ఎంచుకుంటారు. ఏజెంట్లు డబ్బు తీసుకుని సరిహద్దు దాటిస్తారు.
మెక్సికో సరిహద్దు నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అమెరికా కస్టమ్స్, బోర్డర్ పెట్రోల్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
గణాంకాల ప్రకారం, 2020లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 19,883 మంది భారతీయులు అరెస్టయ్యారు. 2021లో 30,662 మంది, 2022లో 63,927 మంది భారతీయులను అరెస్టు చేశారు. ప్రతి ఏడు ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
మెక్సికో సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించడం అంత సులభం కాదు. 2019లో పంజాబ్‌కు చెందిన ఆరేళ్ల పాప తన తల్లితో పాటు మెక్సికో సరిహద్దు దాటి అమెరికా చేరుకుంది. కానీ, అక్కడ వేడికి తాళలేక ఆరిజోనా రాష్ట్రంలో చనిపోయింది. అప్పుడే, ఈ అంశం వార్తల్లోకెక్కింది.
ఇవి కూడా చదవండి:
- కేటీఆర్: ‘వీ6ను ఎప్పుడు బ్యాన్ చేయాలో మాకు తెలుసు’
- జర్మనీ: జెహోవా విట్నెస్ హాల్ చర్చిలో కాల్పులు... సుమారు ఆరుగురు మృతి
- చైల్డ్ ఫ్రీ లైఫ్: ‘మాకు పిల్లలు వద్దు.. కుక్కలు, పిల్లులు ముద్దు’ అంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది.. ఎందుకు?
- క్యాంపా కోలా: త్వరలో మార్కెట్లోకి 'రీ ఎంట్రీ' ఇవ్వబోతున్న ఈ భారతీయ శీతల పానీయం చరిత్ర ఏంటి?
- కేసీఆర్: ‘రేపు కవితను అరెస్ట్ చేయొచ్చు.. చేసుకుంటే చేసుకోని.. భయపడేది లేదు’














